[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘అద్దాల మేడలో బందీ’ అనే కథని అందిస్తున్నాము.]
వినయ్ ఒక చిన్న పట్టణంలో పుట్టాడు. ఉదయాన్నే కోడికూతతో మేల్కొనే వాడలో పెరిగాడు. ఓ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే పక్కింటి వాళ్లు కషాయం తీసుకొచ్చే రోజులవి. వినయ్ చదువులో మొదటి ర్యాంకులు కొట్టినవాడు కాదు కాని చివరి బెంచీ హీరో కూడా కాదు. మధ్యలో ఎక్కడో ఉండే సాధారణ మధ్యతరగతి అబ్బాయి. కానీ తనికి ఒక కల ఉండేది. అది కంప్యూటర్.
ఆ చిన్న పట్టణంలో కంప్యూటర్ అంటే అప్పట్లో ఒక మాయల పెట్టె. దానిలో ప్రపంచం దాక్కుని ఉందని అతనికి అనిపించేది. అందుకే కంప్యూటర్ సైన్స్ చదివాడు. C నేర్చుకున్నాడు, C++ నేర్చుకున్నాడు. Oracle, Java నేర్చుకున్నాడు. ఎప్పటికప్పుడు పాతబడిపోతున్న సాంకేతిక ప్రపంచంలో కొత్త కొత్త భాషలు నేర్చుకున్నాడు. తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఒక రోజు మహానగరంలో ఉద్యోగం రానే వచ్చింది.
ఆ రోజు వాళ్ళింట్లో పండగ. “మావాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్” అని తండ్రి అన్న ప్రతిసారీ ఆయన చాతీ రెండు అంగుళాలు పెరిగినట్టుండేది. అమ్మ ముఖం మీద గర్వం పొంగేది. ఎవరైనా ”మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?” అని అడిగితే, జవాబు చెప్పే రామచంద్రయ్య తన గొంతు సవరించుకునేవాడు. “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్” అనే రెండు పదాలను కొంచెం నెమ్మదిగా, కొంచెం గర్వంగా పలికేవాడు. ఆ రెండు పదాల్లో తన జీవితమంతా దాగి ఉందని ఆయన నమ్మకం. ముప్పై ఏళ్లు ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసినప్పుడు ఎవరూ తనను గౌరవంగా చూడలేదు కానీ ఇప్పుడు కొడుకు ఉద్యోగం వల్ల తనకూ గౌరవం వచ్చిందని భావించేవాడు. తల్లి లక్ష్మమ్మకు అంత విశ్లేషణ తెలియదు. ఆమెకు తెలిసిందల్లా కొడుకు బాగా చదివాడు. పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఇక అతడు సుఖంగా ఉంటాడు అంతే. బంధువుల కళ్లల్లో అసూయ మెరుస్తుండేది. “కొడుకు జీవితంలో సెటిల్ అయిపోయాడు” అన్న ఆనందం తల్లిదండ్రుల్లో నిలబడిపోయింది.
కానీ మహానగరంలో అడుగుపెట్టిన మొదటి రోజే వినయ్‌కి అది మరో గ్రహంలా కనిపించింది. ఆకాశాన్ని తాకే భవనాలు. అద్దాల మేడలు. గేట్ల ముందు సెక్యూరిటీలు. మెడకు వేలాడే ఐడీ కార్డులు. గాజు గదుల్లో కూర్చుని ప్రపంచాన్ని నడుపుతున్నట్టున్న యువకులు. అతడూ వారిలో ఒకడయ్యాడు. కొన్ని నెలలు గడిచాక పెళ్లి మాట వచ్చింది. అమ్మాయి వాళ్లు ప్రేమ గురించి, అభిరుచుల గురించి అడగలేదు.
