[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చంగా తెలుగులో వ్రాయలేమా?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 3వ భాగం.]
ఆదిభట్ల నారాయణదాసువారు వరువాయినే తలచుకోవలసిన (ప్రాతఃస్మరణీయులు) నుడివేల్పు (భాషాదైవం) అనే తొలకు (మహనీయకీర్తి) కలిగినవారు.
ఆయన నాటుతెనుగు (అచ్చతెలుగు)లో నిండారు మాటకూర్పులెన్నో అల్లారు (రచించారు). నాటుతెనుగు పెంపు కోసమే తానీ ఇడుమును (కష్టాన్ని) తట్టుకుని ఎనిమిది పదుల పైబడిన ముదిమిలోనూ పనిచేస్తున్నానని చెప్పుకున్నారు.
అచ్చతెలుగంటే లాతినుడులు (సంస్కృతం, ఆంగ్లం లాంటి పరభాషా పదాలు) లేనిది. అచ్చంగా తెలుగంటే ఎలాంటి మకిలి లేనిదని (నిర్మలమైనది). ఒక్కసారి ఈ నాటుతెనుగును చవిచూసినవారు తెలుగుతల్లి ‘మీదయ’ను పొందగలరు.
నాటుతెలుగును మంది బుర్రలో నాటగలిగితే ఈ దిక్కు వారు, ఆ ఊరివారనే తేడాలు (ప్రాంతీయభేదాలు) పోయి తెలుగువారందరమూ ఒక్కటేననే ఏనుగుతలంపు కలుగుతుంది.
మనవైన నుడులేవో మనకు తెలుస్తాయి. మనవికాని వాటికి ఎంతగా బానిసయ్యామో తేటతెల్లమౌతుంది..
మన కమ్మని కూర మనకుండగా లాతి (పరాయి) ఇంటి ‘మాడుకూర’కు మొహము (తీవ్రమైన కోరిక) వాచు (దేవురింపు) దేనికి?
నారాయణదాసువారు ఈ అన్నింటిని ఎదలో కూర్చుకుని తల్లివిన్కి అనే కబ్బానికి (పుస్తకానికి) నాటుతెనుగులో ఇంత మట్టు (ఉపోద్ఘాతం) అల్లారు (వ్రాశారు). కుదురు తిన్నగా ఉంటేనే మొక్క ఎదిగేది. నారాయణదాసువారు చాలా గట్టిగా తన నుడిపెంపు అనే కోరికని నెరవేర్చుకునేందుకు ఈ అల్లిక (రచన)లో పాటవమైన పాటు పడ్డారు. దాన్ని తేలిక్పరచి ఇక్కడ మూడు విడతలుగా అందిస్తూ వస్తున్నాను.
నాటుతెనుగు తీపికి ఈ అల్లిక జలేబీ వంటి ఒక మచ్చు. జలేబి తీపి ఎలా ఉంటుందో నోటితో చెప్పలేము. చేత్తో వ్రాతగా చూపలేము. అచ్చంగా తెలుగంటే ఇట్లా ఉంటుందని నప్పేలాగా, ఒప్పేలాగా, మీరు మెచ్చేలాగా మచ్చుకివ్వాలనేదే నా ఈ చిన్న యావ.
ఈ తరం మందికి ‘కలతకలితీ తెలుగు’ నుడులే ఎరుకై చావటం లేదు.. ఇంక ఈ నాటు తెనుగొకటా..?” అన్నవారున్నారు. వీలైనంత పడమటి నుడులు చేరిస్తేనే ఆ మాత్రమైనా తెలుగు మాటాడేవారు మిగిలుంటారనే వారూ ఉన్నారు.
లొగ్గి (లొంగిపోయి) నుడిని (భాషను) లోకువ చెయ్యాలనేవారి తలంపే ఇట్లా ఉంటుంది.
నుడికాపులుగా (భాష పరిరక్షకులు) నిలిచేవారందరికీ ఇది తియ్యగా ఉంటుంది. చవిగొన వేడుకోలు.
