[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]
కభీ కభీ ఆతా హై ఖయాల్
మనసు అనేది ఒక మాయా దర్పణం. అది నిరంతరం మన మస్తిష్కంలో ఒక పక్క సర్దుకుని కూర్చుంటుంది. దర్పణం తెరగా మన గతం రీల్స్ అందులో తిరుగుతూ ఉంటాయి. మనం బిజీ అయినప్పుడు ఆ దర్పణం మూతపడుతుంది. కాస్త తీరిక చిక్కి, సోఫాలో వాలగానే షో స్టార్ట్ అవుతుంది. దీని నిడివిలో ఈరోజు నుంచి వెనక్కి వెళుతూ మనకి ఊహ తెలిసిన ఐదారు సంవత్సరాల నుంచి జరిగిన సంగతులు చుట్టలు చుట్టుకుని ఉంటాయి. పాత జ్ఞాపకాల గుట్టలు నిత్యనూతనాలు, అవి తరగవు. ఒక పక్క మనం నెమరువేస్తుంటే అవి మరోపక్క మేటలు వేస్తుంటాయి. హృదయపు గోడల నిండా జ్ఞాపకాల మీటలు. సైకియాట్రిస్టులు సెలవిస్తుంటారు. మధుర జ్ఞాపకాలనే మననం చేయండి, చేదుగురుతులను చేరనివ్వకండని. మీట నొక్కే పని మన చేతిలో ఉందా? ఎప్పుడు, ఏ తలపు, ఏ పిలుపు, ఏ ఆర్తి, ఏ స్ఫూర్తి గతం కాలింగ్ బెల్ నొక్కి ఏ అనుభవాల తలుపులు తీయిస్తుందో!
ఈ గతం తాలూకు కెరటాల తాకిడి మనల్ని ఒకోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందులో విరుద్ధ భావాలుంటాయి. గతంలో మనం కొందరి చేతిలో మోసపోయి లేదా అన్యాయానికి గురికాబడి ఉంటాం. దానికి కారణం ఎవరో వారిని తలుచుకుని కలత పడుతుంటాం. అలాగే మన ఉన్నతికి దోహదం చేసిన అనేకమంది ఉంటారు. వారి తక్షణ సహాయం మనల్ని గట్టెక్కించి ఉంటుంది. అలాంటివి గుర్తొచ్చినప్పుడు మన మనసు అప్రయత్నంగా కృతజ్ఞతతో నిండిపోతుంది. ఎన్నో మెట్లెక్కి ఇక్కడి వరకూ వచ్చాం. ఎక్కేప్పుడు ఎన్నో ఇక్కట్లు పడి ఉంటాం కదా! అవి గుర్తొస్తుంటాయి. ఒక్కోసారి ఈ ఆలోచనలలో తీపి, చేదు మిళితమై ఉంటాయి. బాధ కలిగించే ఆలోచనా బీజాలు లోతుగా మొలకెత్తుతాయి. ఆహ్లాదం కలిగించిన బీజాలు పైపైనే మొలకెత్తుతుంటాయి. కాబట్టి బాధపడిన సందర్భాలు ఎక్కువగా మదిలో మెదులుతుంటాయి. పై వాటిని లోతుగాను, లోతుగా ఉన్న వాటిని పై పై గానూ మార్చే సాఫ్ట్‌వేర్ ఏదైనా ఉంటే బాగుండును.
మన పూర్వ జీవితంలోని మంచి చెడులకు సంబంధించిన అనుభూతులు ఉగాది పచ్చడిలా తియ్యగా అనిపిస్తూనే పంటి కింద పడిన వేప పువ్వులా చేదు అనుభవాలు కూడా స్మృతిలోకి వచ్చి పోతుంటాయి.ఏ అనుభూతులూ లేని మనిషి ఒక రోబో అవుతాడు. ఎన్నో నొప్పి కలిగించే అనుభవాలున్న మన గతమే మన బలం, మనోధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్! గ్రామాల్లో పుట్టి పెరిగిన మనందరికీ మన ఊరి జ్ఞాపకం ప్రతిరోజూ ఆఖరికి రాత్రి నిద్రపోయేటప్పుడైనా వచ్చి తీరుతుంది. ‘ఒక్కసారి మా ఊరు పోయి రావాలి’ అనే కోరిక, తపన నిరంతరం హృదయపు గోడలపై శాశ్వతమైన వన్నె తరగని వాల్ పోస్టర్!