“ప్యాకేజీ ఎంత?, ఏ కంపెనీ?, ఆన్‌సైట్ అవకాశం ఉందా?, ఫ్లాట్ ఉందా? తల్లిదండ్రులతో ఉంటాడా?” అన్న ప్రశ్నలతోనే పెళ్లి నిర్ణయమైంది. ఇరు పక్షాలూ ఇద్దరూ ఒప్పుకుని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత మొదలైంది నిజమైన జీవితం. ఫ్లాట్ కావాలి. దానికోసం బ్యాంకు లోన్. కారు కావాలి. మరో లోన్. ఇంటీరియర్ డిజైన్. క్రెడిట్ కార్డులు. పిల్లల భవిష్యత్తు కోసం పాలసీలు. భవిష్యత్తును భద్రపరచే ప్రయత్నంలో వర్తమానం మొత్తం తాకట్టు పడిపోయింది.
నెల మొదటి తేదీన జీతం వస్తుంది. రెండో తేదీకి ఈఎంఐలు తీసుకుపోతాయి. మూడో తేదీకి బిల్లులు.
నాలుగో తేదీకి క్రెడిట్ కార్డు. మిగిలేది కేవలం క్యాలెండర్ మాత్రమే. జీవితం కాదు. ఆఫీసులో షిఫ్టులు. టార్గెట్లు. రోడ్డుపై ట్రాఫిక్. మనసులో టెన్షన్. వినయ్ క్రమంగా నడవడం మానేశాడు. పరుగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం కూడా కాదు. ఎవరో వెనకనుండి తరుముతున్నట్టు జీవించడం మొదలుపెట్టాడు. మేఘనకు కూడా అంతే. భర్త సమయానికి ఇంటికి రాడు. ఇంట్లో వున్నా వున్నా కాల్స్ మీటింగ్స్.
ఎప్పుడయినా సరదాగా వున్నప్పుడు వినయ్ మేఘనతో అనేవాడు – “నేను పనిచేస్తున్న కంపెనీ యజమాని ఎవరో నాకు తెలియదు. మేనేజర్ మరో దేశంలో ఎక్కడో ఉంటాడు. కంపనీ కస్టమర్ ఇంకో ఖండంలో ఉంటాడు. పని ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో తెలియదు. ల్యాప్‌టాప్ తెరిస్తే ప్రపంచం తెరుచుకుంటుంది. మూస్తే ప్రపంచం ఆగిపోతుంది. అలా అనిపించే భ్రమలో జీవిస్తున్నాను. వైఫై సిగ్నల్ ఉంటే జీవితం ఉంటుంది. వైఫై పోతే ప్రపంచమే ఆగిపోతుంది. ఒకప్పుడు మనుషులు దేవుడిని వెతికేవాణ్ని. ఇప్పుడు నెట్‌వర్క్‌ను వెతుకుతున్నాను. అదేనోయ్ మా ఉద్యోగం జీవితం” అని. అంటూనే నవ్వేసేవాడు.
ఒకప్పుడు కుటుంబ సభ్యులు కలుసుకునేవారు, మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు కలుపుతున్నాయి. ఇప్పుడు స్క్రీన్లు మాట్లాడుతున్నాయి. ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి తినేవారు. ఇప్పుడు ఒత్తిడి మర్చిపోవడానికి తింటున్నారు. బర్గర్లు. పిజ్జాలు. ఫ్రైడ్ చికెన్. వారాంతపు పార్టీలు. అదే సమయంలో షుగర్. బీపీ. కొలెస్ట్రాల్. నిద్రలేమి. ఆందోళన, డిప్రెషన్ అన్నీ ఉచిత బహుమతుల్లా వెంట వస్తున్నాయి.
***
ఒకరోజు రాత్రి భారీ వర్షం. విద్యుత్ పోయింది. వైఫై చచ్చిపోయింది. ల్యాప్‌టాప్ బ్యాటరీ ఖాళీ. చేయడానికి పని లేక వినయ్ బాల్కనీలో కూర్చున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆకాశాన్ని చూశాడు. అది ఇప్పటికీ నక్షత్రాలతోనే ఉండి, దూరంగా వర్షపు వాసన వచ్చింది, అమ్మ చేసిన పకోడీలు గుర్తొచ్చాయి. నాన్న సైకిల్ గంట గుర్తొచ్చింది. స్నేహితులతో ఆడిన మైదానం గుర్తొచ్చింది. అతని బాల్యం ఒక్కసారిగా తలుపు తట్టింది. అప్పుడు ఒక ప్రశ్న అతని లోపల మెరుపులా మెరిసింది.
