Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 67: సోలో డేటింగ్

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

సోలో డేటింగ్

సోలో డేటింగ్ అంటే మనతో మనం చేసే అందమైన ప్రయాణం. మనతో మనం గడపటం, మనల్ని మనం తెలుసుకోవడం అనేది మనోహరమైన భావన. ఇది స్వీయానుబంధం. ఒంటరిగా సినిమా చూడడం, పార్క్‌కి వెళ్ళడం, హోటల్‌కి వెళ్లి లంచ్ చేయడం లాంటివి. ఏదైనా మంచి పుస్తకం గార్డెన్‌లో గానీ,  మేడపై గానీ కూర్చుని చదవడం కూడా! ఇంట్లో వాళ్ళు ఏ విధంగానూ ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా మనసుకు నచ్చిన పనులన్నమాట. సాధారణంగా మనకున్న బాధ్యతలు, ఒత్తిడి మధ్య మనల్ని మనం మర్చిపోతుంటాం. ఇలా డేటింగ్‌కి వెళ్లడం వల్ల మన ఆలోచనలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం తద్వారా స్వీయప్రేమ పెరిగి  మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

సోలో డేటింగ్ అంటూ ఆడవాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటే, ఇల్లు అమాంతం మనల్ని దినసరి కూలీగా మార్చేస్తుంది. వస్తువులన్నీ మన చుట్టూ చేరి సర్దమని వెంటపడతాయి. ఇల్లు అందంగా ఉంటుంది అన్న ఆశ కల్పించి, మనల్ని వశం చేసుకొని మన వంటిని హూనం చేస్తాయా వస్తువులు. దాంతో అలసట పెరిగి ఉన్న బుర్ర కూడా పనిచేయడం మానేసి, టీవీకి అడ్డం పడి, ఏ పిచ్చి సినిమా బారినో పడి సమయం మరింత వృథా అవుతుంది తప్ప, మనసుకు ఉత్సాహం, తేలికతనం, ధైర్యం రావు సరికదా ఇంకొంచెం ముడుచుకుపోతాం లోలోపలికి ఆ టీవీ దయ వల్ల.

సోలో డేటింగ్‌లో మన సమక్షంలో మనమే ఉంటాం. అప్పుడు మనసు పొరల్లోని దుఃఖాలు, ఆవేదనలు, సంతృప్తులు, సంతోషాలు అన్నిటిని ఒకసారి తడిమి చూసుకోవచ్చు. మన ఆనందం కోసం ఇతరులను సంతోషపెట్టి తిరిగి దాన్ని రాబట్టుకోవడం అనేది గ్యారంటీ లేని ప్రాజెక్ట్. ఇది అలాంటిది కాదు. కాఫీ కప్పు తీసుకొని వరండాలో తిరగండి. ఏమైనా కవితల్లాంటివి, అనుభూతుల్లాంటివి మనసుకు తోస్తే కాగితంపై రాసుకోండి. అందుకోసం మీరు కవి కానక్కర్లేదు. ఆ రాతలు మీలోని స్ట్రెస్‌ని తగ్గించి, స్వయం విశ్వాసాన్ని  పెంచుతాయి. నచ్చిన పాత పుస్తకం ఎటువంటి ఆటంకం లేకుండా మళ్ళీ చదువుకోండి. మనసు కోరిన పాటలు టీవీలో చూసుకోండి, మొబైల్‌లో వినండి. అప్పుడు ఒక గొప్ప అనుభూతి మిగులుతుంది. అతి ఆలోచనలు, వన్ సైడ్ కోపాలు తగ్గిపోయి ఎమోషనల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మనమే ఒక అద్భుతమైన దేవుని క్రియేషన్!

