Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచ్చంగా తెలుగులో వ్రాయలేమా?-2

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చంగా తెలుగులో వ్రాయలేమా?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 2వ భాగం.]

అచ్చంగా తెలుగు నుడువులు నిక్కమైన వేల్పు నుడువు (దేవభాష)లే! తేటతెలుగు నుడులు తియ్యనివని, పాడుకునేలా ఉంటాయని, అటుమొన్నదాకా మంది నోటివెంట అలరారినవనీ మనకు ఎరుకపరుస్తూ ఆదిభట్ల నారాయణ దాసుడుగారు ‘తల్లివిన్కి’ కబ్బానికి మట్టు (ఉపోద్ఘాతం)లోఈ మాటలల్లారు. వాటిని ఇప్పటి మనకి చదవ వీలయ్యేలా తేలికపరచి ఇస్తున్నాను. ఇవి పొల్లమాటలో, కల్ల మాటలో, చెల్లని మాటలో కావు.

మాటలల్లటం (రచన) అంటే ఆదరబాదర డాబుపన్నుగడ కాదు. తెలుగునుడువులు తెలియాలి. వాటి వాడకం తెలియాలి. వాటి కూర్పునేర్పు అలవడాలి

నుడులకాపు (భాష పరిరక్షణ) తప్పనిసరని తొలుతగా పనిగట్టుకుని పనిచేసిన నుడిమూర్తి నారాయణదాసుడువారు. గుడిగట్టి కొలవదైగిన నుడివేల్పు ఆయన. మొదటి విడతగా వారి అచ్చతెలుగు అల్లికని మచ్చుగా చూపించి నా వీలున్నంత మేర మాటకారులందరికీ (రచయితలకు) పంపాను. ఎక్కువమంది చూసీ చూడనట్టు ఉండిపోయారు. కొందరు పువ్వు బొమ్మ పెట్టి ఊరుకున్నారు. ‘చూశాను – చదవలేదు’ అని దానర్థం. అరయని, చదవని వారే మాటకూర్పరుల్లో (రచయితల్లో) ఎక్కువ అనే చెడుమాట తప్పక తొలగాలనే కోరిక.

కొంతమంది ఇవి నారాయణదాసుగారు పనిగట్టి వండి వార్చి కూర్చినవా అని అడిగారు. కాదని చెప్పిన తరువాయి ఒకటికి రెండుమార్లు చదివి అచ్చతెలుగులో తీపిని చవి చూడగలిగామని చెప్పారు.

‘లెక్కింప నలవికాని నుడులెన్నో మరుగున పడినవీ, తెలియనివీ, ఈ నింగీ నేలల నిండా కిక్కిరిసి ఉన్నా’యంటూ వీటిని ఊరిపలుకులు (వాడుకభాష) అన్నారాయన. ఇవి నుడులు పుట్టిననాటినుండీ మునుపటి మన పెద్దలు మాటలాడినవే! మనం మతిలేక వదులుకుంటున్నాం. వాటిని వాడకానికి తెస్తే నుడిమనుగడ నిండారుతుంది.

మాటలల్లేవారంతా నుడువులకు కాణాచి కావాలి. కాపుదార్లు కావాలి. పెంపుదార్లు కావాలి. పట్టని తనము పనికిరాదని మనవి. ఇది చదవండని వేడుకోలు.

మీరు కోరితే మొదటి విడతది మళ్లీ పంపగలను. పనివినియెద!

ఆదిభట్ల నారాయణదాసుడు వారి ‘తల్లివిన్కి’ రెండవ విడత అచ్చంగా తెలుగు మాటల అల్లిక (ఓజవెజ్జు గం. వెం. పూర్ణచంద్రుడు)

చావు పుట్టుకలు నిక్కాలు కావు. ఎన్నటికి చెడని పగడంలా తనివి నిండారేతనర్పు (ఉన్నతి) అలరారే కన్నతల్లి (అమ్మవారు) తప్ప తక్కిన నింగినేలల్లోని దినుసులెల్ల (సమస్త జీవరాశులు) కుందేటి కొమ్ముల్లా ఉత్త హుళిక్కి అనే ఎరకువ (గ్రహింపు) ఎలా మరకువ(అజ్ఞానం)ని తొలగించి ఓజమై వస్తుందో (పుట్టుకతోనే వస్తుందో) అట్లా తెలిసిరాక తప్పదు.

