Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 54: కాలం లొంగే ఘటమా!

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

కొత్త సంవత్సరం జనవరి ఒకటి నాడు మిత్రుల నుద్దేశించి మా ప్రియమైన, గౌరవమిత్రురాలు ఒకామె, “కాలాన్ని మంచి చేసుకోవాలి” అంటూ వ్యాస రూపంలో ఒక చక్కని సందేశం ఇచ్చారు. కాలాన్ని మంచి చేసుకుంటే దాన్ని వృథా చేయడం వల్ల వచ్చే నష్టాలను అధిగమించి, సద్వినియోగం చేసుకుంటే మరిన్ని లాభాలు పొందవచ్చని ఆ వ్యాసం అంతరార్ధం. మనకసలు ఎవరినైనా చెడ్డ చేసుకునే ధైర్యం ఉందా ఏమిటి? ఊహ తెలిసిన దగ్గరనుంచీ పెద్దలు మనకి (ఆడపిల్లలకి) నూరి పోసిందదే కదా! అందరితో మంచిగా ఉండాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. నోరు చేసుకోకూడదు (చిన్నప్పుడు అన్నదమ్ముల మీద హక్కుల కోసం పోరాడినప్పుడన్న మాట) అని సుద్దులు. సీనియర్ లేడీస్ చేతిలో అయితే మొట్టికాయలు పడేవి జడలు వేసేటప్పుడు. మనకి పెళ్లి చేసి పంపేటప్పుడు “ఎట్టి పరిస్థితిలోనూ సహనంతో ఉండు. లేకపోతే, మా పెంపకం అని మన కుటుంబాన్ని అనుకుంటారు, ఇంకా మన ఇంటి పేరుని కూడా అనుకుంటారు జాగ్రత్త !” అన్నారు.

మన అమ్మలు ఆవేశపడాల్సి వచ్చినప్పుడు మౌనంగా కళ్ళప్పగించి చూస్తూ ఉండేవారు. అది మనం గమనిస్తూ ఉండేవాళ్ళం. బంధువుల ఇళ్లకి వెళ్ళినప్పుడు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ “వీళ్ళమ్మ గొప్ప శాంతమూర్తి. నోరు విప్పి ఎరగదు. రోజంతా పనిచేసుకుంటూ ఉంటుంది. అత్తమామల మాట జవదాటదు. భర్తను పన్నెత్తి మాటనదు. పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది. ఇంటిని పండులా ఉంచుకుంటుంది.” అంటూ, మనకి కూడా అమ్మలాగే ఉండాలని ఒక మానసికమైన ట్రైనింగ్ ఇచ్చేవారన్నమాట (మన రెబెల్ బుద్ధులు గౌన్లు వేసుకున్నప్పటి నుంచీ గమనించి కావచ్చు).

అలా పెరిగి వచ్చిన మనం, మానవ జీవితంలో గొప్ప విలువాతివిలువైన ‘కాలం’ గారిని, మంచి చేసుకోక చెడ్డ చేసుకుంటామా? చెప్పండి! ఇక విషయానికి వచ్చేద్దాం. కాలాన్ని మనం ఎక్కడ వృథా చేస్తున్నాం? రోజూ చేయాల్సిన పనుల జాబితా రాత్రి కాగితం మీద రాసుకుని, తలగడ కింద పెట్టుకొని మరీ నిద్రపోయి, మర్నాడు లేచి చేసి పారేస్తున్నాం. కాకపోతే కొన్నిసార్లు పక్కింటి స్నేహితురాలి కోసం మ్యాచింగ్ సెంటర్‌కీ, (అక్కడ మనకీ పనుంటుంది మరి) మరోసారి ఇంటికి దగ్గరగా కొత్త చీరల షాప్ ఓపెన్ చేసినప్పుడు (కొత్త రకాలేవైనా వస్తే ముందే కొనుక్కోవాలి కదా) వెళ్ళక తప్పదుగా! ఒకోసారి ఏ పిన్నమ్మో, పెద్దమ్మో ఓ వెయ్యి రూపాయలు నోముకని పంపి, నా పేరు చెప్పి చీర కొనుక్కోమ్మా! అన్నప్పుడో, ఇంకా కాస్త మోడ్రన్ పిన్నులు (ఇంచుమించు మన వయసు వాళ్ళు) “నేనిచ్చిన డబ్బులతో చీర కొనుక్కుని ఫోటో పెట్టు!” అని దబాయించినప్పుడో తప్పదుగా వెళ్లడం!