‘నేను గెలిచానా?’ లోకం గెలిచావు అంటోంది. బ్యాంకు వాడేమో ఇంకా ఇరవై సంవత్సరాలు చెల్లించాలి అంటాడు. కంపెనీ ఇంకా ఇంకా కష్టపడాలి అని వార్నింగులు ఇస్తోంది. మార్కెట్ ఇంకా అవసరాల్ని తీర్చుకోవాలి వస్తువుల్ని కొనాలి అని అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కానీ మనసు మాత్రం ‘నువ్వు అలసిపోయావు’ అంటున్నది. అప్పుడు అతనికి అర్థమైంది. తన ఫ్లాట్‌కు తానే యజమాని కాదు. బ్యాంకే యజమాని. తన సమయానికి తానే యజమాని కాదు. కంపెనీ యజమాని. తన మనసుకు తానే యజమాని కాదు. భయాలు యజమానులు. అద్దాల మేడలో కూర్చుని ప్రపంచాన్ని జయించాననుకున్నాడు. కానీ నిజానికి అతనే ఒక అదృశ్య బందీ. అప్పుల బందీ. ఆశల బందీ. అభిలాషల బందీ. పోటీ బందీ. ఆ రాత్రి వినయ్ ఒక గొప్ప సత్యంఅర్థమవుతున్నది విజయం అనేది జీతం కాదు. ప్యాకేజీ కాదు. ప్రమోషన్ కాదు. అద్దాల మేడ కాదు. నిద్రపోయే ముందు మనసు ప్రశాంతంగా ఉండగలగడమే విజయం. ఉదయం లేచినప్పుడు జీవితం మీద ప్రేమ మిగిలి ఉండటం విజయం. మనిషిగా మిగలడం విజయం. మిగతావన్నీ కేవలం ఈఎంఐలతో కొన్న భ్రమలు మాత్రమే.
***
వినయ్ ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నాడు. అప్పుడు రాత్రి రెండు గంటలు. కిటికీ అవతల నగరం ఇంకా దీపాలు వెలుగుతూనే వున్నాయి సిటీ మేల్కొనే ఉంది. స్క్రీన్ మీద ఒక మెసేజ్ మెరిసింది. ‘Resource Utilization Report’. అతను లోపలే నవ్వుకున్నాడు
‘రిసోర్స్’ ఈ పదం తనకు మొదటిసారి వినిపించినప్పుడు విచిత్రంగా అనిపించింది. మనిషిని మనిషి అని కాకుండా ‘రిసోర్స్’ అని పిలవడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కాలేదు. తనకిప్పుడు అలవాటైపోయింది. కంపెనీలో వుండేది ఎవ్వరూ మనుషులు కాదు. రిసోర్స్‌లు. ఒకరు రాజీనామా చేస్తే ‘రిసోర్స్ లాస్’, కొత్తవాడు వస్తే ‘రిసోర్స్ ఆన్‌బోర్డింగ్’, అనారోగ్యంతో సెలవు తీసుకుంటే ‘రిసోర్స్ అన్‌అవైలబుల్’. మనిషి మెల్లగా కేవలం ఒక పదంగా మారిపోయాడు. మొదట పదం, ఆ తర్వాత సంఖ్యగా మారిపోయాడు. సంఖ్య తర్వాత క్రమంగా గ్రాఫ్‌గా మారిపోయాడు. అంతేకాదు గ్రాఫ్ తర్వాత డేటాగా కూడా మారిపోయాడు.
“వినయ్” వెనుకనుండి మేఘన పిలిచింది
“ఇంకా పడుకోలేదా?”
“ఇంకో అరగంట” అన్నాడు
ఆ అరగంట అన్నది కాస్తా మూడు గంటలైంది. మెల్లిగా మేఘన నిద్రలోకి జారుకుంది.
వినయ్ ఇంకా స్క్రీన్ ముందే ఉన్నాడు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరూ వేర్వేరు ప్రపంచాల్లో జీవిస్తున్నారు.