నిన్న, రేపు అనేవి నిలబడక మారిపోతుంటాయి. కానీ ఒక్క నేడు అనేది మాత్రం మారకుండా ఉంటుంది. అలాగే, తాను ఎప్పటికీ ముందు(future tense), వెనక (past tense) పుట్టుక, పొదలిక (పెరగటం), పొలయిక(చావు)ల జోలికి కొంచెమైన పోకుండా ఎన్నటికీ నిండుతన్వితో అలరారుతూ ఉంటుందని ఈ తల్లి(అమ్మవారు) కి గల వెయ్యి పేర్ల గురించి విన్కి (శాస్త్రం)  చాటి చెప్తోంది.

తక్కిన వేల్పుల (దేవతలకూ వెయ్యేసి పేర్లున్నాయి.  కానీ, ఈ తల్లి వెయ్యిపేర్లలో మాత్రమే – వచ్చిన పేరు తిరిగి రాకుండా, అదుకు పొల్ల మాటలు (తప్ప-తాలు)లేకుండా ఉండటం వలన వేల్పునుడులలో (అమ్మభాషలో) ఈ తల్లి వెయ్యి పేర్లను కూర్చిన ఆ మాటలల్లేవాడు (కవి) ఎంతైనా పొగడదగినవాడు.

చదువులు వ్రాయటాలు మేటి చదువరి(పాఠకుడు)కే గాని సంతకము చేయలేని ములచల కోసం కాదు. నాటు తెలుగు పలుకు చవి (అచ్చమైన తెలుగు రుచి) తెలిసిన వాళ్లకే ఈ నా తల్లివిన్కి చవిగొల్పుతుంది (నచ్చుతుంది).

మా ఇలవేలుపు తెలుగు చదువర్లను హాయిగా బెక్కేండ్లు ఎల్ల వసతులూ ఒసగి కాపాడుగాక!

మొత్తం మీద తల్లి వెయ్యి పేర్ల (లలితా సహస్రనామాలు) విన్కి (శాస్త్రం) తుదకు తేలిందేమంటే.. ఎవరెట్లా అనుకున్నా ఈ బతుకు మంచి చెడ్డలన్నీ కలలో కనిపించే దినుసుల్లా కల్లలే కాబట్టి, మంచి అనుకున్నా చెడు అనుకున్నా కొరత (వెలితి) లేదు.

ఎండ, వాన చలితరులుగా (వరుసలుగా) వచ్చే మార్పుల్లాగానే ఆ పగడదినుసే అనేకరకాలుగా మారుతున్నట్లుంది గానీ, నిక్కంగా చెప్పాలంటే ఈ మారుదల కూడా లేదు. మింటికి (ఆకాశానికి) ఏ డాగు గానీ, డాలు గానీ, చిల్లిగానీ, మొర్రితొర్రులు గానీ హద్దుపద్దు వంతువంపులు గానీ లేనట్టే, తమ ఉనికే తమకు నిక్కమని (శాశ్వత సత్యం) తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వారికి తమ తలంపు (ఊహ)లకు అందని ఆ మింటి వంటి దినుసుతల్లి (సమస్త జీవరాసులకు మాతృమూర్తి) వేలుపు (అమ్మవారు) ఉన్నదని నిరుకు చేయక (నిర్ణయించక) తప్పదు.

అంతేకాదు, తమకన్నా వేరు దినుసులు (జీవరాశి) లెక్కింప నలవికాని రకాలెన్నో మరుగున పడినవీ, తెలియనివీ, ఈ నింగీ నేలల నిండా కిక్కిరిసి ఉన్నాయని అనుకొనక తీరదు (తప్పదు) కదా! తమ మెలకువ (జాగ్రదవస్థ), కల (స్వప్నావస్థ),  కూర్కు (నిద్రావస్థ)లు మనం కాకున్నప్పటికీ ఈ మూడు ఉన్కులను (ఉనికి)కనిపెట్టినవారు (కారణమైనవారు) కల, మెలకువ, నిద్రలకన్నా వేరైనప్పటికీ మేము -మాది, మీరు-మీది, వారు-వారిది అని అనుకుంటూ మంచిచెడ్డలు పొంగులు పొందక తప్పదు కదా!