నెలనెలా, సరదాగా పాట్‌లాక్ పెట్టుకుని పొరుగింటి కూరలు లొట్టలు వేస్తూ తినడం కూడా చెయ్యాలి. జీవితానందం కోసం ఇలాంటి పనులు చెయ్యమని మానవ వ్యక్తిత్వ వికాస రచనల్లో చెయ్యి తిరిగిన సీనియర్ రచయితలు చెప్తుంటారు కదా! ఇంకా ఇంటికి దూరంగా, చుట్టుపక్కలున్న పెద్ద పెద్ద తోటల్లో పూల మొక్కల మధ్య తిరగాలనీ, సముద్ర తీరాల్లో కూర్చుని ఆనందించాలనీ! ఆత్మీయ బృందంతో కలిసి చిన్న చిన్న ట్రిప్పులు లాంటివి కూడా వేసుకోమని దినపత్రికల ఆదివారం అనుబంధంలో పేజీడు వ్యాసాలు వేస్తున్నారు. అవన్నీ చదివి ఆచరించినప్పుడు కాస్త సమయం ఖర్చు చెయ్యక తప్పదు!

నిత్యం ఉదయాన్నే కాఫీ తాగుతూ, రేడియోలో భావన సూక్తులు వింటుంటే, కొత్త రోజు అప్పుడే బేకరీ నుంచి తెచ్చిన కేకులా నిండుగా కనబడుతుంది. సహాయకురాలు కాలింగ్ బెల్ కొట్టి, దురుసుగా లోపలికి ప్రవేశించి ఇల్లంతా భరతనాట్యం చేసి ముగించి వెళ్లేసరికి ఒక గంట కేకు ముక్క మాయం. ఇక అప్పటినుండి అనేక రకాలుగా ఆ కేకు, ముక్కలు చెక్కలై అదృశ్యమవుతూ ఉంటుంది. రాత్రి పదయ్యేసరికి నిద్రపోయే నాలుగైదు గంటల కేకు మాత్రమే మిగులుతుంది. ‘రోజంతా ఏం చేసావ్? ఎంత విలువని మిగిల్చావ్?’ అని మన అంతరాత్మ అడిగితే, అదీ.. అదీ.. అని నసుగుతుంది మన మట్టిబుర్ర. ‘అంటే ఈ రోజు సమయాన్ని వృథా చేశావు!’ అని ఆ తేదీ మన నెత్తిన గబుక్కున ఒక మొట్టికాయ వేసి వెళ్ళిపోతుంది. టోటల్‌గా ఇదే మన పరిస్థితి.

అసలు ఇంకో సంగతి మనం మర్చిపోయాం అది, కాలం మాయ మరాఠీ! కాలంతో ప్రయాణం కనికట్టులా ఉంటుంది. మన ఊరికి వెళ్లి మన బంధుమిత్రులతో ఉన్నప్పుడు రోజు ఒక గంటలా గడుస్తుంది. అయిష్టంగా, తప్పక కొందరు బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ముళ్ళ మీద ఉన్నట్టుగా తోచి, గంట రోజులా సాగుతూ ఉంటుంది. సాహిత్య సభల్లో మంచి వక్తలు గంట మాట్లాడినా ఐదు నిమిషాల్లా ఉండి, పీ.హెచ్డీలు మాట్లాడినప్పుడు (వాళ్ళు ఎలాగూ వాళ్ల పరిశోధనా గ్రంథాల లెవెల్‌లో మాట్లాడుతారు. పేజీలు తప్ప రసం ఉండదని మన అనుమానం) మనం టైమ్ చూసుకుంటూ టీ ఇస్తున్నారేమో అని అటూ ఇటూ ఆశగా చూడడం, మన మిత్రులు ఎవరైనా మీటింగ్ హాల్లో ఉన్నారేమో వెతికి వాళ్ళ పక్కన చేరి చెవులు కొరకడం లాంటి వంకర వేషాలెన్ని వేసినా సరే సమయం నత్తనడకని నడుస్తుంటుంది. కవిత్వ భాషలో చెప్పాలంటే ఆనందంలో పరుగులు తీసి, ఇబ్బందుల్లో నేలబారుగా పాకుతుంది కాలం.

