[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]
ఉ:
అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ; బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి; యా
వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి; వే మృణా
ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్
ఈ పద్యము తెలియని తెలుగువారుండరు. కావ్యలక్షణములలో ఇష్టదేవతాస్తుతి మొదటిది. విఘ్నేశ్వరుని పూజించకుండా దేవతలయినా ఏ పనినీ మొదలుపెట్టరు కదా! అందుకే మనం కూడా మన కాలమ్‌ను గణపతి స్తుతితో ప్రారంభిద్దాము. ఈ పద్యాన్ని వ్రాసింది అల్లసాని పెద్దన. తన ‘స్వారోచిషమను సంభవము’ (మనుచరిత్రము) అన్న కావ్యమునకు నాందీపద్యముగా ఆయన దానిని వ్రాశారు. వినాయకుని అత్యంత చమత్కారంగా చాలామంది కవులు స్తుతించారు. పెద్దన గారి ఈ పద్యం వాటిల్లో తలమానికంగా నిలుస్తుంది.
ఖండాన్వయము:
అంకమున్=తొడమీద, చేరి=కూర్చుని, శైలతనయా=పర్వతరాజ పుత్రి పార్వతీ దేవి యొక్క; స్తన=పాలిండ్ల, దుగ్ధములు=పాలు; అను వేళ=తాగుతున్న సమయములో, బాల్యాంక=చిన్నపిల్లలకు సముచితమైన; విచేష్టన్=విశేషమైన పనిగా; తొండమునన్=తన బుజ్జి తొండముతో, అవ్వలి=అటువైపున నున్న; చన్=తల్లి చన్నును, కబళింపన్=పట్టుకోవడానికి; పోయి=వెళ్లి, ఆవంక=అటువైపు; కుచంబున్=స్తనమును; కానక=చూడలేక; అహివల్లభ=పాములలో శ్రేష్ఠమైనదైన; హారమున్=కంఠాహారమును, కాంచి=చూచి; వే=తొందరగా, మృణాళ=తామరతూడు, అంకుర=లేత (లేతదైన తామరతూడు), శంకన్=అనే అనుమానంతో; అంటెడు=పట్టుకున్నటువంటి, గజాస్యునిన్=ఏనుగు ముఖము గల విఘ్నపతిని; కొల్తున్=పూజిస్తాను; అభీష్ట=నా యొక్క కోరిక; సిద్ధికిన్=తీరుటకునై,
దండాన్వయము:
అమ్మ ఒడిలో చేరి, గిరిజాదేవి వద్ద, స్తన్యము కుడుచుచున్న సమయంలో, చిన్నపిల్లలందరూ చేసే విధంగా, ఒక వైపు పాలు తాగుతూ, రెండో స్తనమును పట్టుకోబోయి, అటువైపు స్తనము కనిపించక, దాని స్థానంలో పామును చూచి, ఆ పామును లేత తామరతూడు అనుకొని, పట్టుకుంటున్న గణేశుని, నా కోరికలు తీర్చుకోడానికై, పూజిస్తాను.
‘పదచిత్రము’ (word picture) కు అద్భుత, సుందరమైన ఉదాహరణమీ పద్యరత్నము. దీనిలో వాచ్యము (చెప్పబడినది) గా ఉన్న విషయము, వ్యంగ్యము (చెప్పబడని)ను సూచిస్తున్నది. రవివర్మ, వడ్డాది పాపయ్య గార్ల వంటి దిగ్గజ చిత్రకారులు, ఈ పద్యాన్ని విని, చక్క బొమ్మ గీసేస్తారు. సృష్టిలో అంత మనోహరమైన చిత్రం అంత కంటే ఏది? నాకు తెలియదు కాని, చందమామ, యువ, లాంటి పత్రికల మీద ఈ చిత్రం కొలువు తీరే ఉంది ఉంటుంది. లేదా, ఏ మైసూరు మహారాజా ప్యాలెస్ లోనే గోడమీద అలంకరించబడే ఉంటుంది.
బుజ్జి గణపయ్య, అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు. చిన్న పిల్లలేం చేస్తారు? ఒకవైపు తాగుతూ, మరోవైపున ఉన్న కుచముతో ఆడుకుంటారు. వారికి అది అతి సహజమైన చేష్ట. అంతవరకు బాగానే ఉంది. మన గణపయ్య కూడా అట్లా చేద్దామనుకున్నాడు. కానీ అటువైపు అమ్మ చన్ను కనబడదే! కనపడకపోగా ఒక పాము కనబడింది! గజానన్ మహారాజ్ ఏమీ భయపడలేదు. పైగా ఇదేదో లేత తామరతూడులా ఉందే అని పట్టుకున్నాడు. ఇది వాచ్యం.