నుడువరీ(చెప్పేవాడు) చెప్పేనుడువులు వినేవారు వినేది, కనేవాళ్లు కనేది(చూసేది), ఆ పగడదినుసే (పగడంతో సమానమైన అమ్మవారు) అనే ఎరుకువ (గ్రహింపు) చేత, వేర్వేరనే మరకువని బట్టి  తలంచి నిరుకు చేసూ (నిర్ణయిస్తూ) కుంగుపొంగులు పొందటం ఎల్ల మైతాల్పులకు (శరీరధారులందరికీ) తప్పదు. కాబట్టి ఈ చదువులు వ్రతాలు, ఈ మడితడిపొడి (తడిమడి, పొడిమడి=మడికట్టుకునే పద్ధతులు), వేలిమివేలుపుడులు (యఙ్ఞయాగాలు), కాకలు (ఉపవాసాలు), నోములు, ఎల్లతెగల కట్టుబాట్లు (కులచారాలు), కొలుపులు (జాతరలు), తిరునాళ్లు, కూడుకూటమి కూర్కులవసతులకు కొరగాని (తింటానికి, కలిసి బతకటానికి, నిద్రకు, నివాసానికి పనికిరాని) వేల్పుమొక్కులు (దేవతారాధనలు) ఇవన్నీ! వెర్రివెంబర నాలిముచ్చు డబ్బు కక్కూర్తి పన్నుగడలే (నిరర్థకమైన ఆలోచనలే)! ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. ఎట్లా చెయ్యక తీరదో అట్లాగే చేస్తున్నారంతా! బ్రతుకు పాడి (విధివ్రాత)ని తప్పించ ఎవరితరం?

రకరకాల ఓజమై (పుణ్యఫలం), గాలి, నిప్పు, తడి, పారు లాంటి (పాంచభౌతికాలు) వింతవిత కూడికల (అనేక విధాల కలయికల) వలన పెక్కుతీరుల (అనేక విధాలైన) ఉసురు (ప్రాణం) గల మైతాల్పులు (మనుషులు, జంతువులు) చెట్లు చేమలు, రాళ్లు రప్పలు ఓజమై (ప్రభావంతం) పుడుతున్నాయి. పొదలు (వర్ధిల్లు) తున్నాయి. పొలియు(చావు)తున్నాయి. ఈ పాడికి (మన కర్మలకు) గతము(దారి)ఈ పాడియే (మన కర్మలే కారణం).

నింగీ నేల దినుసుల (జీవరాశుల) పుట్టుక పొదలిక (పెరుగుదల), పొలయికల (మరణం) ఓజకు (సక్రమంగా అమలుకు) అంతటికీ తనకు తానే కతమని (కారకులు) ఎరుక కలవారు నిరుకు (నిర్ణయం) చేయక తప్పదు.

మేను వంచి నుదుటి చెమరూడ్చి (తుడుచుకుంటూ – కష్టించి పనిచేస్తూ) ఎవ్వరిని ఎగ్గింపక (కీడు చేయకుండా) అందరూ ఔనన (ఆమోదయోగ్యం) మిక్కిలి అడకువతో తన తోడి వారికి మంచి సల్పు వారే తప్పక తమతమ బ్రతుకుల్లో నిండి తనివి(తృప్తి), తనర్పు (ఉన్నతి) పొందగలరని నా నమ్మకం.

నా యీ వ్రాత తోటిపాటివారికి మేలే చేస్తుంది. కావుననే తల్లి వేయిపేర్ల విన్కిని (సహస్ర నామ శాస్త్రాన్ని) ఇట్లా ఈ నాటుతెలుగున నా ఈ ఎనబదేండ్ల యీడున వ్రాయించిన నా ఇలవేలుపు నన్ను, నా మంచి చదువరులను, తగు కోర్కెలొసంగి (తీర్చి) కోరినన్నేండ్లు హాయిగా బ్రతికించి తన పైన ఎల్లరికి నమ్మిక హెచ్చించి యీ మేనులతోనే తనలో చేర్చుకొనుగాక!

