Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-6 – తుమ్ చలీ జావోగీ పర్ఛాయియా రహ్ జాయెగీ

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘శగున్’ (शगुन-Shagoon, 1964) చిత్రం కోసం రఫీ పాడిన పాట. సంగీతం ఖయ్యామ్.

సినిమాలలో ప్రేమ గీతాలన్నీ ఓ పద్ధతిలో కనిపిస్తాయి. తమ మనసుల్లో భావాలను నాయికా నాయికలు పరస్పరం ఒకరితో ఒకరు పంచుకుంటూ తాము ఒకరితో మరొకరు ఉండాలనే కోరికను వ్యక్తీకరించుకుంటారు. కాని సాహిర్ ప్రేమ గీతాల స్థాయి మహోన్నతం. ఆయన గీతాలలోని అనుభూతి స్థాయి అత్యున్నతం. ఒకో ప్రేమ గీతం ఒకో వినూత్న భావాన్ని కలిగిస్తుంది. విరహాన్ని, ప్రేమలోని విషాదాన్ని, ముఖ్యంగా ప్రేమ కలిగించే ఆ నొప్పిని ఆయన ప్రస్తావించే తీరు అమోఘం. ప్రేమలో గెలుపు ఓటముల కన్నా పేమను అనుభవించడమే జీవన సారం అనిపించే గాఢత ఆయన ప్రతి గీతంలో కనిపిస్తుంది. ప్రేమలో పడిన వ్యక్తిలో ఓ మహోన్నత వ్యక్తిత్వం దర్శిస్తాం. ఆయన పాటల్లో లోతు అర్థం అయితే ప్రేమించడమే మనిషి జీవన విధానం కావాలి. ఇలా ప్రేమించాలి, ఇలా ప్రేమను ఆస్వాదించగలగాలి అనిపిస్తుంది. సాహిర్ తన పాటల్లో చూపించే ప్రేమ జీవులు ప్రేమించి విశిష్టమైన వ్యక్తులుగా ఎదుగుతారు. వారి కథలు సుఖాంతమా దుఖాంతమా అన్నది అనవసరం. వారు ప్రేమించారు అంటే సంపూర్ణంగా జీవించారు, ఉన్నతంగా ఆలోచించారు అని అనిపించేటంత గొప్పగా ఉంటాయి ఆయన గీతాలన్నీ.

ప్రేమ గొప్పతనం గురించి కబీర్ ఓ రెండు వాక్యాలలో ఇలా చెప్పారు.

‘పోథీ పఢి పఢి జగ్ ముఆ పండిత్ భయా న కొయ్

ఢాఈ అక్షర్ ప్రేమ్ కా పఢె సో పండిత్ హోయ్’

గ్రంథాలన్నీ తిరగేసినంత మాత్రాన ఎవరూ పండితులు కారు. ప్రేమ అనే పదంలోని ఆ రెండున్నర అక్షరాలను చదవగలిగిన వాడే పండితుడు. నిరక్షరాస్యుడైన కబీర్ ‘ప్రేమ్’ అనే హిందీ పదంలోని ఒత్తును కలుపుకుని మరీ సరిగ్గా రెండున్నర అక్షరాలుంటాయి ఆ పదంలో అని ఒక వ్యాకరణ నిపుణుడుగా ఆ దోహా రాయడం నాకు ఎప్పటికీ వింతే. అలాగే అంతటి పాండిత్యాన్ని తన ప్రేమ గీతాలలో ప్రదర్శించగలిగే సాహిర్ రచనా శక్తి నాకు ఓ అద్భుతం. దీనికి ఉదాహరణగా ఈ గీతాన్ని చూద్దాం.

