[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘అలుపెరగని బాటసారి!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నిర్దయగా కాలం సంధిస్తున్న ప్రశ్నలకు
సమాధానాలు అన్వేషిస్తూ
మౌనంగా సాగుతుంటాను!
గత జ్ఞాపకాలే జీవితంగా బ్రతకలేను
రేపు ఏమి జరుగుతుందో తెలియకపోయినా
నిర్భయంగా వర్తమానాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తుంటాను!
మది నిండా అమావాస్యల చీకట్లు కమ్మేస్తున్నా
ఆత్మవిశ్వాసాన్ని వీడను!
కొన్నిసార్లు ఆనందాలు ఎదురై పరవశాలను పరిచయం చేస్తుంటే
సంబరానికి మారుపేరై నిలుస్తాను!
జీవితమంటే సప్తవర్ణ మయమైన ఇంద్రధనుస్సని గ్రహించి..
విభిన్నభావాలను గుండెలకు హత్తుకుంటూ..
చెక్కుచెదరని ధీరత్వాన్ని వెంటబెట్టుకుని
అడుగులు ధీమాగా ముందుకే వేస్తుంటాను!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.