Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనర్ఘరత్నాలు-7

[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]

సీ.:
చెక్కితివా యొక్క టక్కులాడిని రాత
పరమహంసకు మత్తు బరుపగలవు
వ్రాసితివా యొక్క పాపని రాతిలో
గొడ్రాలికిని జేపు గూర్పగలవు
తీర్చితివా యొక్క దీనమూర్తిని రాత
పిసినారి చేయి జూపించగలవు
ఉంచితివా రాత నొక యోధు, పందతో
మిటమిట గుడ్లుఱిమింప గలవు

తే.గీ.:
సంతరించితివా యతీశ్వరుని రాత
నమిత భోగిని కానల కంపగలవు
చేతి మెలకువ జూపి, మా శిల్పివర్య!
చేయవలెనన్న యేమైన జేయగలవు

~

ఈ పద్యము, బ్రహ్మశ్రీ, శతావధాని పౌరాణికరత్న పాణ్యం లక్ష్మీనృసింహశాస్త్రిగారు; వారి అన్నగారు పాణ్యం నరస రామయ్యగారు కలసి రచించిన ‘ప్రభాతరేఖలు’ అను ఖండ కావ్యము లోని, ‘శిల్పి’ అన్న ఖండిక లోనిది. కళాకారునికి గల శక్తిని, ఈ పద్యములో కవి ఉన్నతీకరించుచున్నాడు. ఆయన తీసుకున్నది ‘శిల్పి’ని.

జంటకవుల సంప్రదాయం తెలుగులో మొదటి నుండి ఉంది. రాయలసీమలో ‘పాణ్యం సోదర కవులు’గా వినుతినెక్కిన వారు పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి, పాణ్యం నరసరామయ్యగారలు. ‘శిల్పి’ తాను చెక్కే శిల్పాల ద్వారా, మానవులలో పరివర్తన తేగలడు. అంతే కాదు, అతడు తల్చుకొంటే ఏమైనా చేయగలడు అని ఈ జంటకవులు, విరోధాభాసాలంకారంలో అందంగా ఆవిష్కరించినారు. వారిరువురూ ఏకోదరులు కాదు; అన్నదమ్ముల పిల్లలు. ఈ ఖండ కావ్యములో, ఏ పద్యం ఎవరు రాసినారో తెలియదు. అంతగా వారి భావ సౌకుమార్యం, భాషా సౌందర్యం, శిల్పం, మమేకమై ఉంటాయి. ఈ కావ్యానికి ‘తొలిపలుకు’ను వ్రాసిన వారు శ్రీమాన్ సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు. వారిలా అన్నారు:

“జంటకవులలోని ‘జంటతనము’ హృదయమునకు సంబంధించినది గాక మరేమగును? కనుక, ఈ కావ్యమును విమర్శించునపుడు కవులిరువురను విషయమును ఎంత మఱచిన, నంతమేలు!”

వారి శరీరములు వేరుగాని, ‘కవితాత్మ’ ఒక్కటే అని పుట్టపర్తివారి అభిప్రాయము.

ఇక పద్యం గురించి..

ఇది సీసపద్యం. క్రమంగా భావాన్ని పెంపొందించుకుంటూ పోవడానికి దీనికంటె అనుకూలమైన ఛందస్సు లేదు. ఇందులో ‘రాత’, ‘రాత’ అని మూడు సార్లు కవి ప్రయోగించినారు. వ్రాయడం అంటే చెక్కడం. చిత్రకారులు బొమ్మలను వేసిన సందర్భంలో కూడా చిత్రము వ్రాసినాడంటారు. ‘అలేఖ్య’ అన్న పదం దీని నుంచి పుట్టినది. దాని అర్థం, ‘చిత్రించుటకు శక్యం కానిది’ అని. పెద్దన, తన ప్రవరుని, ‘అలేఖ్య తనూవిలాసుడై’ అని వర్ణించినాడు కదా!

