Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమెరికా.. విహార వీచికలు-5

[ఇటీవల అమెరికా పర్యటించి, అక్కడ చూసిన కొన్ని దర్శనీయ ప్రదేశాల వివరాలు అందిస్తున్నారు శ్రీమతి జె. శ్యామల. ఇది 5వ భాగం.]

అలరించిన ‘మోంటెరీ బే అక్వేరియం’

నాలుగో రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ‘మోంటెరీ బే అక్వేరియం’ కు బయలుదేరాం. ‘కానరీ రో’ ఏరియాలో సముద్రం దాపునే నెలకొంది ఈ మోంటెరీ బే అక్వేరియం. ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనడం వల్ల నేరుగా లోపలికి వెళ్లాం. ఆహార పదార్థాలు, మంచి నీళ్ళు లోపలికి అనుమతించరు. అయితే ఖాళీ బాటిల్ తీసుకువెళ్ళి అక్వేరియం లోపల మంచినీళ్ళు నింపుకోవచ్చు. అక్వేరియం లోపల సందర్శకుల సౌకర్యార్థం కెఫే ఉంది. మేం వెళ్ళేసరికి సందర్శకుల సందడి బాగా ఉంది. పిల్లల్ని తీసుకు వచ్చి, వారికి అన్నిటినీ పరిచయం చేస్తున్న తల్లిదండ్రుల్ని చూస్తే ముచ్చటగా అనిపించింది.

అందులోనూ పసిపిల్లల కార్ట్ లను తోసుకుంటూ, వారిని సముదాయించుకుంటూనే అక్వేరియంను శ్రద్ధగా వీక్షించడం మరిత ఆశ్చర్యనందాలను కలిగించింది. మోంటెరీ బే అక్వేరియంను 1984లో ప్రారంభించారు. ఇక్కడ 550కి పైగా జాతులకు చెందిన 35,000 జలచరాలు ఉన్నాయి. ప్రధానంగా ఆకర్షించేది 28 అడుగుల ఎత్తు, 65 అడుగుల పొడవు గల కెల్ప్ ఫారెస్ట్.

అంటే దాదాపు మూడు అంతస్తుల ఎత్తులో ఉంది. కృత్రిమ ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహిస్తున్న లివింగ్ కెల్ప్ ఫారెస్ట్ లలో ఇదే మొదటిది కావడం విశేషం.

మోంటెరీ బే నుంచి వచ్చే సముద్ర జలాలు, నేరుగా సూర్యకాంతి ప్రసరించడం, సర్జ్ మెషిన్ (లార్జ్ ప్లంజర్) వల్ల కెల్ప్ ఫారెస్ట్ సహజ సిద్ధంగా కనిపిస్తుంది. ఈ మెషిన్, వాటర్ కరెంట్స్‌ను క్రమబద్ధం చేస్తూ, ఎగ్జిబిట్ లోని కెల్ప్ రోజుకు సగటున 4 అంగుళాలు పెరిగేందుకు దోహదపడుతోంది.

ఓపెన్ సీ విభాగం:

1996 లో పారంభించిన ఈ విభాగం రెండో అంతస్తులో ఉంది. ఏడేళ్ళ పాటు శ్రమించి, 57 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఈ ట్యాంకు ఎంత పెద్దది అంటే ఇందులో మిలియన్ గ్యాలన్ల నీరు పడుతుంది. ఓపెన్ సీ విభాగంలో మూడు భాగాలు ఉన్నాయి.

అవి – జెల్లీ ఫిష్, అతి చిన్న సముద్ర ప్రాణులు, వివిధ రకాల సముద్ర జంతువులకు చెందిన పెద్ద ఎగ్జిబిట్. సముద్ర ప్రయాణాలు చేసే టఫ్టెడ్ పఫిన్స్, సీ టర్టిల్స్ రాత్రి పూట అక్వేరియం విండోలోకి ఈదకుండా బబుల్ వాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రీన్ టర్టిల్స్, సార్డీన్స్, పెలాజిక్ స్టింగ్ రేస్, స్కాలోప్డ్ హామర్ హెడ్ షార్క్, వివిధ రకాల టూనాలు చూడవచ్చు. సీ ఆటర్స్ ప్రత్యేక ఆకర్షణ. అక్వేరియంలో ఉన్న సముద్ర క్షీరదాలు ఇవి మాత్రమే. చిత్ర, విచిత్ర రూపాలలో, భిన్న వర్ణాలలో, అనేక రకాల జెల్లీ ఫిష్ కనుల పండుగ చేసి, అబ్బురపరుస్తాయి.

