Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆక్రోశం

“మనలాంటోళ్ళకి ప్రాణం మీద కాదురా తీపి వుండాల్సింది. మన బతుకుమీద వుండాల. అప్పుడే ప్రాణం విలవిల్లాడుతున్నా మన మొహాలపై చిరునవ్వును ఎవ్వరూ లాగేయలేరు” అని ఈ కథలో సూరీడు చంద్రంతో అన్నా… తమ వాళ్ళకి తీరని దుఃఖాన్నే మిగిల్చిపోయారు వాళ్ళిద్దరూ.

“దినమ్మూ మూడుపూటలా యిలా నోటికాడికి కూడొస్తావుంటే… కష్టం చేయడానికి ఒళ్ళు వంగుతుందా! యిట్టాంటి సోంబేరి బతుకు బతికే కన్నా యాడన్నా పడి సావరా! పీడ యిరగడైపోద్ది.”

నట్టింట్లో నేలమీద కూర్చోని ఒళ్ళో వున్న కంచంలో వేడి అన్నం కొంచెం కూరతో కలిపి ముద్దచేసి నోట్లో పెట్టుకోబోతున్న చంద్రం ఆ మాటలకు తలపైకెత్తి చూసాడు.

ఎదురుగా గుమ్మంలో నాన్న హనుమంతు. పొద్దున్నుండి ఎండలో పనిచేసి కష్టబడిన శరీరం ఎర్రగా… ఒంట్లో నీరంతా ఒంటిపైకి వచ్చేసిందా అన్నట్లు చమటతో పూర్తిగా తడిచిపోయి, కొడుకుపై కడుపులో వున్న కోపం అంతా కళ్ళలోకొచ్చేసి చింతనిప్పుల్లా చిటపటలాడుతా ఆవేశంతో ఊగిపోతున్నాడు. చేతికి సాయంగా వుండాల్సిన చెట్టంత కొడుకు పనీపాటా లేకుండా, యింట్లో పడుండటం చూసి గుండె రగిలిపోతావుందా తండ్రికి.

అరచేతిలో వున్న ముద్దనేంచేయాలో అర్ధంకానట్టు.. కొన్ని క్షణాలు తదేకంగా దానివైపు చూసాడు చంద్రం. తలను మరింత కిందకి దించి ఆ ముద్దను నోట్లో పెట్టుకొని గబగబా కంచంలోని అన్నమంతా కూరతో కలిపేసి ఎవరో తరుముకొస్తున్నట్లు తినేసి, అన్నం తిన్నకంచం పెరట్లో బావి దగ్గర పెట్టి చేతులు కడుక్కోని, యింట్లోకి కూడా రాకుండా, పెరటివైపు వాకిలి గుండా బయటకెళ్ళిపోయాడు.

వెళ్ళద్దని వారిస్తున్నా వెళ్ళిపోతున్న కొడుకుని చూసి ఉస్సూరుమంటూ యింట్లోకి నడిచింది రాములమ్మ. రెండు చేతులూ నెత్తిన బెట్టుకుని దిగులుగా నులక మంచంపై కాళ్ళు ముడుచుకు కూర్చోనున్న మొగుడ్ని చూస్తే బాధగా వుంది. ఇంట్లోనే నీడపట్టున మగ్గం నేసుకునే మనిషి, మండే ఎండలో పొలంలోకూలి పని చేసి, కాలే కడుపుతో యింటికి రాగానే, వీడిని యిలా చూసేసరికి కోపం రాక యింకేం వస్తుంది?

“దేనికయ్యా జరిగిందానికి బాధపడుతావు. నువ్వు యిన్ని మాటలన్నా వాడు తినడం మానేసాడా, లేదే! నువ్వన్న దాంట్లో తప్పేమీ లేదు. వాడికింకా మంచికాలం రాలేదు అంతే” మాట్లాడుతూనే కంచంలో అన్నం, కూర వడ్డించి మొగుడిముందు పెట్టింది.

“నాకు వాడంటే ప్రేమ లేక కాదే! బాగుపడాలనే అలా అన్నా.”