తుం చలీ జావోగీ పర్ఛాయియా రహ్ జాయేంగీ

కుఛ్ న కుఛ్ హూస్న్ కీ రానాయియా రహ్ జాయేంగీ

(నువ్వు వెళ్లిపోతావు, నీడలు ( అనుభూతులు)  ఇక్కడ మిగిలిపోతాయి. అందం జ్ఞాపకాల జాడలు  ఏవో కొన్ని ఈ చోట  మిగిలిపోతాయి. )

ఈ వాక్యలలోని లోతును ఆ అనుభూతిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. మనం ఓ అందమైన ప్రదేశంలో మనకు బాగా నచ్చినవారితో కొంత సమయం గడుపుతాం. కాలం ఎవరి కోసమూ ఆగదు. కొంత సమయం తరువాత ఎవరికి వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాని మన మనసుల్లో ఆ ప్రదేశం గుర్తుకు వచ్చిన ప్రతి సారి ఆ చోట ఆ వ్యక్తితో మనం గడిపిన ఆ కొన్ని క్షణాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. అందమైన అనుభవాలను ఆస్వాదించిన ఆ ప్రదేశం ఆ అనుభవాలతో ఆ వ్యక్తుల గుర్తులతో నిండిపోయి మనకే పూర్తిగా సొంతమైన భావన కలుగుతుంది. ఉదాహరణకు మన బాల్యంలో మనం తిరిగిన ప్రదేశాలను ఎప్పుడు చూసినా ఆ పాత అనుభూతి తోనే మనకు అవి ప్రతి సారి కనిపిస్తాయి. ఆ ప్రదేశంతో మనకో సంబంధం ఏర్పడుతుంది. అది పూర్తిగా మన అనుభూతి. జీవితం అంటే ఇలాంటి అనుభూతులను సంపాదించుకోవడమే. అంటే అందమైన ఆ క్షణాలు, ఆ వ్యక్తులు శాశ్వతంగా ఆ చోట మనకు సొంతమై మనకు మాత్రమే చెంది మదిలో నిలిచిపోతారు.

అందుకే ఇక్కడ కవి తన ప్రియురాలితో అంటున్నాడు నువ్వు వెళ్ళిపోతావు కాని ఈ చోటున ఓ నీడలా నా మదిలో శాశ్వతంగా నిలిచిపోతావు. ఎప్పుడు ఈ చోటుకు నేను వచ్చినా నువ్వు నా మనిషిగా ఇదే ఆనందానుభూతితో కనిపిస్తావు. ఆమెతో అక్కడ అతను గడిపిన ఆ క్షణాలు అతని జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఎంతలా అంటే ఆమె వెళ్ళిపోయినా అతనికి బాధ లేదు. ఎందుకంటే అతను అనుభవించిన ఆ క్షణాలు ఆమెను అతని జీవితంలో శాశ్వతంగా నిలిపి ఉంచుతాయి. ఇది ఇచ్చే ఆనందం ఆమె వెళ్ళిపోవడంతో కలిగే వియోగం కన్నా ఎంతో ఎక్కువ.

తుమ్ కి ఇస్ ఝీల్ కె సాహిల్ పె మిలీ హో ముఝ్సే

జబ్ భీ దెఖూంగా యహీ ముఝ్కొ నజర్ ఆవోగీ

యాద్ మిటతీ హై న కోఈ మంజర్ మిట్ సక్తా హై

దూర్ జాకర్ భీ తుమ్ అప్నె కొ యహీ పావోగీ

(నువ్వు ఈ కోనేరు ఒడ్డున నన్ను కలిసావు. ఎప్పుడు చూడాలనుకున్న నాకు నువ్వు ఇక్కడే కనిపిస్తావు. జ్ఞాపకాలు మాసిపోవు, దృశ్యాలు అదృశ్యమవలేవు. దూరంగా వెళ్లి కూడా నిన్ను నువ్వు ఇక్కడే కనుగొంటావు)

