[ఇటీవల అమెరికా పర్యటించి, అక్కడ చూసిన కొన్ని దర్శనీయ ప్రదేశాల వివరాలు అందిస్తున్నారు శ్రీమతి జె. శ్యామల. ఇది మూడవ భాగం.]
మదిని దోచిన ‘మొంతాన్యా దే ఒరొ స్టేట్ పార్క్’
మా ట్రిప్‌లో రెండవ రోజు మేం కొంచెం తీరికగా తొమ్మిది గంటలు దాటాకే బయలుదేరాం. ఎందుకంటే ఆ బసను మధ్యాహ్నం పదకొండు గంటలకు ఖాళీ చేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు కనుక మా లగేజ్ మొత్తం సర్దుకోవడానికి కొంత సమయం అవసరమైంది. దానికి తోడు మేం బస చేసిన ఇల్లు చాలా బాగుంది. ఇంటి వారి అభిరుచి ఎన్నదగిందిగా ఉంది. ముందు లోపలికి ప్రవేశించే చోట ఉంచిన డోర్ మ్యాట్ మీద నాలుగు భాషల్లో ‘వెల్కమ్’ అని రాసి ఉంది. వాటిలో ‘స్వాగతం’ అని తెలుగులో ఉండడం ఆకట్టుకుంది.. ఆనందం కలిగించింది. ప్రతి గదిలో పాత కాలం నాటి వస్తువులు ఎంతో అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. వాటిలో పెద్ద పెద్ద రాగి పాత్రలు కూడా ఉన్నాయి. పైకప్పు చక్కటి దూలాలతో ఎంతో బాగుంది. విశాలమైన బెడ్ రూమ్, చిన్న కిచెన్, ఆ పక్కనే డైనింగ్ స్పేస్.. అద్దాల తలుపుల గుండా పచ్చని చెట్లు, నీలాకాశం, దూరాన కొండలు ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ సేదతీరవచ్చు. దానికి ఆనుకుని ఒక మెట్టు దిగువలో పెద్ద హాలు. కూర్చునేందుకు చక్కటి ఫర్నిచర్. అక్కడినుంచి కూడా ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి బాస్కెట్ బాల్ ఏర్పాటు.. అంతే కాదు ఎన్నో రకాల బొమ్మలు, ఇండోర్ గేమ్స్ వస్తువులు, మేగజైన్లు, పుస్తకాలు ఎంత చక్కటి సేకరణ! బ్రేక్‌ఫాస్ట్‌తో కడుపు, ప్రశాంత, ఆహ్లాద పరిసరాలతో మనసు నింపుకొని, ఇంటి ముందున్న ఎంచక్కని పూల మొక్కల ముందు ఓ ఫొటో తీసుకుని, ఆ ఇంటికి వీడ్కోలు పలికి కారెక్కాం.
మొదటగా ‘మొంతాన్యా దే ఒరొ స్టేట్ పార్క్’కు వెళ్ళాం. పార్క్ అనగానే మనకు తోటలు, ఉద్యానవనాలు గుర్తురావడం సహజం. కానీ ఏదైనా ఒక ప్రాధాన్యత, చరిత్ర కలిగిన సువిశాల ప్రాంతాన్ని ప్రభుత్వం పరిరక్షిస్తూ పర్యాటకులకు అందుబాటులో ఉంచినప్పుడు ఇక్కడ వాటిని స్టేట్ పార్క్, రిజర్వ్ పార్క్ అని పేర్కొంటారు.
ప్రకృతి ప్రేమికులు మెచ్చే తావు ‘మొంతాన్యా దే ఒరొ స్టేట్ పార్క్’.
‘మొంతాన్యా దే ఒరొ’ అంటే స్పానిష్‌లో ‘మౌంటెన్ ఆఫ్ గోల్డ్’ అని అర్థం. ఇక్కడి కొండ ప్రాంతాలలో వసంత కాలంలో చెట్లు పసుపు రంగులో ఉండే మస్టర్డ్, కాలిఫోర్నియా పాపీస్ పుష్పాలు విరగబూసి ప్రకాశిస్తూ ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఏటా మిలియన్ మంది సందర్శకులు వచ్చే ఈ స్టేట్ పార్క్ ‘లోస్ ఓసోస్’కి రెండు మైళ్ళ దూరంలో ఉంది. ఎనిమిది వేల ఎకరాల మేర కొండలు, ఏడు మైళ్ళ సముద్ర తీరం, ఇసుకతో నిండిన బీచ్‌లు, ఇసుక దిబ్బలు, ప్రవాహాలు, లోయలు గల ప్రాంతమిది.
