Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనర్ఘరత్నాలు-10

[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]

కం.:
ఏ యంగకమును భావన
చేయక వ్రాయంగరాదు; చేసిన నానం
దాయత్తతమది చొక్కు, బ
రాయత్తపు బుద్ధి చెలువ నలవియె వ్రాయన్.

శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారనే సాహిత్య విమర్శకుడు ఈ పద్యాన్ని ‘మెటా’ కవిత్వానికి ఉదాహరణగా పేర్కొని, దానిని విశ్లేషించినారు. ముందుగా వారికి కృతజ్ఞతలు.

పింగళి సూరన కవితా వైభవమును దర్శించని, ఆనందించని పద్యకావ్య ప్రేమికులుండరు. ఈ పద్యం ఆయన వ్రాసిన ‘ప్రభావతీ ప్రద్యుమ్నము’ అన్న కావ్యం లోనిది. శుచిముఖి అనే హంస దీనిలో ప్రభావతి నిసర్గ నిరుపమాన సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంది. నిజానికి వర్ణిస్తూ ఉన్నవాడు పింగళి సూరన. అచ్చతెనుగు పద్యం ఇది. కానీ అంత సుబోధకం కాదు. చిత్రలేఖన కళని లోతుపాతులు ఇందులో ఉన్నాయి.

అల్లసానివారు “ప్రవరాఖ్య డలేఖ్య తనూ విలాసుడై” అని ప్రవరుని అందచందాలను వర్ణించారు. ప్రవరుని తనూవిలాసం అలేఖ్యం. అంటే వ్రాయడానికి కుదరనిది. ఇక్కడ వ్రాయడం అంటే ‘కుంచెతో చిత్రీకరించడం’ అని అర్థం చేసుకోవలె. “చిత్తరువు వ్రాసితి..” అన్న ప్రయోగం ఉంది. ‘అలేఖ్య’ అన్న ఒక్క పదంతో పెద్దన గారు సరిపెట్టినారు. ఆ పదం సుప్రసిద్ధమై, ఆడపిల్లలకు ‘అలేఖ్య’ అనే పేరు పెట్టుకునేంతవరకు వెళ్లింది.

‘చిత్రీకరించడానికి వీలుపడకపోవడం’ అనేది ఎంత గహనమైన విషయమో, మనస్తత్వశాస్త్రంతో అన్వయిస్తూ పింగళి వారు ఈ పద్యము వ్రాసినారు. ఈ శుచిముఖి ఉందే, హంస, ఇది చాలా గడుసుది. ఇది ఏమి చెప్పినా, సొగసుగా ఉంటుంది. కాని ఒక పట్టాన అంతరార్థం ఆవిష్కృతం కాదు. గడుసుతనమంటే అదే కదా మరి!

ఒకసారి పదార్థాన్ని (Substance), పద్యార్థాన్ని పరిశీలిద్దాము. ఏ యంగకమును: ఏ అవయవాన్ని, శరీరభాగాన్ని కూడా, భావన చేయక: లోతుగా ఆలోచించకుండా, వ్రాయంగ రాదు. ఆమె బొమ్మ గీయడానికి వీలుపడదు. చేసిన: అట్లా చేస్తే, అంటే లోతుగా ప్రతి శరీరభాగాన్ని గురించి ఆలోచించకుండా గీస్తే (వ్రాస్తే), ఆనందాయత్తత: ఆనందముతో ఆవరింపబడిన, మది: మనస్సు; చొక్కు: పరవశమైపోతుంది; పరాయత్తపు బుద్ధి: మనసు పరవశమైన స్థితిలో దానికి నియంత్రణ ఉండదు. అప్పుడు, చెలువన్: ప్రభావతిని గురించి వ్రాయన్: చిత్రీకరించడానికి, అలవియె: సాధ్యమా?

కళ మనస్సంబంధి అని సూరన్న గారు స్పష్టం చేస్తున్నారు. బొమ్మ ఒకటి గేయవలెనంటే దానిపైన మనసును కేంద్రకరించవలె. దానినే ఏకాగ్రత అంటారు. అగ్రతః ముందు, ఏకః: ఒకే వస్తువును ఉంచడం, ఏకాగ్రత. ప్రభావతీ సౌందర్య వీక్షణా పరవశమైన శుచిముఖి మనసు ఆమె అందాన్ని చిత్రీకరించడంలో నిస్సహాయయత పొందింది.

