Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఐతిహాసిక మహావట భూజం-2

[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]

2.

సత్యసాయి జిల్లాలో మండలమొక్కటి యున్నది
నంబులపూలకుంట పేరనయమగు పేరునుగన్నది
ఆ మండలమందు గలదు అందమైన ప్రకృతిహొయలు
కొండల కోనల వెలసిన కుగ్రామం గూటిబయలు.

దక్షిణ భారతమందున దర్శనీయమైన చెట్టు
అతిపెద్దదిగా పేరును బడసిన అద్భుతమౌ పట్టు
ఐదెకరాలకు పైనే ఆక్రమించె మర్రిమాను
శాఖలు, ఉపశాఖలుగా మించెను తన పచ్చమేను.

గిన్నీసు గ్రంథమందున చేసిరి దీనిని నమోదు
ఉరుతరవట వృక్షముగా లోకమందు సరిజోడు
సత్యనారాయణ అయ్యరు సాధించెను ఈ విజయం
మొదటనె ఆయన పొందెను అవమానం అపజయం

బెంగుళూరు నగరానికి చెందిన పాత్రికేయుడతడు
స్వేచ్ఛావృత్తిగ పొందెను స్వచ్ఛందపు సేవారతి
మర్రిమాను పై తన పరిశోధన తప్పటంచు
వ్యతిరేకముగా లేఖలు వ్రాసినారు కొంతమంది
నిరాశతో తన పేరును ‘రిగ్రెట్ అయ్యరు’ గా మార్చెను
కానీ అతని శోధన ప్రపంచమే గుర్తించెను.

3.

బుక్కపట్నమన్న ఊర వెంకటప్ప మంగమాంబ
పుణ్యదంపతులుండిరి, పూచిన తంగేడుపుట్టె
తిమ్మమ్మను బాలికగా, వారి గర్భశుక్తిముక్తాఫల
పుట్టగానె పరిమళించు పూవు వోలె భాసిల్లెను.

చక్కదనము, మంచి గుణము గంధములో పన్నీరుగ
తిమ్మమ్మను కూడి నిలిచె తిరమగు పరిమళవీచిక
మొదటినుండి మొక్కలన్న తిమ్మమ్మలో అతిమక్కువ
పచ్చదనము ఆ యమ్మకు అణువణువున వెలుగగ.

గూటిబయలు పొలిమేరల కొండల వరుసొకటున్నది
ఆ కొండల నడుమన అందమైన చదునున్నది
ఆరుబయట ఆ చదునున తిమ్మమ్మ సఖులతోడ
రకరకాల ఆటలాడి రాణించెను ప్రకృతి కన్య.

కొండలూ కొనలలో విహరించెను తిమ్మమాంబ
ప్రతి చెట్టును ప్రతి చేమను పలుకరించి పులకరించు
ఆమె హస్త స్పర్శతోనె అచటనున్న మొక్కలన్ని
సంతసమున తలుపును సమదర్శన యోగంబున

తల్లిదండ్రులందు తాను తగురీతిని గౌరవించు
పెద్దలందు ఆమె మిగుల వినయముతో మెలగుచుండు
నేస్తురాండ్రు తిమ్మమ్మకు నెయ్యము గూర్చెడు సఖులు
ప్రకృతి ఆమె దైవంబగు కొండలు కోనలు హితవగు.

యోగులు సాధువులొచ్చిన సమాదరణ తాజేయును
భక్తిగ పాదముల మ్రొక్కి ఆశీస్సులు స్వీకరించు
అమ్మణ్ణీ! నీ వినయము నిండుగు ముచ్చట గొలుపును
సౌభాగ్యము నీ సొత్తని వారలు దీవెన లిత్తురు.

ఒకనాడొక రాజయోగి బుక్కపట్నమున కొచ్చెను
సాధువులను ఆదరించు వెంకటప్ప మంగమాంబ
ఆ మహనీయుని కిచ్చిరి ఆతిథ్యము గౌరవమున
తిమ్మమ్మను చూచి యోగి దీవించగ చేరబిలిచె.

బాలిక! ఇటురా! నామము నీదేమని అడిగె యోగి
ఆయన పదములు తాకుచు ‘తిమ్మమ్మ’ని బదులు పలికె
యశస్వినీ భవ! యటంచు దీవించెను రాజయోగి
ఆంజనేయ స్వామి పేరు అందముగా అమరెననెను.

జానపదులు హనుమంతుని తిమ్మయ్యగ వ్యవహరింత్రు
వానరశ్రేష్ఠుడు మారుతి ప్రకృతి అంతర్భాగము
సాముద్రిక శాస్త్రమందు సరి లేరెవ్వరు యోగికి
బాలిక చేతిని చూచుచు భవిష్యత్తు నిటుపలికె.

అనుకూలపు దాంపత్యము అమరును చిన్నారి నీకు
భర్త ప్రేమ పుష్కలముగ పొందెదవని యోగి చెప్పె
నీ మూలంబు నీ ప్రకృతిని అద్భుతమొకటట్లు జరుగు
నీ పేరున పరిఢవిల్లు నిత్యము శాశ్యతమై ధర.

అశుభముల సూచించుట సాముద్రికులకు కూడదు
శుభములనే చెప్పవలయునన్ననిజము యోగి యెఱుగు
బాలిక జీవితమందున జరుగబోవు దుర్ఘటనను
యోగివరుడు పరిహరించె, యుక్తము ఆయన తీరది.

(ఇంకా ఉంది)

Exit mobile version