ఈ వాక్యాలు వింటున్న ప్రతి సారి ఓ వింత అనుభూతి కలుగుతుంది. ఆ ప్రేమికులు కొన్ని క్షణాలు ఓ కోనేటి ఒడ్డున కలిసారు. ఆ క్షణాలు తన మనసులో శాశ్వతంగా ఎలా ఎందుకు నిలిచి ఉంటాయో ఆ ప్రేమికుడు వివరించే తీరు ఎంత గొప్పగా ఉందో చూడండి. నువ్వు ఇక్కడ కొన్ని క్షణాలే నన్ను కలిసాననుకుంటున్నావు. కాని నిన్ను ఎప్పుడు నేను చూడాలనుకున్నా ఇక్కడకు వస్తే నాకు ఇలాగే కనిపిస్తావు. అంటే ఆ క్షణం ఆ కలయిక శాశ్వతంగా అతని మనసులో ముద్రించబడింది. అది ఎప్పటికీ చెరిగిపోదు. ఆమె, ఆ చుట్టూ ఉన్న ప్రకృతి ఇప్పుడు అతని జీవితంలో కలిసిపోయాయి. కాలం కూడా వాటిని మాపలేదు. జ్ఞాపకాలు మాసిపోవు, వారి మనసుల్లో నిలిచిపోయిన దృశ్యాలు ఎప్పటికీ అదృశ్యమవవు. అందుకే అతను ఆమెతో అంటున్నాడు నువ్వు ఇకడి నుండి దూరంగా వెళ్లిపోయినా నిన్ను నువ్వు ఇక్కడ చూసుకుంటావు. భౌతికంగా నువ్వు ఇక్కడ లేకపోవచ్చు కాని జ్ఞాపకంగా నువ్వు చిరస్థాయిగా ఇక్కడే మిగిలిపోయావు.

ఈ సందర్భంగా సాహిర్ ఒక మార్మికమైన  ఆలోచనను అతి సున్నితంగా, ప్రతీకాత్మకంగా చెప్తున్నాడు.

కాలం ముందుకే పరుగిడుతుంది. అది వెనక్కు రాదు. కానీ, కాలం అనుభవాలు మనస్సులో ముద్రించుకుపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషి మనసు గతం తాలూకు అనుభవాలను నెమరువేసుకుంటుంది. మనిషి శరీరం వర్తమానంలో వున్నా, మనసు గతంలోకి జారుకుంటుంది. వర్తమానాన్ని విస్మరిస్తుంది. ఆ సమయంలో ఎవరయినా పలకరిస్తే ఉలిక్కిపడి వర్తమానంలోకి వస్తాడు మనిషి. అంటే, కాలం గడచిపోయింది. కానీ, ఆ సంఘటన అనుభూతి మనసులో సజీవంగా వుండటంవల్ల, ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ అనుభూతి తాజా అవుతుంది. అంటే, ఇప్పుడు భౌతికంగా ఆ మనిషి అక్కడ లేకపోయినా, ఆ ప్రాంతంలో ఆ మనిషి ఆనవాళ్ళను మనసు అనుభవిస్తుంది. ఇది క్లిష్టమైన తాత్విక భావన. ఇంతకన్నా సరళంగా చెప్పటం కష్టం.

ఈ భావనను చరణాలలో మరింత స్పష్టం చేస్తాడు సాహిర్.

ఘుల్ కే రహ్ జాయెగీ ఝోంకో మె బదన్ కీ ఖుష్బూ

జుల్ఫ్ కా అక్స్ ఘటావొ మె రహేగా సదియో

ఫూల్ చుప్కె సె చురా లెంగే లబొం కీ సుర్ఖీ

యె జవాన్  హుస్న్ ఫిజావొ మె రహెగా సదియొ

(ఈ గాలి అలలలో నీ శరీరపు సువాసన కలిసిపోయింది. నీ కురుల ప్రతిబింబం ఈ నల్ల మబ్బుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక్కడి పూలు నీ పెదవుల ఎరుపును దొంగలించుకున్నాయి. నీ యవ్వనపు అందం ఈ వాతావరణంలో ఎప్పటికీ నిలిచిపోతుంది)

