[ఇటీవల అమెరికా పర్యటించి, అక్కడ చూసిన కొన్ని దర్శనీయ ప్రదేశాల వివరాలు అందిస్తున్నారు శ్రీమతి జె. శ్యామల. ఇది 4వ భాగం.]
విలాస ‘విలాసం’ – ‘హర్స్ట్ క్యాజిల్!’
మా ప్లాన్ ప్రకారం ట్రిప్‌లో మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి, శాన్ సిమియన్లో ఉన్న ‘హర్స్ట్ క్యాజిల్’ సందర్శనకు బయలుదేరాం. కొండ మీద ఉన్న ఆ క్యాజిల్ చూడడానికి ముందుగానే ఆన్లైన్లో బస్సు టికెట్లు బుక్ చేసుకున్నాం కాబట్టి హడావిడి లేకుండా అక్కడి విజిటర్ సెంటర్ చేరుకొని క్యూలో నిలుచున్నాం. టైమ్ కాగానే టికెట్లు చెక్ చేసి, చేతికి ట్యాగ్ కట్టి బస్సు వద్దకు పంపించడం మొదలుపెట్టారు. అలా మేం బస్సు ఎక్కి కూర్చున్నాం. అంతా ఎక్కడం పూర్తయ్యాక బస్సు బయలుదేరింది.
కొండపైకి దాదాపు ఐదు మైళ్ళ దూరం ఉంది. డ్రైవర్ మెల్లగా బస్సు నడుపుతూనే స్పీకర్లో క్యాజిల్ గురించిన విశేషాలు చెపుతున్నాడు. కొండపైకి వెళ్ళే ఆ ప్రాంతంలో రోడ్డుకి ఇరు వైపుల పెద్ద పెద్ద ఫల వృక్షాలు కనువిందు చేశాయి. ఆ పక్కనే ఒక ‘జంతుశాల’ కూడా ఉండేదట. హర్స్ట్ వివిధ రకాల జంతువులకు కూడా అక్కడ ఆవాసాలు ఏర్పరచి, పోషించాడట. కాలక్రమంలో వాటి పోషణ భారమై ప్రభుత్వ జూ లకు వాటిని ఇచ్చేశాడట. అయినా ఇప్పటికీ ఆ కొండ ప్రాంతంలో జింకలు వగైరాలు జీవిస్తూ సందర్శకులను అలరిస్తున్నాయి.
బస్సు క్యాజిల్ ముందు ఆగడంతో అందరం దిగాం. పచ్చటి ఆహ్లాద ప్రకృతిని.. ఇంకా ఎంతో ఎత్తులో నిలువెత్తు రాజసంతో ఠీవిగా నిలిచిన క్యాజిల్‌ను ఆసక్తిగా పరికిస్తుండగా, మహిళా గైడ్ వచ్చి స్వాగతం పలికారు. తనను తాను పరిచయం చేసుకుని, క్యాజిల్ గురించి ఉపోద్ఘాతం మొదలుపెట్టారు. మెట్ల ముందరే అందరం నిలుచుని శ్రద్ధగా వినడం మొదలు పెట్టాం. ఆ క్యాజిల్ ను ఎవరు, ఎప్పుడు కట్టింది చెప్పి, క్యాజిల్ తీరుతెన్నులు వివరించారు.
చారిత్రక ఎస్టేట్‌గా పేరొందిన ఈ క్యాజిల్ అధిపతి విలియం రాండాల్ఫ్ హర్స్ట్. ఆ ప్రాంతంలో అత్యంత వైభవమైన క్యాజిల్ కట్టుకోవాలన్నది ఆయన కల. దాన్ని నిజం చేయడానికి తగిన సమర్ధత కలిగిన ఆర్కిటెక్ట్ కోసం వెదికాడు. అదే సమయంలో కాలిఫోర్నియాలో తొలి మహిళా ఆర్కిటెక్ట్‌గా లైసెన్స్ పొందిన జూలియా మోర్గాన్ గురించి తెలిసింది. ఇంకేముంది ఆమెను రప్పించి, తన ఆలోచనను, అభిలాషను వివరించాడు. ఆమె విని, తన శక్తి వంచన లేకుండా అద్భుతమైన డిజైన్ తయారుచేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1919లో క్యాజిల్ నిర్మాణం మొదలై 1947లో పూర్తయింది.