ఆ మాటలంటున్నప్పుడు భర్త కళ్ళలో సుడులు తిరుగుతున్న నీటిని చూసి “ఊరుకోవయ్యా తినేటప్పుడు మాట్లాడకు. కూరలో కారం ఎక్కువైనట్లుంది” అంటూ మంచినీళ్ళగ్లాసు చేతికందించింది. పెనిమిటి కంట కన్నీటికి కారణం యేదయినా తన కంటబడితే దాన్ని బయటపడనిస్తుందా!

తలవంచుకుని మౌనంగా అన్నం తింటున్న భర్తని చూస్తూ విసనకర్రతో విసురుతూ కూర్చుంది.

“ఇన్నాళ్ళూ కులవృత్తిని నమ్ముకున్నాం. యిప్పుడు గడ్డురోజులు. పనులులేవు. కడుపు నిండడానికి కూలి పనులు చేస్తున్నాం. కొడుకు మనసులో యేముందో? కష్టాన్ని నమ్ముకున్నోడంటే ఆ దేవుడికి కనికరమెక్కువంటారయ్యా. ఆయనే ఏదోక దారి చూపిస్తాడులే” మనసుకు ఊరట కలిగించే మాటలు మొగుడు అన్నం తింటున్నంతసేపూ చెప్తూ కూర్చుంది.

***

“ఎండలో యాడికిరా పోతాండావు?” అంటూ తన దారి కెదురుగావచ్చిన ‘సూరీడు’ పలకరించేదాకా గమనించనేలేదు చంద్రం సూరీడుని.

“నాకేం పనులన్నా.. ఊరకే అలా”.. అంటూ నసుగుతున్న చంద్రాన్ని చూసి నవ్వుతూ భుజాలపై చేతులేసి “పద.. అలా రాజయ్యతాత మామిడితోట వరకూ వెళ్దాం” అంటూ తోటవైపుకి దారితీసారిద్దరూ.

కావలితాత వీళ్ళని చూసి అన్నం తింటానికి గుడిసెలోకెళ్ళాడు. గుబురుగా పెరిగిన చెట్టు నీడకి చేరారు యిద్దరూ. కాసేపటిదాకా ఎవరూ ఏం మాట్లాడుకోలేదు.

“అన్నా! ఏదో వొకటి చేయాల. చేతులు ముడుచుకుని ఖాళీగా యిలా ఎంతకాలం? పని లేకుండా వుంటే అందరికీ లోకువే. నాన్న నోటికెంతొస్తే అంతమాటా అనేస్తాడు. వారంరోజులు పగలంతా కష్టపడితే ఒక చీర నేయగలం. దాన్ని షావుకారు చేతిలో పెడితే పదిహేనొందలిస్తాడు. కళ్ళముందు కష్టం కనిపిస్తుంది కాని, పైసలు రావు. యిప్పుడా పని కూడా దొరకడం లేదు. అన్నా… ఏ పనయినా చేస్తాను. ఎంత కష్టమైనా పడతాను. కాని, కష్టానికి తగ్గ పైసలు కూడా కావాలన్నా. నాన్న ఈ వయసులో కూలి పనులకు వెళ్తున్నాడు. వద్దంటే వినడు. ఖాళీగా కూసుంటే కడుపెట్టా నిండుద్ది? అని అంటాడు. అంతోటి కష్టం యింకేడన్నా చేస్తే నాలుగు రాళ్ళెక్కువొస్తాయేమోనని ఆశ ..అంతే!” దిగాలుగా యాష్టపోయాడు చంద్రం.

 “రోలు పోయి మద్దెల తో మొరపెట్టుకున్నట్లుందిరా చంద్రం” నిట్టూరిస్తూ అన్నాడు సూరీడు

“ఒరె.. ఎలాగోలా కడుపునిండా అన్నం పెట్టడానికి నీకు అమ్మా, నాన్న వున్నార్రా. కాని, నా పరిస్థితి చూడు. పెళ్ళాం, పిల్లల్ని కడుపులో పెట్టుకు సాకాలి. కాని, ఒక్కపూటైనా వాళ్ళ కడుపు నింపలేక, పెళ్ళాం అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక సచ్చిపోతున్నాను.