– పూర్ణచందు, నుడిబంటు.
***
చొరకుండా లోతు , తినకుండా చవీ (రుచి) తెలుస్తాయా?
పొట్టకక్కుర్తి కొద్దీ బడుల్లో బోముగా(బలవంతంగా) వేల్పు నుడువులు (తెలుగు మాటలు) కాకుండా పరంగి (ఫ్రెంచి) లాంటి ‘విలాతి వింత నుడులు’ (పరభాషాపదాలు) ఎన్నో ఏళ్ల నుండీ తంటాలు పడి చచ్చీచెడి నుగ్గై (నలిగిపోయి) వడుసుడి (రాజులకు చెల్లించే అపరాధ రుసుము, జరిమానా) తగుల్చుకుని నేర్చుకున్నప్పటికీ ఆ ముక్కల్ని (భాషాపదాల్ని) ఆ ఆ విలాతిసీమల (విదేశీయుల) వారిలాగా అనగలరా (ఉచ్చరించగలరా)?
మన తెలుగువారు తమ తల్లిమాట పరువు తీస్తూ, ఇందున కందునక్కూడా చెడుతున్నారు. ఈ పెంకె మాటలు బొప్పండ్ర (మూఢులు) చెంగట (దగ్గర) ఆడుకోవాలి (చెల్లుతాయి).
ఇప్పటి మూతిపైన మీసం ఉన్న ఏ మాటలల్లువాడైనా (రచయిత) వేల్పునుడి (సంస్కృతం) జోలికి పోకుండా పగడనాటు తెలుగున (సారవంతమైన అచ్చతెలుగులో) మాటకూర్పులు (రచనలు) చెయ్యగలరా?
తొల్లింటి పెద్దలు (మన పూర్వకవులు) నుడికూర్పుల అడుగుల పడికట్లు తప్పకుండా (వ్యాకరణ నియమాలు తప్పకుండా) లాతిమాటకు మాటగా (పరభాషా పదాలకు సమానమైన తెలుగు మాటలతో) తెనిగించటం చెయ్యగలుగుతున్నారా?
ఒరుల తలంపులు (ఇతరుల ఆలోచనలు) దొంగిలింపక తనంత తానుగా క్రొంగ్రొత్త తోవతొక్కి నాటుతెలుగు (అచ్చతెలుగు) కూర్పులతో (రచనలతో) నిండుచదువరి(జ్ఞానవంతుడైన పాఠకుడు) మెచ్చుకునే తీరులో వహినొనర్చి (పొందుపరచి) వెలువరించి (ప్రచురించి) వెయ్యినోళ్ళ పొగడు (ప్రశంస) పొందిన వాడి పస నలువురిలో అచ్చుపడ్తుంది( చిరస్థాయిగా ఉంటుంది).
నాటుతెలుగు పెంపు (అచ్చతెలుగు అభివృద్ధి) కోరుతున్నాను కాబట్టి, ఇలా అనవలసి వచ్చింది. నా తోటిపాటి తెలుగు చదువరులను (రచయితలు,పాఠకులను) నొప్పించటం కోసం కాదు.
ఇదిగో తుదిమాట.. ఆటపాట్లకు అలవాటు పడిన వాణ్ణి కనుక, బాగా చేవ ఉడిగిన ముదివాడిని (శక్తి తక్కిన వృద్ధుణ్ణి) అయినప్పటికి, లేని అలవు(శక్తి) తెచ్చుకుని తల్లివిన్కి (లలిత అమ్మవారి సహస్రనామాల శాస్త్రాన్ని) పూర్తిచేసి, ముత్తీరికల తీరెద (సంపూర్ణ విశ్రాంతి తీసుకుంటాను).
నా తోటిపాటి మంది అందరూ ఎలాంటి వారైనా తల్లి వెయ్యి పేర్లను తలపోసుకొంటూ ఉంటే తాము కోరని కోర్కెలు కూడా ఈడేర్చుకుని ఆ తల్లిలో చేరి ఎప్పటి నిండు తనర్పున(ఉన్నతి) అలరారుతుంటారు.