వేల్పునుడులలో (దేవభాష అయిన తెలుగులో) వెయ్యిపేర్ల వినికికి (సహస్రనామశాస్త్రానికి) నాటుతెలుగు పలుకుకూర్పులు కొంతవరకైన వివరంగా (వివరణము అనేది సంస్కృతపదం) కాగలవని నా నమ్మకం.

వేల్పునుడులను (సంస్కృతభాషలో సహస్రనామాలను) తిన్నగా పగడనాటు తెలుగు(అచ్చంగా తెలుగు) పలుకులతోను పగడాలను నాటే తెలుగు నొడవులు (తద్భవ, తత్సమ పదాలు) తోను, లేదా వేల్పు నొడవులు (సంస్కృత పదాలు) లేకుండా వివరించటానికి అంతగా వీలుపడదు గానీ, ఏదో కొంత మేనమామ పోలికలాగా చెప్పవచ్చు.

నిక్కంగా నింగీనేలల్లోని మేనితాల్పులు (శరీరధారులైన జీవరాశులు) ఎల్లమంది (అందరూ) ఒకరంతవారు ఒకరు ఎవరికీ తీసిపోరు. తనకన్నా పొడుగు, తనకన్నా పొట్టి కలిగినప్పుడు తాను పొడుగా పొట్టా ఎరుక కలుగుతుంది. (సాపేక్షవాదం).

కొద్దిగొప్పల పేరుతో ఒకరినొకరు తెగడటం, పొగడటం చేస్తుంటే ఎరుకగలవారు కుంగకపొంగక అంతా కన్నతల్లిదే అని అనుకుంటూ పెంద్రోవ కలిమి( మోక్షమార్గాన్ని) చూరగొంటారు.

పసితనం నుంచీ దరిదాల్చి (అవధులు మీరి, అమితంగా) కారులను కప్పసములు సల్పిన (కాలప్రవాహాన్ని మళ్లించిన) విన్నాణులు (విజ్ఞానవేత్తలు), ఐదేళ్ళు పైబడిన మగవారుగానీ, ఆడువారిలో పడుచులుగానీ, ముదితలుగానీ, ఈ తల్లివేయిపేర్ల విన్కి చదువుటకు గాని, వినుటకుగాని, తగినవారౌదురు.

చెడుకోర్కెలు ఉడుగని చెడుగొట్లు తల్లివిన్కిని డాబు కోసం చదవటానికి సమకడితే బెడిసి కొడ్తుంది.

ఎంత చదువుకొన్నప్పటికీ, మరెంత తన్నుకుని తలకిందయినప్పటికీ  గాని, తిరిదాల్పు బోదలు కూర్చిన వేల్పునుడువులు (ఎన్నెన్నో మెలికలతో మర్మాలతో నిండిన అమ్మవారి సహస్రనామాలు) ఈ కడుపు కక్కూర్తి జట్టుకి నిండార తెలిసే వీలేలేదు.

వేల్పు నుడువులందు (లలితాసహస్రనామాల్లో)  వేనవేల వివరాలు (రహస్యాలు) ఉన్నాయి. అత్తిరిదాల్పు (రహస్యాలు నింపు కూర్చిన సహస్రనామాల మూలకర్త) తా కూర్చిన నుడువుల్లో (సహస్రనామాలు) ఏ ఏ తలంపులతో ఏ ఏ నుడువులు వాడారో వ్రాత తప్పులున్న వహుల్ని (పుస్తకాల్ని) బట్టి, పొట్టకక్కురితి పంతుళ్లను బట్టి, వేలుపునుడి తల్లి వేయిపేర్ల వినికి (లలితా సహస్రనామాలు) వివరాలు తెలుసుకోవాలనుకోవటం బొత్తుగా వినమ్మిరేకుల (ఆకాశంలో నక్షత్రాల్ని) లెక్కించ బూనటమే!

