[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]
18.
హైందవ ధర్మము చెప్పిన అద్భుతసూత్రము, నిత్యము
“వృక్షము శాశ్వత జీవిత చిహ్నముగా నిలుచునెపుడు”
ఊడలేమొ మానుపైకి కొమ్మలేమొ క్రింది వైపు
చక్కని కవితా ‘రూపక’ మీది చూడగ కమనీయము.
మాయా మోహిత జగమున సత్యము ఛాయగ తోచును
క్రిందికి పైకిని జీవము క్రీడగ తను పెరుగుచుండు
వేదాంతపు లోతులెన్నో మర్రిమాను వెలయించును
మానవునికి బోధపడని మహిత గూఢ విషయములను.
గుడుల యొక్క ఆవరణను మర్రి చెట్లు పెరుగుతాయి
తిమ్మమాంబ మర్రిమాను ఒడిలోని గలదొక గుడి
తిమ్మమాంబ ఒడి లోపల తిరుగుతు ఉంటేను మనము
అనుకూలపు శక్తి పొంది ప్రశాంత చైతన్య మొసగు.
మూఢ భక్తి వల్ల జనము మూర్ఖులగుట సత్యము
అజ్ఞానము కూడ తోడు అగుచువారు తిమ్మమ్మకు
హాని చేతురాదేవికి అందుకె రక్షణ చట్రము
నలుదిక్కుల నమరె, నటవి శాఖ చొరవ చేత.
ఎప్పటికప్పుడు అటవీ శాఖవారు తెప్పింతురు
సారవంతమైన మట్టి, తిమ్మమ్మకు పోషకముగ
పాతమట్టి మార్చి కొత్త మట్టినట్లు తోలించగ
భూసారము పెరుగును భూవటము చిగురించును.
అత్తిచీమ, కందిరీగ వంటి కటకము లెన్నియొ
వేలాదిగ మర్రిమాను చేరి పొందు ఆశ్రయమును
గుడ్లుపెట్టు పొదుగువాని కూర్మితోడ నిరంతరము
తగ ‘పరాగ సంపర్కము’ తాను జరుగు తక్షణముగ.
ఫలదీకరణము జరుగును విత్తనాల ఉత్పత్తియు
విస్తారముగాగ జరుగు తిమ్మమర్రి దీపించగ
తేనెటీగ, గబ్బిలంబు, సీతాకోక చిలుక వంటి
రకరకాల జీవులెన్నో తిమ్మమాంబ యిష్ట సఖులు.
చెట్టు గుబురు పందిరికిని ఉత్తరదిక్కున పెరుగును
అత్తిపండ్లు, అంజీరులు, అతి రుచిగానుండు పండ్లు
అవి ఆకర్షించునెపుడు వేలకొలది కీటకముల
కందిరీగ లెన్నొ గడుపు పండ్లలోనే లార్వా దశ.
అత్తిపండ్ల పూలనట్లు కందిరీగ లెన్నొ చేయు
వరపరాగ సంపర్కము, ఎంజైములు పరిఢవిల్లు
దీనివలన మర్రిమాను పొందు మంచి పోషకములు
స్వయంపోషకత్వంబును సంతరించే తిమ్మమాంబ.
‘ఎగిరేనక్కలు’ అని పిలువబడు గబ్బిలములు నివసించును
మర్రిమాను కొమ్మలలో, మంచి చేయ పర్యావరణమునకు
కోతులెన్నో చేరి యచట కిచకిచలాడును నిరతము
సందర్శకలిత్తురెన్నో తిండి పదార్థములు ప్రేమను.
పాములెన్నొ సంచరించు పావనమౌ తిమ్మమాంబ
మర్రిమాను ఒడి లోపల, మానవులను అవి కరవవు
రాత్రి వేళలందు పక్షులచట చేరి నిద్రించవు
తల్లిపట్ల వారికున్న తడి భావము గుండెన.
గర్వకారణంబైనది గరిమగల మర్రిమాను
కానీ తగు సౌకర్యము లెన్నో లేవు కొరతకలుగు
విదేశముల నుండి సైత మరుదెంతురు మాను జూడ
త్రాగునీరు, మరుగు దొడ్లు అరకొరగానే ఉండును.
చెదలు పట్టు ఊడలకును చీడలు పీడలు సోకును
భూమికోత కూడ మర్రిమాను బాధించును
ప్రభుత కొంత దృష్టి పెట్టి, సౌకర్యములను పెంచుచు
ఇతిహాసపు మహావృక్ష రక్షణ చేయగ నొప్పును.
పర్యావరణపు హితమే మానవ హితమై నిలుచును
‘వృక్షములను రక్షించిన అవి మనలను రక్షించును’
అని వేదము ఘోషించెను అదె మనకును నిత్యరక్ష
తిమ్మమాంబ మర్రిమాను తిరముగ నిలుచును నిరతము.
(సమాప్తం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
