Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమృతం పంచిన వాళ్ళు అనాథలుగా మారొద్దు..

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘అమృతం పంచిన వాళ్ళు అనాథలుగా మారొద్దు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కన్నవాళ్లను పరాయివాళ్ళలా భావిస్తూ
వృద్ధాశ్రమాలకు చేరుస్తూ
అదేదో ఘనత సాధించినట్టుగా
పొంగిపోతుంటారు కొందరు!

తమ బిడ్డల సౌఖ్యమే
సర్వస్వమని భావిస్తూ
తల్లిదండ్రుల ఆలనాపాలనను మరచి
వృద్ధులైన పెద్దలను
నిర్లక్ష్యం చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు!

అమ్మానాన్నలు అమృతభాండాలు
వారి త్యాగాలు అమూల్యాలు
వారి కలల ఫలితమే
నేడు తమ జీవితంలోని
ఉన్నత స్థితి అని
మరిచిపోతుంటారు!

వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ
పలకరించడానికి కూడా
సమయమే లేనంత బిజీగా
జీవితాన్ని పరుగులు పెట్టిస్తుంటారు !

కానీ ఒక సత్యాన్ని మాత్రం
గుర్తించలేకపోతున్నారు
రేపు పిల్లలు సైతం వారితో
అలాగే ఉండొచ్చనే నిజాన్ని!

వందలాదిగా పెరుగుతున్న ‘వృద్ధాశ్రమాలు’
మారుతున్న సమాజానికి
మౌన సాక్ష్యాలుగా నిలుస్తుంటే
ఈ సంస్కృతి మారాలి!
వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి!

ప్రతి ఇల్లు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తో
ఆప్యాయతల ఆలయంగా అలరారాలి!

అదే మన సంస్కృతికి
నిజమైన గౌరవం
అదే మనిషితనానికి,
మంచితనానికి చిరస్థాయి వైభవం!

Exit mobile version