‘మెటా కవిత్వం’ అంటే ‘కవిత్వం ఎలా రాయాలి’ అన్నదే వస్తువుగా కవిత్వం వ్రాయడం. పెద్దన గారి “పూతమెరుంగులున్” అన్న సుదీర్ఘ ఉత్పలమాలిక దీనికి చక్కని ఉదాహరణ. సంస్కృత సాహిత్యంలో దీనిపై ఎక్కువ చర్చ జరిగినట్లు అనిపిస్తుంది. ‘ప్రభావతీ ప్రద్యుమ్నము’లో, ఇంద్రుని ద్వారా కవి ‘శబ్దసంస్కార మెచ్చటను జారగనీక’ అన్నపద్యంలో కవిత్వతత్త్వాన్ని చెప్పాడు. ఈనాటి మన అనర్ఘరత్నం బయటికి చిత్రలేఖనం గురించి అన్నట్లు కనిపించినా, కవిత్వం గురించి కూడా చర్చించింది. ‘శుచిముఖి’ అన్న పేరే అపురూపమయినది. అది కవయిత్రి కూడా. దానికి ఈ పేరు పెట్టింది సాక్షాత్తు సరస్వతీదేవియేనట.

“శబ్ద సంస్కార పూతంబను బుద్ధి
న ద్దేవియ నాకు శుచిముఖియని
పేరిడియె”

‘శబ్ద సంస్కారం’ ఉన్న పదబంధం చాలా గొప్పది. ఒక్కో పదానికి, అది ఉపయోగించబడిన సందర్భాన్ని బట్టి అద్భుతమైన శక్తి వస్తుంది. ఈ పద్యంలో, కవిత్వాన్ని వ్రాసే క్రమంలో, కవి పొందే ఒక ద్వైదీభావ కాతురతను వర్ణించాడు సూరనార్యుడు. ఆ లెక్కన, చిత్రలేఖనం, కవిత్వానికే కాదు, సంగీతానికి, నాట్యానికి కూడా ఇది వర్తిస్తుంది. కళ ఇతరులను పరవశింపచేయాలి కాని, దాన్ని సృష్టించేవాడే పరవశుడైతే, కళాసృష్టి జరుగదు. ప్రముఖ గాయని శ్రీమతి ఎస్.జానకి గారిని ఒకసారి ఎవరో అడిగారట – “అత్యంత విషాద గీతాలను పాడేటప్పుడు వీరు కూడా దుఃఖిస్తారా?” అని. దానికి ఆమె నవ్వి “నేను ఏడుస్తూ కూచుంటే, పాటలో విషాదాన్ని ఎలా పలికించగలను?” అన్నదట.

సాంప్రదాయికములైన ఉపమలను ప్రభావతి పట్ల వాడాలంటే, శుచిముఖికి సిగ్గు వేస్తుందట. “వీనిదడవ సిగ్గొదవు నవ్వెలదినెంచి” అంటుంది. ఇది ఒక అలంకారమే, దీన్ని ‘వ్యతిరేకాలంకారం అనవచ్చు’ అంటారు భైరవభట్ల.

‘డేవిడ్ డీన్ షుల్మాన్’ ఇజ్రాయిల్‌కు చెందిన కవి, ఇండాలజిస్టు (భారతదేశ అధ్యయనకారుడు), బహుభాషా కోవిదుడు. ఆయన ‘ప్రభావతీ ప్రద్యుమ్నము’ను ఆంగ్లంలోకి అనువదించారు. కళాపూర్ణోదయానికి వచ్చినంత ప్రాచుర్యం, ఎందుకో ‘ప్రభావతి’ కి రాలేదనిపిస్తుంది. షుల్మాన్ అందులోని కవిత్వతత్త్వాన్ని దర్శించి, ‘ప్రత్యేకీకరణ’ ప్రక్రియను సుసంపన్నం చేశారు.

Exit mobile version