ఇక్కడ ఎన్నో ట్రెయిల్స్ ఉన్నాయి. అన్నిటిలోకి బ్లఫ్ ట్రెయిల్ సౌకర్యవంతంగా, చక్కగా ఉంది. ఎక్కువమంది ఆ బాటనే నడుస్తారు. చెట్ల పొదల మధ్య ఏర్పరచిన నడక దారిలో అలా నడుస్తూ వెళ్ళాం. చెట్ల పొదల్లో దాగిన పక్షుల కిలకిలలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి.
హఠాత్తుగా బయటకు వచ్చి, మనుషుల అలికిడి గుర్తించి అంతలోనే లోపలికి మాయమవుతున్న చిన్న చిన్న పిట్టలు భలే ఉన్నాయి. ఇక్కడ యువకులు, పిల్లలు, పెద్దలు మాత్రమే కాదు వృద్ధులు కూడా ఓపికగా, ఆసక్తిగా రావడం నాకు ఎంతో నచ్చింది. హైకింగ్, మౌంటెన్ బైకింగ్, హార్స్ రైడింగ్, సర్ఫింగ్.. వారి వారి అభిరుచులు నెరవేర్చుకునేందుకు అవకాశం ఉందిక్కడ. ఇక్కడ కుందేళ్ళు, ఉడతలు, స్కంక్స్, రకూన్స్, జింకలు వగైరాలు ఉంటాయట.
ఇక్కడ పసిఫిక్ అలల క్రీడలు ‘బాప్ రే’ అనిపించేలా ఉంటాయి. కూర్చునేందుకు అక్కడక్కడ చెక్క బెంచ్‌లు ఉన్నాయి. సముద్రం కొంతమేర పాల సముద్రంలా దర్శనమిస్తుంది. నీలం, ముదురు నీలం, పాచి రంగు, బూడిద రంగు, గోధుమ వర్ణం.. ఇలా కాసింత వేళ ఎన్నో రంగులద్దుకున్న మహా సముద్రం మహా అందంగా ఉంది. బ్లఫ్ ట్రెయిల్ లో నడిచాక.. ఇంకా ముందుకు మరో దిశలో నడిచాం.
నీటి మధ్యలో వివిధ ఆకృతులలో పెద్ద పెద్ద రాతి గుట్టలు. అలాగే చూస్తూ ఉంటే మానవ, జంతు రూపాలుగా.. మన ఊహకు తోచినట్లుగా అనిపిస్తాయి. అలల ధాటికి అరిగి అరిగి, మధ్యలో పెద్ద రంధ్రాలు, సొరంగాలు ఏర్పడినట్లున్నాయి.
ఇక సముద్రపు పాల నురగల అలలు భీకర శబ్దంతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఆ రాతి గుట్టలను పదేపదే అభిషేకించే దృశ్యం ఎంతసేపు చూసినా తనివితీరని దృశ్యం. రాతి గుట్టల మధ్య ఏర్పడ్డ చిన్న సొరంగాల మధ్య పాల నీటి ప్రవాహాలు, రాతి చప్టాల మీదుగా పాలనీటి ప్రవాహం మళ్ళీ కిందకు దూకుతూ ఉండడం మరో మనోహర దృశ్యం. దూరంగా కొండలు. కొందరు వాటి పైకి ఎక్కి అంత పైనుంచి చూస్తున్నారు.
ఆ ప్రకృతి సౌందర్యానంతా మనసు గదిలో పదిల పరుచుకుంటూ, మేం ఇంకా ‘మోరో రాక్’ చూడవలసి ఉన్నందున వెనుదిరిగి కారు పార్కింగ్ వైపు నడిచాం.
అబ్బురపరిచే బృహత్ శిల ‘మోరో రాక్!’
‘మోరో రాక్’ శాన్ లూయిస్ ఒబిస్పో కౌంటీలో ఉంది. అల్లంత దూరాన వుండగానే ‘ఇంకేముంది వచ్చేశాం’ అన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అయితే మోరో రాక్తో పాటుగా ఓ మూడు నిలువెత్తు గొట్టాల వంటివి కూడా కనిపించాయి. వీటి సంగతి తర్వాత.. ముందు మోరో రాక్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి.
ఇదొక ‘వాల్కొనిక్ ప్లగ్’. మరి వాల్కొనిక్ ప్లగ్ అంటే.. ఉనికి కోల్పోయిన అగ్నిపర్వత అవశేష మెడ భాగం. ‘మోరో’ అంటే స్పానిష్‌లో పర్వతం అని అర్థం. 1769లో ఇక్కడకు చేరిన స్పానిష్ సముద్ర యాత్రికులు ఇక్కడే బస చేశారట. ఆ బృందంలో ఒకరైన హువాన్ క్రెస్పీ ‘మేం గుండ్రటి పర్వతంలా ఉన్న అతి పెద్ద రాయిని చూశాం’ అని డైరీలో రాసాడట. నావికులకు ఇదో గురుతుగా నిలిచింది.