ఇప్పుడు ఈ క్యాజిల్ కాలిఫోర్నియా స్టేట్ పార్క్ హోదానే కాకుండా నేషనల్ హిస్టారిక్ ల్యాండ్‌మార్క్‌గా కూడా గుర్తింపు పొందింది. క్యాజిల్ ప్రధాన గృహంలో 115 గదులు ఉన్నాయి. మూడు అతిథి గృహాలు, నీటి కొలనులు, ఫౌంటెన్లు, 127 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాలు ఉన్నాయి.
గైడ్ ఉపోద్ఘాతం చెప్పి, లోపలికి నడవగా, అంతా ఆమెను అనుసరించాము. ముందుగా నీటి కొలనులు చూశాం. ముఖ్యంగా ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే నెప్ట్యూన్ పూల్ ఒక అవుట్ డోర్ పూల్. కాంప్లెక్స్ మొత్తం గ్రీకు – రోమన్ సమ్మిళిత శైలిలో నిర్మితమైంది. కొలను చుట్టూ ఆకర్షణీయ నిర్మాణాలు. ముఖ్యంగా ప్రాచీన రోమన్ గుడి ముఖద్వారాన్ని పోలిన ఆర్చి వంటిది ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
పాలరాతి శిల్పాలు, వీనస్, క్యుపిడ్స్, మెర్మెయిడ్స్ ఎన్నో బొమ్మలు. వీటిలో చాలా వరకు ఇటలీ నుంచి తెచ్చినవే. ఆ పక్క డ్రెస్సింగ్ రూమ్. అచ్చెరువొందించే ఆర్కిటెక్చర్. ఈ కొలనుకు నీటి మాటో అంటే దగ్గరలో ఉన్న శాంటా లూసియా మౌంటెన్ నుంచి వచ్చే స్ప్రింగ్ వాటర్ తోనే నింపుతారని తెలిసింది. ఆ కొలనులో 345,000 గ్యాలన్ల నీరు పడుతుందట. కొలను నిర్మాణానికి వెర్మాంట్ మార్బుల్ ను ఉపయోగించారు. ఈ కొలనులోని నీటిని వేడి చేయడానికి ఆయిల్ బర్నింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అది పని చేయడం లేదు.
ఇక రెండోది రోమన్ పూల్. ఇది ఇండోర్ పూల్. చుట్టూ ఎనిమిది మంది రోమన్ దేవతల, దేవుళ్ళ, వీరుల శిల్పాలు ఏర్పాటుచేశారు. ఈ కాంప్లెక్స్ లో ఎక్సర్సైజ్ రూమ్, స్వెట్ బాత్స్, డ్రెస్సింగ్ రూమ్ , హ్యాండ్ బాల్ కోర్ట్ ఉన్నాయి. సీలింగ్, ఫ్లోర్ మొజాయిక్ టైల్స్‌తో నిర్మించారు. స్మాల్తీ అని పిలిచే ఈ టైల్స్ బ్లూ, గోల్డ్ కలర్స్ లో ఎంతో సహజ రమణీయంగా ఉన్నాయి.
ఆ తర్వాత మెట్ల మార్గంలో ప్రధాన గృహానికి దారి తీశాం.
పార్టీలు జరిగినప్పుడు వాడే గోతిక్ శైలిలో నిర్మించిన పెద్ద డైనింగ్ హాలులో ఇటు, అటు కలిపి ఓ నలభైకి పైగా కలపతో చేసిన కుర్చీలు, మధ్యలో పొడవాటి టేబుల్, రకరకాల కళాత్మక వస్తు సామాగ్రి, పాత్రలు, బొమ్మలు, గోడలకు సైతం అరుదైన అలంకరణలు, చిత్రాలు, దీపాలంకరణలు, అద్భుతః అనిపించింది.
