[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]
కం.:
క్షితి భర్త కుమారుడు, లో
హితుడన విలసిల్లె జేర్చి హృదయంబున, సం
తత ముదమునను జనాదర
మతి సాంద్రముగా బహుశ్రుతానందితుడై.
తెలుగు పద్యకవిత్వములో అత్యంత ధిషణాగంభీరమైనది, కవి అసామాన్య ప్రతిభకు తార్కాణము, ‘ద్వర్థి కావ్యము’. బహుశా ప్రపంచములోని ఏ భాష లోనూ, ఈ వినూత్న ప్రక్రియ లేదేమో? ఒక కావ్యాన్ని, రెండు అర్థాలతో సమన్వయం చేస్తూ రాయడం కత్తి మీద సాము. సంస్కృతాంధ్ర భాషలలో, ఏకాక్షర నిఘంటు అధ్యయనంలో ఆరితేరిన కవివతంసులు మాత్రమే ఈ జోడు గుర్రాలపై స్వారీని నిర్వహించగలరు. దీన్నే ఆంగ్లంలో ‘Herculean Task’ అంటారు, హెర్కులిస్ చేసింది శారీరికమైన విన్యాసం మాత్రమే కాని ద్వర్థికావ్య రచన మేధావిన్యాసం.
ఈ పద్యం ‘హరిశ్చంద్ర నలోపాఖ్యానము’ లోనిది. దీని కర్త రామరాజభూషణుడు. ఈయనను భట్టుమూర్తి అని కూడా అంటారు. వాణికి గారాబుపట్టి ఆయన. ఈ కావ్యాన్ని ఆయన క్రీ.శ. 1580 ప్రాంతంలో వ్రాశారు. శ్రీరామచంద్రప్రభువుకు అంకితమిచ్చాడు. పింగళి సూరన ‘రాఘవపాండవీయము’ అనే ద్వర్థి కావ్యాన్ని రచించాడు. భారతము, రామాయణము, రెండూ కలిసి అన్ని పదాల్లో సాగుతుంటాయి. భారతరామాయణాల్లో సామ్యంగా ఉన్న విషయాలు అధికం. కాబట్టి సూరన పరిధి విస్తృతం. అంత మాత్రాన సులభం కాదు!
కాని, హరిశ్చంద్ర, నలోపాఖ్యానాల్లో సామ్యమైన అంశాలు అతి తక్కువ. కాబట్టి భట్టుమూర్తి పనే క్లిష్టమైనదని చెప్పవచ్చు. ద్వర్థికావ్యమును వ్రాయడం ఎంత కష్టమో పింగళి సూరనే ఇలా చెప్పాడు.
శా.:
రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
కుండుం తద్గతి కావ్యమెల్ల నగునే? నోహో యనం జేయదే
పాండిత్యంబున నందునున్ తెనుగు కబ్బం బద్భుతం బండ్రు, ద
క్షుండెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషాకృతిన్.
ఈ పద్యానికి హరిశ్చంద్ర కధను బట్టి చూస్తే ఇలా విడదీయాలి. దీనినే దండాన్వయం అంటారు.
క్షితి భర్త, కుమారుడు, లోహితుడన, హృదయంబున, చేర్చి, సంతత, ముదమునను, జనాదరమతి, బహుశ్రుత, అనందితుడై, సాంద్రముగా విలసిల్లె.
నలుని కథను బట్టి చూస్తే:
క్షితి భర్తకు, మారుడు, లో, హితుడన, విలసిల్లె, బహుశ్రుత, ఆనందితుడై సంతతము, దముననుజను (దమయంతిని), హృదయమున, చేర్చి, ఆదరము, అతి సాంద్రము గాన్.
అద్భుతం కదా! సూరన కావ్యానికీ భట్టుమార్తి కావ్యానికి 3 దశాబ్దాల అంతరం ఉంది. మొదట రాఘవపాండవీయాన్ని వేములవాడ భీమకవి రచించినాడని అంటారు గాని, దానికి ప్రమాణం లేదు. ఆ గ్రంథమే అలభ్యం.
ద్వర్థి కావ్యంలో ఈ క్రింది విధానాలను అనుసరిస్తారు
- ఒకే పదాన్ని తెలుగులో, సంస్కృతంలో వేరే అర్థాలతో ప్రయోగించడం (ఉభయభాషాశ్లేష)
- పదాల్లో శ్లేషల ద్వారా (సభంగశ్లేష)
- నానార్థములు గల పదాల ప్రయోగం (అభంగశ్లేష)
- ఒక పదానికి రెండు రకాల అర్థాలు. ముఖ్యార్థం, గౌణార్థం. ఈ రెండింటినీ సమన్యయం చేయడం
- పదం యొక్క ఒకే అర్థాన్ని వేర్వేరుగా చూపడం
- పదాల అన్వయమును విరిచి చూపడం.
తెలుగు సాహిత్యంలో ఇతర ద్వర్థి కావ్యాలు, వాటి కవులు
- నైషధ పారిజాతీయం – కృష్ణాధ్వరి (1620)
- ధరాత్మజా పరిణయం – క్రొత్తలంక మృత్యుంజయకవి (18వ శతాబ్దం). ‘ధరాత్మజ’ అన్న పదంలోనే సీత, పార్వతీ అనేన అర్థాలు!
- అచలాత్మజా పరిణయం – బుక్కపట్నం వెంకటాచార్యులు. (1730)
- లంకావిజయం – పిండిప్రోలు లక్ష్మణకవి (1717)
- కృష్ణార్జున చరిత్రం – మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి (1850)
- రామకృష్ణోపాఖ్యానం – శ్రీపాద వెంకటాచల కవి
- శివరామాభ్యుదయం – పోడూరి పెదరామామాత్యుడు (18వ శతాబ్దం).
ఇలా చాలా ఉన్నాయి. “అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః” అని తన ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనుడన్న మాట అక్షరసత్యం!
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