ఇంకో ఐడియా! మనం ఎంత కాలంగానో చూడదలుచుకున్న ముఖ్యమైన ప్రదేశాలకి ఒంటరిగా వెళ్లడం మంచిది. ఒక పెద్ద బృందంతో గానీ, బంధువులతో గానీ వెళితే అక్కడ ఆ ప్రదేశాల్ని కానీ, ఆ కట్టడాలను కానీ నిశితంగా పరిశీలించడానికి వీలు కాదు. అక్కడ అందరూ కలిసి నవ్వుకుంటూ, జోకులేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతాం. ఒకరికొకరు ఫొటోలు తీసుకుంటూ ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకతను పూర్తిగా ఆస్వాదించలేం. మనం భావుకులమైతే ఒంటరిగా అక్కడ వాటిని చూడడం వల్ల కలిగే తాదాత్మ్యం, థ్రిల్ పోగొట్టుకుంటాం. ఒకసారి నేను ఢిల్లీలో బయలుదేరి ఒక ట్రావెల్ బస్సులో ఆగ్రా వెళ్ళాను. యమునా నది ఒడ్డున ఉన్న ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ముందు నిలబడ్డాను. ఆ పాలరాతి మందిరం అందానికి, వైభవానికి ఆశ్చర్యంతో, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి ఐపోయాను. తట్టుకోలేక ఏడ్చేసాను. చాలా సేపటికి తెప్పరిల్లాను. మరికొంతమందితో కలిసి వెళ్లి ఉంటే ఆ సంభ్రమాన్ని మిస్ ఐపోయేదాన్నే! అలాగే హంపి విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రాణుల నివాసమహల్స్ ఒంటరిగా చూస్తుంటే ఎప్పుడో అక్కడికి వచ్చినట్టు, ఆ రాణుల మనోభావాలు నాకు  తెలిసినట్టు అనిపించింది. మరో రాణీ మహల్‌కి వెళ్ళినప్పుడు, మరింత  మమేకమై పోయి నేనే ఏదో జన్మలో ఇక్కడ బతికిన రాణినేమో! అన్న ఫీల్ కూడా వచ్చేసింది. అదో తియ్యని అనుభవం.

ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం మనోవికాసానికి రహదారి. సోలో డేటింగ్‌లో మనతో మనం విలువైన సమయాన్ని గడపొచ్చు. ఇది మనకి మనపై గౌరవాన్ని పెంచుతుంది. ప్రతి చిన్న సంఘటనకీ తత్తరపడకుండా నిదానంగా నిర్ణయం తీసుకోగలుగుతాం. సమస్యకి మూలాన్ని, పరిష్కారాన్ని కనుక్కునే దిశగా మనసు దారితీస్తుంది. ఏదో తెలియని ఒత్తిడి నుండి విముక్తులం అవుతాం. ఎవరి ప్రెషర్ లేకుండా, మొహమాటం లేకుండా మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే మనసు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. మనల్ని మనం పరిశీలించుకుని మన ప్రవర్తనలోని తప్పొప్పుల్ని బేరీజు వేసుకోవడానికి ఏకాంతం మంచి మార్గం. మనం ఎక్కడ ఇంకొంచెం బాగా నడుచుకోవాల్సిందీ అన్నది అర్థమవుతుంది. మనల్ని మనం ఉన్నతీకరించుకోవచ్చు. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎమోషనల్‌గా ఎవరి ముందో బయటపడి వారి సానుభూతిని కోరవలసిన ఆవశ్యకత తగ్గుతుంది. అసలు క్లిష్ట పరిస్థితుల్లో  నిమ్మళంగా కూర్చుని ఆలోచించుకుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం మనకే తెలిసిపోతుంది.

మన చుట్టూ ఉన్న లెక్కలేనంత మందితో మనం ప్రేమభావనతో ఉంటూ మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం.అలా చేయడం వల్ల చాలా నష్టపోతాం. మీరొక అపురూపమైన వ్యక్తి. ఇప్పుడైనా మీ ఘనతను   గుర్తించండి. లేకపోతే జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణాలు, మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప మనిషిని  మిస్ అవుతారు. మీరు నాలుగు వైపులా ఉన్న నలుగురి లోని గొప్పతనాన్ని గుర్తిస్తూ అభిమానిస్తూ ఉంటారు.అది కాస్త పక్కన పెట్టి, మన విశిష్టతను గమనించి మనల్ని మనం అభిమానించుకుందాం. చిన్నప్పటినుండీ  ఎదుగుతూ వచ్చిన క్రమంలో ఎన్ని మంచి లక్షణాలను అలవర్చుకున్నామో అది ఎదుటివారికి ఎంత కంఫర్ట్ ఇచ్చిందో గుర్తుచేసుకుందాం. మన గురించి నాలుగు మంచి మాటలు  మిత్రులు చెప్పినప్పుడు  మొహమాట పడకుండా విని గర్వపడదాం.