ఒకప్పుడు వాళ్లు కలిసి కలలు కనేవాళ్ళు. ఇప్పుడు కలిసి ఈఎంఐలు కడుతున్నారు అంతే తేడా.
***
మేఘనకేమో ఒక విచిత్రమైన ఒంటరితనం ఉంది. భర్త ఉన్నాడు. ఇల్లు ఉంది. కారు ఉంది. బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంది. కానీ సంభాషణ లేదు. మాట్లాడే వాళ్ళే కరువు.
***
ఆ రోజు ఆదిత్య పుట్టిన రోజు. వాడికి ఐదేళ్లు నిండాయి. స్కూల్‌లోనెమో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ. వాడు చెట్టు వేషం వేసుకున్నాడు.
“నాన్న వస్తాడు కదా?” అని అమ్మతో ఆశగా అడిగాడు.
మేఘన నవ్వింది. “వస్తాడు రా” అంది.
వినయ్ నిజంగానే ఆఫీసునుంచి తొందరగా రావాలనుకున్నాడు. కానీ అదే రోజు క్లయింట్ కాల్. ప్రాజెక్ట్ రివ్యూ. డెడ్‌లైన్.
ఆదిత్య నాన్నకోసం ఎదురుచూస్తూనే చెట్టులా నిలబడి బహుమతి అందుకున్నాడు.
వినయ్ మొబైల్‌లో ఫోటో మేఘన తీస్తున్న లైవ్ వీడియో చూసి చప్పట్లు కొట్టాడు.
పిల్లాడి బాల్యంలో తండ్రి అతిథిగా మారిపోయాడు.
***
“మా ఉద్యోగులే మా బలం” అని ఓరోజు కంపెనీ వార్షిక సమావేశంలోవేదికపై సీఈఓ అన్నాడు. అంతా చప్పట్లు కొట్టారు. అంతేకాదు, “మీరు మా కుటుంబం” అని కూడా అన్నాడు. మళ్లీ చప్పట్లు.
వినయ్‌కు నవ్వొచ్చింది. అంతా కుటుంబం అయితే మాకు జ్వరమొస్తే ఎట్లుందని అడుగుతారా? నిద్రపోవట్లేదని గమనిస్తారా? కూతురు పుట్టిన రోజు మిస్ అయ్యిందని బాధపడతారా? కుటుంబం అనే పదాన్ని కార్పొరేట్ ప్రపంచం తమ సౌకర్యం కోసం అత్యంత విజయవంతంగా దోచుకుంది.
ఎలాంటి ప్రేమ లేకుండా. బాధ్యత లేకుండా..
***
సడన్‌గా ఒకరోజు వూర్లో ఉదయం తండ్రి రామచంద్రయ్యకు స్వల్ప గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు.
మేఘన ఫోన్ చేసింది. వినయ్ మీటింగ్‌లో ఉన్నాడు. మరో గంట తర్వాత కాల్ చేశాడు. వెంటనే ప్రయాణమయ్యారు.
ఆసుపత్రి మంచం మీద తండ్రిని చూసినప్పుడు వినయ్‌లో ఒక్కసారిగా ఏదో దుఃఖం పొర్లుకొచ్చింది. ముసలితనంతో వాడిపోయిన తండ్రి చేతులు సన్నబడ్డాయి. జుట్టు తెల్లబడి పలుచబడింది.
కళ్లలో గతంలోవున్న వెలుగు మసకబారింది. అమ్మ గుండెల నిండా దిగులు కనిపిస్తూనే వుంది. ఇవేవీ ఏ ఒక్క రోజులోనో జరగలేదు. అనేక ఏళ్లుగా క్రమంగా జరుగుతున్నాయి. కానీ తాను చూడలేదు. ఎందుకంటే పనిలో ఉద్యోగంలో బిజీగా ఉన్నాడు. సంపాదించడంలో జీవితాన్నే కోల్పోతూ బిజీ బిజీగా వున్నాడు.