ఆడిటోరియం:

సముద్ర జీవులకు సంబంధించిన విజ్ఞానదాయకమైన చిత్రాలను ప్రదర్శించే ఈ ఆడిటోరియంలో 250 నుంచి మూడు వందల వరకు సీటింగ్ సౌకర్యం ఉంది. 15 నిముషాల నిడివి గల వేర్వేరు ఫిలిమ్ లను ప్రదర్శిస్తుంటారు. చిత్రం పేరు, సమయం ఆడిటోరియం ప్రవేశం ముందర బోర్డుపై రాసి ఉంచుతారు. స్వాగతం పలికే వ్యక్తి కూడా ఉంటారు. ప్రదర్శనకు, ప్రదర్శనకు మధ్య కొంత విరామ సమయం ఉంటుంది.

ఫిలిమ్ ప్రారంభానికి ముందర దాని గురించి ఓ వ్యక్తి వివరించడం విశేషం. అంతేకాదు ప్రదర్శన ముగిశాక సందేహాలు ఏమైనా ఉంటే ప్రేక్షకులు ఆ వ్యక్తిని అడిగి, సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఫిలిమ్ ప్రారంభానికి కొన్ని నిముషాల ముందు తెరపై కొన్ని క్విజ్ ప్రశ్నలు చూపించి, ఆ తర్వాత వాటికి సరైన సమాధానం చూపడం పిల్లలకు, పెద్దలకు కూడా ఆసక్తి కలిగించే అంశం. మేం ఆ రోజున మూడు షార్ట్ ఫిల్మ్స్ చూశాం. అవి – జర్నీ టు బాహా, కేరింగ్ ఫర్ యానిమల్స్, లూనా: ఎ సీ ఆటర్స్ స్టోరీ. ఇలాంటి చిత్రాలు చూడడం వల్ల విజ్ఞాన.. వికాసాలే కాదు, సముద్ర జీవుల క్షేమం పట్ల మన బాధ్యతను తెలుసుకోగలుగుతాం.

అక్వేరియం నిర్వహించే ఇతర కార్యక్రమాలు:

కేవలం ప్రదర్శన బాధ్యతే కాకుండా అక్వేరియం వారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరి తోడ్పాటుతో 1992 లో మోంటెరీ బే నేషనల్ మెరైన్ శాంక్చ్యువరీ రూపుదిద్దుకుంది. యుఎస్ లో సముద్ర సంబంధిత చట్టాలు, విధానాల గురించి పనిచేసేందుకు 2004లో ఒక బృందాన్ని ఏర్పాటుచేశారు. అక్వేరియం సైంటిస్టులు – సీ ఆటర్స్, గ్రేట్ వైట్ షార్క్స్, బ్లూ ఫిన్ టూనాల గురించి ఎన్నో పరిశోధనా పత్రాలు రాశారు. స్పెషల్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ లు నిర్వహిస్తూ స్నోయీ ప్లవర్, ఆఫ్రికన్ పెంగ్విన్ మొదలైన వాటి వృద్ధికి పాటుపడుతున్నారు.

2007 నుంచి అక్వేరియం వారు, ప్రమాదం నుండి కాపాడబడిన లేసాన్ ఆల్బట్రాస్‌తో పబ్లిక్ షో నిర్వహిస్తూ, సముద్రాన్ని ప్లాస్టిక్‌తో కలుషితం చేయడం వల్ల అందులోని ప్రాణులకు ఎంత హాని జరుగుతుందో సందర్శకులకు వివరిస్తున్నారు.

నిశితంగా పరిశీలించాలంటే అక్వేరియం చూడడానికి ఒక రోజు కేటాయించినా సరిపోదు అనిపించింది.

అంతలో గిఫ్ట్ షాపులు కనిపించాయి. ఓ షాపులోకి ప్రవేశించి మా సందర్శనకు గుర్తుగా మేం కూడా జెల్లీ ఫిష్ మాగ్నెట్ చిత్రం కొన్నాం. సమయం చూస్తే సాయంత్రం. ఇక బసకు చేరుకోవడం ఉత్తమం అనుకుంటూ బయటకు నడిచాం. మర్నాడు ఉదయానే శాండియేగొకు తిరుగు ప్రయాణం గుర్తుకొచ్చి ‘మా ట్రిప్ అప్పుడే అయిపోయిందా’ అనిపించింది. ఇంకా ఆ అద్భుత జలచర లోకం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది.

(వచ్చేవారం.. లహోయా కోవ్ – శాండియేగొ గురించి)

Exit mobile version