మన తల్లిదండ్రుల జ్ఞాపకాలు మన అణువణువులో ఉంటాయి. మన శరీరం పోలికల్లో, అలవాట్లలో, భావాల్లో, కుటుంబ బంధాల్లో వారు మనలో జీవిస్తుంటారు. వారు ఎక్కడికీ వెళ్లరు. మనలోనే మమేకమై ఉంటారు. ఉదయం లేస్తూనే రేడియో భక్తిరంజనిలో వచ్చే అమ్మ పాడుకునే లక్ష్మీస్తోత్రం అమ్మను తలపిస్తుంది. ఆ వెంటనే అమ్మ కానీ, నాన్న కానీ కోరిన ఒక చిన్న కోరికేదో తీర్చలేకపోయామన్న సంగతి గుర్తొస్తుంది. మనసంతా దుఃఖపు వరదలో మునుగుతున్నట్లుగా అవుతుంది. నిస్తేజంగా అనిపిస్తుంది. మరుక్షణమే తక్షణ కర్తవ్యం ఏదో మనల్ని ఆ వరద నుంచి పక్కకు లాగుతుంది. పనిలో పడిపోతాం.
ఎవరో పెట్టిన బాల్యపు గుర్తుల వీడియోతో పాటు మన బాల్యం కూడా రంగులరాట్నం తిరిగి మన మనసుని ఆనందంలో ముంచుతుంది. చిన్నప్పుడు తీర్థంలో తిన్న ఖర్జూరపళ్ళ తీపి మన మనసును అంటుకుని పెదాలపై మాధుర్యాన్ని పూసి వెళుతుంది. ప్రతిరోజూ యోగా మాస్టారు వెళ్లిపోయేటప్పుదు ‘నిత్యం ఓ నలుగురికి కృతజ్ఞతలు చెప్పండి’ అని చెప్తూ ఉంటాడు. అలా చెబుతుంటే క్రమంగా మనలో ఉన్న నకారాత్మక భావనలు పోయి సకారాత్మక ఆలోచనలు స్థిర నివాసంగా ఉండిపోతాయట. మన బుర్రలో ఆ రెండూ కలగలిసి పోయి ఉన్నప్పుడు విడదీయడం వీలవుతుందా?
మన తలలో నిక్షిప్తమైన అనుభవాల అనుభూతులు, మనకి ఏకాంతం దొరికినప్పుడు క్లోజ్ అప్ లోకి వచ్చేస్తాయి, మనల్ని అటూ ఇటూ జరగకుండా కట్టిపడేస్తాయి. ఆల్బమ్ చూడవలసిన అవసరం లేకుండా అన్నీ కళ్ళముందు కనబడుతూ ఉంటాయి. మనకి స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు నాన్న వీధి అరుగు మీద నిలబడి గర్వంగా అందరికీ గొప్ప చెప్పుకోవడం, అమ్మ మనం పని చేసే ఆఫీస్ పేరు తప్పు చెప్పాక వెనక నుంచి మనం విన్నామని తెలిసి సిగ్గుపడిన క్షణంలో అమ్మ మనకి మూడేళ్ల పాపల్లే తోచడం లాంటి మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవం. మన వివాహమైన మండపం పక్క నుంచి వెళ్ళినప్పుడు మన పెళ్లికి వేసిన పందిళ్లు, పచ్చి కొబ్బరాకుల వాసన, మొహమంతా పాకిన పసుపుకుంకాల సౌరభం గుర్తు రావడం చిత్రమైన అనుభూతి.
