[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]
సుద్దులు – బుద్ధులు
నాకు గుర్తున్నంతవరవరకూ మనకి, నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండీ వీధరుగు మీద కూర్చోబెట్టి ప్రైవేటు చెప్పిన మాస్టర్లు మొదలుకుని ఇంటిలోని పెద్దల నుంచి, మన డిగ్రీ మాస్టర్ల వరకూ మనకు నిత్యం మంచి మాటలు అంటూ ఎన్నో సుద్దులు చెబుతూ బుద్ధులు గరిపేవారు. క్లాస్ రూమ్ గోడల మీద కూడా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’, ‘దురాశ దుఃఖానికి చేటు’, ‘ఐకమత్యమే బలం’ వంటి కొటేషన్స్ ఉండేవి. ఇంగ్లీష్ మాష్టార్లు ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’, ‘ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్’, ‘నో పెయిన్స్ నో గెయిన్స్’ లాంటి కొటేషన్స్ చెప్పేవారు.
అంతే కాదు, మనింటికి పెదనాన్నలో, చిన్నాన్నలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా “బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుని సంపాదించుకోవాలమ్మా! ఏవో ఆస్తులున్నాయనుకుంటున్నావేమో! అలా అనుకోకు” లాంటి హితబోధలుండేవి (ఆ ఆస్తులు కాస్తా మనం పెరిగి పెద్దయ్యేప్పటికి కరిగిపోతాయని వాళ్ళకి అప్పుడే తెలుసన్నమాట). మనం ఏదో హుషారుకొద్దీ అమ్మానాన్నలకి మాటకు మాట అప్పచెప్పామంటే ఐపోయేది మన పని. వచ్చిన చుట్టాలందరిముందూ ‘మా పిల్ల ముదిరింది, మాటకి మాట తిరగేస్తోంది’ అన్న నేరారోపణ జరిగేది. అప్పుడా బంధువులు మన వంక ముద్దాయిని చూసినట్టు చూసి బస్సు ఎక్కేవరకూ తలంటేవారు సుద్దులతో! నేటి బాలతరం, మనం ఏదైనా ఒకటికి రెండుసార్లు చెప్పగానే “దీన్నేఓసీడీ అంటారని మా మామ్ చెప్పింది” అంటున్నారు నవ్వుల పువ్వులు కురిపిస్తూ.
అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు అధికారం కోల్పోయి, పనిలేక, టైం పాస్ కాక అధికారపక్షం వాళ్ళని ముక్కు గోక్కున్నారనీ, కళ్ళు చికిలించారనీ, నవ్వారనీ ఆరోపణలు చేస్తూ వాళ్ళ చెవుల్లో జోరీగల్లా నీతి వాక్యాలు, బుద్ధులు చెబుతూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. పాలకపక్షంవాళ్ళు మౌనం వహించి, వహించి ఓర్పు నశించి, “మీ హయాంలో మీరేం చేశారో గుర్తులేదా? మీరేమన్నా శుద్ధపూసలా?” అంటూ గత ఐదేళ్ల సంగతులన్నీ సోమిదేవమ్మ చెప్పినట్టుగా మొదలు పెడతారు తప్ప వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. దాంతో వాళ్లకు తిక్కరేగి మరో మాట అనడం ‘మాటకు మాట తెగులు’ అన్నట్టుగా చిలికి చిలికి గాలివాన చేసుకుని ఆనక, ఆయాసం వచ్చి చతికిలపడడం ఇరుపక్షాల వారికీ అలవాటైన కార్యక్రమమే!
కలియుగంలో ముఖ్యంగా మనమున్న ప్రస్తుత పరిస్థితి సుద్దులు, నీతులు లేదా బుద్ధులు చెప్పవలసిన అవసరం అధికంగా ఉన్న కాలం. ‘మానవుడు ఎలా ప్రవర్తించాలి? సమస్యలు రాకుండా ఏ విధంగా క్రమశిక్షణతో జీవించాలి? లోకం తీరు ఇలా ఉంటుంది తెలుసుకోండి’ అని బుద్ధిజీవులు, పెద్దలు క్రాంతదర్శులు శతకాలరూపంలోనూ, సుభాషితాలరూపంలోనూ మనకేనాడో చెప్పిపెట్టారు. అలాంటివి చెబితే ఎవరూ వినే కాలం కాదిది. “ఉపకారికి అపకారం చేయం కానీ అపకారికి మాత్రం అంతకన్నా ఎక్కువ అపకారం చేసి బుద్ధి చెప్పకపోతే బతకలేని కాలం ఇది” అని మన పిల్లలే మనకి చెప్తున్నారు. మనకు కూడా ఇన్నాళ్ళుగా కొత్తతరం ఊహలు అనుభవాలు ఉన్నప్పటికీ పెద్దల్ని ఫాలో అయ్యాం. అయినా ఆట్టే బావున్న దాఖలాలేమీ లేవు అవన్నీ పాటించినందువల్ల మనం లాభం పొందిన ఉదాహరణలూ లేవు. ఏదో దేవుడి మీద భారం వేసి వీలైనంతవరకు అందరితో మంచిగా ఉంటూ బండి లాగేసాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం అవసరమైనంత తెలివిగా బతకలేదేమోనన్న అనుమానం వస్తుంటుంది. అయినా ఇప్పుడు రూటు మార్చి కొత్త ప్రయోగాలు చేసేంత ధైర్యమూ, ఉత్సాహమూ రెండూ లేవు. అందుకే కాస్త అటూ ఇటూగా ఆలోచిస్తూనే పాతదారిలో నడిచేయడం బెటర్ అనుకుంటూ నడిచొచ్చేశాం. ఇప్పుడాలోచిస్తే అపకారికి కూడా ఉపకారం చేసే మనల్ని వెంగళాయిలుగా జమకట్టి ఉండచ్చనిపిస్తోంది. ఇంకా లోతుగా అవలోకిస్తే అపకారం చేయలేని అశక్తులమని కూడా మన చుట్టూ వారు నమ్మకంగా ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తాం.
