Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 62: అనుకూల శక్తులూ – ప్రతికూల శక్తులూ

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

అనుకూల శక్తులూ – ప్రతికూల శక్తులూ

“మనం ఒక కార్యం త్రికరణశుద్ధిగా తలపెట్టినప్పుడు దానిని విజయవంతంగా పూర్తిచేయడానికి పంచభూతాలన్నీ కలిసికట్టుగా ఒక్కటై మనకు సహాయం చేస్తాయి.”

ఈ మాట హైందవ పురాణ ప్రబోధమా! పవిత్ర ఖురాన్ సందేశమా! పరిశుద్ధ గ్రంథ వచనమా! మనకు తెలియదు అయితే సరిగ్గా ఇదే థీమ్‌తో ‘పౌలో కోయెలో’ అనే రచయిత ‘ది ఆల్కమిస్ట్’ అనే అద్భుతమైన నవలను పోర్చుగీసు భాషలో రాసాడు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యి మన తెలుగులోకి కూడా ‘పరుసవేది’ పేరుతో వచ్చేసింది.

మనం సాగించిన జీవనపయనంలో మనం నెరవేర్చిన విధుల్లో లేదా పనుల్లో అనుకూల శక్తులూ వ్యతిరేక శక్తులూ ఎలా ఎదురయ్యాయో ఒకసారి అవలోకిద్దాం!

భుక్తి కోసం చేసిన ఉద్యోగం మన కోసం మనం చేసుకున్న పని. రిటైర్ అయ్యాక, కాస్త సమాజం కోసం పని చేద్దాం! అని ఆశపడతాం నాలాంటి వాళ్ళం కొందరం. ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చూసుకుని, అక్కడ ఉండే పెద్దవాళ్ళతో, వారానికోసారి వెళ్ళి కాసేపు సంభాషించి, వాళ్ళని ఉత్సాహపరిచి ఏమైనా పళ్ళు పట్టుకెళ్ళి ఇద్దాం! అనుకుంటాం. వాళ్ళకి ఇతరేతర సహాయాలేమన్నా కావాలేమో అడుగుదాం! అని కూడా అనుకుంటాం. మన ఇంటికి కాస్త దగ్గరగా ఉండే ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్రస్ కనుక్కుని రెడీ అయ్యేలాగా పిల్లలు అడ్డం పడిపోతారు. “అమ్మా! రిటైర్ అయ్యావు. ఆరోగ్యం చూసుకోవడం మానేసి, అక్కడికి వెళ్లి నువ్వు ఏం చెప్తావ్? వాళ్ళు ఏం వింటారు! నీకు ఇవ్వాలని ఉంటే ఎప్పుడో ఒకసారి పోయి డొనేషన్ ఇచ్చిరా! వారానికోసారి నిన్ను అక్కడికి ఎవరు తీసుకెళతారు? ఆ హోమ్ ఊరి చివర ఉంది.” అని నిరుత్సాహపరుస్తారు.

ఏదైనా సర్వీస్ ఆర్గనైజేషన్‌లో చేరి సర్వీస్ చేద్దాం అంటే “అందులో ఉండే వలంటీర్లు యంగ్ లేడీస్ ఉంటారు. వాళ్ళు స్కూటీల్లోనో, ఆటోల్లోనో చకచకా వెళ్లి పనులు చేసుకుని వస్తూ ఉంటారు. నీలాంటి పెద్దవాళ్ళని ఆటోలు ఎక్కించి దగ్గరుండి తీసుకెళ్లవలసిన అవసరం వాళ్ళకేంటి?” అని నీరుకారుస్తారు మన ఉత్సాహాన్ని. “పోనీ ఇరుగుపొరుగు చిన్న పిల్లలకి తెలుగు నేర్పిస్తాను” అంటే “సాయంత్రాలు అలా వాకింగ్‌కి వెళ్ళకుండా, నాన్నగారిని ప్రశాంతంగా టీవీ చూడనివ్వకుండా నువ్వు పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి తెలుగు నేర్పిస్తే మాత్రం ఎవరమ్మా నేర్చుకుంటారు? ఒకవేళ మొదలుపెట్టినా యాభయ్యారు అక్షరాలు నేర్పేటప్పటికి సగం మంది పారిపోతారు. ఇంక నువ్వు ఒత్తులు, గుణింతాలు అనేసరికి మన వీధిలోకి కూడా ఎవరూ రారు!” అని వేళాకోళం చేస్తారు. మనకి ఇంట్లోనే వ్యతిరేక శక్తులు అంటే ఇవే! “పోనీలే అమ్మ ఏదో చేయాలని ఆశపడుతోంది చేసుకోనివ్వండి” అని భర్తలు ఏమైనా మాట సాయం చేస్తారా! అంటే వాళ్లంతా పేపర్ చాటున ముసిముసిగా నవ్వుకుంటూ కూర్చుంటారు. ప్రపంచమంతా ఒక్కటై సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఇంట్లో వాళ్ళు ఇస్తే చాలు అని మనం గొణుక్కుని ఊరుకోవాల్సిందే! మరీ పట్టుపడితే, మనవళ్ళతో సమానంగా పేచీ పెట్టినట్టు ఉంటుందని మనకే మొహమాటంగా ఉంటుంది.

