[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]
6.
ఊరికి దూరముగా నొక పశువుల పాకను తిమ్మమ
భర్త నుంచి పరిచర్యలు చేయుచుండె నతి శ్రద్ధగ
కుష్ఠువ్యాధి వీరయ్యను క్రమక్రమముగ నాక్రమించె
మేనున పెనుపుండ్లు పడగ చీముయు రసి కారుచుండె.
వీరయ్యకు ఔషధములు ఇవ్వగ వైద్యుడు భయపడే
పాలెగాని భయము చేత జంకుచుండె తన మనమున
తిమ్మమాంబ మది రోయక పుండ్లను ప్రతి దినము కడిగి
కట్లు గట్టి తన భర్తను కంటికి రెప్పగను గాచె.
తనకా విధముగ సేవలు సల్పుచున్న ధర్మపత్ని
గని మిక్కిలి మనోవేదనను భవించే వీరయ్యము
“తిమ్మా! నా వలనను నీ దీర్ఘ జీవితంబు మ్రోడువారె
నా కర్మకు నన్నొదలుచు నవ్యమైన జీవితంబు
నెన్నుకొనుము మారు మనువు మన కులమున తప్పుకాదు
నీ అందము నీ యవ్వనమంతయు నా వల్లపోవు
నేనెన్నేడులో బ్రతకను కుష్ఠువ్యాధి నన్ను తినును
నా మాటను వినుము నీవు నా మనస్సు కుదుటపడును”.
అని పరిపరి విధముల ఆత్మసఖుడు తన పత్నిని
అనునయించి నచ్చచెప్పె, ఆతని మనమతి దొడ్డది
కానీ భారత సంస్కృతి సనాతనపు ధర్మ దీప్తి
అధర్మమున కొగ్గునే? తన పాతివ్రుత్యము మరచునే.
ఆదర్శపు ఆ గృహిణికి అతని పల్కులు తోచెను
మర్మఘాత శరముల వలె మారణాస్త్రముల పోలిక
విలవిలలాడెను తిమ్మమ వేదనతో ఇట్లు పలికెను
“ఇది యేనా మీరు నన్ను అర్థము చేసుకున్న విధము?.
సఖ్యం సాప్తపదినమ్మను ఆర్యోక్తిని మరచినారె
‘నాతి చరితవ్యా’ యటంచు పెండ్లి నాటి వాగ్దానము
నా హృదయము లోన నిల్చి నా పథమును నిర్ణయించె
భీష్ముడు ధర్మజు తెలిపిన ధర్మసూక్ష్మమెరుగ లేరె?
భర్తకు సమమైన బంధువతనికి సమమైన సఖుడు
భార్యకు సమమైన బంధువామెకు సమమైన సఖియు
ఒకరు లేక ఒకరు లేరు ఇరువురు నొకటియె చూడగ
అని సర్వజ్ఞడు భీష్ముడు ఆనతిచ్చె ధర్మజునకు
మా యింటికి వచ్చిన యోగివరుడు నాకు చెప్పె
దానినే శిరసున దాల్చుదు అదియే నా పరమార్ధము
నా అందము నా యవ్వనమంత వ్యర్థమగునంటివి
శారీరిక సౌఖ్యములే ముఖ్యములా సతిపతులకు
నాకు కుష్ఠురోగ మదివచ్చిన నీవిటు సేవలు చేయవె
నా కర్మకు నన్ను వదిలి వేరొక వనితను కోరెదొ?
జరారోగములు మానవ జీవితమున సహజంబులు
వాటి వలన సతీపతుల అనురాగము ఆవిరౌనె?
శీర్యంబవునది శరీరము దహ్యంబగునది దేహము
దీని కొరకు పవిత్రమౌ దాంపత్యము కలుషమౌనే?
ఆమరణాంతము నీవును నేనును విడిపోవు ప్రసక్తి లేదు
ప్రాణాధికమవు నాకు మానుము నీ నిర్వేదము”
అను సతి మాటలు వీరయ విని పెను అచ్చెరువునందె
తన ప్రియసఖి తిమ్మమాంబ తనదేయని గర్వపడెను
ఆయమ జ్ఞానము, త్యాగము, అనితరసాధ్య మటంచును
భగవంతుని వేడుకొనియె తన వ్యాధిని రూపుమాప.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
