[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]
15.
తిమ్మమ్మకు వీరయ్యకు సంతానము కలిగినట్లు
ప్రమాణములు లేవేమియు ప్రకృతియు పురుషుడు వారలు
చరాచరపు సృష్టిలోన విస్తారముగా వ్యాపించిన
ప్రకృతిమాత ప్రతిరూపము వన దేవత తిమ్మమాంబ.
సంతు లేని దంపతులట తిమ్మమాంబ నమ్మి మ్రొక్కి
పూజలు సల్పిన కలుగును పూర్ణమైన సంతానము
ఎన్నో జంటలు తల్లిని పూజ చేసి విన్నవింప
పొందిరి తగ సంతానపు సాఫల్యము తనివి తీర.
తిమ్మమ్మకు వీరయ్యకు తిరమగు నల్లని రాతితొ
చక్కనైన విగ్రహాలు నిలబెట్టిరి గుడి లోపల
కొబ్బరికాయలు పళ్లను కోరి తల్లి కర్పింతురు
దూరప్రాంతముల నుండియు వచ్చుచుండు భక్తజనము.
గుడి ముందర నుండు నచట తిమ్మమాంబదే సమాధి
దాని చుట్టు ఐదుసార్లు ప్రదక్షిణము చేయవలెను
జీవితమున సత్పథమును అనుసరించుటకు ప్రతీక
సరిగా నచ్చటె తిమ్మమ సహగమనము నొనరించెను.
రెండువేల ఒకటవ వత్సరాన త్రవ్వకములు
జరుపగాను కనిపించెను పాతగాజులెన్నో నగలు
సహగమనపు వేదిక యదె యని ఋజువయ్యను అట
ఒక పవిత్రమైన ఆత్మలయమయ్యెను ప్రకృతియందు.
మర్రిమాను తన గుడుల ప్రాంగణమున భక్తాదులు
పాదరక్షలను విడుచుచు పరిక్రమణ యొనరింతురు
కాషాయపు వస్త్రములను కొమ్మలకును ముడివేతురు
ఏడాదికి లోపలనే సతులకు వెస కడుపు పండు.
మానే దైవము జీవము, మానే జనులకును సర్వ
శుభకారకమయి వెలుగును తిమ్మమాంబ స్ఫూర్తి చేత
ప్రకృతిని దైవముగా మది భావించుచు ఆరాధన
చేయుట మన భారతీయ సంస్కృతిలో వరభాగము.
16.
‘గీతాంజలి’ కావ్యములో విశ్వకవి రవీంద్రనాథు
డెంతయు నౌచిత్యంబున ప్రకృతి పూజ ప్రవచించెను
వర్డ్సువర్తు కవివరుండు ప్రకృతిని వస్తువు చేయుచు
కావ్యంబులనెన్నొ వ్రాసె కమనీయపు భావములను.
ప్రకృతినె బోధకురాలిగ ప్రేమ తోడ స్వీకరించు
మని చెప్పెను వర్డ్సువర్తు. ఆమెయే అతనికి స్ఫూర్తిగ.
“చిన్న గడ్డి పువ్వు కూడ శ్రేష్ఠమైన భావములను
తన మదిలో కలిగించును” అని చెప్పెను ఆంగ్ల సుకవి.
ఫలితంబును ఆశింపక ఫలములనిచ్చును చెట్టు
నిస్వార్ధము తోడ పారు నిండగు నదులన్నియును
గాలి వీచు కులమతాల గాలి సోకకుండగాను
సేవ చేయు ప్రకృతి మనకు పక్షపాతరహితమతిని.
కావుననే తిమ్మమాంబ మర్రిమాను వాసిగాంచె
దానిని చెట్టుగ చూడరు కరుణకు పట్టుగ జూతురు.
చెప్పులు లేకుండ తిరుగు పరమార్థము ఇదియె చూడ
వట సమూహంబు కాదు వరమందిరమా వృక్షము.
తిమ్మమాంబ సమాధి ముందు నందీశ్వరుడుండు నిలచు
ఆయనకును మొక్కి, పిదప శివదర్శన రతులు కాగ
లయముకు పునరు జీవమునకు శివుడే సుప్రతీక
ప్రకృతి కూడ లయమైమరి పునరుత్థానంబు నొందు
సమాధి యున్న స్థానమునకు సవంతరముగ ఎదుటనుండు
శ్వేతమందిరము ఒకటి, స్ఫటిక కాంతి వెలుగు చుండు
అక్కడ ఆ మహాశివుడు ఆచరించు ఘన తపమని
భక్తుల విశ్యాసము, విశ్వాసమె భక్తి నిజము!
ప్రజలందరు విశ్వసింత్రు రాత్రిపూట శ్రీహరియే
విహరించును మర్రిమాను ప్రాంగణంబు లోనటంచు
శివకేశవులకు ఎవ్వరు అభేదమును గ్రహించెదరో
వారే సమ్యక్ జ్ఞానులు, వారే తత్త్వజ్ఞులవని.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
