Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచ్చతెలుగులో ఇలా వ్రాయాలి

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చతెలుగులో ఇలా వ్రాయాలి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

తనరుచు మిధిలకుఁ జని పెం
పున విల్లెక్కించు పందెమున గెలిచి, జగం
బున మించు చాలుపేరిటి
ననఁ బోఁడిం బెండ్లియై దనర్చె న్మిగులన్‌ –

సీత తనకు తానుగా పెనిమిటిని ఎంచుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కట్టుమట్టుకూర్పులు= నిబంధనలు ముందే చెప్పేశారు. ఆ వైనాన్ని యయాతి చరిత్రలో ఈ కందపద్యంలో కూర్చాడు పొన్నగంటి తెలుగన్న!

రాముడు విశ్వామిత్ర మహర్షి, లక్ష్మణులతో కలిసి ‘తనరుచూ’=అమితోత్సాహంతో మిధిలకు బయలుదేరాడు. అక్కడ శివుడి విల్లు ఎత్తి, ఎక్కుపెట్టాలన్న పందాన్ని గెలిచాడు. ఏలుకోటి మొత్తంలో=ప్రపంచం మొత్తం మీద చక్కనైనదీ, నాగలి చాలులో పుట్టిందన్న పేరున్న సీతను పోడిగా = విధి విధానాల ప్రకారం, ఒప్పుగా, పెండ్లాడాడు. ఇదీ ఆ పెనిమిటి ఎంపిక వేడుకలోని నిగ్గు!

ఈ అచ్చతెలుగు పలుకుల్ని చదివితే ఎక్కడా సంస్కృతం నుడులు లేవనే లోపమేదీ మనకు కనిపించదు. సంస్కృతం లేకపోతే బిగువు చాలదు.. అనటానికీ లేదు. అచ్చతెలుగులోనూ సొగసుంది. పాడుకోదగినంత వయ్యారి నడక ఉంది.

స్వయంవరం అనే పదాన్ని వాడకుండానే అది జరిగిన వైనాన్ని విరివి చేయటాన్ని ఆనవాలు=గుర్తు పెట్టుకోవలసి ఉంది! గీర్వాణం లోని కతల్ని తెలుగులోకి తెచ్చుకునేప్పుడు దాని వ్రాత తీరును కూడా అరువు తెచ్చుకోక తప్పదు. అయినా, ఉన్నంతలో తెలుగు దనాన్ని నిలుపుకోవటం అవసరం.

అమితోత్సాహం, స్వయంవరం, నియమం ఇలాంటి పదాలకు సమర్థనీయమైన తెలుగు మాటల్ని తెలుగన్న వాడాడు. కానీ, ఆయన వదలలేకపోయిన పదం ‘జగంబున’ అనేది ఇందులో కొరతగా కనిపించింది. జగము, లోకము, ప్రపంచము లాంటి పదాలు వచ్చినప్పుడు సమానమైన తెలుగు మాటలు దొరకక తెలుగులో మనమే పుండలించుకోవలసి = కనిపెట్టవలసి లేదా కల్పించవలసి వస్తుంది. ఆ కొత్తమాట అందరికీ తెలిసేదిగా, తేలికగా పలికేదిగా ఉండాలి. కొంత అలవాటయ్యే వరకూ విడమరపుల్ని మూకుళ్ళలో (బ్రాకెట్లలో) ఇవ్వాల్సి వస్తుంది.

మొదట మనకు ఏది సంస్కృతమో, ఏది సంస్కృత, ప్రాకృతాల లోంచి పుట్టిందో, ఏది వాటికి దగ్గరి చుట్టమో తెలియాలి. తెలుసుకోవటం పెద్ద పనేమీ కాదు. ఇవ్వాళ నుడికలిమి యావత్తూ మన సెల్‌ఫోన్‌లో ఇమిడి ఉంది. తెరిచి చూసుకుంటూ వ్రాసుకోవచ్చు.

