[ఇటీవల అమెరికా పర్యటించి, అక్కడ చూసిన కొన్ని దర్శనీయ ప్రదేశాల వివరాలు అందిస్తున్నారు శ్రీమతి జె. శ్యామల. ఇది రెండవ భాగం.]
కన్నుల పండుగ చేసే కోర్ట్ హౌస్!
ఆ తర్వాత మేం చూసిన రెండో పర్యాటక ప్రాంతం.. సొగసైన సౌధం శాంటా బార్బరా కౌంటీ కోర్ట్ హౌస్.
కోర్ట్ హౌస్ అంటే ఇదేదో భారీ కోర్టు భవంతి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఈ ప్రాంగణంలో మరెన్నో విశేషాలున్నాయి. ఈ కోర్టు హౌస్ శాంటా బార్బరా డౌన్ టౌన్లో నెలకొని ఉంది. దీన్ని ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్ గా పేర్కొంటారు.
భవన నిర్మాణ శిల్పి మూడవ విలియం మూజర్ రూపొందించిన ఈ కోర్ట్ హౌస్ 1929లో నిర్మాణం పూర్తి చేసుకుంది. స్పానిష్ కలోనియల్ శైలిలో ఉండే ఈ నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా ఉండి చూపుల్ని కట్టిపడేస్తుంది. అందమైన ఆర్చీలు, ఎర్రటి పలకలతో తీర్చిదిద్దిన పైకప్పులు, దిగువన ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనం.. ఎటు చూసినా రమణీయమే.
ఇక్కడ ఉన్న మ్యూరల్ హాలు చూసితీరవలసిందే. గోడలకు చేతితో చిత్రించిన నిలువెత్తు మ్యూరల్ పెయింటింగ్స్ చరిత్ర ఘట్టాలను దృశ్యమానం చేస్తాయి. రకరకాల డిజైన్లతో చాండిలియర్స్ ఆకట్టుకుంటాయి. చుమాష్, స్పానిష్, మెక్సికన్ తదితర సంస్కృతుల కలబోత ఈ మ్యూరల్ హాల్ ప్రత్యేకత. ఈ మ్యూరల్ హాల్ విశేషాలను నిర్దిష్ట వేళలలో ఒక గైడ్ వివరిస్తారు. సందర్శకులు హాలులో కూర్చుని ఆ విశేషాలు వినేందుకు చక్కని బెంచీల ఏర్పాటు కూడా ఉంది.
ఇక ‘ఎల్ మిరదోర్’ పేరిట 85 అడుగుల ఎత్తు క్లాక్ టవర్ మరో గొప్ప ఆకర్షణ. 18వ శతాబ్దికి చెందిన నాలుగు ముఖాల గడియారం ఇప్పటికీ పనిచేస్తోంది. టవర్ పైకి మెట్ల మార్గంతో పాటు ఎలివేటర్ సౌకర్యం కూడా ఉంది. అయితే మేం వెళ్లినప్పుడు ఎలివేటర్ పనిచేయడం లేదు. టవర్ పైనుంచి 360 డిగ్రీల కోణంలో శాంటా బార్బరా అందాలను తిలకించడం ప్రత్యేక అనుభూతి. మెట్లు ఎక్కిన శ్రమను అది ఇట్టే మరిపింపచేస్తుంది. ఒక్క కోర్టు హౌస్ మాత్రమే కాదు.. అక్కడి ఇళ్ళన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అందాల ఆవాసాలుగా ఉన్నాయి.
పసిఫిక్ మహా సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో ఓ వైపు సహజ ప్రకృతి అందాల్సిన వివిధ రకాల చెట్లు, కొండలు మరో వైపు మానవ నిర్మిత అందాల కట్టడాలు. అక్కడినుంచి దిగువనే ఉన్న ఉద్యానవనం కమనీయ దృశ్యం. అది వివాహ వేదికగా కూడా ఉంది. మేం వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెళ్ళి సందడి గమనించాం.
కోర్ట్ హౌస్ ఆవరణలోనే ఒక పెద్ద ‘లా లైబ్రరీ’ ఉంది. కోర్ట్ హౌస్ అందాలను మనసులో బందీ చేసేసి, అక్కడినుంచి బయలుదేరాం.
సరదాల తావు – స్టెర్న్స్ వార్ఫ్
తరువాత స్టెర్న్స్ వార్ఫ్‌కు వెళ్ళాం. వార్ఫ్ అంటే తెలుగులో రేవు అని చెప్పుకోవచ్చు. ఇది 1872 లో ఏర్పడింది. దీన్ని నిర్మించిన జాన్ పి. స్టెర్న్స్ పేరును దీనికి పెట్టారు. ఈ వార్ఫ్ గతంలో దాదాపు పాతికేళ్ళ పాటు జనాల రాకపోకలకు, వస్తు రవాణాకు ఉపయోగపడింది.
ఇక్కడ నేరుగా చెక్కతో నిర్మితమైన డెక్ మీద కారులో తిరగొచ్చు. అందువల్ల మరీ ఎక్కువ దూరం నడిచి శ్రమపడే అవసరం ఉండదు. ఇక్కడ పసిఫిక్ నీటి లోతు ఎక్కువ. 2,300 అడుగుల పొడవైన వార్ఫ్. మేం వెళ్ళేసరికి జనం బాగానే ఉన్నారు.
అక్కడ ఉన్న చెక్క బెంచీలపై కూర్చుని సముద్ర అందాన్ని, చందాన్ని ఆస్వాదించేవారు కొందరు, అలా నడుస్తూ సముద్రాన్ని, పక్షులను, నిలువెత్తు పామ్ వృక్షాలను, దూరాన ఉన్న కొండలను వీక్షించేవారు ఎందరో. ఇక సరదాగా చేపలు పట్టుకునేవారు, బోటు షికారు చేసేవారు, సీ సెంటర్, మ్యూజియం లను తిలకించేవారు, గిఫ్ట్ షాపుల్లో మెచ్చినవి కొంటూ, రెస్టారెంట్లలో, క్యాండీ షాపులో, ఐస్ క్రీమ్ పార్లర్ లలో నచ్చినవి తింటూ ఎందరెందరో.
ఇక్కడ పెద్ద పెద్ద సీగల్స్ ప్రత్యేక ఆకర్షణ. మరో విశేషం.. ఇక్కడ అరచేయి చూసి జాతక చెప్పే షాపు కూడా ఉంది. దాని పేరు ‘మేడమ్ రోసింకా పామ్ రీడింగ్ కాటేజ్’. కుతూహలం ఉన్నవారు, డాలర్లంటే లెక్కలేనివారు అందులోకి వెళ్తున్నారు.
మేం సముద్ర సౌందర్యాన్ని, అందులో పక్షులు, జంతువుల విన్యాసాలను చూస్తూ, అన్ని సందడులను గమనిస్తూ ఓ గంట గడిపి ప్రయాణంలో తొలిరోజుకు ముగింపు పలుకుతూ, మా బసకు బయలుదేరాం.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.