నా పెళ్ళాం నాలుగిళ్ళలో పనిచేసి తెచ్చిన డబ్బుతో అన్నం వండిపెడుతుంటే ముద్దమింగలేక,కక్కలేక ఆ అవస్థతో ఇంట్లో వుండలేక… యిలా వచ్చానురా..” అలవాటయిపోయిన బాధయినా భారంగా భరిస్తూ చెప్పాడు సూరీడు.

 ఏదో వొకటి చేయాల… ఆలోచనలోపడ్డారిద్దరూ.

“ఏందిరా! మాటల్లో పడి సందెచీకట్లు కమ్ముకున్నా తెలీలేదా! యింటికెళ్ళే పనిలేదా? రేతిరిక్కూడా యీడే వుంటారా?” తోటనంతా కలియతిరిగి రాలిపోయిన కాయలేమైనా చెట్లకింద పడివుంటే అవన్నీ యేరుకొని గంపలో యేసుకొచ్చిన రాజయ్యతాత సూరీడు, చంద్రంతో ఆశ్చర్యంగా అన్నాడు.

“వెళ్ళి చక్కబెట్టడానికి అక్కడేం రాచకార్యాలు లేవులే తాతా!” అన్న చంద్రం మాటలకి

“అట్టయితే నాకు ఊర్లోపనుంది వెళ్ళిరానా!..”ఆశగా అడిగాడు రాజయ్యతాత.

“ఎళ్ళెళ్ళు. కల్లుదుకాణానికేగా. హాయిగా వెళ్ళిరా. దారిలో మా యింట్లో కూడా వో మాట చెప్పేయ్. రాత్రికిక్కడే వుంటానని. లేకపోతే అమ్మ బెంగెట్టుకుంటుంది” అన్న చంద్రం మాటలకు

“అబ్బో నువ్వు చంటిపిల్లోడివని… మీ అమ్మకు దిగులు.. అట్టె చెబుతాలే. తోటని ఓ కంట చూసుకుంటా వుండండి.” అంటూ రాలిన కాయల్నుంచిన గంప భుజానికెత్తుకొని ఊరివైపెళ్ళాడు రాజయ్యతాత.

“ఒరె చంద్రం… ఆకాశంలో చందమామని చూడరా. చుట్టూ చుక్కల్నేసుకుని ఎంత దర్జా ఒలకబోస్తున్నాడో! కాని, రోజురోజుకూ కొంచెం, కొంచెం కరిగిపోయి, అమాసనాడు మాయమైపోతాడు గదరా! మన బతుకులూ యింతే. రేపటి మాట మర్చిపోతే ఈ రోజుకి రాజు లా బతకతాం. కాని, రేపటి కష్టాన్ని తలచుకుంటావుంటే ఈ రోజు సుఖాన్ని గూడా అనుభవించలేం. ఎందుకురా ఈ బతుకులు… థూ…” మనసులోని అక్కసునంతా నొట్లోని ఎంగిలితో కలిపి ఖాండ్రించి ఉమ్మేసాడు సూరీడు.

“నాకైతే… ఒక్కరోజైనా పున్నమినాటి చంద్రుడిలా వెలిగిపోవాలని వుందన్నా. ఆ ఒక్కరోజును తల్చుకుంటా మిగిలినరోజుల్ని ఖుషీగా గడిపేస్తా” చంద్రం కళ్ళలో ఆశ నిండుగా కనిపిస్తూంది.

“ఎంతసేపని యిలా కూసోనే ఉంటార్రా! యింద తినండి” అంటూ కాగితం పొట్లంలో కట్టుకొని తెచ్చిన బజ్జీలు, పొట్లాం విప్పి వాళ్ళ ముందుంచి అక్కడే కూలబడ్డాడు రాజయ్యతాత.