పంతులు (పండితుడు) నుడినడలు (పదాల నడక) మప్పగలడు (అభ్యాసం చెయగలడు) గానీ, ఓజగా రాదగిన తెలివి (దానిసారాన్ని) నేర్పింపలేడు. బొందిని కట్టవచ్చుగానీ డెందానికి(హృదయం) కట్టడం ఎవరితరం? వ్రాతకి వరువడి (ఒరవడి – ప్రాధాన్యక్రమం) ఉందిగానీ, మాట కేదీ ఈ మేలుబంతి (ఒరవడి)? మంది పన్నికకి (వాడుకభాషకి) అచ్చుంటుందిగానీ వేల్పు పన్నుగడను (దేవతల భాషను) అచ్చొత్తగలమా? వాయింపు మప్పవచ్చుగానీ పాట చెప్ప (పాటను వ్రాయటం) ఎవరి తరం?

నిక్కంగా చెప్పాలంటే, వేల్పుపన్నిక (దేవతాభావానికి భాష్యం)లో ఎవరి చెల్వం (సౌందర్యం) వారిది. ఎవరి కుత్తుకలు (చెప్పే వ్యాఖ్యానాలు) వారివి. ఎవరి తెలివితేటలు వారివి. ఎవరి ఊపిరి తీసుకును నేర్పు వారిది. ఎవరి తలంపులు వారివి. ఎవరి ఆకలి దప్పికలు వారివి. ఎవరి కలకూర్కు మెలకువలు (కలలు, నిద్రలు, మెలకువలు) వారివి. ఎవరి కోర్కెలు వారివి. ఎవరి ఇమ్ములు (అవకాశాలు) వారివి. ఎవరి వంతలు (దుఃఖాలు) వారివి. ఎవరి పోకడలు వారివి. ఎవరి బతుకులు వారివి. ఎవరి పుట్టుక, పొదలిక (ఎదుగుదల), పొలియిక (మరణం) వారివి. ఎవరి పోడిమి (పస, వన్నె)వారిది.

కావున ఎవరంతవారువారని తెలిసికొన్నట్లయితే, తగువారంతా తక్కినవారితో మిగుల పొందికతో పొసగుతో ఉండగలుగుతారు. తామేమో తమ తోడి వారికంటే లావరులమని (గొప్పవాళ్లం అని) చదువరులమని, అందమైన వాళ్లమని, బరువైన వాళ్లమని, దుడ్డు (డబ్బు) కలవాళ్ళమని ఒడ్డూపొడవూకలవాళ్లమని, బరువైనవారమని, గొప్ప తెగ(కులం)కు చెందినవాళ్లమని,. గొప్పవాళ్లమనీ అనుకుని సొరకాయలు తెగ నరుకకుండా లేనిపోని డాబులు చేయకుండా, కిందుమీదులు మూసుకుని, తమ చేతకాని తనాన్ని తలచుకుని సిగ్గుపడి ఈ తలపన్నులతో (శిరోభారాలతో) కుంగే మందికంటే పందిలా పుట్టటం నయం.

ఇలాంటి కొంటె కొంప చెరపుల్ని కన్న వెంటనే సమయించకుండా (చంపేయకుండా) ఇడుములపాలు పడటానికా ఓ కన్నతల్లీ..  నీ వసతులెల్ల (నీ సుఖాలన్నింటిని) మానుకుని పెంచావు.. ఓ కనికరపు కుప్పా.. మా అప్పా..! మా ఇలవేల్పా! ఇటు నుయ్యు, అటుగొయ్యి అన్నట్టుగా బదుకులెల్లా వలవంతే (మనోవ్యథే) మిగుల్తుంది.

ఎవరు పడగలరబ్బా ఈ పొగరుబోతుల బెదిరింపులు, ఈ ఎండ వాన చలితరువులు (వరుసగా కలిగే బాధలు), పులిగాకులు, పలుగాకులు పెట్టే పెక్కు ఇక్కట్లు.. అక్కటా.. ఈ యీడు ముదిరినకొద్దీ ఏకు మేకగుచున్నదే కన్నతల్లీ!

ఈ నింగి నేలలలో నీవుకానిదేది? అంతయున్నీవే అయినప్పుడు మేమే నీవు, నీవే మేము. మా మంచిచెడ్డలెల్ల నీవి కావా? కన్నతల్లీ మాకంటే చీమలయినా నయం, దోమలయినా నయం, అవి ఈ పాపాల ముద్ద తుంటరిమందియేలికపెట్టే అగచాట్లలో పడవుగా!