ఒక వైపు సీలింగ్ కు వేలాడుతూ ప్రకాశవంతమైన రంగుల బ్యానర్లు కనిపించాయి. అవి ఆ కాలంలో సియానా, ఇటలీలో జరిగే గుర్రపు పందేలలో పాల్గొన్న వివిధ జిల్లాల బ్యానర్లు అని తెలుసుకున్నాం. ఇటాలియన్ సీలింగ్ ప్రత్యేక ఆకర్షణ. ఐన్ స్టీన్, చార్లీ చాప్లిన్ వంటి ప్రముఖులెందరో అక్కడ ఆతిథ్యం పొందారట. సోషల్ రూమ్ వంటి మిగతా హాళ్లలో కూడా చక్కని ఫర్నిచర్ ఆకట్టుకుంది. హెర్ట్స్ వివిధ దేశాలనుంచి సేకరించి తెచ్చిన వస్తు సముదాయం ఔరా అనిపించింది.
ఆ తర్వాత బిలియర్డ్స్ రూమ్. ఆ కాలం నాటి రెండు పెద్ద బిలియర్డ్ టేబుళ్ళు, బంతులు, స్టిక్స్ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తాయి. ఆ తర్వాత థియేటర్ లోకి తీసుకువెళ్ళి ఓ పది నిముషాల డాక్యుమెంటరీ చూపించారు. ఆ తర్వాత తిరిగి కిందకు చేరడానికి బస్సు ఎక్కాం.
విజిటర్స్ సెంటర్ చేరాక అక్కడ ఉన్న థియేటర్లో విలియం రాండాల్ఫ్ హర్స్ట్ గురించిన అరగంట ఫిల్మ్ చూశాం. హర్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో, 1863లో జన్మించాడు. తండ్రి జార్జ్, తల్లి ఫీబీ. తండ్రి మైనింగ్‌లో బాగా సంపాదించడంతో, బాల్యంలోనే ఎన్నో దేశాలు చూసే అవకాశం దొరికింది. పదేళ్ళ వయసులోనే తల్లితో కలిసి యూరప్ అంతా పర్యటించాడు. ఎన్నో అద్భుత కట్టడాలను చూశాడు. కళను, చరిత్రను ఆసక్తిగా గమనించాడు. పెద్దయ్యాక తండ్రి నడుపుతున్న ‘ద శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్’ పత్రికను, తాను నడిపాడు. ఆ తర్వాత ‘న్యూయార్క్ జనరల్’ అనే మరో పేపర్‌ను కొన్నాడు. అది బాగా ప్రజాదరణ పొందింది. కాలక్రమంలో ఆ తర్వాత మరో రెండు డజన్ల పేపర్ల అధిపతి అయ్యాడంటే హర్స్ట్ ఎంతగా ఎదిగాడో ఊహించవచ్చు. 1903లో మిలిసెంట్ విలియంను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఐదుగురు కొడుకులు. పత్రికా రంగంలోనే కాదు, టి.వి., సినిమా, రాజకీయ రంగాలలోనూ ప్రముఖంగా నిలిచాడు. తనకంటూ ఓ అద్భుతమైన కోటను కట్టుకోవాలనే చిరకాల వాంఛను సాకారం చేసుకున్న వైనాన్ని చూపే అరగంట నిడివిగల బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్ చాలా బాగుంది. దాంతో సందర్శన ముగిసింది. తిరిగి బస్సెక్కి కొండ దిగి, మా కారు వైపు నడిచాం.