కొన్ని స్మృతులు హ్యాపీ హార్మోన్స్‌ను రిలీజ్ చేస్తే కొన్ని దిగులు హార్మోన్స్ కూడా విడుదల చేస్తాయి. పేపర్లో ఒక న్యూస్ లేదా ఒక మూవీలో ఓ డైలాగ్ మనల్ని జ్ఞాపకాల మబ్బుల్లోకి లాక్కెళుడుతుంది. అప్పుడక్కడ మనం కొంతసేపు చల్లని గాలిలో షికారు చేసి వస్తుంటాం. ఒకోసారి మనకి అత్యంత ఆప్తులైన వారి తలపులు గుర్తుకొచ్చి మైమరిచిపోయి పక్క వాళ్ళు పిలిస్తే కూడా పలకము. అప్పుడెవరో “ఆవిడ రచయిత్రి కదా! ఎప్పుడూ ఏదో ఖయాల్లో ఉంటుంది, కొత్త కథ కోసమో, కొత్త నవల కోసమో!” అంటూ వెక్కిరిస్తారు కూడా! ఈ ఆలోచనల్లో మునిగే పని ప్రతి ఒక్కరూ చేసేదే! దానికి రచయిత కానక్కర్లేదు.
ఎవరో ఒక వ్యక్తిని గాని, ఒక పరిసరాన్ని గాని గుర్తుచేసేట్టు మన ఆలోచనలు, జ్ఞాపకాలు ఉంటాయి. కొండొకచో భవిష్యత్తుపై ఆశలు లేదా కాసిని భయాలు కూడా ఉంటాయి. మన వ్యక్తిత్వాన్ని గౌరవించి మన ప్రవర్తనని ప్రేమించి అభిమానించిన స్నేహితుడో, స్నేహితురాలో గుర్తొచ్చినప్పుడు మనసంతా ఒక సుగంధ పరిమళం అలముకుంటుంది. ఇప్పుడా వ్యక్తి ఆచూకీ పై కూడా మనకు ఆసక్తి ఉండదు కానీ ఆనాటి స్నేహర్ద్రపు భావన వన్నె తరగని వజ్రంలా మెరుస్తూనే ఉంటుంది. సముద్రం ఎదుట కూర్చుంటే అందులోని అలల్లా గత స్మృతులు ఎగిసిపడుతూ ఒకటొకటిగా తీరాన్ని తాకి వెనక్కు వెళ్లి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాయి. అంచేతే మనకి ఆ సముద్రాన్ని చూస్తూ ఎంతసేపైనా కూర్చోవాలనిపిస్తుంది. “అలా చూస్తూ ఉంటే ఏమొస్తుంది?” అని మనతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తే మన దగ్గర జవాబుండదు. సమాధానం చెప్పకుండా లేచి వాళ్ళని అనుసరించడమే మనం చేయాల్సిన పని.
మనిషి ఎంత గొప్ప స్థానంలో, పదవిలో ఉన్నా, దైనందిన కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా రోజులో ఏదో ఒక సమయంలో తన వ్యక్తిగత జీవితపు దారుల్లోకి ఒక్క పరుగన్నా తీయకుండా ఉండలేడు. మనల్ని వదిలి వెళ్లిపోయిన అమ్మానాన్నల స్మృతుల గాయాలు దశాబ్దాలు గడిచినా మానిపోవు ఎందుకో! నిన్నటి వరకూ వారు మనతోనే ఉన్న అనుభూతి. మన మనసుకు గానీ, శరీరానికి గానీ ఎదురుదెబ్బ తగలగానే నీళ్లు నిండిన కళ్ళు వాళ్ళని గుర్తు చేసుకుంటాయి. ఒక్కసారి కలలోనైనా వాళ్ళిద్దర్నీ గట్టిగా కౌగిలించుకుని మనసు తీరా ఆవేదనని పంచుకోవాలనిపిస్తుంది. వారి ఆనవాళ్ళ కోసమే తోబుట్టువులపై మనకింత మమకారం! ఇప్పుడు మన జీవన పయనం, ఆలోచనలు ఒకదానికొకటి అల్లుకుపోయాయేమో!
