Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఐతిహాసిక మహావట భూజం-1

[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]

1.

ప్రపంచానికే తలమానికం ఆర్యావర్త భారతం
అందులో అగ్రగణ్యం ఆంధ్రదేశం నిరతం
ఆంధ్రదేశానికి ఆయువుపట్టు రాయలసీమ
ప్రేమ పౌరుషం సంగమించిన సువిశిష్ట ధామం.

రాష్ట్రానికి దక్షిణాన రాణించిన భూమి
బ్రిటిష్ వారు నిజామ్‌కు ఇచ్చిన దత్తసీమ
ఆ పేరే నచ్చని ‘చిలుకూరి’ పెట్టిన పేరే రాయలసీమ
ఎన్నో ప్రత్యేకతలను చాటిన తెలుగు వారి ధీమా!

తత్త్వవేత్తలెందరో తామిక్కడ పుట్టారు
వేమయ్య, బ్రహ్మంగారు, జిడ్డు కృష్ణమూర్తి
హజరత్ హమిర్. ముంతాజ్ అలీ
ఆధ్యాత్మిక పరిమళాలను విరివిగా వెదజల్లారు!

పరిఢవిల్లింది ఈ సీమలో మరపురాని సాహిత్యం
అష్టదిగ్గజాల కావ్యములే అలరించెను అనునిత్యం
ఒంటిమిట్టలో పుట్టిన మట్టి కవే పోతన
తన కవితను పండించెను మాదయగారి మల్లన.

నాటక రంగం ఇక్కడ నాణ్యతనే చిమ్మింది
బళ్ళారి, ధర్మవరం, కోలాచలం నటనాఝరి
కట్టమంచి కట్టినాడు సాహిత్యానికి గట్టి గుడి
వారందరు మలచినారు రాయలసీమను వడి.

శుద్ధమైన తెలుగు భాష స్వంతం రాయలసీమకు
ఉర్దూ కూడా ఇక్కడ ఊర్జితమై నిలిచింది
చిత్తూరుకు దక్షిణాన క్షేమంగా తమిళం
అనంతపురం పొలిమేరల అందంగా కన్నడం

సంగీతాంబుధిలో సర్వులనూ ముంచినాడు
ములకనాడు బ్రాహ్మడైన త్యాగరాజు కాకర్ల
సొంతం చేసుకొన్నారు తమిళులు త్యాగయ్య కీర్తనలను
భాషాభేదాల్లేవని సంగీతానికి చాటినారు.

అన్నమయ్య వేంకటపతి పాదాలను ఉంచాడు
భక్తి భావ మధురములౌ పరమ శ్రావ్య కీర్తనలను
వెంగమాంబ విరచించెను వేంకటేశ గీతాలను
రాళ్లపల్లి వారి సేవ సంగీత సరస్వతికి తావి.

కె.వి., బి.ఎన్. రెడ్డి ద్వయం చలన చిత్ర మహోదయం
పద్మనాభం, శాంతకుమారి, సీమకు దక్కిన చుక్కలు
కలకాలం నిలిచిన కళాఖండాలు వారి ఫలం
ఇంకా ఎందరో చేశారు రాయలసీమను పూర్ణఫలం.

భరతావని గర్వించే పుణ్యక్షేత్రాలు ఇచట
వెలసినాయి ఎన్నో, రాయలసీమ లేమ నుదుట
తిరుమల, శ్రీగిరి, అహోబలం, కాళహస్తి,
మహానంది, యాగంటి, మంతా)లయం, పుట్టపర్తి.

ఈ కోణాలన్నీ రాయలసీమకు కూర్చిన మణులే
కానీ ఈ దీర్ఘకవిత కోణం అది వినూత్నం
రాయలసీమను విరిసిన హరిత మహా పారిజాతం
విస్తరించినట్టి ప్రకృతిమాత దివ్య దరహసం.

పర్యావరణానికి పూచిన పరమ దివ్య మర్రివనం
ఈ దీర్ఘకవితా హారానికి అదే నాయకమణి
రాయలసీమకు ప్రకృతి రక్తిగ నొసగిన వరం
తిమ్మమ్మ మర్రిమానను తిరమైన హరిత భరం.

కదిరి నరసింహుడు కంభమున వెడలినాడు
నరహరి కరుణే ఆ పెను చెట్టుకు దోహదము
ఖాద్రీ దేవుని కల్లన దూరములో మర్రిమాను
అత్యద్భుత దర్శనమై ఆకుపచ్చకాంతులీను.

బేట్రాయిసామి దేవుడా చెట్టును బ్రోచినాడు
కాటమరాయుడు మానును కరుణను రక్షించినాడు
ప్రహ్లాదవరదుని గరిమే వటవృక్షము నందు నిలిచి
చెట్టు చేమలను ఈ దేవుని రూపములుగ కొలిచి.

(ఇంకా ఉంది)

Exit mobile version