***
కారులోనే లంచ్ తినేసి అక్కడినుంచి ‘ఎలిఫెంట్ సీల్ విస్తా పాయింట్’ దగ్గరకు వెళ్ళాం. హర్స్ట్ క్యాజిల్ సందర్శకులు తప్పనిసరిగా ఈ ఎలిఫెంట్ సీల్ విస్తాను కూడా సందర్శిస్తారు. నీటి ఒడ్డునే పెద్ద పెద్ద ఆకారాలలో ఉన్న ఎలిఫెంట్ సీల్స్ బద్ధకంగా పడుకుని కొన్ని, పక్కవాటిని పలకరిస్తూ కొన్ని కనిపించాయి.
***
ఆ తర్వాత మేం ‘లోబోస్ రిజర్వ్ పార్క్’కు బయలుదేరాం. లోబోస్ అంటే స్పానిష్‌లో తోడేళ్ళు అని అర్థం. ఈ రిజర్వ్‌లో మూడు వందల మొక్కల జాతులు, రెండువందల యాభై జంతు జాతులు ఈ రిజర్వులో ఉన్నాయి. పాయింట్ లోబోస్కు 1968లో రిజిస్టర్డ్ నేషనల్ ల్యాండ్‌మార్క్‌గా గుర్తింపు లభించింది.
ఈ రిజర్వ్‌లో ఎక్కువ శబ్దాలు చేసేవి సీ లయన్స్. సి లయన్ పాయింట్ వద్ద వీటి సందడి గమనించవచ్చు. నవంబర్ నెలలో కాలిఫోర్నియా గ్రే వేల్స్ అలస్కా శీతల జలాలను వీడి, వెస్టర్న్ బాహా కాలిఫోర్నియాకు చేరుకుని సంతాన వృద్ధి చేస్తాయి. 50 అడుగుల వరకు పొడవు, 40 టన్నుల బరువు ఉండే ఈ వేల్స్ ఏటా 10,000 మైళ్ళు ప్రయాణిస్తాయి. భూమ్మీద ఇంత దీర్ఘ ప్రయాణం చేసే క్షీరదం ఇదే కావడం విశేషం. పాయింట్ లోబోస్ వద్ద ఇలా ప్రయాణించే వేల్స్ ను డిసెంబర్ రెండో పక్షం నుంచి జనవరి వరకు, మళ్ళీ మార్చి నుంచి మే వరకు చూడవచ్చు అని తెలుసుకున్నాము.
ఈ రిజర్వ్‌లో మరో విలక్షణ ఆకర్షణ మోంటెరీ సైప్రస్. ఒకప్పుడు విస్తృతంగా ఉండే సైప్రస్ చెట్లు ఇప్పుడు మోంటెరీ లోని పెబుల్ బీచ్ వద్ద, పాయింట్ లోబోస్ వద్ద మాత్రమే ఉన్నాయి. కొండలను గట్టిగా పట్టుకుని, గాలుల తాకిడిని తట్టుకుంటూ నిలిచి, సముద్రానికి, భూమికి ఉండే అనంత ఘర్షణను ప్రతిబింబిస్తున్నాయి. 1960లో యు.ఎస్. లోనే తొలి అండర్‌వాటర్ రిజర్వ్‌ను రూపొందించేందుకు 775 ఎకరాల నీట మునిగిన భూమిని అదనంగా చేర్చారు. 1973 లో పాయింట్ లోబోస్ కు ఎకొలాజికల్ రిజర్వ్ హోదా ప్రకటించారు.
సూర్యాస్తమయ సమయం కావడంతో అక్కడే నిలిచి ఆకాశం వైపు దృష్టి సారించాం. సూర్యుడు మెలమెల్లగా కదిలిపోతూ, క్షణాలలో అస్తమించడం అది ఓ అద్భుత అనుభూతి. ఇప్పుడు వివిధ సముద్ర జీవులకు, వృక్షాలకు రక్షిత ప్రదేశంగా ఉండి, ఆహ్లాదం పంచుతున్న పాయింట్ లోబోస్ ను వీక్షించి, తిరిగి కారెక్కి బసకు బయలుదేరాం.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.