అంటే ఆమె ఆ క్షణం ప్రకృతిలో కలిసిపోయింది. ఇక ఆమె ఆ ప్రకృతిలో ఓ భాగం. అతను ఆమెను కోల్పోవడం అన్నది ఎప్పటికీ జరగదు. ఆ గాలి, ఆ మబ్బులు, ఆ పూలు అక్కడి వాతావరణం ఆమెను ఎప్పటికీ అతనికి గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇక ఆమె అతని జీవితంలో భౌతికంగా ఉంటుందో లేదో తెలియదు. కాని ఆ స్థలం, ఆ అనుభవం, ఆ అనుభూతి అతనికి శాశ్వతం. ఆమె ఆ క్షణం అతనికి సొంతమయిపోయింది. ఆమె ప్రయత్నించినా అతనికి దూరం కాలేదు. పల్లవిలోని భావాన్ని చరణంలో మరింత ప్రస్ఫుటం చేస్తున్నాడు.

అక్కడి గాలుల్లో ఆమె పరిమళం కలసిపోయింది. ఆమె ఉన్నా లేకున్నా అతను మాత్రమే ఆమె పరిమళానుభూతిని అనుభవించగలడు ఎప్పటికీ. పూలలో ఎరుపు, మేఘాలలో మెరుపు ఆమెనే.

ఇక్కడ గమనించాల్సిన విషయం సాహిర్ పదప్రయోగం.  ‘సదియోం’, ఆంటే, కొన్ని వేల సంవత్సరాలు. మనిషి జీవిత కాలం వంద కూడా సరిగ్గా కాదు. అలాంటప్పుడు వేల సంవత్సరాలుగా ఈ ప్రకృతిలో ఆమె భాగమై ఎలావుంటుంది అన్న ప్రశ్న వస్తుంది. ఒక తాత్విక సిద్ధాంతం ప్రకారం ఈ భూమిపై నడయాడిన ప్రతివ్యక్తి , భౌతికంగా అదృశ్యమైనా ఈ ప్రకృతిలో భాగమై సజీవంగానే వుంటాడు. మరణించినవారు నక్షత్రాలై ఈ భూమిని చూస్తూంటారని కొన్ని నాగరికతల్లో నమ్మకం వుంది. పాంచభౌతిక శరీరం పంచభూతాలలో కలసిపోతుంది, ఆత్మ అనంతంలో భాగమవుతుందంటారు. అంటే, వ్యక్తి భౌతికంగా కనబడడు. కానీ ప్రకృతిలో భాగమై వుంటాడు. ఒక్కసారి ఈ భూమిపై జన్మిస్తే ప్రకృతిలో అనంత కాలం భాగమై వుంటాడు. ఈ ఆలోచనను ప్రేమ భావనతో రంగరించి ఎంతో అందంగా చెప్పాడు సాహిర్.

ఇస్ ధడకతీ హుఈ షాదాబో-హసీన్ వాదీ మే

యె న సమ్ఝో కి జరా దేర్ కా కిస్సా హో తుమ్

అబ్ హమేషా కె లియె మెరె ముకద్దర్ కీ తరహ్

ఇన్ నజారొ కె ముకద్దర్ కా భీ హిస్సా హో తుం

(జీవంతో తొణికిసలాడే  ఈ అరవిరిసిన పచ్చటి వాతావరణంలో కొంచెం సేపు మాత్రమే ఉండిపోయే కథ నీవని అనుకోవద్దు.   ఇకపై  నా అదృష్టంలా  ఎప్పటికీ  ఇక్కడి ప్రకృతి దృశ్యాల అదృష్టంలో నువ్వు కూడా ఓ భాగమే)

నిరంతరం మారుతూ ఉండే ప్రకృతి ఇప్పుడు జీవంతో ఉంది. ఆమె అక్కడ అశాశ్వతమైన ఓ జ్ఞాపకం కాదు. అతనికి లభించిన ఓ అదృష్టం. ఆమె ఆక్కడ ఓ మధుర జ్ఞాపకంగా నిలిచి ఆ పకృతి అదృష్టంలో ఓ భాగంగా కలిసిపోయంది. తనను తాను ఆమె ఆ క్షణం నుండి ఎన్నటికీ వేరు చేసుకోలేదు. ఆమె ఉనికి అపురూపం, శాశ్వతం, ఎప్పటికీ నిలిచి ఉండే మధుర జ్ఞాపకం.

