[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]
11.
రకరకముల పక్షలన్ని రవములు చేయుచు చేరును
మర్రిమాను కొమ్మలందు మధురముగా పాడి ఆడి
చిలుకలు, గోరొంకలు, చిత్రమైన కణుజు పిట్టలు
పిచ్చుకలును, పావురములు చెకుముకులను వడ్రంగులు
కోకిలలే మర్రిమాను కున్న రమ్య సంగీతము
కుహు కుహు యను కూతల తిమ్మమ్మను తనియించును
కాకులు సైతము చేరును ‘కావు’ ’కావు’ జీవులు శాశ్వతమని
పాలపిట్టలన్ని వచ్చి పచ్చని కొమ్మల వాలును
రాత్రివేళ గుడ్ల గూబలెన్నో వచ్చి నివసించును
మర్రిమాను కొమ్మలందు తలక్రిందుకు ధ్యానములను
గ్రద్దలు, వనమయూరములు కూడను తమ యునికి చూపు
పక్షిజాతులెల్లవచ్చి పంచిపెట్టు నానందము.
తిమ్మమాంబ మర్రిమాను తీయని అతిథ్యంబును
అన్ని రకాలైన పులుగు లకునిచ్చును ఆదరమున
జాతిభేద మెపుడు చూపదా వటరాజము, ఆమెకు
సర్వత్ర సమదర్శన యోగమె సమకూరు నిజము
కోకిలైన, కాకియైన ఒకటె మన తిమ్మమ్మకు
చిలుకయైన గుడ్లగూబ యైన నొకటె వటవరముకు
‘ఉదారచరితానుంతు వసుధైక కుటుంబకమ్’
అన్న సూక్తి మూర్తి దాలు తిమ్మమ్మ మర్రిమానున.
పక్షులన్ని మర్రిమాను నెంతయు ప్రేమించుచుండు
గారవమున చూచుచుండు తమ తల్లిగ కనుపాపగ
కొమ్మలపై ఏ పక్షియు మలవిసర్జనము చేయదు
తమ తమ నెలవులు చేరును సాయంత్రము పిదప వెడలి.
12.
ప్రస్తుతమీ మాను మొదలు దాపున మరియొక మొక్కది
ప్రభవించెను మర్రిమాను వారసురాయనంగ
క్షీణించదు, నశించదు, మార్పును పొందును
ప్రకృతి నిరంతరము తన వాసిని నూతనముగ పెంచుచుండు
ఊడలు మన తిమ్మమ్మకు ఉర్భితముగ సంభవించు
చెట్టుకొమ్మ నుండి సాగి వేలాడే వేర్లు, సఖులు.
‘ఏరియల్ రూట’౦దురు ఆంగ్ల భాష వాని జనులు
సృష్టి లోన అన్ని చెట్లకును రావీ ఊడలెపుడు
మర్రి, జువ్వి, వంటి చెట్లు ఊడలనే దింపు నింపు
తమ శరీరమునకు అవియె విస్తృతినే కలుగచేయు
తమను తాము విస్తరింప చేయ వటములన్ని కూడ
కొమ్మల నుండియె వేర్లను పుట్టించును అద్భుతమిది!
నేలవైపు సాగి ఊడ భూమి లోన పాతుకొనును
భూసారము గ్రహియించును భూజము శక్తిని పెంచును
పుష్టిగ, లావుగ, ఊడలు కొమ్మలకేం తీసిపోవు
ఏడులు గడచిన పిమ్మట మానులుగా మారునపుడు.
‘ఊడ’ను పేరే వృక్షపు భాగంబుల కేలవచ్చె
లేతవిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలా ఊడల
ఊయల లూగుట కనువుగ ఉన్నవి కాబట్టి తెలియ
పిల్లలు కూడను ప్రకృతిలో పరవశ మొందెదరు నిజము
మర్రిమాను ఊడలనే మోత కర్తలుగు వాడెద
రవి బరువగు వస్తువులను కట్టి నలుగురట్లు మోయ
సౌకర్యముగాగ నుండు, చక్కగ, పొడవుగ, ఊడలు
పరిమాణము ఎక్కువగా, బరువేమో తక్కువగా
మానవ రవాణాలకు మర్రి ఊడలే పొసగును
బరువు కట్టి ఊడలకును, అటునిటు ఇద్దరును పట్టి
మోయగలరు సులువుగ, ఎంతటి బరువును ఐనను
ఊడలట్లు ఉపయోగము నందించును మానవులకు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