1968లో కాలిఫోర్నియా స్టేట్ హిస్టారిక్ ల్యాండ్‌మార్క్‌గా గుర్తింపు పొందిన మోరో రాక్ ఎత్తు 581 అడుగులు. సాలినన్, చుమాయిష్ తెగల వారు మోరో రాక్‌ను పవిత్రంగా భావిస్తారు. చరిత్ర పూర్వ యుగం నుంచే చుమాయిష్ తెగ వారి సెటిల్మెంట్ ఈ దాపుల్లో ఉంది. అయితే సాలినన్ తెగవారు వారి ఇతిహాసాన్ని అనుసరించి సంవత్సరానికి రెండుసార్లు మోరో రాక్ పై వేడుకలు చేసుకుంటారు. అయితే స్థానిక చుమాయిష్ తెగ వారు దీన్ని న్యాయపరంగా సవాలు చేశారు. మోరో రాక్ ప్రాంతం తమదని, అంతేకాక మోరో రాక్ అతి పవిత్రమైనదని, దాని పైకి ఎక్కడం అభ్యంతరకరమని, పైగా దానివల్ల మోరో రాక్ క్షీణించే ప్రమాదం ఉందని వారి వాదన.
మోరో రాక్ ఎన్నో రకాల పక్షులకు ఆవాసంగా కూడా ఉంది. ముఖ్యంగా పెరిగ్రిన్ ఫాల్కన్లు ఇక్కడ ఎక్కువ. అటు ఇటు తిరుగాడుతున్న పెద్ద పెద్ద ఉడుతలు దృష్టిని ఆకర్షించాయి.
సుదూరం నుంచే కనిపించే మూడు నిలువెత్తు గొట్టాల గురించి చెప్పాలంటే.. పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలెక్ట్రిక్ కంపెనీ 1950లో నిర్మించిన పవర్ ప్లాంట్‌లో భాగమైన పొగ గొట్టాలు ఇవి. వీటి ఎత్తు 450 అడుగులు. ఆ ప్రాంతానికి ప్రత్యేక గురుతుగా ఉండి ఏకంగా నగరానికే ‘త్రీ స్టాక్స్ అండ్ ఎ రాక్’ అనే నిక్ నేమ్ వచ్చేసింది. జాలర్లకు ఇంటికి వెళ్ళే సమయంలో ఈ గొట్టాలు లైట్ హౌస్ బీకన్ల లాగా ఉపయోగపడేవి.
ఆ కాలంలో అక్కడ నెలకొన్న పెద్ద పవర్ ప్లాంట్ కావడంతో దానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. అయితే కాలక్రమంలో ఈ పవర్ ప్లాంట్ కు కాలం చెల్లి 2014 లో మూతపడింది. ఇటీవల కాలంలో విస్ట్రా కార్పొరేషన్ ఇక్కడ పెద్ద బ్యాటరీ స్టోరేజ్ సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో 2027లో ‘త్రీ స్టాక్స్’ కూల్చివేత జరగవచ్చు. ఆ ప్రాంత చరిత్రలో భాగమైన, ప్రజల మనోభావాలతో ముడిపడిన కారణంగా అక్కడ ఆ వివరంతో కూడిన ఫలకం ఏర్పాటుచేయవచ్చు.
ఇక ఇక్కడ మోరో బే అందాలను కూడా ఆస్వాదించవచ్చు. సముద్రపు నీళ్ళలో సీ లయన్స్, ఆటర్స్ వగైరాలను చూడవచ్చు. ముఖ్యంగా సముద్ర జలాలలో సందడి చేసే సీ ఆటర్లు ఎంతగానో ఆకర్షించాయి. ఆహార కోసం సముద్ర జలాలలో మునకలు వేస్తూ, అలా నీటిపై తేలుతూ, ఏదైనా జీవి చిక్కగానే వెల్లికిలా పడుకుని పొట్టమీద ఆహారం ఉంచుకుని తాపీగా తినడం గమనించవచ్చు.
సువిశాల సముద్రం, పైన అనంతమైన వినీలాకాశం, దూరంగా ఎత్తైన పర్వతాలు, పరిసరాలలో నిడుపాటి చెట్లు.. అంతా మనసుకు పసందైన విందు. ఆ రోజుకు విహారాన్ని ముగించి మా మూడో కొత్త బసకు బయలుదేరాం.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.