వినయ్ ఆ రాత్రి ఆసుపత్రి బయట బెంచ్ మీద కూర్చున్నాడు. మేఘన పక్కనే వుంది. చాలా సంవత్సరాల తర్వాత ఒడిలో ల్యాప్‌టాప్ లేదు. ఎలాంటి మీటింగ్ లేకుండా. టార్గెట్ లేకుండా వున్నాడు.
ఒకసారి ఆకాశం వైపు చూశాడు. పైన ఆకాశానికి ప్రమోషన్లు లేవు. చంద్రుడికి అప్ప్రైజల్స్ లేవు.
చెట్లకు కేపీఐలు లేవు. పక్షులకు డెడ్‌లైన్లు లేవు. అయినా అవి జీవిస్తున్నాయి. తాను మాత్రం అన్నీ సాధించి కూడా జీవించడం మరిచిపోయాడు.
అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద మెసేజ్ ‘Congratulations! You have been promoted’ ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్. కానీ ఆశ్చర్యంగా అతనికి అసలే సంతోషం అనిపించలేదు. ఎందుకంటే అదే క్షణంలో అతనికి మరో జీవిత సత్యం అర్థమైంది. ఇన్నేళ్ళ కృషితో తాను ఎదిగింది ఉద్యోగంలో. కానీ తగ్గింది జీవితంలో.
మరుసటి ఉదయం రామచంద్రయ్య కాస్త కోలుకున్నాడు. వినయ్ అతని మంచం పక్కన దిగాలుగా కూర్చున్నాడు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడలేదు. మధ్య మధ్యలో ఆసుపత్రిలోని యంత్రాల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఆ తర్వాత రామచంద్రయ్యే మెల్లిగా మాట్లాడాడు.
“నీకు తెలుసా వినయ్ బాబూ నేను చిన్నప్పుడు నీ కోసం ఎన్ని కలలు కన్నానో”
“ప్రశాంతంగా వుండండి నాన్నా తర్వాత మాట్లాడొచ్చు” అంటూ వినయ్ కంట్లో నీళ్ళను కళ్ళల్లో అదుముకుంటూ తండ్రి వైపే చూసాడు
“నువ్వు బాగా చదవాలి అనుకున్నా మంచి ఉద్యోగం రావాలి అనుకున్నా. నీకు ఎలాంటి కష్టాలు రావొద్దనుకున్నా” అంటూ కొద్దిసేపు ఆగాడు రామచంద్రయ్య.
“కానీ ఇప్పుడు చూస్తుంటే నీకు కష్టాలున్నాయని తెలుస్తూ వుంది, కాని ఆ కష్టాలేమితో నాకు తెలుస్తలేదు” అన్నాడు.
ఒక్కసారిగా వినయ్ కళ్ళలోంచి నీళ్లు దొర్లాయి.
రామచంద్రయ్య మెల్లిగా నవ్వాడు.
“డబ్బు సంపాదించావు. ఇల్లు కొన్నావు. కారు కొన్నావు. కానీ నువ్వు నిన్ను నువ్వు కోల్పోతున్నావేమోనని భయంగా ఉందిరా నాన్నా”
వినయ్‌కి ఆ మాటలు గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి.
ఎందుకంటే అదే మాటను అతను తనలో తాను గతంలో ఎన్నోసార్లు అనుకున్నాడు. తనను తానే విన్నాడు. కానీ విననట్లు నటించాడు.
తండ్రి ఆరోగ్యం కొంత కుదుట పడడంతో వినయ్ కుటుంబంతో హైదరాబాద్ వచ్చేసాడు. తిరిగి వచ్చిన తర్వాత అతనిలో ఏదో మార్పు మొదలైంది. ఉద్యోగం వదిలేయలేదు, ప్రపంచాన్ని త్యజించలేదు. అన్నింటిని విడిచి హిమాలయాలకు వెళ్లిపోలేదు. కానీ తన జీవితాన్ని కొంచెం దూరం నుంచి చూడడం మొదలుపెట్టాడు.
