[ఒడియాలో గురుప్రసాద్ మహంతి గారు వ్రాసిన ‘అలకాసన్యాల్’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు డా. తుర్లపాటి రాజేశ్వరి.]
నిన్ను సచ్చిబాబు ఎప్పుడు చూశాడో
నాకు తెలీదు అలకాసన్యాల్
బహుశ అప్పుడు ఆకాశంలో బంగారువర్ణం
చిరుత పులి – జింకల నీడలు
బహుశ అప్పుడు ఆకాశంలో పసుపు వర్ణపు
చందమామ కాగడా!
ఇవాళ నిన్ను నేను చూస్తున్నా
నువ్వునాకు నీ రవిక గుండీలు అప్పగించు
నీ చోళీ మీది ‘చా’ మరకలని వేడినీళ్లల్లో ఉతుక్కో!
టేబుల్ అవతలివైపు తలొంచుకుని నిలబడి మాట్లాడు!
మళ్ళీ వచ్చి ఇదుగో నాపక్కన కుర్చీలో మెల్లగా కూర్చో!
మండుటెండ – బూడిద రంగు ధూళి
సిగరెట్టు పొగ మందంగా కాగితంపూవుని కమ్మేస్తాయి
బయట
కాకుల, గబ్బిలాల శబ్ద ధ్వనులు..
కలిసి వినిపిస్తాయి!
బొగ్గుల పొయ్యి నుండి వచ్చే పొగల వలయాలు!
మెలేసిన మీసాల పొగరు చూపులు!
వీధిలో రిక్షావాలా సందడి.. మోగిన గంట!
నువ్వు కట్టుకొయ్య తాడుని వదిలించుకోవటం
వచ్చి చెదిరిన దుస్తులతో, జుట్టుతో పక్కమీద
కుప్పకూలటం చూశాను!
మళ్లీ లేస్తావు!
బట్టలు సవరించుకుంటావ్.. నేను టౌన్‌హాల్ సభకి వెళ్లానా..
అక్కడా నువ్వే మళ్లీ!
ఒకనాడు
సచ్చిబాబు గంధర్వుడైన చిత్రరథుడి
చెరనుంచి విడిపించి
తెస్తున్నపుడు జయజయధ్వానాలు చేశావ్!
మళ్లీ
స్వాతంత్య్రం వచ్చాక
దేశవిభజన సమయంలో
నౌఖాలి సాయిబుపేట నుంచి
బయట పడ్డావ్!
మధ్యాహ్నం అలిసి పోయింది!
రైలు స్తంభాల వెనుక నుంచి
సంధ్య తొంగి చూస్తోంది!
బొగ్గుల పొయ్యి నుండి పొగల జాడలేదు!
కాకులు, గబ్బిలాలు మౌనం వహించాయి.
సిగరెట్ పొగ ఇప్పుడు
నర్గీస్, నేతాజీ ఫోటోల మీద దట్టంగా!
తనకింద పెదవిని కొరుక్కుంటూ
ఆకాశంలో అకస్మాత్తుగా చంద్రుడు!
ఇవాళ
నువ్వొక తుఫాన్‌లా
ఉపన్యసించటం విన్నాను!
నేను చూశాను!
నీ దేహం బురదగుంటలా రూపాంతరం చెందటం!
చింపేసిన కాగితంలా తునాతునకలవటం!
ఆ ముక్కల్ని గాలి మెల్లగా ఎగరేయటం!
శిథిలమైన నౌఖాలి
కలకత్తా – కొత్త ఢిల్లీ.. దారుల్లో..
మళ్ళీ కాకుల, గబ్బిలాల కీచురాళ్ల ధ్వనులు!
కటక్ సందుల గొందుల్లో.. కూడళ్లలో
రాత్రిళ్లు పురిటినొప్పులు..
తెల్లవారి రోగిష్టిగా జన్మించటం!
ఇప్పుడు కూడా
నువ్వు ప్రేమించు! గర్భం ధరించు!
చూశాను..
నీ వంటి మీద సినిమా ప్రకటన!
గాలి నిన్ను సుతారంగా లేపి తీసికెళిపోతుంది!
