Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనర్ఘరత్నాలు-13

[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]

ఉ॥
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి, యా
మిక్కిలి కంటికిన్ దనదు మిక్కిలి హస్తము మాటుసేసి ఇం
పెక్కెడి బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖున్ గొలుతున్ బ్రసన్నుగాన్.

ఈ పద్యరత్నం కేతన రచించిన ‘దశకుమార చరిత్ర’ లోనిది. నాందీపద్యము. ‘దశకుమార చరిత్ర’ సంస్కృతము లోని పంచకావ్యాలలో ఒకటి. అది వచనకావ్యం. బాణభట్టు ‘కాదంబరి’ తర్వాత అంత ప్రాచుర్యము పొందినది. దానిని కేతన కవీంద్రుడు తెలుగులోకి పద్యకావ్యముగా అనువదించాడు. గద్యకావ్యాన్ని పద్యకావ్యంగా అనువదించడం ఆయనకే చెల్లింది.

ఈ పద్యముతో ఆయన విఘ్నపతిని స్తోత్రము చేస్తున్నాడు. వినాయకుని చమత్కారంగా స్తోత్రం చేసిన వారిలో పెద్దన అగ్రగణ్యుడు. ఆయన ‘అంకము జేరి శైల తనయా స్తన..’ అనే పద్యాన్ని మన కాలమ్‍లో పరిచయం చేసి ఉన్నాము.

కేతన భావం అత్యంత మనోహరమైనది. భాష అతి సరళం. ఆయన వాడిన పదాలు విభిన్నంగా ఉంటాయి. పద్యం యొక్క అర్థాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

బుజ్జి గణపతి, వాళ్ల నాన్న శివయ్యతో మురిపాలు సాగిస్తున్నాడు. ఆయన రెండు కళ్లనూ, గబుక్కున వెనకనుంచి వచ్చి, తన చిట్టి చేతులతో మూసి, “నేనెవరో చెప్పుకో!” అన్నాడు, ముద్దు ముద్దుగా.

పరమశివుడు నవ్వాడు. రెండు కళ్లు కొడుకు మూసినా, ఆయనకు చక్కగా అంతా కనపడుతూ ఉంది. ఎందుకు? ఆయనకు మూడో కన్ను ఉంది కదా! దీనిని కేతన ‘మిక్కిలికన్ను’ అన్నాడు. అంటే ‘అదనంగా ఉండేది’.

నాన్న మూడో కంటితో చూస్తూ నవ్వుతున్నాడని తెలిసి విఘ్నపతి తన ‘మిక్కిలి హస్తము’ అంటే తొండంతో దానిని కూడా మూసివేశాడు. “ఇప్పుడు చూడు మరి!” అన్నాడు అల్లరిగా. పరమేశ్వరుని మనస్సు, కొడుకు చర్యలతో ‘పల్లవించింది’! దీనిని ‘బాలకేళి’గా అభివర్ణించాడు కేతన. ‘మూసి’ అనడానికి ‘మాటువేసి’ అన్నాడు. ‘నేత్ర యుగ్మమును కరద్వితయంబున’ అనడంలో కూడా సొగసు ఉంది. అలా అల్లరి చేస్తున్న గణపయ్య ‘ముద్గునన్ బొలుచు’తున్నాడు. ఆయనను ప్రసన్నుడిని చేసుకోవడం కోసం, పూజిస్తాను.

భావం, భాష, చమత్కారం ఈ పద్యంలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. చూశారా? పద్యమంటే ఇలా ఉండాలి. ఎవరికీ అర్థం కాకుండా, కేవలం పాండిత్య ప్రదర్శన పద్యాలు రాస్తారు ఆధునిక పండితులు. వారికే పురస్కారాలు!

‘పదచిత్రాని’కి (word picture) మరో చక్కని ఉదాహరణ ఈ హృద్యమైన పద్యం. బాపు గారైతే దీనికి చక్కని బొమ్మ వేస్తారు.

కేతన అసలు పేరు ‘మూలఘటిక కేతన’. దశకుమార చరిత్ర, పదిమంది రాజకుమారుల సాహస ప్రేమగాథాలహరి. దీనిలో 12 అధ్యాయాలు, 1625 పద్యాలు ఉన్నాయి! ఆయన బమ్మెర పోతనామాత్యుని శిష్యుడు. అందుకే పోతన్నగారి మార్దవం ఆయన కవిత్వంలో మనకు గోచరమవుతుంది.

విశ్వనాథవారు ‘అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు’ అన్న పద్యంలో చెళ్లపిళ వంశస్వామికి తాను శిష్యుడవడం, గురువుగారికి గర్వకారణం అని చెప్పుకున్నారు. కేతన తన గురువుగారి గురించి ఇలా చెప్పుకున్నాడు

తే.గీ.:
కవిత జెప్పి యుభయకవిమిత్రు మెప్పింప
నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ
బరగ దశకుమారచరితంబు జెప్పిన
ప్రోడ నన్ను వేరె పొగడ నేల?

గురువులను గౌరవించడంలో ఒకరొకరిది ఒక పద్ధతి.

కేతన ‘ఆంధ్రభాషాభూషణం’ అన్న వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశాడు. అది తెలుగులో వచ్చిన తొలి వ్యాకరణ గ్రంథం. ‘నవదండి’ అన్న బిరుదు ఉంది. ఆయన 13వ శతాబ్దానికి చెందిన వాడు.

‘కేతన – ఒక వివేచన’ అన్న వ్యాసాన్ని సంచిక వారపత్రిక పాఠకాలకు ఇది వరకు నేను అందించి ఉన్నాను.

మరొక అనర్ఘరత్నంతో వచ్చే నెల కలుద్దాం. సెలవు.

Exit mobile version