ప్రతి ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూసే అలవాటు మానేశాడు. ఆదిత్యను స్కూల్ బస్ వరకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. మేఘనతో కలిసి కూర్చుని టీ తాగడం మొదలుపెట్టాడు. ఆఫీసు బిజీలో వున్నప్పుడు అవన్నీ చాలా చిన్న విషయాల్లా అనిపించాయి. కానీ అనేక చిన్న విషయాలు కలిస్తేనే పెద్ద జీవితం కదా!
జీవితమంటే పెద్ద విజయాలు మాత్రమే కాదు. అదంతా చిన్న చిన్న సంతోషాల సమాహారం. ఒక ఆదివారం కొడుకు ఆదిత్య తండ్రి చేతిని పట్టుకుని అడిగాడు “నాన్నా నువ్వు చిన్నప్పుడు చెట్లు ఎక్కేవాడివా?” అని.
వినయ్ నవ్వాడు. ”చాలాసార్లు ఎక్కేవాణ్ని”
“నాకూ చెట్లు ఎక్కడం నేర్పిస్తావా?” ఆ ప్రశ్న వినగానే అతనికి తన బాల్యం ఒక్కసారిగా తిరిగొచ్చింది.
అప్పుడు వానలో తడిచిన రోజులు. గిల్లీడండా ఆటలు బొంగరాలు తిప్పడం పతంగీలు ఎగరేయడం మట్టిలో ఆడడం, మామిడి చెట్లు, వాటి పచ్చదనం అతను ఆదిత్యను దగ్గరికి తీసుకున్నాడు.
“నేర్పిస్తాను రా” అన్నాడు. ఆ రోజు చాలా ఏళ్ల తర్వాత వినయ్ మేఘన ఆదిత్యని తీసుకుని పార్కుకు వెళ్లారు.
కొడుకుతో కలిసి పరుగెత్తారు. చెట్టు కింద కూర్చున్నారు, ఆకాశాన్ని చూశారు, ఆదిత్య నవ్వుతూ వుంటే ఎంతో సంతోషం కలిగింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది.
తన కొడుకు ఆదిత్య బాల్యంలో తాను ఒట్టి ప్రేక్షకుడిగా కాకుండా ముఖ్యమయిన పాత్రగా ఉండాలి.
***
ఆఫీసులో ఒకరోజు ఇటీవలే కొత్తగా చేరిన ఉద్యోగికి అంతా ‘హార్డ్ వర్క్ చేయి’, ‘పోటీ పడు’, ‘సర్వైవ్ అవ్వాలి’ అంటూ సలహాలిస్తున్నారు. వినయ్ మాత్రం ఇంకో మాట చెప్పాడు ‘ముందు బతుకు’ అని.
ఆ అబ్బాయి ఆశ్చర్యంగా చూశాడు.
“ఉద్యోగం కోసం జీవితం కాదు. జీవితం కోసం ఉద్యోగం” అన్నాడు వినయ్.
తను ఆ మాటలు అంటుంటే తనకే కొత్తగా అనిపించింది. ఒకప్పుడు ఇవే మాటలు తనకు తాను చెప్పుకునే వాడు. క్రమంగా వాటిని తానే మర్చిపోయాడు. ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్లీ గుర్తొచ్చాయి.
ఒక రోజు సాయంత్రం మేఘన బాల్కనీలోకి టీ తీసుకొచ్చింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ మౌనంగా ఒకర్ని ఒకరు చూస్తూ అలా కూర్చున్నారు. ముందు ఇలాంటి మౌనాలు నిశ్శబ్దాలు ఇద్దరి నడుమా దూరాన్ని సూచించేవి. ఇప్పుడు అవే దగ్గరతనాన్ని సూచిస్తున్నాయి.
“నువ్వు మారిపోయావు” అంది మేఘన.
“ఎలా?”
“ఇప్పుడైనా సమయానికి ఇంటికి వస్తున్నావు” అంది నవ్వుతూ.
వినయ్ కూడా నవ్వాడు.
ఎన్నాళ్ల తర్వాత ఆ నవ్వు కళ్లనుండి గుండెల దాకా చేరింది.
***
రెండు రోజుల తర్వాత కంపెనీ నుంచి స్టాఫ్ కొత్త పనితీరు నివేదిక వచ్చింది.