“యిలా వున్న తావునే కూసోని పని కావాలంటే ఎట్టారా! మీకెం కావాలో దొరికేదాకా ఎతుక్కుంటూ ఎల్లాల. ఆకాశంలో రేతిరి కనిపించే చందమామ, చుక్కల్ని చూస్తూంటే… అవి మనలో వుండే దిగులును దూరం చేస్తాయా… అవి చీకట్లో వుండే చమక్కులు. బతుకు బాగుపడాలంటే పగలు కావాల. తెల్లారిందని తట్టిలేపి, చురుక్కుమనిపిస్తూ ఆకాశంలో సూర్యుడు దినమ్మూ… ఈ చివరన పుట్టి ఆ చివరకు పోతుంటాడే… పని విషయంలోనూ మనము అట్టే వుండాల. యిందాక ఊర్లో ‘సుబ్బులు మేస్త్రీ ‘ కనిపించాడు. అడవిలో కలప కోసం పోతున్నాడంట. ముందుగా మాట్లాడుకున్న కూలోల్లు రాక పని ఆగిపోతుందేమోనని దిగాలుగా వున్నాడు. మీ గురించి చెప్పా” అని రాజయ్యతాత చెప్పగానే.

“అడవిలో పనంటే అమ్మ ఒప్పుకోదేమో!” చంద్రం బిక్కమొహం పెట్టాడు.

“అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలారా! పనికి మేస్త్రీ కూలి బాగానే ముట్టచెబ్తాడు. నమ్మకంగా వున్నారంటే యింక పనికోసం ఎతుక్కోవాల్సిన పనుండదు. అవసరం అందరిదీ. కాళ్ళదగ్గర కొచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోబాకండిరా! ఒకరికొకరు తోడుగా వుండి పని చేసుకోండి. ఒరే చంద్రం… యింటికాడ అడవిలో పని అని చెప్పొద్దు. ‘కోలార్ ‘దగ్గర బేల్దారి పని అని చెప్పు” వాళ్ళకున్న అనుమానాలు, సంకోచాలు కాళ్ళకింద నలుగుతున్న ఎండుటాకుల చప్పుడులో నెమ్మదిగా కలిసిపోయాయి. మొత్తానికి యిద్దరూ మేస్త్రీ దగ్గర పనికి ఎల్లేట్టు ఒప్పించాడు రాజయ్యతాత.

“అన్నా… మనం అడవిలోకొచ్చి రెండు దినాలైపోయింది. యింకా పని మొదలెట్టలా. అడవిలో ఎక్కడున్నామో తెలీడం లేదు. అలా… నాలుగడుగులేసినా మేస్త్రీ అరుస్తున్నాడు. ఉన్నచోటనే ఊరికే కూచోనుంటే పొద్దుపోవడం లేదు. మేస్త్రీతో మాట్లాడి విషయమేంటో కనుక్కోన్నా!” చంద్రం మాటల్లో చురుకు లేదు.

ఆరుబయట నేలమీద వెల్లకిలా పడుకోని ఆకాశంలో చుక్కల్ని లెక్కపెడుతున్న సూరీడు “పని దొరకనప్పుడు పనికోసం దిగులు సరే, పని దొరికినాక కూడా దేనికిరా యిలా… దిగాలుగా వున్నావ్” అన్నాడు.

“అది కాదన్నా అమ్మకు అబద్దం చెప్పిరావడం యిదే మొదటిసారి. ఎందుకో భయంగా వుందన్నా” ఇరవైయేళ్ళ చంద్రం గొంతులో అయిదేళ్ళ పసిపిల్లాడి గుబులు.

“నీకు పని చిక్కిందనగానే గంగమ్మతల్లికి టెంకాయ కొట్టి నువ్వు తిరిగొచ్చినాక పుంజు నిస్తానని మొక్కుకొని వుంటుందిరా మీ అమ్మ. మీ అయ్యకూడా నిమ్మళంగా వుండుంటాడు. మనం యిక్కడికి పని చెయ్యాలనే గదా వచ్చింది. అది పూర్తి కాకుండా మేస్త్రీ మనల్ని వదల్డు. బండ్లు యింకా రాలేదంట. అందుకే పనిలో ఆలస్యం. ఉషారుగా వుండరా!” సూరీడు చంద్రాన్ని సముదాయించాడు.

