Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఐతిహాసిక మహావట భూజం-5

[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]

7.

విధి బలీయమది విచిత్ర మనతిక్రమ్యము దానికి
తల ఒగ్గుట తప్ప మనిషి తానేమియు చేయలేడు
వ్యాధి ముదిరి బాలవీరయను మృత్యువు కౌగిలించె
తిమ్మమాంబ దుఃఖితయై పతి శవమున బడి విలపించె.

దుఃఖోద్వేగముతో తిమ్మమ గంగరాజు శపియించె
నాపతికీ గతి బట్టగ అతడె కారణంబని దూరె.
పతి లేనటువంటి జీవితము ఏలది యింక నాకు?
అభేదమే మా యిరువురకయినప్పుడు చింత ఏల?

నేను కూడ నా నాధున్ని తోడ దివికి పోయెదనిని
సహగమనము చేయ తిమ్మమాంబ నిశ్చయించె
వారిరువురి గాఢమైన ప్రేమాతిశయమును తెలిసిన
తలిదండ్రులు ప్రజలెల్లరు ఆయమకే జే వెట్టిరి.

ఆ కాలములో పతితో సతీసహగమనము కాదు వింత
ఆచారములను కాలమె నిర్ణయించుగదనిరతము.
చితి పేర్చిరి వీరయ్యకు దహన సంస్కారమును చేయ
ఆతని పార్థివ దేహము చితిపై శయనించె నకట!

తల్లికీ తండ్రికి మొక్కెను తిమ్మమాంబ తాను మొదట
పిదప అత్తమామలకును ప్రేమతో పాదాలు తాకె.
గురుజనములు పెద్దలు మరి బంధువులందరి వద్దను
ఆశీస్సుల నందుకొనియె పతివ్రతావతంస పడతి.

చితి పక్కన ఒక మంచెను కూర్చిరి తిమ్మమ్మ కొరకు
దానిమీద నుండి యామె పతి చితిపై తను దూకగ
నాలుగు గుంజలు మర్రివి నాటిరి నలువైపులందు
మంచెకు ఉతముగానవి నిశ్చలముగ నిలిచియుండే.

తన పతి పార్థివ దేహము తిమ్మమ్మకు అతి పునీతము
నిర్జీవుడు కాడు అతడు సజీవుడే ఆమె యెదను
ఆతని ఆత్మను ఆ సతి ఐక్యము కాదలచి నిలిచె
తమ ఇరువురి అభేదమును ధర చాటగ తిమ్మమ.

బాలవీర వరునకు సతి ప్రదక్షిణము చేసెనపుడు
ముమ్మారులు, ముక్తిని గన, ముదమున తన పతిని చేర
మంచెనెక్కె తిమ్మమాంబ సంచిత కర్మలు తీరగ
చితి ముట్టించగ వెలిగెను శీఘ్రముగా అగ్నిశిఖలు.

‘ప్రకృత్యై నమః’ అని నినదించుచు పడతి దూకె చితి మీదకు
హాహాకారములు చెలగెను అచట నున్న ప్రఙల నుండి
కొందరు సాగిల మొక్కిరి కూడిన భక్తిని పడతికి
తృణపాయముగ మేనును త్యజించిన ఆ యోగినికి.

సతీసహగమనమన్న మూఢాచారంబనుచునుంద్రు
సంస్కర్తలు సంఘ మందు. సముచితమే వారి మాట
బలవంతముగా భార్యను భర్త చితిని తోసినచో
మూఢాచారమగును, అపుడు, ముమ్మాటికి అది నిజము.

కానీ, పతినెడబాయగ, క్షణము కూడ నుండలేని
పతివిహీన యౌచు తాను జీవచ్ఛవమనుచు తలచి
స్వచ్ఛందముగా పతితో సహగమనము చేయు సాధ్వి
చరిత్రలో అమరముగా తాను నిలుచు ననవరతము.

సహగమనమునకు గల ఆధ్యాత్మిక తత్త్వంబును
ఆకళింపు చేసుకున్న అది అనన్యమని తెలియును
వ్యక్తిగతము సహగమనము, సతి భావావేశానుగుణము
పతిని విడిచి ఉండలేని సతీమణుల త్యాగగుణము.

సతికిష్టము లేకున్నను సమాజమున మూఢ జనులు
మూర్ఖ బంధువులు సైతము సహగమనము నా కాలము
నందు ఆడవారిపైన రుద్దు చుండ్రి బలిమిని, అది
సామాజిక దుష్టమైన సాంప్రదాయమతి నింద్యము.

నిర్వికార నిశ్చలయై భర్త తోడ కాలిపోయె
పతివ్రతాశిరోమణిగ తిమ్మమాంబ రాలిపోయె
బాల్యమునుండియు ఆమెకు నేస్తముగా చెట్టు చేమ
ఆమె మృతిని చూసి ఏడ్చె నిశ్శబ్దపు రోదనమది.

(ఇంకా ఉంది)

Exit mobile version