ఇందులో మారుమూల పలుకుల వ్రాలను (పదప్రయోగాలను)వరుసగా గుదికూర్చి చివరన వివరించాను. నా పొరబాట్లు ఏవయినా ఉంటే కన్నతల్లి కాచుగావుత!
నా ఈ వెర్రిమొర్రి తెలిసీ తెలియని ముసలి పిసవ్రాతలను తెలిసిన మంచి చదువరులు ఒప్పులుగా గైకొనేలా నా ఇలవేల్పు సల్పుగావుత (చేయగలదని కోరిక).
కూడు గుడ్డ కూర్కులను సమకూర్చుకోవటానికి అనువులుగా పదారు వన్నెల వెరవుల్ని (జీవనోపాధుల్ని) పొందుతున్నారు. ఎవరెవరి అలవాట్లనుబట్టి, వారివారి నేర్పుకొలది బతుకు తెరవులుగా తమకి తోచిన పడికట్లను ఏర్పరచుకుని వేరువేరు జట్టులు (ముఠాలు) కట్టుకున్నారు.
నేల అంతటా పలుచోట్ల లెక్కింప నలవిగాని పెక్కు రకాల ఒండొండు (ఒక్కక్క) నుడికూర్పు(రచన)ల్ని తొలి చదువుల్ని, సీమపలుకుల్ని (విశిష్ట సంపన్న ప్రాచీన భాష)ని అని, వాడికమాటలు (గ్రామ్యాలు) అని పేర్లుపెట్టి తక్కువ చేస్తున్నారు.
ఎప్పటినుండో తలంప నలవికాని (ఆలోచించ వీల్లేని) వింతవింత నడువడుల నుడువుల కూర్పుల్ని వాత (బలుపుకాదు వాపు) వ్రాతల పన్నుగడలను తరతరాల నుండి తమలో వెల్లడించుకుంటూ (ప్రదర్శిస్తూ) ఉన్నారు.
ఈ టక్కరి టకటొంకు టాటోటు మందికి ఓజగా (జన్మతః) వచ్చిన నేర్పులవి!
తక్కిన ఉసురులు (ప్రాణప్రదమైనవాటి) కంటే లేనిపోని కొరమాలిన పనులే చేస్తూ తాము చెడి తమతోటి ఉసురులను(మనుషులను) చెరుస్తున్నారు.
ఇలాంటి చెడుతెలివి ఈ జట్టుకి పుట్టుపాడి(వెన్నతోపెట్టిన విద్య).
కాబట్టి, మింటిమిద్దెలు (గాలిమేడలు) అల్లకుండా, తమతమ పదుగుల(తోటివారల) హెచ్చుతగ్గు వాసులు ఎంకుంటూ, తెగనీల్గుతూ కోరికోరి తంటాలు తెచ్చుకుని, తమలోతాము జగడమాడి ఊరకే తమ మంచి ఉసురు (మంచితనం) కోల్పోకుండా ఒండొరువుల ఒకరికోసం ఒకరుగా బతుకగల అన్నినాళ్లు హాయిగా తాము, తమ తోడివారు అన్నట్టుగా మనుట (జీవించటం) కన్నా మరి చేయవాల్సింది ఇంకేదీ లేదు.
నా “తల్లి వేయిపేర్ల విన్కి” ఇలాంటివి వలదని చాటిచెప్తున్నదనే నా తలపు (ఆలోచన) నిరుకు(నిర్ణయం) గిట్టనివాళ్ళను ఏమనాలి?
ఎవరి ముక్కులు వారికి తిన్నన! ఎవరంతవారు వారు! కనుక ఎవ్వరెవ్వరికి మంచిచెడ్డల గురించి చెప్పటం అనేది ఊసుపోని, కొరవిగాని పని!
అబ్బా! ఏమి నా తలవ్రాత! ఎరిగిఎరిగీ ఏనుగు ముడ్డిలో దూరునట్లు, ఎవ్వరు ఏ నుడువుల్ని వాతవ్రాతల వాడుకొన్ననేమి?
