[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]
8.
ప్రకృతిలోన పరమాత్మను పదిలముగా దర్శించిన
తిమ్మమాంబ మరణమెపుడు తిరముగాదు తీరిపోదు
ఆమె ఆత్మ చిరు మొక్కగ చిగురించెను హర్షమునను
ఆమె మరల జీవించెను ఒక మొక్కగ ధన్యయగుచు
మంచెకు ఈశాన్యములో నాటబడిన గుంజ పిదప
ప్రరోహముల వెలయించెను పచ్చితనము ఎక్కడిదో?
ఎక్కడిదను అనుమానము ఎందుకు మన కందరకు?
తిమ్మమంంబ గుండె తడియె గుంబకు పసరును ఇచ్చెను.
గుంజ నుండి ప్రభవించెను తిమ్మమాంబ దివ్యాత్మయే
ప్రకృతిలోన మమేకమై బాల్యము నుండియు ఆయమ
తనదగు ఆత్మాశ్రయముగ తరువొక్కటి మోసులిచ్చె
భావిలోన అద్భుతమగు ఇతిహాసము రూపుకట్టె
‘ఇంతింతయి వటుడింతయి’ అని పోతన అన్నట్లుగ
వామనావతారములో విష్ణుమూర్తి పెరిగినటుల
ఇంతింతయి వటమింతయి వృక్షరాఖమై చెలగెను
‘తిమ్మమ్మ మర్రిమాను’గ తిరమగు సత్కీర్తి గాంచె.
ప్రకృతి పట్ల ఆమె ప్రేమ, పతిభక్తియు త్యాగనిరతి
ప్రతికొమ్మను ప్రతిరెమ్మను ఆయమ తాకిన తీరది
ఆమె చేతిస్పర్శతోనె అండజములు పులకించెను
ఆమె యూర్పు నింపే జీవ మఖిలమైన భూజములకు
చరిత్రలో కనగవినగ సాధ్యము కానట్టి మాను
శాఖలు ఉపశాఖలుగా సర్వత్రను వ్యాపించెను
ఊడలు దించెను విరివిగ ఊరితమైనటము వెలిగె
మాను కాదు వనమేయని ప్రకృతి ప్రేమికులందరుగన.
9.
తిమ్మమాంబ శపియించెను దుర్మార్గుని గంగరాజు
పతివ్రతల కోపమునకు పాలాయెను పాలకుండు
అతని కుటుంబము సైతము అతికష్టము నెదుర్కొనెను
వారి వంశమది భిన్నముగా మారెను ప్రాపుపోయె.
చెట్టుకు పుట్టకు నొకరుగ పాలెగాని కుటుంబము
జాడే తెలియని చోట్లకు చెల్లా చెదురైపోయిరి
రాజభక్తి తోడ తనను అహరహమును సేవించిన
బాలవీరయార్యుని కటు అన్యాయము చేసినాడు.
అతని సేవ మరచినాడు అతని ప్రేమ మరచినాడు
కుష్టువ్యాధి బాధితుడై కుములుటయే అతని తప్పా?
రోగగ్రస్తుండగుటను అతని బాధ్యతేమున్నది
వెలి వేసెను నిర్దయగా తగిన ఫలితమను భవించె.
తిమ్మమాంబ శాపంబది తీక్షణ్ణంబై కట్టకుడిచె
గంగరాజు స్వార్థంబది గర్వంబది ఖర్వమయ్య
మంచివారి ఉసురుపోసు కొనువారలు బాగుపడుట
చరిత్రలో ఎటు చూసిన కనము వినము ఇది సత్యము.
10.
రాయలసీమ ప్రాంతము రాహిత్యము జలవనరుల
వట్టిసీమ దుర్భిక్షపు పట్టుయైన నిర్భాగ్యసీమ
వర్షాభావము దానిని వంచించును ప్రతియేటను
పంట లెండి పశుగ్రాసము కొరతతోడ కునారిల్లు.
గూటిబయలు కూడ కాదు సారవంతమైన సీమ
కొండల గుట్టల నడుమన కూడెను ఒక చదును నేల
పచ్చదనమే కానరాని ప్రాంతంబున గుంజమొలిచి
మహవట సముదాయము వర్ధిల్లుట చిత్రమగును.
ప్రకృతినే ప్రేమించిన ప్రకృతినే లాలించిన
ప్రకృతిచే లాలనగని ప్రకృతిలో లీనమైన
తిమ్మమాంబ ఆత్మశక్తి మర్రిమానులో చేరెను
అది దానిని విస్తరించే అద్భుతమౌ వట దీప్తిగ.
ఎండినట్టి మేదినిలో ఎంతో ఘనమగు వృక్షము
ప్రభవించుచు, సాగి సాగి, ప్రపంచమున వింతయగుట
పర్యావరణపు అద్భుతమని పొగడిరి శాస్త్రజ్ఞులు
వృక్షశాస్త్ర రహస్యముల బాగుగ తెలిసిన విజ్ఞులు.
మర్రిమాను గుబురు చూడ మహితంబై విలసిల్లును
అంబరమే చూడరాని అంత చిక్కనౌ పందిరి
దివికిని భువికిని మధ్యన ప్రకృతి పట్ట గొడుగోయన
అతి చల్లని నీడను తన ఆశ్రితులకు సతమునిచ్చు.
మర్రిమాను తన చేతుల మహిని గొల్వ చాచినట్లు
తన పచ్చని కొమ్మలన్ని తామరతంపర చేయను
కొమ్మలపై చిగురించిన లేచిగుళ్లు, ఆకులు, తమ
సుమ పేశల సుస్వభావములను చూపు సంతసముగ.
సూరీడుకు అతి కష్టము మర్రి గుబురు ఛేదించుట
అంత దట్టముగ నుండును మర్రిమాను పై భాగము
దానిని ‘క్యానోపి’ అందురు ఆంగ్ల భాషలోన జనులు
విఫల యత్నమొనరించును భాస్కరుడే లోని కేగ.
రవికిరణపు లావణ్యము సుప్రభాత సమయంబున
బాలార్కుడు ఉద్భవించు ఉదయపు కాలమునందున
తీవ్రత తగ్గిన సంధ్యాసమయంబున లోకబంధు
సంజకెంజాయ కాంతిని గుబురు నుండి జారవిడుచు.
అప్పుడు, వెలుగును ఆకులు లేచిగుళ్లు తళతళమని
ఉదయార్కుని, సంధ్యార్కుని కిరణచయము తాము గొనుచు
హేమపు కాంతులు మరకతమున పడి తగ మెరయునట్లు
ప్రకృతిమాత వంటి చిత్రకారుడు మరి అవని గలడె.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
