Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఐతిహాసిక మహావట భూజం-8

[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]

13.

‘శ్రీ వీరయ నాయకుని చరిత్ర’గ శేముషి పొందినది
తిమ్మమ్మ మర్రిమాను కథ తిరముగ నిలిచింది
గిరిధరప్రసాదరాయను సూరి ఆంగ్లకరించె దానిని
గ్రంథస్థమైన చరితము కలకాలము నిలిచినట్లు.

బి.బి.సి. వారు వారి వరుస ప్రసారములలోన
రెండవ భాగమునందున చర్చించిరి వటవృక్షము
‘వృక్షపు ఆత్మల’ పేరిట రెండువేల పదిహేడున
ప్రతిష్ఠాత్మకంబయ్యెను పతివ్రతామ తల్లి గాథ.

ఆంగ్ల గ్రంథము వలనను అవని యెల్ల తెలుసుకొనెను
ప్రకృతిని ఆరాధించిన పడతి గాథ, బరువు గాథ
వీరయతిమ్మమ జంటను వేనోళ్ళను కొనియాడిరి
దానిని చదివిన వారు తమ కనులే చెమరింపగ.

తిమ్మమాంబ దేహత్యాగ పరమార్థము తగ వెలసెను
అత్యద్భుతమైన వట విశిష్ట సమూహముగ వసుధ నందు
గూటిబయలు యన తెలిసెను గురుతర వృక్షపు నెలవని
అనంతపురము వాసికెక్కె అంతటి తరువర సంపద.

14.

పంతొమ్మిది వందల తొంభై రెండు లోన ప్రభుత్వపు
అటవీశాఖయె మానును స్వాధీనము చేసుకొనేను
ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖ వచ్చి గూటిబయలు
లోన యొక్క సుందరమౌ అతిథిగృహము నిర్మించెను.

అటవీశాఖాంతర్గత అధికారులు పూనుకొనుచు
వన్యప్రాణ సంరక్షణ రక్షణ పై కప్పు నివ్వ
రకరకాల వన జీవులు రమ్యమైన ఆశ్రయమునుగన
మర్రిమాను ప్రాంతమునకు మరువరాని శోభ తెచ్చె.

మర్రిమాను ఒడిలో గల మహాశివుని దేవళమును
బాగుగ అభివృద్ధి చేసి పవిత్రమగు చోటు చేసి
పన్నెండు లక్షల వ్యయమున ‘శివఘాటు’ను నిర్మించిరి
శివభక్తులకది అయ్యెను శివేత రక్షతమయ్యెను.

కర్నాటక రాష్ట్రమందు చిక్కబళ్లపూరు జిల్లా
లో నున్నది ‘కైవారము’ అను గ్రామము కడు పునీతము
పాండవులా ప్రాంతములో వనవాసము చేసిరియని
ఏకచక్రపురము అన్న అదియే అని ఐతిహ్యము.

చింతామణి పట్టణముకు పది మైళ్ల దూరముండు
‘కైవర బెట్ట’గ కూడను వ్యవహారింత్రు దాని ప్రజులు
యోగి నారాయణుడను మహానీయుని ఆశ్రమమట
విలసిల్లును ఆధ్యాత్మిక కేంద్రముగా అద్భుతముగ

సాధుపుంగవుండు యోగి నారాయణ ముముక్షువు
కన్నడభాషను ఆయన బోధనలు, రచనలు గల
వెన్నియె ప్రజలను చేసెను చైతన్యపు మూర్తులుగను
‘నరేయనప్ప’ యన్న నామము గలదా యోగికి.

‘ఘావి’ గుహను ఆ మునియే ధ్యాన యోగమున మునిగెను
జ్ఞానోదయమును పొందెను జ్ఞానమునే పంచె ప్రజకు
ఘావి గుహసముదాయము లోన వెలసె నరసింహుడు
యోగనరసింహుడగుచు భక్తుల కరుణించుచుండు

‘తాతయ్య’ని భక్తులతని తగ ప్రేమగ పిలుచుకొంద్రు
‘కైవారతాత’గా నటి యోగీశుడు లయము పొందె
కన్నడ దేశము వారికి అనంతపురము అన్న ప్రీతి
ఇరు రాష్ట్రాల ప్రజలు సరిహద్దుల కలసిమెలసి.

విష్ణు దేవు నంశ గాను వెలసె అమరనారాయణ
దేవుని స్తుతియించెను నారాయణ యోగి సతము
అమరనారాయణ శతకము, కాలజ్ఞాన, యోగసూక్ష్మ
ముల విరచించే యోగి భక్తుల సన్ముక్తి కొరకు

తిమ్మమాంబ మర్రిమాను తిరమగు ఘన కీర్తి తెలిసి
కైవారపు ట్రస్టు వారు కడు ఆసక్తిని చూపిరి
ప్రకృతి లోన పరాత్పరుని ప్రవచించిన యోగివరుని
బోధనలకు అనుగుణమని వటము గూర్చి తలచివారు.

పదిలక్షల రూప్యములను బహువిధముల వ్యయము చేసి
మర్రిమాను ప్రాంతములో దైవిక కార్యక్రమముల
నతి శ్రద్ధగ నడపుచుంద్రు నారేయన యోగి కరుణ
తిమ్మమాంబ ఆత్మతనియ ఆధ్యాత్మ సౌరభము మెరియ,

తిరుమల తిరుపతి దేవస్థానము వారిచట నొకటి
వేంకటేశ్వరాలయమును నిర్మింపగ పూనుకొనిరి
తిమ్మమ్మకు ఆశీస్సుల నీయుటకై తిరుమలేశు
డేతెంచుట ముదావహము, ప్రకృతి లక్ష్మి, పురుషుడతడు.

ఒక చిరు మందిరమచ్చట మర్రిమాను ఒడి లోపల
తిమ్మమాంబ కొరకు కట్టి తిరముగ నిలిపిరి ముదమున
అచట నొక్క శిలాఫలకమున ఆ మాతను గూర్చి వ్రాసి
ఆయమ పావన చరితము క్లుప్తముగా తెలిపిరిచట.

దాని మీద ఈ మాటల చెక్కించిరి ‘తిమ్మమాంబ
పదమూడువందల తొంభై నాలుగులో ప్రభవించెను
శెట్టిబలిజ శెస్కాక్క వేంకటప్పు, మంగమలకు
పద్నాలుగో వందల ముఫై నాలుగులో సహగమనము.’

(ఇంకా ఉంది)

Exit mobile version