“ఏమో అన్నా! యింటిదగ్గర నాన్న తిట్టినా అన్నం తినేసేవాన్ని. కాని, యిప్పుడు తిండి సయించడం లేదు. ఏదో జరుగుతుందేమో అనే భయం తుమ్మ జిగురులా అంటిపెట్టుకోనుంది. అడవిలో ఎప్పుడు, ఎక్కడ, ఏవైపునుండి ప్రమాదం పొంచి చూస్తుంటుందో మనకు తెలీదు కదా!” భయం చంద్రం మాటల్నిసన్నగా వణికిస్తూంది.

“దయదలిచే దేవుడూ, సాయంచేసే దయ్యం మన దరిదాపుల్లో లేనప్పుడు, భయంతో చేతులు కలపడం అనవసరంరా.. మనలాంటోళ్ళకి ప్రాణం మీద కాదురా తీపి వుండాల్సింది. మన బతుకుమీద వుండాల. అప్పుడే ప్రాణం విలవిల్లాడుతున్నా మన మొహాలపై చిరునవ్వును ఎవ్వరూ లాగేయలేరు” సూరీడి మాట స్పష్టంగా వుంది.

“నిజమే అన్నా. సోంబేరిగా బతికేకన్నా పనిచేస్తూ చచ్చినా ఆనందమే” చంద్రం వాళ్ళ నాన్నని తలచుకున్నాడు. “రేపు ఏదో జరుగుతుంది అనే భయంతో ఈ రోజు ఆనందాన్నెందుకు దూరం చేసుకోవాల!” తేలిక పడ్డ మనసుతో అన్నాడు చంద్రం.

యిప్పుడు ఆకాశంలో చుక్కలమధ్య చందమామని చూస్తుంటే, తనని తాను చూసుకున్నట్లుంది చంద్రానికి. అంతా మంచే జరుగుతుందన్న భరోసా కనిపిస్తుందా కళ్ళలో.

చంద్రంకి ధైర్యం చెప్పాడే కాని, అర్థంకాని యిక్కడి వ్యవహారంవల్ల బుర్రనిండా అలుముకున్న ఆలోచనలు సూరీడిని స్ధిమితంగా వుండనివ్వడం లేదు.

‘మేస్త్రీ యిప్పటివరకు పని మొదలుపెట్టకుండా ఎందుకాగినట్లు? అసలిక్కడికొచ్చింది కలపలోడు తీసుకెళ్ళడానికేనా! బండ్లింకా ఎందుకు రాలేదు? చంద్రం చెప్పినట్లు మేస్త్రీ ఎందుకు కంగారుగా వున్నాడు? సంగతేంటో యిప్పుడే తేల్చేయాల’ అనుకున్న వెంటనే మేస్త్రీవున్న చోటికి వెళ్ళాడు సూరీడు.

“అడవిలో పన్లంటే అట్టే వుంటాయిరా. సరైన సమయం చూసి బయలుదేరాల. యియన్నీ పెద్దోళ్ళ వ్యవహారం. మీకనవసరం. ఏటయిము లోనైనా పనిచేయడానికి మీరు తయారుగా వుండాల అంతే” మేస్త్రీ మాటల్లో కరుకుదనం సూరీడి నోరు నొక్కివేసింది.

రేపు ఉదయం పని మొదలవకపోతే చంద్రాన్ని తీసుకొని యిక్కడ్నుంచి వెళ్ళిపోవాల. మనసులోని నిర్ణయం బిగుసుకున్న రెండు చేతుల పిడికిల్లలో మౌనంగా వుండిపోయింది.