తగన్ బ్రోలికేఁగిన దశరథుఁడర్మిలి
రాముఁ బట్టముగట్టు రహి యెఱింగి
కైక మానుపఁ దండ్రి కట్టడ చేసినఁ
దోన తమ్ముఁడు నాలుఁ దోడురాఁగఁ
దనవీడు వెడలి కొందలముతో వెనువెంటఁ
జనుదెంచు వారల ననిచి పిదపఁ
దొడవు లొల్లకమేటి జడదారి చందము
ల్సవరించుకుని గంగ యవలికరిగి
గుహుని మన్నించి యమ్మేటి కోర్కులొసఁగి
నిలుపుచును జిత్రకూటపు మలకు నేఁగి
కాంచి తబసులు తమ్మును గావింపఁ
నచట నొక కొన్ని నాళ్లుండే నంత నిచట-

రాముడు అడవులకు వెళ్లే వైనం మొత్తాన్ని ఈ సీస పద్యంలో అచ్చతెలుగులో చెప్పాడు తెలుగన్న! కొత్త పెళ్లికొడుకుకి తగన్=తగినట్టుగా అంటే, అదటుగా=దర్పంతో తన ప్రోలు= ఊరు అయోధ్యకు వెళ్ళినప్పుడు దశరథుడు, అర్మిలితో=ప్రేమతో రాముడికి పట్టంకట్టే, రహిని=కైవడిని=విధివిధానాలను ప్రెగడలందరితో=మంత్రులతో చర్చించాడని తెలిసి, కైక దాన్ని మానుప= మానేలా తండ్రి దశరథుని కట్టడి చేసింది. తోన=తోడుగా తమ్ముడు, ఆలు= సీత వెంట రాగా తన వీడు= ఊరు వదలి కొందలంతో=దుఃఖంతో వెనువెంట చనుదెంచే = వెంటబడి వస్తున్న వారల ననిచి= వారందరిని ఆపి, నచ్చచెప్పి వెనక్కి పంపి పిదప, తొడవులు= నగలు నట్రా అలంకారాలు ఒల్లక=వద్దని, మేటి జడధారి చందాన= మునుల మాదిరిగా బట్టలు కట్టుకుని శిఖలు పెట్టుకుని గంగ ఆవలి తీరానికి వెళ్లటానికి నదిని దాటించిన గుహుని మన్నించి, ఆ మేటి నావికునికి కోరిన కోర్కులు తీర్చి, అతన్ని కూడా వెంటరావద్దని అక్కడే ఆపి, చిత్రకూటపు మల =పర్వత ప్రాంతానికి వెళ్లి, అనేకమంది తపసులు= ఋషులు వారిని గారవింపగా అక్కడ ఒక కొన్ని నాళ్లు ఉన్నారట.

అచ్చతెలుగులోనే వ్రాయాలనే ఒట్టు పెట్టుకున్నప్పటికీ నామవాచకాల్ని మాత్రం తెలుగులో చెప్పాలనే తలపును వదులుకుంటున్నట్టు ముందుమాటల్లోనే చెప్పుకున్నాడు తెలుగన్న! కాబట్టి దశరథుడు తపసులు. జడధారి లాంటి సంస్కృతం మాటల్ని అలాగే వాడేశాడు.

కత చెప్పటంలో లీనమైపోతే అదాటున అలవాటైన సంస్కృతం మాటలు మనకు తెలీకుండానే ఊడిపడతాయి. కాబట్టి వ్రాయితకు మెలకువ అవసరమే!