“Art Imitates life” అన్నాడు గ్రీకు సాహిత్య పితామహుడు అరిస్టాటిల్. ఒక శిల్పి తన శిల్పాల ద్వారా జీవితాన్ని అనుకరించడమే కాదు, ప్రతిబింబిస్తాడు కూడా. అంతేకాదు, మానవ స్వభావాల్లో సకారాత్మక మార్పును కూడా తీసుకురాగల శక్తి ‘కళ’కున్నది. ఈ పద్యములో ‘చెక్కితివా’, ‘వ్రాసితివా’, ‘తీర్చితివా’, ‘ఉంచితివా’, ‘సంతరించితివా’ అన్న ఐదు క్రియాపదాలున్నాయి. శిల్పి తన రచనా నైపుణ్యాన్ని ఎట్లా ఆవిష్కరిస్తాడో ఇవి తెల్పుతున్నాయి.

ఒక అందగత్తెను చెక్కినాడంటే, పరమహంస కూడా మత్తిల్లిపోతాడట. ఒక్క పసిపాపని శిల్పంగా కూర్చితే, గొడ్రాలికి కూడా పాలు చేపుకు వస్తాయట. ఇది అతిశయోక్తి కాదు. ఆమెలో కూడా మాతృత్వ స్పందనలు వస్తాయని.. ఒక దీనుని శిల్పంగా మలచినా తంటా, ఆ దీనత్వానికి కదిలిపోయి, పరమపిసినారి సైతం, దానమివ్వబోతాడట. ఒక యోధుటిని రూపు దాల్చేలా చేస్తే, పిరికివాడు కూడా ధైర్యవంతుడౌతాడట. ఒక యోగిని తయారు చేస్తే, భోగి కూడా తపస్సు కోసం అరణ్యాలకు వెళతాడట. ఇట్ల, శిల్పివర్యుడు ఏమైనా చేయగలడట. ఎంత మనోహరమైన భావం! కళాకారుల మాధ్యమాలు వేరైనా, లక్ష్యం ఒక్కటే, ప్రయోజనం ఒక్కటే. అన్నమాచార్యుల వారి ‘చిన్ని శిశువు’ కీర్తన వింటుంటే, బాలకృష్ణమూర్తి, వాళ్లమ్మ యశోద వెంట పారాడుతూ మన కళ్ల ఎదుట నిలుస్తాడు.

ఇక్కడ కవి ‘చేతి మెలకువ’ అన్న ప్రయోగం చేసినాడు. మనకు ‘చేతివాటం’ అన్న పదం ఉంది. ఎందుకో గాని అది వ్యతిరేకార్థం లోనే ప్రసిద్ధమైంది. ‘మెలకువ’ అన్న పదం ఇక్కడ చాలం భావస్ఫోరకమైనది. చైతన్యం (Consciousness) అన్న అర్థం దీనిలో మనం గ్రహించాలి. ఆయా శిల్పాల చైతన్య స్వరూపాలను శిల్పి తన సుత్తి, ఉలి లోనికి ఆవహింప చేసుకుంటే తప్ప, అవి తయారుకావు.

ఆనందవర్ధనుడు తన లాక్షణిక గ్రంధం ‘ధ్వన్యాలోకము’ లో ఇట్లా చెప్పాడు.

“అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః
యథావైరోచతే విశ్వం, తథేదం పరివర్తతే”

హద్దులు లేని ఈ సృజనాత్మక జగత్తులో, కవే సృష్టికర్త. ఆయన ఈ ప్రపంచాన్ని ఎలా దర్శిస్తాడో, అది అట్లాగే ప్రవర్తిస్తుంది.

ఈ మాటలు పాణ్యం సోదర కవుల ఈ పద్యానికి చక్కగా సరిపోతాయి. పాబ్లో పికాసో, “Sculpture is the art of Intelligence” అన్నాడు. గొప్ప మాట ఇది.

మైకేలాంజిలో మాటల్లో, “Every block of stone has a statue inside it, and it is the task the sculptor to discover it” (ప్రతి శిలాశకలంలో ఒక విగ్రహం ఉంటుంది. దాన్ని కనుగొని వెలికితీయడమే శిల్పి పని). ఇది శిల్పికే కాదు, కవికి, చిత్రకారుడికి, సంగీతవేత్తకు కూడా వర్తిస్తుంది. సరిగ్గా అటువంటి శిల్పినే పాణ్యం సోదరకవులు కవిత్యంలో ‘చెక్కి’, ఈ అనర్ఘరత్నాన్ని మనకందించినారు. వారి కైతకు జోత!

Exit mobile version