రాత్రంతా చిక్కని అడవిలోదాగున్న చీకటిని చీలుస్తూ ఒత్తుగా ఎత్తయిన చెట్ల ఆకుల మధ్యనుండి తెల్లవారి వెలుగు దూసుకొని వచ్చేసింది. వెలుగులో కనిపిస్తున్న బాట బండ్లని తోడ్కోచ్చింది. అది చూసి అక్కడున్న అందరిలో దిగులు దూరమై చురుగ్గా బండ్లలోకి కలపను ఎక్కించడం మొదలుపెట్టారు.

కాళ్ళూ, చేతుల్లోని ఉషారుతో వేగంగా పని చేస్తున్నా సూరీడి మనసు మాత్రం యింకా స్వాధీనంలోకి రాలేదు. బుర్రలో నిండివున్న జవాబులేని ప్రశ్నలన్నీ నెమ్మదిగా ఓ ఆకారంలా మారి తన వెనకాలే నించుందన్న భావనతో ఉక్కిరిబిక్కిరై పోతున్నాడు. తలెత్తి చుట్టూ ఓసారి చూసాడు. తనకు కొంచెం దూరంలో తనవైపే చూస్తున్న చంద్రం. తన ఆందోళనని పసిగట్టిన చూపులనిండా అర్థంకాని భయం నెత్తిమీదున్న బరువుకన్నా భారంగా మోస్తూ…

ఏదో జరగబోతుంది… ఏమైవుంటుంది? ఆలోచనలు విచ్చుకునేలోగా చుట్టూ కలకలం”పారిపోండ్రా” అని మేస్త్రీ అరుపులు. ఆ వెంటనే తుపాకుల చప్పుడు. ఏం జరుగుతుందో తెలియని అమాయకపు ప్రాణాలు నేలకంటుకుపోయాయి. చమటతో తడవాల్సిన శరీరాలు రక్తంతో తడిసి ముద్దై అప్పటివరకు మోస్తున్న మొద్దుల సాక్షిగా ఊపిరిని వదిలేసాయి.

మేస్త్రీ మనుషులు తీసుకొచ్చిన కొడుకు శవాన్ని చూసి కుప్పకూలిపోయారు చంద్రం అమ్మ, నాన్న. విషయం చెప్పి, చంద్రంకు రావలసిన డబ్బులు వాళ్ళకివ్వబోయారు.

“వాడి చేతుల్లో మా బతుకులు కడతేరి పోతాయనుకున్నాం కాని, వాడి కట్టే మా చేతుల్లో బూడిదయిపోతుందనుకోలేదు” రాములమ్మ కుమిలిపోయింది.

“వాడి బతుకు బాగుపడాలని తిట్టాను. వాడు చమటోడ్చి తెచ్చిన డబ్బుతో ఓ ముద్ద పెడతాడనుకున్నాం గాని… వాడి రక్తంతో తడిచిన ఈ సొమ్ము మాకరగదు సామీ… తీసుకెళ్ళిపోండి” హనుమంతు ఆ డబ్బును ముట్టుకోలేదు.

“నా మొగుడు యిన్ని రోజులూ ఎలా బతకాలా… అని యోచన చేసేవాడు. యిప్పుడు యెలా బతక్కూడదో చెప్పి సచ్చిపోయాడు. మా కెందుకు బాబూ ఈ డబ్బు! దీంతో కడుపు నిండుతుందా! కాలుతుంది గాని…! ఎల్లిపోండి” సూరీడి పెళ్ళాం మేస్త్రీ మనుషులు యివ్వబోయిన డబ్బును కంటితో కూడా చూడలేదు.

“ఈ డబ్బుతో మన మేస్త్రీ యింకో మిద్దె కట్టేస్తాడురా” గొణుక్కుంటూ వెనక్కి తిరిగారు మేస్త్రీ మనుషులు.

“అడవిని నమ్ముకుంటే బాగుపడతారని పంపిస్తే ఆశపోతుల దురాశకు మీరు బలయిపోయారు గదరా…” సూరీడు, చంద్రాన్ని తలచుకొని కుమిలికుమిలి ఏడుస్తున్నాడు రాజయ్యతాత… ఈ ఆక్రోశం జనారణ్యానికి చేరువైనట్లే వుంది.

Exit mobile version