ముని అనేమాటకి సంస్కృతంలో ఋషి అని! కానీ తెలుగులో ముని అంటే, కొన, శిఖరాగ్రం అని! అందుకని సంస్కృతపదమే అయినా మునులు అనకుండా జడధారులు అన్నాడు తెలుగన్న. అక్కడికి తెలుగన్న మెలకువగానే ఉన్నాడు. కానీ, ఈ జడధారి అనటంతోనూ ఓ తంటా ఉంది. జడ అంటే తెలుగులో జుత్తు అల్లికేగానీ, సంస్కృతంలో చల్లనిది, తెలివి లేనిది, మూగది ఇలాంటి అర్థాలున్నాయి. ఈ జడతో ధారి అనే సంస్కృతపదాన్ని కలిపితే ‘తెలివిలేని అవతారం’ అనే చెడు అర్థం వస్తుంది. అందుకే ముక్కు మూసుకుని వేలుపులను కొలిచే దానికి తెలుగులో మాటల్లేవు. అచ్చతెలుగున వ్రాసేప్పుడు ఇలాంటి ఇబ్బందుల్ని దాటవలసి ఉంటుంది. అప్పటికది తగినట్టుగా మనమే తెలుకుంటా మని తెలుగన్నకు ఇలాంటి చోట కొంత దాటవేత తప్పలేదు. తపస్సుకు చెందినవన్నీ సంస్కృతం నుడితో పుట్టిన నడవడులు= ఆచారాలు. వాటిని చెప్పాల్సి వచ్చినప్పుడు అందరికీ తెలిసిన సంస్కృతం మాటల్ని వాడుకోవటమే మేలు,

మనం అచ్చతెలుగున వ్రాయాలనే ఒట్టు పెట్టుకున్నది తెలుగు మరగుల్ని వెలికి తేవాలనేగాని, సంస్కృతం నుడుల్ని మరిపించాలని కాదని కూడా మనం ఎదన పెట్టుకోవాలి.

నేలచూలి వెదక గాలిబిడ్డఁడు లోను
గాను గలిగి నట్టి కడిఁది కొమ్మ
మెకపు గముల ననుప మించి యందరిలోన
ననుమఁడుప్పుకడలి యవలి కరిగె

నేలచూలి=భూమాత పుత్రిక=సీతాదేవిని వెదకటానికి గాలిబిడ్డఁడు=వాయునందనుడు=హనుమంతుడు లోనుగాను కలిగినట్టి=మొదలైన కొమ్మమెకపు గములు= కొమ్మలమీంచి దూకుతూ తిరిగే కోతుల గుంపులు= వానరుల్ని అనుపన్= అంపగా= పంపగా, మించి అందరిలోన=వాళ్లందరి కన్నా మించిన వాడైన అనుమడు= హనుమంతుడు, ఉప్పుకడలి = లవణ సముద్రం దాటి అవలికి వెళ్లాడట!

ఈ పద్యంలో నేలచూలు, గాలిబిడ్డడు లాంటి మాటలు సంస్కృత పదాలకు బదులుగా తెలుగన్న తెలుగులో కల్పించినవి. సంస్కృతంలో భూజాని, వాయునందనుడు అన్నట్టే తెలుగులోనూ కల్పించిన మాటలు. అలా తెలుగు మాటలతోనూ సొగసును తేవచ్చనేది తెలుగన్న ఆశ. ఇలాంటి నుడికట్లు తెలుగు నుడికలిమిలో=నిఘంటువులో చేరాల్సి ఉంది. వాటిని మనమూ వాడుతుంటే అవే వాడకంలోకి వస్తాయి. తొందరపడి ఇవి ఎవరికి అర్థం అవుతాయని పెదవి విరిచేయకండి. నిదానిస్తే అందరికీ అర్థం అయ్యేవే!