మన బంధువర్గంలో ఎవరైనా, కుటుంబం పట్లా తల్లితండ్రుల పట్లా బాధ్యత వహించకుండా, స్వార్థంలో మునిగి ‘నేనూ, నా భార్య, పిల్లలు, భార్య పుట్టింటి ఫ్యామిలీ మాత్రమే నాది’ అనుకునేవాళ్లకీ లేదా సమాజ వ్యతిరేక పనులు చేసే వాళ్ళకీ “అబ్బాయీ! నువ్వు కుర్రవాడివి, నీకు తెలియదు నువ్వు చేస్తున్న పనులు బాలేదు. నీకు ఇంకా అనుభవం లేదు. మేము జీవితాన్ని కాచిగూడ పోసాము కాబట్టే నీకు రెండు మాటలు చెప్తున్నాము” అంటూ దాసరిగారి లెవెల్లో బుద్ధులు చెప్తే వినేతరం ఇప్పుడు లేదు. పైగా మనం తప్పు పట్టినందుకు ప్రతిగా వాళ్ళు మనల్ని తప్పు పట్టి దూరంగా నిలబెడతారు ‘ఉల్టా చోర్’ సామెతలా. అందుకే ఎవరూ ఎవరికీ సలహాలు ఇచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం లేదు. “మీ తమ్ముడే కదా! నువ్వు చెప్పొచ్చు కదరా!” అంటే మౌనంగా దణ్ణం పెడుతున్నారు.
మన మిత్రబృందంలో ఎవరైనా కోపిష్టి వాళ్ళుంటే వాళ్ల దగ్గరికి పోయి ‘తన కోపమే తన శత్రువు’ పద్యం చెప్పామంటే వాళ్లతో స్నేహానికి తిలోదకాలు ఇవ్వడానికి సిద్ధపడ్డట్టే! ‘తల్లిదండ్రులను పూజించవలెను’ అన్నామంటే నేటి విద్యార్థులు తల్లిదండ్రులతో తమకు గల భేదాభిప్రాయాల గురించి గంటసేపు లెక్చర్ ఇవ్వగలరు. ‘గురువులను గౌరవించవలెను’ అన్న సూక్తి, రోడ్డు పక్కన ఉన్న అపార్ట్మెంట్లో పెట్టిన ప్రైవేటు స్కూళ్లలో గత్యంతరం లేక అరకొర జీతాలకి పనిచేస్తున్న టీచర్లకి వర్తించదు. సమాజాన్ని సక్రమమార్గంలో పెట్టాలని నడుము కట్టి పనిచేసే కొందరు యాక్టివిస్టులు, టీవీ ఛానళ్లవాళ్లు పిలిచారు కదా అని అత్యుత్సాహంతో లోపలికి వెళ్లి కూర్చుని నీతిబోధలు చేస్తుంటారు. మరికొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి, యువతకి ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలో వివరించి చెప్పి చీపురుకట్ట దెబ్బలు తిని, ఆపై తప్పక క్షమాపణలు చెబుతుంటారు. ఈ పని స్టేట్ పోలీస్ బాస్లు చేసినా ప్రజలనుంచి ఇదే ట్రీట్మెంట్ తీసుకోవల్సిందే! కనుక మన నోటికి వచ్చిన సూక్తిముక్తావళి, మంచిమాటల మూటలు వంటివి ఎంత త్వరగా మరిచిపోతే/మింగేస్తే మన ఒంటికి అంత మంచిది. అందుకే మన పెద్దమ్మలు ముందుచూపుతో “ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు” అనేశారు. హాయిగా వక్కపొడి నోట్లో వేసుకుని కులాసాగా నవ్వుతూ సోఫాలో శయనించి టీవీ చూసుకుంటూ ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకోవడం సదా క్షేమం! ఎవరికైనా!
బద్దెన, వేమన లాంటి అనేక మంది శతకకారులు చెప్పిన సూక్తులు గానీ మార్గదర్శకాలు గానీ స్వయంగా ఎవరికి వారు చదువుకుని తమని తాము సంస్కరించుకుని సరైన మార్గంలో వెళ్లడానికి ఉపయోగపడతాయి. ఈ బుద్ధులు సరిచేసే సూచనలు, మన ప్రవర్తనని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడానికీ అనునిత్యం మరింతగా ఎదగడానికీ మన పూర్వీకులు మన కోసం తయారు చేసి పెట్టిన రెడీమేడ్ టిప్స్ అనుకోవచ్చు. ఎప్పుడైనా కొన్ని మనకు వ్యతిరేక సంఘటనలు జరిగి మనసు వ్యాకులత చెంది ఏం చెయ్యాలో పాలుపోనప్పుడు ఈ పద్యాలన్నీ మననం చేసుకోవడం వల్ల మనకి ఎంతో ఉపశాంతి లభిస్తుంది. మనల్ని మనం చెక్ చేసుకోవడానికీ, లోకపుతీరును మరింత సులభంగా అంచనా వేయడానికీ ఇవి అత్యవసరం. అయితే ఇవన్నీ ఎదుటి మనిషికి చెప్పేటందుకు కాదనీ అలా చెప్ప ప్రయత్నిస్తే ఏమవుతుందో “తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు” అన్న భర్తృహరి సుభాషితం మనం బట్టీ కొట్టాం కదా! అది గుర్తుచేసుకుందాం! బుద్ధిగా (వీపులు పగలకుండా) మసలుకుందాం!!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, రెండు కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