మార్మికతకు పరాకాష్ట ఈ చరణం.. నా అదృష్టంలో భాగంలా ఈ ప్రకృతి అదృష్టంలో కూడా ఎప్పటికీ భాగం అంటున్నాడు. మనిషి శాశ్వతుడా? అశాశ్వతుడా? అనడిగితే అడిగిన వాడిని వెర్రివాడిలా చూస్తాం. కానీ, పై చరణం వివరణలో శరీరం అదృశ్యమైనా మనిషి ప్రకృతిలో రూపరహిత స్థితిలో ఎల్లప్పటికీ వుంటాడని అనుకున్నాం. ఈ చరణంలో, నువ్వీ ప్రకృతిలో కాస్సేపటి కథవి మాత్రమే అనుకోకు అన్నాడు.

మై పల్ దో పల్ కా షాయర్ హూ

పల్ దో పల్ మేరీ కహానీ హై

పల్ దో పల్ మేరీ హస్తీ హై

పల్ దో పల్ మేరీ జవానీ హై…

ఇది కభీ కభీ సినిమాలో పాట. నేను క్షణికుడిని అంటున్నాడు కవి. అదే సినిమాలో,  చివరలో,  ప్రేమించుకుని వేరయి వేరేవారిని వివాహమాడిన ప్రేయసీ ప్రియుల పిల్లల వివాహమవుతుంటే ఇదే పాట ఇంకో రూపంలో వినిపిస్తుంది.

మై హర్ ఎక్ పల్ కా షాయర్ హూ

హర్ ఎక్ పల్ మేరీ కహానీ హై

హర్ ఎక్ పల్ మేరీ హస్తీ హై

హర్ ఎక్ పల్ మేరీ జవానీ హై..అని..

క్షణికుడిని అన్నవాడు యవ్వనం దాటి పరిణతి చెందిన తరువాత నేను శాశ్వతుడిని, అనంతుడిని అంటున్నాడు. ఎప్పుడయితే యవ్వనం దూకుడు తగ్గి జీవితాన్ని దగ్గరగా చూస్తాడో అప్పుడు అతడు గ్రహిస్తాడు, తాను అశాశ్వతుడిని కాదని. తన సంతానం ద్వారా తాను చిరంజీవినన్న గ్రహింపు వస్తుంది. అంతేకాదు, తనలోనూ తన తల్లితండ్రులతో సహా పూర్వీకులంతా సజీవంగా వున్నారనీ, తనద్వారా తనతో పాటూ వారంతా తన సంతానంలో సజీవంగా నిలుస్తారనీ, తన సంతానం వల్లా తామంతా అనంత కాలం సజీవంగా నిలుస్తామన్న గ్రహింపు వస్తుంది. అప్పుడు ‘మై పల్ దో పల్ కా శాయర్ హూ’ అనడు, మై హర్ ఎక్ పల్ కా శాయర్ హూ..అంటాడు..

ఇదే ఆలోచనను ఇక్కడ సదియోం అన్న పదంలో పొదిగాడు సాహిర్. ఆమె ఎల్లప్పటికీ అతని అదృష్టం.. ఆమె ద్వారా కలిగే సంతానం వల్లనే అతనికి శాశ్వతత్వం వస్తుంది. అంతే కాదు సమస్త ప్రకృతి అదృష్టం స్త్రీ.. ప్రకృతి స్త్రీకి ప్రతీక. కాబట్టి ఆ ప్రకృతిలో ఆమె వేల సంవత్సరాలు నిలచివుంటుంది.