ఆఫీసుల్లో పని చేసేటప్పుడు ఫైల్స్ విషయంలో ఒకోసారి మన ప్రమేయం లేకుండా జరిగే పొరపాటు వల్ల ఒక నీలాపనింద మన నెత్తిన పడుతుంది. మనం దిగ్భ్రాంతికి, అవమానానికి గురై నిశ్చేష్టులం అవుతాం. అప్పుడు మన పైవాడు కానీ, తోటి ఆఫీసర్స్ కానీ, మన కింద పనిచేసే సబార్డినేట్లు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. మనం ఎదురుచూసిన చిన్న మాట సాయం ఎవరి నోటి నుంచీ రాదు. మనకి మంచినీళ్లు, కాఫీలు అందిస్తూ ఫైల్స్ మోసే అటెండర్ వచ్చి “నిమ్మలం తల్లీ! కంగారు పడకు. నిజం నిలకడ మీద తేలతది” అన్న ఒక ఓదార్పు మాట జోరువానలో మనకి గొడుగు పట్టినంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. మానవత్వం, సౌహార్దం వంటి పెద్ద మాటలు తెలియని అతనిలాంటి దయార్ద్ర హృదయులు కూడా మన యాదిలోకి అప్పుడప్పుడూ వస్తుంటారు.
ఒక వారం రోజుల్లో మనకి ప్రమోషన్ రాబోతున్నట్టు, ఫైల్ కదిలినట్టు వార్త తెలుస్తుంది. మనం గాల్లో తేలుతుండగానే మన పర్సనల్ ఆఫీసర్ చేసిన ఒక చిన్న మతలబీ సూచన వల్ల, సమీప భవిష్యత్తులో కూడా ప్రమోషన్ రాని విధంగా మన ఫైల్ మూసివేయబడుతుంది. అప్పటి మన నిరాశ బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతుంది. ఓ ఆరు నెలల తర్వాత మనకి ప్రమోషన్ కూడా వచ్చి ఉంటుంది కానీ ప్రమోషన్ పేరు చెప్పగానే ఈ వ్యవహారమే మనకి గుర్తొస్తుంది. బంధువర్గంలో కూడా మన నుండి ఆర్థిక సహాయం పొందిన వాళ్లు సైతం, ఒక చెయ్యని తప్పు మన మీదికి తోసి మనల్ని చెడ్డ చేస్తారు. మన మీద ఎవరో ఒకరు అకారణ ద్వేషం చిమ్మిన సంగతీ, ఇంకొకరు ఈర్ష్యతో వెటకారం చేసిన విషయమూ తరచూ గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి చేదు వాస్తవాలు అనేకం ఉంటాయి. మనకి దశాబ్దం వెనక రావలసిన ఒకానొక ప్రభుత్వ అవార్డు మరీ ఆలస్యంగా వస్తుంది. ఇప్పటికైనా వచ్చిందిలే అని సర్దుకునేంతలో అవార్డులు అందుకుంటున్న వారి లిస్టులో మన పక్కన అందరూ మన సబ్ జూనియర్లు ఉన్నప్పుడు మళ్లీ మన మనసు చివుక్కుమంటుంది. ఇలా వయస్సు పెరిగే కొద్దీ గతం పొరలు పొరలుగా మన మెదడులో ఘనీభవించి, ఒక్కో పొరా మనల్ని ‘కభీ ఖుషీ కభీ గమ్’ అన్నట్టు పలకరిస్తూ ఉంటుంది.
కొన్ని మధుర స్మృతుల రాగాలు గుండె వీణను కొనగోట మీటి వెళుతుంటాయి. నిరంతర ఆలోచనా స్రవంతులు అప్పుడప్పుడూ హృదయాన్ని తాకి వెళుతుంటాయి. ఎప్పటివో అపురూప జ్ఞాపకాలు మెదిలి మెదడును ఉత్తేజపరుస్తుంటాయి. వీటిని తలచుకుంటూ మన కమ్యూనిటీలో ఉన్న పార్క్ బెంచీ మధ్యలో కూర్చుని, కన్నులరమోడ్చి ఆ తలపుల వానలో తడిసి ముద్దైతే పర్వాలేదు కానీ బెంచీలో ఎడమవైపు కూర్చున్న వాళ్ళకీ, కుడివైపు కూర్చున్నవాళ్ళకీ ఆ జ్ఞాపకాల వివరాలు చెప్పి విసిగించడం మొదలు పెడితే ఇరుగూ పొరుగూ మనల్ని వదిలి దూరంగా పారిపోతారు. ఆ పైన మనకి అవసరానికి మనిషి మిగలడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం! సరేనా!!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, రెండు కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
