Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 69: అమ్మంటే అంతులేని సొమ్మా?

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

అమ్మంటే అంతులేని సొమ్మా?

ఆలయాన దేవుని రీతి, ఇంటికి ఇల్లాలే జ్యోతి అంటూ పాటలు పాడి అమ్మను ఇంటికి కట్టు బానిసను చేసి ఆమె సేవల్ని సంపూర్ణంగా దోచుకుంది మానవజాతి. అమ్మ అందరికీ తరగని భాగ్యమే! అమ్మకి ఎవరు భాగ్యం? భర్త అనడం అర్ధసత్యమే! మరి ఎవరు కావాలి పూర్తి భాగ్యం? పిల్లలు కావాలి. మరి వాళ్ళు ఎంతవరకు అవుతున్నారు? అన్న మౌలిక ప్రశ్న వేసుకుంటే జవాబు నిరాశ పరుస్తుంది. నేటి సమాజంలో మానవ సంబంధాలు ఎంత స్వార్థపూరితంగా ఉన్నాయో, మనుషులు సొంతలాభం కోసమే ఎలా బతుకుతున్నారో గమనిస్తే దాని ప్రతిబింబం కుటుంబ బంధాల్లో కూడా కనబడుతుంది. అమ్మాయిలకి పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టి, వాళ్ళు కాస్త పెద్దయ్యి చదువుకునేటప్పుడు సెలవులకు వాళ్ళని తీసుకుని అమ్మానాన్నల దగ్గరికి అంటే పుట్టింటికి వెళ్లి వేసవికాలం అంతా గడపటం వచ్చేప్పుడు ఆవకాయలు, స్వీట్లు, హాట్లు, వడియాలు వంటివి తెచ్చుకోవడం అలవాటవుతుంది. అది అందరికీ సంతోషాన్నిచ్చే పనే! అలా ఓ పది పదిహేనేళ్ళు గడిచేసరికి తల్లులు అరవయ్యోపడిలో పడి బీపీ, షుగర్, కొలెస్టరాల్ బారిన పడుతుంటారు. ఇంకా నడుము, మోకాళ్ళ నెప్పులు ప్రారంభం అవుతాయి. అనేకానేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వారిని చుట్టుముడుతుంటాయి. ఆడపిల్లలు ఈ విషయాన్ని గుర్తించరు. వాళ్లు నలభైలు దాటుతున్నా అలాగే తల్లి దగ్గరికి వెళ్లి సుఖపడాలనుకుంటారు. కొందరు తల్లులకి సహాయకారిగా ఉంటూ వారికి చేదోడువాదోడుగా ఉంటారు. అప్పుడు ఆ తల్లులకు శ్రమ అనిపించదు. కానీ అటువంటి సానుభూతిగల అమ్మాయిలని భూతద్దం పెట్టుకుని వెతకాల్సిందే!

తండ్రులు కూడా కూతుళ్ళకి చెప్పరు. ‘అమ్మకి ఇప్పుడు శక్తి తగ్గిపోయింది, ఇన్ని రోజులూ చేసింది కానీ ఇంక చేయలేదు, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి.లేదంటే ఇక్కడికి వచ్చి మీరే అన్నీ తయారు చేసుకోండి, అమ్మ మీకు సలహాలు మాత్రం ఇవ్వగలదు’ అని చెప్పడం మానేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చి ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. శలవులుంటే కొడుకులు, కోడళ్ళు కూడా ఊళ్లు తిరుగుతూ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లిళ్లు చేసినప్పుడూ, మనవలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడూ తల్లులు చిన్నవయసులో ఉంటారు కాబట్టి వారికి అన్నీ అమర్చి పెడతారు. పొద్దు వాటారినట్టు వారికి ఓపిక సన్నగిల్లుతూ ఉంటుంది. అది ఎవరూ గమనించరు భర్తతో సహా! ఎనభై ఏళ్ళు పైబడుతున్నా కూడా మాతృ హృదయం పిల్లల కోసం రకరకాల వంటలు చేయడానికి వెనుదీయదు. ఈ బలహీనతని కుటుంబం మొత్తం శ్రమ దోపిడీ చేస్తుంది. ఈ కాలంలో అమ్మాయిలు ముఖ్యంగా పెద్ద చదువులు చదివి లక్షల సంపాదిస్తూ మగపిల్లల్లాగే మృదుత్వం కోల్పోయి తమ ఉద్యోగం, సంపాదనా తప్ప మిగిలిన విషయాల్ని పట్టించుకోకుండా తయారవుతున్నారు. ఈ వర్కింగ్ జంటలు తాము మాత్రం వారాంతంలో హోటళ్లను పావనం చేస్తూ రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు. ఇక కోడళ్ళు అత్తగారింట్లో ఉంటే ఆవిడకి సాయం చేయవలసి వస్తుందేమో అని తల్లిగారింట్లో తిష్ట వేస్తూ ఉంటారు.