పద్యాలలోనే కాదు, ఈ యయాతి చరిత్రలో వచనం కూడా సొగసైన మాటల పొత్తిగా ఏర్పడిన తీరు అబ్బుర పరుస్తుంది. ఈ వచనాన్ని చూడండి:

“అట్లు రాముడంపిన యానవాలిచ్చి, యచ్చెలువం గనిన యుబ్బునం గొబ్బునం బొంగి సింగారపుఁదోట లోనుగాఁ దోఁపులు వెకలించి, కాపులున్న రక్కసుల వెక్కసంబుగా నొక్కుమ్మడి నక్షుడు మొదలుగాఁ బలుపురఁ బొలసు మే పరుల జముని నెలవున కనిచి పెనఁకువఁ బట్టువడ బెట్టు వేడుకపడు గాడుపు బట్టి మీఁద రాకాసి మొనలు గనలి-”

ఒక్క ఊకున చదవాలనుకుంటే అలవాటు లేక ఇబ్బంది అనిపిస్తుంది గానీ నిదానించి చదివితే పెద్ద తిమకపదాలేవీ ఇందులో లేవు.

“అలా రాముడు పంపిన ఆనవాలుని ఇచ్చి, అచ్చెలువం గనిన = ఆమెను= సీతను చూసిన ఉబ్బున = ఉత్సాహాన, గొబ్బున పొంగి = ఎక్కువగా పొంగి, ఎత్తుగా పెరిగి =మిక్కిలి విజృంభించి, సింగారపుతోట =శృంగారవనము లోనుగా = మొదలైన తోపులు=తోటలు పెకలించి కాపులున్న రక్కసుల్ని పెక్కసంగా= తేలికగా ఒక్కుమ్మడి= ఒక్క ఉదుటున అక్షుడు మొదలుగా పలువురన్ = అనేకుల పొలసు మేపరుల్ని = రాక్షసుల్ని జముని నెలవున కనిచి= యమపురికి పంపి, పెనకువ పట్టువడ= పట్టుబట్టి పోరాడి..” ఇలా సాగుతుందా వచనం తీరు.

చెలువ, గొబ్బు, లోను, పెక్కసం, పెనకువ లాంటి మాటలు మన ఎరుకలోవే.. కొత్త మాటలేవీ కావు. వాడకపోయే సరికి మరుగున పడిపోతున్నాయి. వీటిని వాడటాన్ని గ్రాంథికం అనకండి. గ్రాంథికం అంటే సంస్కృతపదభూయిష్టము అంటామే అది గ్రాంథికం. తెలుగు నుడులున్నచోట, వాటిని కాదని కావాలని గొప్పని చాటుకునేందుకు సంస్కృతం నుడుల్ని వాడుతూ వ్రాసిన పొత్తాలలోని నుడితీరు గ్రాంథికం. అంతేగాని,అచ్చతెలుగులో మనవైన తెలుగు మాటల్ని మరపు రాకుండా వాడకంలోకి తెచ్చేందుకు వ్రాసే వాటిని గ్రాంథికం అంటే ఒప్పదు. అచ్చమైన తెలుగు వాడుక మాటల్ని ఏవగించుకోకండి. మన నుడులంటే మన బిడ్డల్లాంటివి!

ఇవి పొత్తాల కెక్కాలన్నది, అలాగే మంది నోట నానాలనేది మన పట్టు, మన ఒట్టు,

వెనకటి వ్రాయితల అచ్చతెలుగు పలుకులను ఇలా ఏరి చెప్పేది దేనికంటె, ఇవన్నీ ఒకప్పుడు మన ఏలుకోటి= ప్రజల నోట పలికిన పసిడి పలుకులే కిఆబట్టి! నుడికలిమి కెక్కనివి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి!

అచ్చతెలుగున వచ్చిన యయాతి చరిత్రకు ఇడమరుపులు వ్రాసిన వారు.. పొద్దున్నే తలచుకోవలసిన పేరు కపిలవాయి లింగమూర్తిగారు. ప్రతీ నుడికీ ఆయన ఇచ్చిన విడమరుపులు గొప్పవి. తెలుగు విశ్వవిద్యాలయం వారు దీన్ని అచ్చువేశారు. వారికీ వీరిక్కూడా దణ్ణాలు.

Exit mobile version