ఆత్మస్థైర్యం పెరగడానికి మనల్ని మనం బేరీజు వేసుకోవడానికి ఏకాంతం ఉపయోగపడుతుంది. మనల్ని మనం అభిమానించుకుంటూ ఉండాలి. ఇప్పటివరకూ మన కోరికలనన్నిటినీ త్యాగం చేసి, పక్కకు పెట్టి నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యం చేసాం. మన ఇష్టానికి గుర్తింపు ఇచ్చుకుంటూ ఇకనైనా మన ప్రవర్తనను దిద్దుకుందాం! చలో! పదండి! మనతో మనం డేటింగ్ చేద్దాం. ఎదమరిగే సొదలేవో విప్పుకుని చూసుకుందాం. ఆ సంతృప్తితో తిరిగి వచ్చాక మన బంధుమిత్రగణానంతా మరింత ప్రేమిద్దాం!

మనకంటే పెద్దవాళ్ళు ఎవరో కనబడి, “చిన్నప్పుడు ఆ స్వీట్  చాలా ఇష్టంగా తినేదానివి, ఇప్పుడు తింటున్నావా?” అన్నప్పుడు మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఆ విషయం మనం మర్చిపోయుంటాం. ఎంత సేపూ ఈ వంట చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుందా? అనేదే ఆలోచిస్తూ ఉంటాం గానీ వాళ్ళెవరికీ ఇష్టం లేకపోయినా, నాకిష్టమైనది కూడా ఒకటి చేసుకోవచ్చు కదా అని ఆలోచన రాదెప్పుడూ! అలాగే మన కుటుంబాల్లో మగవాళ్ళు  పండగలకి అందరికీ బట్టలు కొని వాళ్ళకోసం వాళ్ళు కొనుక్కోరు, ఎవరో బలవంతం చేస్తే తప్ప. వాళ్ళు కూడా అప్పుడప్పుడూ వెతికి వెతికి మంచి బట్టలు కొనుక్కోవాలి, అది జీవితానందాన్ని  పెంచుకునే మార్గం కూడా!

చిన్నప్పటినుంచీ మనం పుట్టి పెరిగిన ఫ్యామిలీతో ఉంటాం. తర్వాత మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది, ఈ బంధాలతోనే మునిగి తేలుతూ ఉంటాం. అప్పుడప్పుడూ ఇలా మనం మనతో గడపాలి. మనల్ని మనం ముద్దు చేసుకోవాలి. గెస్ట్‌గా భావించి మర్యాద చూపించాలి. Self-care is not selfishness. అలాగే మన ఆరోగ్యాన్ని మనమే పట్టించుకోవాలి. మన ఆత్మసంతృప్తి కోసం మనలోకి మనం చూసుకుంటూ ఉండాలి. ఏకాంతంగా ఉన్నాం కదా అని ఆత్మ పరిశీలన – అంతర్వాణి అంటూ ఆదర్శాలకు పోయి, గాంధీగారిలా మరో చెంప చూపే  పనులు చేస్తే ఎదుటివాడు మనలో తప్పు ఉందని నిర్ధారించుకోగలడు. సున్నితత్వం పాళ్లు ఎక్కువై మనల్ని ఎవరైనా ఓ మాట అన్నా మనమే బాధపడి, తిరిగి జవాబు ఇచ్చినందుకు కూడా మనమే బాధపడే పిచ్చివాళ్ళం అయ్యాం ఇంతవరకూ! ఇక చాలు. సకారణంగానే రిప్లై లేదా రిటార్ట్ ఇచ్చామని నిబ్బరంగా ఉందాం. అతిగా ఆలోచించి వివరణ ఇచ్చేపని పెట్టుకుంటే మన ఆత్మవిశ్వాసం కాస్తా పోగలదు జాగ్రత్త! మన ఆత్మగౌరవం నిలుపుకునే బాధ్యత కూడా మనదే, మర్చిపోవద్దు!

Exit mobile version