ఈ రోజుల్లో అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారంటే తల్లిదండ్రులకు వెన్నులోంచి వణుకు పుడుతోందంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే వాళ్ళున్న ఒక్క నెలా తల్లిదండ్రులకు కూలిపని తప్పదు. వాళ్ళు తిరిగి వెళ్ళాక వీళ్లిద్దరూ సెలైన్లు ఎక్కించుకోవాల్సిందే. ఈ సంగతంతా అందరికీ తెలుసు. నోటితో దొంగ సానుభూతి మాటలు చెప్పి, పనులు చేయించుకుని ఫ్లైట్ ఎక్కి తుర్రుమంటారు సంతానం. వృద్ధులయ్యి శారీరకంగా బలహీనులైన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, గౌరవం ఉండాలి. వారికి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. అవన్నీ సున్నా వీళ్ళకి. మళ్లీ వీళ్ళే ఇండియా వారితో మాట్లాడే ఫోన్ కార్డు ఒకటి వేసుకుని రోజూ తీరికగా గంటలు, గంటలు తీపి మాటలు చెబుతుంటారు. ఖర్చూ, శ్రమా లేనివి కదా కబుర్లు!

అమెరికా నుంచి వచ్చిన సంతానం తల్లిదండ్రుల దగ్గర దిగి మర్నాటి నుంచీ షాపింగులకూ, బంధుమిత్రుల ఇళ్లకూ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో తల్లులు అప్పాలనీ, గారెలనీ, ఆవడలనీ, చట్నీలనీ ఏవేవో చేసేస్తూ స్పెషల్ వంటల కోసం వంట మనుషుల సాయం తీసుకుంటూ, ఓ.ఆర్.ఎస్.లు తాగుతూ నానా హైరానా పడిపోతుంటారు. వీళ్ళసలు తినడానికి ఏ పూట వస్తారో, ఏ పూట రారో కూడా చెప్పరు. ఆ వండినవన్నీ ఏం చేయాలో తెలీక ఫ్రిజ్‌లు నిండిపోయినప్పుడు తల్లుల బాధ వర్ణనాతీతం. విదేశాలనుంచి వచ్చిన తమ పిల్లలతో, మనవలతో కలిసి గడపాలనీ,వాళ్ళు ఇల్లంతా తిరుగుతూ భోజనాలు చేస్తూ, కబుర్లు చెప్తూ ఉంటే మురిసిపోదామనీ అనుకున్న తల్లిదండ్రుల ఆశలు వమ్మవుతాయి. అంత దూరం నుంచి వచ్చినపుడు తల్లిదండ్రుల పక్కనే కూర్చుని, కబుర్లు చెబుతూ వాళ్ళకు ఆనందం కలిగించాలని ఈ ఎన్నారై పిల్లలు ఎందుకనుకోరో తెలియదు. తమ డాలర్ల సమయాన్ని బాగా వాడుకోవాలి అనుకుంటారేమో!