ఇక బంధువుల నుంచి మనకు ఎంత సపోర్ట్ వస్తుందో చూద్దాం! మనం కాస్త ఉత్సాహంగా మన వాళ్ళ పెళ్లిళ్లలో జరిగే ఏ హల్దీ ఫంక్షన్ లోనో, సంగీత్ లోనో ఓ నాలుగు స్టెప్పులు వేస్తే ఫ్యామిలీ వ్యతిరేక శక్తులు ఓర్వలేక నొసలు చిట్లిస్తాయి, ‘ఇప్పుడీవిడకి ఇవన్నీ అవసరమా! హాయిగా ఓ మూల కూర్చోక!’ అంటూ. బాగా సంపాదించుకుంటే గర్వమనీ, మంచి ఇల్లు కట్టుకుంటే అహంకారం అనీ, మన పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళకేంటీ పిల్లలే బోలెడు సంపాదిస్తున్నారనీ, పిల్లలు సరైన జాబుల్లో లేకపోతే ‘సంతానం బాగా ఎక్కి రాలేదు పాపం!’ అనీ వ్యంగ్యపు బాణాలు మనమీద అటూ ఇటూ పడుతూ ఉంటాయి. వాళ్ళను లెక్క చేయకపోతే పొగరుబోతులనీ, భయపడితే పిరికివాళ్ళమనీ మన వెనక రేటింగ్స్ పడుతుంటాయి. మరంచేత, మనం చేసే పనులకి ప్రపంచం అంతా ఏకమైపోయి మనకు సపోర్ట్ చేసేయడం కలలోనిమాట కదా! ఏదో మనకు మనం ఇంట్లో కూర్చుని కష్టపడి ఏ సంగీతమో నేర్చుకుని రవీంద్రభారతిలో కచేరీలిస్తే, లేదా ఏ సాహిత్యరంగంలోనో కృషిచేసి మనల్ని మనం నిరూపించుకుని పదిమందిలో పేరూ, సాహితీ అవార్డులూ తెచ్చుకుంటే మాత్రం అప్పుడంతా, ‘ఆవిడ మాకు బంధువే! మా పిన్ని కూతురే! మా మామయ్య భార్య!’ అంటూ మన విజయంలో గ్రూప్ ఫోటోకి వస్తారు.

ఇంకో సంగతి ఉంది, అదీ చూద్దాం! ‘వంటిళ్ళు కూలగొట్టండి. అక్కడే మగ్గిపోకండి!’ అని మన సిస్టర్స్ చెబితే మనం వినలేదు. ‘కొత్తతరం వచ్చాక పర్వాలేదు, యూత్ భార్యలకి హెల్ప్ చేస్తున్నారు’, అనుకున్నాం కదా! కాస్త లోతుగా అధ్యయనం చేస్తే, వాళ్ళు చేసే సాయం ఏముంది? కాస్త ఒవేన్‌లో చపాతీలు వేడి చేయడం, ఎప్పుడో ఒకసారి కాసిని కూరలు మంచి హుషారుగా ఉన్నప్పుడు తరిగి ఇవ్వడం, స్విగ్గీ నుంచో మరోచోటి నుంచో వచ్చిన ఆహార పదార్థాల ప్యాకెట్లు చింపి గిన్నెల్లోకి సర్దడం అంతేగా! మొత్తం వంటిల్లు బాధ్యత అంతా ఆడవాళ్లదే! అసలు వంటిల్లే పెద్ద మయసభ! ఆడవాళ్ళకి ప్రధాన వ్యతిరేకశక్తి! వంటిల్లు ఆడవాళ్ళకి రోజంతా పని చెబుతుంది. అడుగు పెడితే చాలు పనులు పురమాయిస్తుంది. వంట చేసేటప్పుడు పొయ్యి దగ్గరనుంచి జరిగితే చాలు పదార్థాలు మాడిపోతాయి. తన ఎదురుగానే బానిసలా నిలబడాలని గ్యాస్ స్టవ్ కి ఎంత పంతమో! అక్కడే నిలబడి పాలు కాస్తుంటే చచ్చినా మరగవు. తల తిప్పి ఇంకో పని మొదలు పెట్టగానే, పాలన్నీ పొంగి గ్యాస్ పొయ్యిని ముంచుతాయి. అప్పుడు దాన్ని శుభ్రపరచడానికి మరో అరగంట పడుతుంది. అసలు వంటిల్లే మగవాళ్ళ కన్నా పెద్ద శత్రువు ఆడవాళ్ళకి.