నేను నీ కలలని!
నువ్వు పైలోకంలో కూడా
నా వదులొదులు పైజమా
కమీజ్‌లనే పలవరిస్తున్నావు!
~
ఒడియా మూలం: గురుప్రసాద్ మహంతి
తెలుగు అనువాదం: డా. తుర్లపాటి రాజేశ్వరి
~
పదాల వివరణ:
- సచ్చిబాబు: సచ్చిదానంద రౌత్రాయ్. జననం 1916. ఒడియా కవిత్వంలో అధివాస్తవికవాదం, ప్రతీకవాదం, గద్య కవిత మొదలైన ఎన్నో ప్రయోగాలు చేసినవాడు. ఆయన అలకాసన్యాల్ శీర్షికతో రాసిన కవితలో అలకాసన్యాల్ ఒక ప్రతీకాత్మక పాత్ర. రాజకన్య. కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ, జ్ఞానపీఠ పురస్కారాలు అందుకున్న కవి. 21.08.2004 న కన్ను మూశారు.
- చిత్రరథుడు: అంగారపర్ణుడనే గంధర్వుడే చిత్రరథుడు, కుబేరుని మిత్రుడు.
- నౌఖాలి: ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాంతం ఒకనాడు తూర్పు బెంగాల్లోనే ఉండేది. దేశ విభజన సమయం: 1946లో ఇక్కడ హిందూ-ముస్లిం అల్లర్లు చెలరేగాయి. అనేక మంది హిందు స్త్రీలు మానభంగాలకు, హిందువులు ఊచకోతకు గురి అయ్యారు.
~
మూల కవి గురించి:
గురుప్రసాద్ మహంతి : (1924-2004)
గురుప్రసాద్ మహంతి భానుజీ రావుతో కలసి ‘నూతన కబిత’ కవితా సంకలనం 1955లో ప్రచురించారు. నూతన కబితలోని కవితలన్నీ ‘రొమాంటిక్ రియలిజమ్’ తో ప్రభావితుడై రాసినవే. ఒడియా సాహిత్యంలో ఈ కవితలు అలజడిని సృష్టించినవే. గురుప్రసాద్ మహంతి దీర్ఘకవిత ‘కాలపురుష’ (1960) అధునిక ఒడియా సాహిత్యంలో చెప్పకోదగిన దీర్ఘ వచన కవిత. ఇది ఇలియట్ ‘ది వేస్ట్‌లాండ్’ని తలపిస్తుంది. టి.ఎస్. ఇలియట్, బాదలియర్, ఆంగ్లమెటా ఫిజికల్ కవుల ప్రభావం మహంతి కవిత్వంలో స్పష్టంగా గోచరిస్తుంది. స్వాతంత్య్రానంతరం జీవితాలలో ఏర్పడ్డ అనేక సంక్లిష్టతలను గురుప్రసాద్ మహంతి తన కవితల్లో చిత్రీకరించాడు. భాషాభివ్యక్తిలో నూతనత్వం-వక్రోక్తి, పట్టణీకరణ -మానవతామూల్యాలు ప్రధాన లక్ష్యంగా మహంతి కవిత్వం సాగుతుంది. సమకాలికులలో ‘విషాద కవి’గా వీరిని సాహితీ విమర్శకులు వర్ణిస్తారు. వీరు ‘సముద్రస్నాన’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1973లో పొందారు.
డా. తుర్లపాటి రాజేశ్వరి కవయిత్రి, కథా రచయిత్రి, అనువాదకురాలు. కథ, నవల, కవిత్వం, అనువాదం, రూపకం, వ్యాసం, విమర్శ – వివిధ ప్రక్రియలలో రచనలు వెలువరించారు. 23 పుస్తకాలు ప్రచురించారు. అనువాద రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి ‘తెలుగు వికాసం పురస్కారం’, కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి గుత్తికొండ సుబ్బారావు పురస్కారం, విశాఖ రచయితల సంఘం, భారతనిధి ఫౌండేషన్ వారి బలివాడ కాంతారావు పురస్కారం, చలసాని వసుమతీ మాధవ పురస్కారం మొదలైన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