తల్లి పేరున ఉన్న పుట్టింటి ఆస్తుల కోసం, ఆవిడ బంగారం కోసం పోటీపడే అమ్మాయిలు తల్లి ఆరోగ్య పరిస్థితి, ఆమె మానసిక పరిస్థితి, తండ్రి అనారోగ్యం పట్ల ఆమెకు ఉండే బెంగలు, ఇన్‌సెక్యూరిటీస్ గురించి ఎన్నడైనా ఆలోచిస్తారా? ఆమెను దగ్గరకి తీసుకుని ధైర్యమిస్తారా? పుట్టింట్లో కూర్చుని “మా ఆయనకు నువ్వు చేసే బిర్యాని ఇష్టం! మా పెద్దమ్మాయికి నువ్వు చేసే బొబ్బట్లు ఇష్టం!” అంటూ ఆవిడ రెక్కలు ముక్కలు చేయించి ఆవిడ చేత వండించుకుని భర్తకీ, పిల్లలకీ పెట్టుకునే క్రూరులు నేటితరం అమ్మాయిలు. తమ ఇళ్లకు తీసుకెళ్లి కూడా ‘అమ్మా! అది చేయవే! నాకు రాదు. ఇది చేయవే! నాకు కుదరడం లేదు (వీళ్ళకి ఈ జన్మలో రాదు. అసలు ట్రై చేస్తే కదా!) నువ్వు బాగా చేస్తావ్” అంటూ తల్లికి వంటిల్లు అప్పచెప్పి టీవీ ముందు కూర్చునే స్వార్థపరులు వీళ్ళు. ‘మా ఇంటి కొచ్చినా నువ్వే వంట చెయ్యి! మీ ఇంటికొచ్చినా నువ్వే వంట చెయ్యి! కూర్చుని తింటాం !’ అనే కృతఘ్నులు వీళ్ళు.

యాభై తులాల బంగారం పెట్టినా ఆఖర్న తల్లి పోయినప్పుడు ఆవిడ వంటి మీద ఉన్న బంగారం కోసం ఏడ్చి (తల్లి పోయిందన్న ఏడుపులో కలిపేసి) అందుకోసం కంసాలింటికి పరిగెత్తుకెళ్లి (వాటాలో తేడా రాకూడదని) పంచుకునే పుత్రికలున్నారు నేటి లోకంలో. అలా ఏడ్చి తెచ్చుకున్న నాలుగు తులాల బంగారం, అప్పుడే పుట్టిన మనవరాలు ఎగరేసుకుపోతే నోరు మూసుకుంటారు, ఇంకొకళ్ళతో చెప్పుకోలేరు. ఈ తతంగం అంతా చూసి రేపు మన కూతుళ్లు కూడా ఇలాగే తయారవుతారన్న జ్ఞానం ఉండదు వీళ్ళకి. కాలం కలిసి రాక తల్లి ఒంటరిదైపోతే కూతుళ్ళ, కోడళ్ళ పంట పండినట్టే ! అపుడా తల్లులు ఇంకా వినయంతో, ప్రేమతో మరి కాస్త మమేకమైపోయి, సేవాభావంలో మదర్ థెరిసాను మించిపోయి పిల్లల ఇళ్లలో సహాయకులుగా ఉంటూ ఒళ్ళు గుల్ల చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ చాకిరీని హక్కుగా భావిస్తూ మనవలతో సహా ఎవరూ కనీసం గుర్తించను కూడా గుర్తించరు.