హడావుడిగా ఏదైనా టిఫిన్ చేద్దాం అంటే ఆ పిండో, నూకో కనబడకుండా దాక్కొని ఉంటుంది. మనం నానా పాట్లూ పడి మరొక టిఫినేదో చేసాకా, నవ్వుకుంటూ ఆ డబ్బా అల్మైరాలోంచి తొంగిచూస్తుంది. ఇక రిఫ్రిజిరేటర్ ఒక పెద్ద మాయాబజార్! ఎన్నిసార్లు సర్దినా కంగాళీగా తయారయ్యి, వెతుకుతున్నదేదీ కనపడదు, విసుగ్గా సర్దుతుంటే, లోపలి నుంచి గాజుసీసా ఒకటి కిందపడి భళ్ళున పగిలి బీభత్సం! ఎవరైనా గెస్ట్‌లు భోజనానికి వచ్చినప్పుడు నిత్యం ఎంతో రుచిగా ఉండే వంటలు కూడా కుదరవు. ‘ఈవిడకి వంట బొత్తిగా రాదు’ అని వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీ అయ్యేట్టు ఉంటుందారోజు భోజనం. అసలు టీ కూడా సరిగా రాదు. చెప్పానుకదా, వంటిల్లు ఓ పెద్ద శాడిస్ట్ అని! ఆడవాళ్లు రోజంతా అక్కడే తన దగ్గరే ఉండాలని వంటిళ్ళకి మహాకోరిక!

మనం ఉద్యోగం చేసిన రోజుల్లోకి ఒకసారి (ఫ్లాష్‌బ్యాక్ లోకి) వెళ్లి చూసుకున్నా, మనకి వ్యతిరేక శక్తులు వరుసగా గుర్తొస్తాయి. మన నసీబు ఎలా ఉంటుందంటే ప్రమోషన్, సరిగ్గా సీనియారిటీలో మన ముందున్న వ్యక్తి వరకూ వచ్చి ఆగిపోతుంది. పోస్ట్‌లు అయిపోతాయి. ట్రాన్స్‌ఫర్ మాత్రం లెక్క ప్రకారం జూనియర్ అంటూ, మన్ని ట్రాన్స్‌ఫర్ కొడతారు. మన పైవాడికి ట్రాన్స్‌ఫర్ రాదు. ప్రమోషన్ ఛానల్లో కూడా మనది ఒంటరి పోరాటమే! అర్హత మనకే ఉన్నప్పటికీ, ఇతరేతర కుంటి కారణాలవల్ల క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వమని ఫైళ్ళలో రికమండేషన్స్ నడుస్తాయి. మన అభ్యర్ధనా రిప్రెజెంటేషన్స్ కాగితాల్ని కోల్డ్ స్టోరేజ్ లో పడేస్తారు. రూల్స్‌లో ఉన్న మన హక్కు కోసం రోడ్డెక్కి, కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చి, ఆ తర్వాత ఫైనల్ హియరింగ్‌లో జడ్జిమెంట్ పట్టుకొచ్చి మన ప్రమోషన్ హక్కుని నిలుపుకోవాలి. ఇంత అన్యాయం జరుగుతుంటే, ఆఫీసులో ఉన్న రెండువందల మందిలో ఒక్కరు కూడా ‘అయ్యో! పాపం! మీది ధర్మపోరాటం! మీరు గెలుస్తారు’ అని అనరు. ప్రతి ఒక్కరూ కోర్టుజడ్జీల్లా ఫీల్ అయిపోయి, ఆకుకి అందకుండా పోకకి పొందకుండా తీర్పులు చెప్పేస్తూ ఉంటారు. రెండేళ్లు న్యాయ పోరాటం జరిపి, గెలిచాక ఆర్డర్ కాపీ తెచ్చి చూపించగానే “మీరు సాధిస్తారండీ! మేము అనుకుంటూనే ఉన్నాం. స్వీట్ బాక్స్ ఏది?” అంటారు, కొంచెం కూడా బిడియపడకుండా. ఇలా ఎక్కడ చూసినా వ్యతిరేక శక్తులే ఉంటాయి మనకి, ఇంటా బయటా, ఫ్యామిలీ సర్కిల్స్‌లో, ఆఖరికి మన ఇంట్లో కూడా! మరి ఆ ‘పౌలో కోయెలో’ గారికి ఇలాంటి అనుభవాలు లేవనుకుంటాను.

మన అనుభవాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఓ నవల రాసేయొచ్చేమో మన థీమ్‌తో! ఏమంటారు!

Exit mobile version