జట్టు (మానవసమూహం) ఎక్క వీలుకాని గొప్ప మెట్టకొన (ఎత్తయిన కొండలమీద) పుట్టిన చెట్టుచేమలు ఇక్కట్టడి జట్టు (ఇక్కడి మనుషులకంటే) వేయివేలరెట్లు లాతి (ఇతరులు) ఉసురులకు (ప్రాణులకు) మేలుసలుపుతూ ఎంత హాయిగా బ్రతుకుచున్నవో కన్నతల్లీ! మమ్మా చెట్లుగా నైనా కాకుండా ఈ పనికిమాలిన జట్టుగా (నరజన్మ) కనిపెంచి ఎంత పొరబాటు చేశావు అప్పా (తల్లీ)! కనికరపు కుప్పా! అని తల్లివిన్కిని చాలా గుట్టుగా ఎప్పుడూ తమ ఉల్లములలో (మనసులో) అనుకునేవాళ్లు..

ఏ తెగవారుగానీ (కులం), ఏ ఈడువారుగానీ, ఆడువారు కానీ, మగవారుకానీ, ఎట్లేనీ బతకగలవారినెల్లా నా కన్నతల్లి ఎల్ల ఇమ్ముల సమకొల్పి (అన్ని అవసరాలు తీర్చి) పెక్కేండ్లు హాయిగా వాళ్ల బ్రతుకు నిల్పి తనలో తప్పక కలుపుకునే తల్లి విన్కిని ఇలా చాటుకున్న పగడవేల్పు నుడువులను గానీ (సంస్కృత సహస్రనామాలు) పగడము నాటు తెనుగు పల్కులనుగానీ, వహికూర్పజాలక (లెక్కచేయక?) ఇప్పటి నా కన్నకొడుకులు తాము కూడా గొప్ప మాట లల్లేవాళ్లం (కవులం) అనుకుని తమకు తెలిసీతెలీని వేల్పునుడువులకు (సంస్కృత సహస్రనామాలు) ముళ్ళకు పూలు గుచ్చినట్టు, ఇసుకలో పప్పు కలిపే లాగా తేటతెల్లమైన తీయని నాటు తెలుగుపలుకుల్ని కలబోస్తూ తెగ నీల్గుతున్నారు.

అలాంటి కొంటెలకి ఈ సీమతెలుగు (నాణ్యమైన నాగరిక తెలుగు) గిట్టకపోవచ్చు. పంది బురదమెచ్చు అనే నానుడి ఎంతో నిక్కం కదా.. అందని పండ్లు పులుపు అనడా అరియడు (విమర్శకుడు)? తను కిందపడి సొట్టనేల అన్నట్టు, నాటుతెలుగు మాటలు అల్లనేరని (వ్రాయలేని) ఈ నాటి అచ్చికబుచ్చిక మాటలు (మాయమాటలు) అల్లే (కవులు) ప్రేలరులు (వదరుబోతులు) చదువరుల (పాఠకుల) మేల్బంతులు (ఒరవడి, విధానం) పాటించటానికి ఒల్లరు (ఒప్పుకోరు).

తెలుగుసీమవారు తప్పక తమతమ అలుపులకొద్దీ (శక్తికొలది) తమ తల్లులు ఉగ్గు పోసిన నాటినుండీ తమకు మప్పిన (వచ్చిన) నాటుతెలుగునందే మాటల పెద్దల పడికట్లతో అల్లినయెడల (రచించినట్లయితే). కరకు ముల్లులున్న ముళ్ళకంచే తొలగిన పండ్లచెట్టులాగా, తీపినీళ్ల బావిలాగా  తేనె తియ్యని నాటుతెనుగు ఎల్లరూ తనివి పొందేలాగా చవిచూడగలరనే కోర్కెతో ఈ తల్లివిన్కి వ్రాయవలసి వచ్చింది!

-ఓజవెజ్జు గం. వెం. పూర్ణచంద్రుడు

(ఇంకా ఉంది)

Exit mobile version