ఓకే సిటీలో పిల్లలంతా ఉంటే, మదర్స్ డే రోజు అందరూ తల్లి ఉండే చోటికి చేరతారు. ఒక చిన్న గిఫ్ట్ ఆమె కిచ్చి అన్నీ చేయించుకుని తిని, గ్రూప్ ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుని పారిపోయే నిర్దయులైన కూతుళ్లు, కొడుకులు ఉండే కలికాలం ఇది. ఇవన్నీ కఠిన సత్యాలైనా, ప్రేమమూర్తులైన అమ్మలు ‘నా కూతుర్లు, కొడుకులు మంచివాళ్లే! మీరు ఎవరు గురించి చెబుతున్నారో ఏమిటో!’ అని సరిపుచ్చుకుని అటు తిరిగి పడుకుంటారు. ఈ అమ్మలకు అదృష్టం పండి సహృదయురాలైన కోడలు వస్తే ఆ తల్లులు సుఖపడతారు. లేదంటే కొడుకు మాత్రం ఏమీ చేయలేడు. అతను నిమిత్తమాత్రుడు. అతనికి అతనిల్లు ప్రశాంతంగా ఉండడం, తనకి వేళకి తిండీ, నీళ్ళూ దొరకడం ముఖ్యం. ఇవాళ మన తల్లితండ్రుల్ని ప్రేమగా, దయగా చూసుకుంటే రేపు మన పిల్లలు అది గుర్తుపెట్టుకుని మనల్ని చూసుకుంటారు. లేదంటే ‘నువ్వు మీ పేరెంట్స్‌ని ఇలాగే చూసావు కాబట్టి నేను మిమ్మల్ని ఇలాగే చూస్తాను!’ అంటే అప్పుడు ఈనాటి యువత రేపటి పెద్దతరం చేసేదేమీ లేదుగా!

“అమ్మా! మేము ఈ వేసవిలో వచ్చి ఒక వారం రోజులుంటాం. నువ్వేమీ టెన్షన్ పడకు. టిఫిన్లు, వంటలు అన్నీ నేను చూసుకుంటాను. నువ్వూ, నాన్నా పిల్లలతో ఆడుకోవడం మాత్రమే మీ పని. నీ చీరలు చూసుకో! పాతవన్నీ ఎవరికైనా ఇచ్చెయ్యి. అంతా కలిసి షాపింగ్‌కి వెళ్లి నీకు చీరలు కొందాం. అట్నుంచి అటే వెళ్ళి హోటల్‌లో లంచ్ చేసి వద్దాం! ఇంకో రోజు అమ్మవారి గుడికి వెళ్దాం! మన ఊరి చుట్టుపక్కల ఎవరైనా పచ్చళ్ళు, వడియాలు, కారంపొడులు లాంటివి అమ్మే వాళ్ళుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఉంచు. మనిద్దరం కావలసినవి ఆర్డర్ చేసుకుందాం. ఇదే ప్రోగ్రాం. నువ్వు నిమ్మళంగా ఉండు. హడావిడి పడకు.” ఇలా అరవై పైబడ్డ తల్లులతో అనగలిగిన వాళ్లే నిజమైన కూతుళ్లు, కోడళ్ళు! వీళ్ళ మనసులు కూడా అమ్మకు మల్లే అమృతం చిందించగలగాలి. ఇంటా బయటా ఎన్నో పనులు చక్కబెట్టుకుని శభాష్ అనిపించుకుంటున్న నేటి అమ్మాయిలు పనిలో పనిగా తల్లితండ్రుల, అత్తామావల బాగోగులు చూస్తూ, కాస్త వారి సేవ చేసుకుంటే అమ్మలు, అత్తలు శారీరకంగా, మానసికంగా కృంగిపోకుండా వారితో మరో నాలుగేళ్ళు ఉండి వాళ్ళని భాగ్యవంతుల్ని చేస్తూ దీవిస్తుంటారు.

అమ్మ ఇల్లు మనకి రెస్ట్ హౌస్ అనుకున్నప్పుడు మరి మనిల్లు అమ్మకి రెస్ట్ హౌస్ కావద్దా? అని అమ్మాయిలు ఆలోచించాలి. తలచుకుంటే కూతుళ్లు, కోడళ్ళు మాత్రమే అమ్మలకు తిరిగి అమ్మలు కాగలరు. ప్రతి అమ్మాయీ అటువంటి ప్రేమతో నిండిన మనసుతో, బాధ్యత కలిగిన కూతురు కానీ కోడలు కానీ కావాలని ఆశిద్దాం!!

Exit mobile version