అందులో ఒక పట్టిక ఇట్లా వుంది Employee ID. Performance Score. Utilization. Productivity. Efficiency. వినయ్ చాలాసేపు ఆ పట్టికను అలా చూస్తూ ఉన్నాడు.
ఆ నివేదికలో తన గురించి అన్నీ ఉన్నాయి. తాను ఎన్ని గంటలు పనిచేశాడో ఉంది. ఎన్ని పనులు పూర్తి చేశాడో ఉంది. ఎంత లాభం తెచ్చాడో ఉంది. కానీ.. తాను ఎప్పుడు నవ్వాడో లేదు. కొడుకుతో ఎప్పుడు ఆడాడో లేదు. తండ్రిని ఎప్పుడు కౌగిలించుకున్నాడో లేదు. భార్యతో ఎప్పుడు మనసు విప్పి మాట్లాడాడో లేదు. మనిషి జీవితంలోని ముఖ్యమైన విషయాలన్నీ డేటాలో కనిపించవని అప్పుడు అతనికి స్పష్టమైంది.
మన కాలపు అతిపెద్ద విషాదం ఇదేనేమో.
మనిషిలో కొలవగలిగిన ప్రతిదీ కొలుస్తున్నాం.
కానీ మనిషిగా నిలబెట్టే వాటిని కొలవలేకపోతున్నాం.
రోజూ ఎన్ని అడుగులు నడిచాడో తెలుసు. ఎన్ని కేలరీలు ఖర్చు చేశాడో తెలుసు. ఎన్ని గంటలు పనిచేశాడో తెలుసు. కానీ అతను సంతోషంగా ఉన్నాడో లేదో తెలియదు. అతని మనసుకు శాంతి ఉందో లేదో తెలియదు. అతను ప్రేమిస్తున్నాడో లేదో, ప్రేమించబడుతున్నాడో లేదో తెలియదు.
కొన్ని నెలల తర్వాత వినయ్ తన ఊరికి వెళ్లాడు. రామచంద్రయ్య ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆదిత్య పెరట్లోకి పరుగెత్తాడు. అమ్మతో కలిసి మేఘన నవ్వుతోంది. సాయంత్రపు గాలి మెల్లగా వీస్తోంది. దూరంగా ఆలయంలో గంటలు వినిపిస్తున్నాయి. ఆ క్షణంలో వినయ్‌కు ఒక గొప్ప సత్యం అర్థమైంది.
జీవితం అనేది ఒక గమ్యం కాదు. ఒక ప్రమోషన్ కాదు. ఒక ప్యాకేజీ కాదు. ఒక అద్దాల మేడ కాదు. జీవితం అనేది ఇలాంటి అన్ని క్షణాల సమాహారం. వాటిని కోల్పోతే మిగిలేది కేవలం రికార్డులు, డేటా. గణాంకాలు. ఫైళ్లు మాత్రమే కాని మనిషి కాదు.
ఆ సాయంత్రం ఆదిత్య వచ్చి అడిగాడు.
“నాన్నా నా అంత వున్నప్పుడు, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకున్నావు?’
వినయ్ నవ్వుకున్నాడు. చాలాసేపు ఆలోచించాడు. తర్వాత అన్నాడు “మనిషిని”.
ఆదిత్యకు అర్థం కాలేదు. కానీ తండ్రి రామచంద్రయ్యకు అర్థమైంది. మేఘనకు అర్థమైంది. అతనికైతే పూర్తిగా అర్థమైంది. ఇన్నేళ్లుగా ‘ఉద్యోగి’గా, ‘రిసోర్స్’గా, ‘డేటా’గా మారిపోయిన తనలో ఎక్కడో మిగిలి ఉన్న మనిషిని మళ్లీ కనుగొన్నాడు.
అది ఉద్యోగంలో గెలవడం కంటే పెద్ద విజయం. అది ప్రపంచాన్ని గెలవడం కంటే పెద్ద విజయం. ఎందుకంటే చివరికి మనిషి జీవితంలో అత్యంత కష్టమైన పని మనిషిగానే మిగలడం.
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