వ్యంగ్యం ఏమిటంటే, అనగా పరోక్షంగా పెద్దన చెబుతూ ఉన్నది పార్వతీ పరమేశ్వరుల అర్థనారీశ్వర తత్త్వాన్ని. తల్లి కుమారునికి పాలు ఇవ్వడంతో దానిని అనుసంధానించడం కవి కల్పనా చాతుర్యం. ఊరికే అన్నారా, “అల్లసానివాని అల్లిక జిగిబిగి” అని!
అర్ధనారీశ్వరమూర్తిలో సగం (ఎడమవైపు అమ్మవారు), మిగతా సగం (కుడి వైపు అయ్యవారు) ఉంటారు. అటువైపు నాన్న ఉన్నాడు మరి! అందుకే స్తనం గణపయ్యకు కనబడలేదు. నాన్న మెడలో పాము ఎప్పుడూ ఉంటుంది. దాన్ని తామరతూడు అనుకొని గజాస్యుడు పట్టుకోవడంలో ఎంతో ఔచిత్యముంది. ఏనుగులకు తామరతూళ్ళంటే చాలా ఇష్టం కదా! అలా పెద్దన ఔచిత్యపోషణ చేశాడు. “అనౌచిత్యాదృతే నాన్యత్ రసభంగస్య కారణమ్” అని క్షేమేంద్రుడు చెప్పనే చెప్పాడు. ఆ లాక్షణిక మమహాశయుడు ‘ఔచిత్య విచార చర్చ’ అన్న గ్రంథమే వ్రాశాడు.
పార్వతీపరమేశ్వరులు ఆది దంపతులు. వారి కుమారుడు విఘ్ననాథుడు, జగద్వంద్యుడు, గీర్వాణ పరిపూజితుడు. స్వామికి అమ్మవారికి అభేదమే. వారిరువురూ ఒకటే కాని వేరుకాదని కాళిదాసుల వారు తమ రఘువంశ కావ్యావతారికలో
‘వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే।
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥’
అని ఆ దంపతులను స్తుతించాడు. వారు విడదీయరాని (inseparables) వారు. ఎలా? వాక్కు, దాన్ని అర్థము ఎలా ఒకటి లేక మరొకటి లేవో అలా! ఇంతకంటే గొప్ప ఉపమానం ఎవరు చెప్పగలరు? కవికుల గరువు తప్ప. “ఉపమా కాళిదాసస్య” అన్నారు.
ఈ పద్యం చివరిపాదంలో భ్రాంతిమదాలంకార ఛాయలున్నాయి. ఒక దానిని చూచి మరొక దానిగా భ్రమపడితే భ్రాంతిమదాలంకారం అవుతుంది. దానిలో స్వభావోక్తిని మిళితం చేయడం పెద్దనకే చెల్లింది.
‘ధారాశుద్ధి’కి చక్కని తార్కాణంగా ఈ పద్యాన్ని చెప్పుకోవచ్చు. ఒక logical sequence, అంటే పాలు తాగుతూ ఉండడం, రెండో కుచముతో ఆడుకోబోవడం, అక్కడ అది లేకపోవడం, పైగా పాము ఉండడం, తామరతూడు అనుకొని దానిని పట్టుకోవడం. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా అమిరాయి. ఉత్పలమాలా వృత్తములో దీనిని అలవోకగా బంధించారు అల్లసానివారు. ‘మృణాళాంకుర శంక’ అన్న ప్రయోగంలో కొంత వృత్యనుప్రాసమున్నది. ప్రాసలన్నీ అతి సహజంగా ఉపయోగించబడ్డాయి. అయినా, ప్రాస కోసం ప్రయాస పడవలసిన పని ఆయనకేముంది? అందుకే
కం:
“పెద్దన వలె కృతిజెప్పిన
పెద్దనవలె నల్పకవిని పెద్దనవలెనా
ఎద్దనవలె మొద్దనవలె
గ్రద్దనవలె కుందవరపు కవి చౌడప్పా!”
ఎద్దనవలె, మొద్దనవలె, గ్రద్దనవలె కుందవరపు కవి చౌడప్పా! అని కవి చౌడప్పగారు సెలవిచ్చారు.
నా విశ్లేషణలో ఏవైనా తప్పులుంటే విబుధులు మన్నింపగలరు.
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