ఏ నడువడులు ఎట్లా ఉన్నా వండని ఇంటికి నిప్పు వెరపు(భయం).
నింగి నేల దినుసులన్ని (భూమ్యాకాశాల లోని జీవరాశులన్నీ) ఏదేది ఎట్లాగైనాకానీ, ఈ ఎనబైలు దాటిన ఈడు (వయసు)లో ఇలాంటివెన్ని ఉన్నా నా కన్నతల్లి చలవే అని నిరుకుపరచుకుని (నిర్ణయించుకుని) తినికుడిచి ఉండకుండా నా తోటిపాటివాళ్ళందరినీ ఈ పొటుకు మాటలు అంటూ, చెత్త వ్రాతలు వ్రాస్తూ నొప్పించటమే పనిగా పెట్టుకున్నాను.
సిగ్గుపడుతూ గజ్జెకట్టి డింగరునిలా (భాషా సేవకుడిలా) వాలకాలు (మోసాలు) చేస్తూ, కూడు(తిండి) కూర్కు(నిద్ర), వసతి మానుకొని అయినా నలుగురిలో తెలిసీతెలియని తబ్బిబ్బుమాటలు నోటికి వచ్చినట్లాడాను.
వీనులు చిల్లివడేలా (చెవులు చిల్లులు పడేలా) గాలిగుడ్డులా ఎగనారుస్తూ, గొప్ప చదువరిలా మేటి పాటకుని చెలువున (విధంగా) పెంకె మాటలను పెచ్చురేగుతూ ఒళ్లువిరుచుకుని తెగనీల్గుతున్నాను.
నా కన్నతల్లి ఇకనైన కనికరించి పెంద్రోవ (మోక్షం) చూపదేమి? నా నెత్తిన గీత ఇట్లుండెనా?
పోనీ, ఈ బతుకున తుదకి వంత (విచారం) మాత్రమే మిగులు కాబట్టి, అందరినీ మంచి చేసుకుని ఏ కోర్కెనీ కోరకుండా మాటకూర్పుల తలకట్టయిన (రచనలలో అగ్రము) ఈ తల్లి విన్కిని చదువుకొని పిన్నలంతా తమ బతుకుల్ని తగునడతను ఊని (పొంది) నిండు తనివి (తృప్తి)తో తమ బతుకుని పొగిడించుకొందురుగాక (నలుగురుమెచ్చుకునేలా జీవింతురు గాక) అని కోరుతున్నాను.
ఇట్లా ఆకలి, కూర్మి(ప్రేమ) మరచి ఈ గిటగిటను(అల్పమైన) మూడుకాళ్ల ముసలి ఈడులో నయినా ఇడుములు (కష్టాలు) ఓర్చుకుని కన్నతల్లి వెయ్యిపేర్ల విన్కి ఎవరికైనా ఎన్నటికైనా మిగులగడ్డ (కరగని తరగని) ఐన నాటుతెలుగు(అచ్చంగా తెలుగు) మాటలు పలికే నన్ను నా ఇలవేల్పు కన్నతల్లి కనికరించి ఈ తగులము కడలి(భవబంధాల సాగరం) నుండి దబ్బున (వేగంగా) కాపాడి ఒడ్డున చేర్చి తన ఒడిలోకి చేర్చుకుని నా బడలిక తీరేలాగా ఒళ్లు నిమురుతూ మిగుల కూర్మితో తన పోసనాలు (పాలు) కుడుపేటందుకు నా ఇలవేలుపుని ఇలా ఎన్ని ఏళ్ళయినా ఎల్లప్పుడూ వేవేల దండాలు పెడతాను.
ఊరి తెలుగున నీ వేయి పేరులెన్ను
నన్నుగావు మనయము నా కన్నతల్లి
ఆఁడుదానిని మగవాని గూడఁ గాంచి
పెంచునీకుఁ బై మించిన వేల్పిఁకేది॥
నారాయణదాసుఁడు
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