తుమ్ చలీ జావోగీ పర్ఛాయియా రహ్ జాయేంగీ

కుఛ్ న కుఛ్ హూస్న్ కీ రాణాయియా రహ్ జాయేంగీ

ఇప్పుడీ పల్లవి వింటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. ప్రతిపదార్ధంకాక పదాలలో దాగివున్న లోతైన ఆలోచనలు మనసులో మెదులుతాయి. ఇదీ సాహిర్ పాటల రచన సంవిధానం. పైపైన చూస్తే ప్రేమ పాట. తరచి చూస్తే, జీవిత సత్యాలను, తాత్వికపుటాలోచనలను , సార్వజనీన భావనలను తనలో ఇముడ్చుకున్న కావ్యం.

జీవితంలో ప్రతిదీ అశాశ్వతమే. కాని అన్నిటినీ శాశ్వతంగా నిలపగలిగేది మనసు. ఆ మనసులో ముద్రించబడిన కొన్ని జ్ఞాపకాలు, ఆ మనసు అనుభవించే కొన్ని అనుభూతులు. ఇవే వాడని, మారని నిజాలు. అనుభూతి ప్రధానంగా జీవించే మనుషులు ఇలాంటి ఎన్నో శాశ్వత క్షణాలను తమ జీవితంలో సేకరించుకుంటారు. వాటికి అలంబన ప్రేమ. ప్రేమ అనుభవాలకు, అనుభూతులకు, వాటితో ముడిపడి ఉన్న మనుషులకు ఓ అమరత్వాన్ని ఇస్తుంది. ప్రేమ మాత్రమే ఇది చేయగలదు. అందుకే జీవితంలో ప్రేమకు అమితమైన శక్తి ఉంది. మనిషి చిరస్థాయిగా ఈ ప్రపంచంలో నిలిచిపోవాలంటే ప్రేమించాలి, ప్రేమించబడాలి, ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకే సాహిర్ ప్రేమను అనుభూతి స్థాయిలోనే ఉంచే ప్రయత్నం చేసాడు. వాస్తవ ప్రపంచం ఎన్నిటినో నశింపజేస్తుంది. కాని అనుభూతి ప్రతి క్షణికమైన అనుభవాన్ని శాశ్వతం చేస్తుంది. పై గీతం అశాశ్వతమైన జీవితంలో అమరత్వాన్ని ఎలా నింపుకోవచ్చో తెలిపే ఓ అద్భుతమైన గీతం. సినీ ప్రేమ గీతాలలోనే అతి గొప్ప గీతం.

దీన్ని రఫీ తప్ప మరొకరు ఇంత అద్భుతంగా గానం చేయలేరు అనిపిస్తుంది నాకు ఎన్నో సార్లు. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గీతం ఇది. నిజం చెప్పండి మన జీవితాలలో అలా శాశ్వతమైన క్షణాలు లేవంటారా? ఉంటాయి. కాని మనం అశాశ్వత్వాన్ని గురించి దిగులుపడుతూ ఆ అనుభూతుల అమరత్వాన్ని పట్టించుకోం. అందుకే ఈ పాటను వినండి నిత్యం మనలను దాటుకుని పరిగెడుతున్న కాలాన్ని ఎలా పట్టుకుని మన సొంతం చేసుకోవచ్చో వివరించే ఈ గీతాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని మరో కోణంలోనుంచి చూడటం నేర్చుకోండి.

అబ్ హమేషా కె లియె మెరె ముకద్దర్ కీ తరహ్

ఇన్ నజారొ కె ముకద్దర్ కా భీ హిస్సా హో తుం..

ఈ రెండు వాక్యాలతో జీవితాన్ని పట్ల ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సాహిర్ లుధియాన్వి సాహబ్‌కి షుక్రియా..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version