Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఐతిహాసిక మహావట భూజం-10

[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]

17.

వటవృక్ష సమూహంబను అతి చల్లని ఒడిని చేరి
ఎందరు మునులును యోగులు తపమిక్కడ చేసినారు
వారి తపోశక్తి ఇచట ఆవరించి నిలిచి యుండు
‘సానుకూల శక్తి’ అచట సాగుచుండు అనునిత్యము

తదేకమౌ ఏకాగ్రత ప్రకృతిరతులు ఐనవారు
సానుకూల శక్తి వైన తరంగముల చూడగలరు
దివ్యమైన భవ్యమైన భావనలను పొందగలరు
రుగ్మతలను బాసి మనము తనువు శుద్ధి నందగలరు.

టన్నుల కొలదిగ వెడలును ప్రాణవాయు సంపద అట
మహావటము విడుదల తను యొనరించును ప్రాణులకను
దాని వలన రోగములను ‘నయము చేయు శక్తి’ కలిగె
ప్రకృతిని మించిన వైద్యుడు ప్రభవించునె భువిని ఎపుడు.

బెరడు నుండి ‘యాస్పిరిన’ను ఔషధంబు లభియించును
సహజహరిత ప్రదేశముల విహరించిన తగ్గిపోవు
రక్తపు పోటది క్రమమున, ఒత్తిడి స్థాయిలు తగ్గును
‘అటవీ స్నానము’ ప్రకృతి వైద్యములో నయము గూర్చు.

‘ఫికస్ బెంగాలెన్సెస్’ అను శాస్త్రీయ నామము పొందె
హిందువులే కాదు బౌద్ధ జైన మతము ననుసరించు
వారెల్లరు మర్రిమాను పూజింతురు దేవతగను
‘ప్రకృతిలోనె దేవుడుండు’నను నమ్మిక మతసారము.

భారతదేశము లోనే అత్యంతపు పొడిప్రాంతము
రాయలసీమనెడి నిజము అందరికీ విదితము
దానిలోన అనంతపుర ప్రాంతము జలరహితమయ్యె
అక్కడ లేచెను ఈ వట రాజము ఘన హరిత వనము.

మానవ మనుగడ నిలవదు శాశ్వతముగ నవనియందు
కానీ ప్రకృతి నిలుచును కలకాలము చిరకాలము
దీనికి తిమ్మమ మర్రియె తగ నిలిచిన తార్కాణము
నిరంతరము పెరుగుచున్న నిత్యజీవ వర శీలము.

‘క్రిస్ గ్రిఫిత్’ యన్న గొప్ప శాస్త్రవేత్త మాటలలో
తిమ్మమాంబ మర్రిమాను తీర్చును సంతాన కాంక్ష
సంతానోత్పత్తి కట్లు జీవిత పునరుజీవనమునకు
శాశ్వత చిహ్నము, దీనికి ఋణగ్రస్థము మానవాళి.

విశ్వమందు నెచటలేని విస్తారపు ఏక వృక్ష
చెట్టు గుబురు మర్రిమాను చిత్రమునౌ దీని ఘనత
ఎనిమిదివందల నలభై ఆరు మీటర్ల చుట్టుకొలత
భూమాతకు మరకతమణి భూరి ఆభరణంబుగ వెలసె.

భారతీయ ఉపఖండపు స్థానికమౌ మొక్కజాతి
‘మల్బరి’ కుటుంబానికి చెందినదీ మర్రి జాతి
కేవలమిది చెట్టు కాదు వనము దివ్యసౌందర్యము
పూనికతో వ్యాపించిన పందిరి హరితపుసుందరి.

చెట్టువోలె కనిపించదు దట్టముగా గుబురుకొన్న
‘తోపు’, చిన్న అడవే ఇది దూరముగా నుండి చూడ
నాలుగు వేలయిన వేర్లు నలుదెసలను దిగి యుండిన
భూమాతకు గొడుగు పట్టు భువనపు రమ్యపు పందిరి.

కాలగతిని వచ్చునట్టి ఘన తుపానులను గూడ
తట్టుకు నిలిచెను తిమ్మమ మర్రిమాను స్థైర్యంబుగ
వర్షాభావపు వ్యగ్రత, కరువులు మరి కాటకములు
వటవృక్షపు నిత్యమైన పెరుగుదలను ఆపలేదు.

కొండల వరుసల మధ్యన కూడెను ఒక పెద్దపాత్ర
వంటిదైన సమప్రాంతము వర్షపు నీరది ఇంకుచు
భూగర్భపు జలము తెచ్చె భూమికి దగ్గర చేయుచు
ఈ వనరే తిమ్మమ్మకు ఎంతయు సమృద్ధి గూర్చె.

భూరి పాత్ర వోలె నిలిచె ప్రకృతి కర్ష్యము నీయగ
మురుగునీరు పారిపోవు వ్యవస్థయే సహజముగను
ఏర్పడెనక్కడ వేరులు కుళ్ళకుండ కాపాడుచు
ప్రకృతిలోని స్వీయ రక్షణంబున కిదియే దృష్టాంతమనగ.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version