[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]
4.
యవ్వన మేతిమ్మమ్మను ఆశ్రయించి ధన్యమయ్యే
విరితీగకు తగపూసిన సుమబాలగ లసితమయ్యె
మదనుడు తిమ్మమ్మ దేహము నందు జేరె కడు ముదమున
రతీ దేవి సౌందర్యము రమణిలొ తా లీనమయ్యె.
వసంతమే వరధనువుగ ఎక్కుపెట్టినట్టి రూపు
తిమ్మమాంబ తనువున చెలువము తగ తాను చూపు
లావణ్యపు శోభ చూచి లలనలె అక్కజము నొంద
యువకుల మనములు మిక్కిలి మక్కువతో కలతనొంద.
యోగ్యుడైన వరునే తమ ముద్దుల కూతురికి చూడ
తలిదండ్రులు అన్వేషణ చేయుచుండి రతి వ్యగ్రత
తమ కన్యకు అనుకూలుడు తగిన మగడు కావలెనని
వారిరువురు తలచుచుంద్రు వారి కోర్కెతి సహజము.
గూటిబయలు సంస్థానపు పాలెగాడు గంగరాజు
అహంకార గర్వాంధుడు అధికార మదాంధుడతడు
పాలనలో నిరంకుశుడు ప్రజలకేమొ అనుకూలుడు
అతని కొలువున నుండెను అందమైన యువకుడొకరు.
బాలవీరయను వాడతి భద్రమైన సేవ ఘనుడు
పాలకుడగు గంగరాజు నమ్మిన బంటే యతడు
రాచకార్యములకెల్లను బాలవీరుడే ప్రతినిధి
విశ్వాసము రాజభక్తి సత్యవ్రతము గల గుణనిధి.
సంస్థానాధీశునిక నయము సన్మతితో విధులు తీర్చు
అతడు లేక పరిపాలన ఆవంతయు మరి కదలదు
ఇతరులైన నిర్వాహకులతని పట్ల ఈసు చెంది
సమయము కొరకై వేచిరి వీరయపై పగను పెంచి.
ఎంతమంది ఎన్ని తీర్ల చాడీలను నుడివినా
గంగరాజు పాలెగాడు పెడచెవిని పెట్టినాడు
బాలవీరయన్న ప్రభువు కంత నమ్మకముగనుండె
ప్రభు సేవా తత్పరుడయి బాలవీరుడవనిమించె
వీరయ్యయె తమ బిడ్డడుకు తగిన వరుడు గాగ తలచి
వెంకటప్ప, మంగమాంబ తిమ్మమ నాతని కిచ్చిరి
పెండ్లి చేసి, దంపతులుగ కాపురమును మొదలుపెట్టి
అన్యోన్యముగా వారలు మెలగుచుండ్రి సంతసమున.
5.
ఇంటిలోన తిమ్మమాంబ ఎంతయు అనుకూలవతియే
‘కరణేషు మంత్రి’ సూక్తికి కనిపించె నిదర్శనముగ
రాచకార్యములను గూడ రమణిపతికి చేయూతగ
సంస్థానముల పనులను సమర్థతగ చేయుచుండె.
గృహిణిగ తన కర్తవ్యము కడు శ్రద్ధగ నెరవేర్చుచు
మెట్టినింట తిమ్మమాంబ మేలగు కోడలుగ నిలిచె
అత్తమామలను ప్రేమగ ఆదరించే ఆ సుశీల
తన తలిదండ్రులకును వారికి భేదముగ మెలగుచుండె.
కోటలోని రాణిగారు కూడ ఆమె వర్తనమును
గమనించుచు తిమ్మమాంబ సుగుణశీల యని తలచె
రాజ కుటుంబమువారలు రాజ్యములో ప్రజలందరు
తిమ్మమ్మను వీరయ్యను దేవతలుగ తలచుచుండ.
జీవితమటు సంతోషము తోడ సాగునే నిరతము
వీరిదైన బాగు చూసి విధికి కన్నుకుట్టనేమొ?
కుష్ఠువ్యాధి సంక్రమించి బాలవీరయకు పాపము
కుష్ఠు రోగులను మిక్కిలి ఈసడించు కాలమపుడు.
అంతవరకు ఆస్థానమునందున చేసిన సేవలు
వ్యర్థమాయె, పాలకుండు వీరయ్యను చూసి పలికె
‘నీ వంటెను గౌరవమే! నీ వ్యాధి నెట్లు సహియింతుము?
అదియెగాక అంటురోగమతి దారుణ కుష్ఠు వచ్చె.
కుష్ఠు వ్యాధిగ్రస్థుడైన వాని సేవ ఎటులోర్తుము
కాననిన్ను సేవనుండి వెలివేసితి వెడలిపొమ్ము
గూటిబయలులో కూడను గూడు లేదు మరి నీక’ని
గంగరాజు పాలకుండు గట్టిగ హెచ్చరికను చేసె.
తిమ్మమ్మయు వీరయ్యయు తీవ్రమైన వేదనతో
కుమిలిపోవసాగిరి తమ దురదృష్టము వగచివారు
పరిపరివిధముల పాలకు ప్రార్థించిరి దీనముగ
తమ జీవిక కగు ధనమును దయచేయగ కోరిరతని.
పకపక నవ్వెను పభువు, “పని చేయక ప్రతిఫలమును
ఆశింతురె మీరిరువురు? అది కుదరదు వెడలపొండు
గ్రామ బహిష్కార శిక్ష విధియించితి” నంచు పలికె
కఠినాత్ముడు కృతఘ్నుడౌ ఏలిక ఆ గంగరాజు.
రాజసేవ కత్తి మీద సామటన్న నానుడి అది
నిజము అయ్యే బాలవీరయకు మిక్కిలి శరఘాతము
ఏ మాత్రము కనికరమును హీనాత్ముడు చూపలేదు
చరిత్రలో పాలకులది దుర్మార్గము అది విదితము.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