జీవితం అందరికీ, వివిధ కాలాల్లో వివిధ రకాల పాఠాలు నేర్పుతుంది నెత్తిమీద సుత్తితో కొడుతూ మరీ! ఆ దెబ్బల నుంచి తేరుకునే లోపల కాలం జర్రున జారిపోతుంది. అలాంటి మరికొన్ని ఉత్పాతాల నుంచి కూడా కోలుకొని సదరు మనిషి తిరిగి చిగురు వేసే లోపల కూడా కాలం గిర్రున తిరుగుతుంది. “కాలాన్ని ఒడిసి పట్టాలి లేకపోతే దోసిట్లోని నీళ్లు జారిపోయినట్టు జారిపోతుంది” అని మా మాష్టారు నా ఆటోగ్రాఫ్ బుక్‌లో రాసారు కూడా! ఇంకా మన సమయాన్ని రిటైల్‌గా హరించే టైమ్‌పాస్ బఠాణీల (జోకుల వీడియోలూ, కామెడీ రీల్స్ లాంటివి) వలల్లో పడకుండా మనల్ని మనం ఎలెర్ట్ చేసుకోవడం చాలా కష్టం. బంధుమిత్రుల విహారయాత్రల వందలాది ఫొటోలూ (వాటిల్లోంచి ఓ నాలుగైదు ఎంచి పెట్టే ఓపిక వాళ్ళకి ఉండదు), వాళ్ళ ఇళ్లలో జరిగే వేడుకల వీడియోలూ చూసి రెండు మూడు కామెంట్స్ పెట్టకపోతే మనం దొరికిపోతాం. ఇక పోతే మనం ప్రేమగా చదివే మన మిత్ర బృందం సాహిత్యం ఉంటుంది. ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించినవీ, మనకిష్టమై వినే కథలూ, నవలలూ ఉండనే ఉంటాయిగా! వాటికి కొంత సమయం కేటాయించాలి.

అయినా మనం కాలాన్ని వృథా చేసే అవకాశం మనకి ఎప్పుడు దొరికిందనీ? చదువుకున్నాం, ఉద్యోగాలు చేసాం. కుటుంబాలు నడిపాం. పిల్లల్ని చదివించి వాళ్ళకి జీవనోపాధి మార్గం చూపించి, వాళ్లకి కుటుంబాల్ని ఏర్పరిచి బాధ్యతల్ని ముగించుకున్నాం. విశ్రాంత ఉద్యోగస్థులమైనాక శరీరం ఇప్పుడు చాలా గారాలు పోతోంది. చెప్పిన నెప్పి చెప్పకుండా కొత్త కొత్తవి చెబుతోంది. ఇంతకాలం పరుగులు తీయించిన శరీరం మాట కూడా వినక తప్పదు కదా! ‘లక్షలు ఖర్చు పెట్టి చదివి, కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టిన డాక్టర్లను కూడా పోషించడం కూడా మన ధర్మం. లేకపోతే వాళ్లేమైపోతారు పాపం!’ అని తరచూ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం. అక్కడ ఉదయం వెళితే ఏకంగా సాయంత్రమే తిరిగి రావడం! రోజు ఐస్ ఫ్రూట్‌లా కరిగిపోతుంది. మర్నాడు కూడా రమ్మంటే మరోరోజు హుష్ కాకీ! ఈ సందట్లో, కాలం క్లాస్‌కి లేటుగా వచ్చి త్వరగా వెళ్ళిపోయే పిల్లల్లా తప్పించుకుంటూ ఉంటుంది.

మేడం ఇవన్నీ సాకులు అన్నారు కాబట్టి మరీ ఎక్కువ చెప్పినా బాగుండదు, అయితే కాలాన్ని మరీ పిసినారుల్లా చిటికెడు, దోసెడు కాకుండా కడవల కొద్దీ, బకెట్ల కొద్దీ గౌరవిద్దాం. కాలం సంతోషించి మన కష్టాలకు ఫలితాలను జలపాతంలా కుమ్మరిస్తుందని ఆశిద్దాం!

పదండి! ‘కల్ కరే సో ఆజ్’ అనుకుంటూ రేపటి పని ఈరోజే చేసేద్దాం! కాలాన్ని మనం గౌరవిస్తే, ‘గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్’ అనే రూల్ ప్రకారం కాలం కూడా కాస్త మనల్ని గౌరవించి, శుభాలనిచ్చే అవకాశం కూడా ఉంది కదా! ఏమంటారు?

Exit mobile version