[శ్రీ వెంకట్ మంత్రిప్రగడ గారు రచించిన ‘అందమైన అబద్ధం’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
పక్షుల కిలకిలారావాల మధ్య.. చల్లగా మెల్లగా తగులుతున్న ఉదయపు చల్ల గాలి తెమ్మెరలు మత్తుగా పలకరిస్తున్నాయి.. ఉదయిస్తున్న సూర్యుడు పైకి వచ్చి రోజంతా రాజ్యం చెయ్యడానికి బలం సంతరించుకున్నాడు.
అప్పుడే మేలుకున్న అరుణ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.. రాత్రి పడుకునే సరికి రెండయినా ఇప్పుడు పొద్దున్నే లేవడానికి ఏమీ ఇబ్బందిగా లేదు.
తనకి ఇష్టమైన స్నేహితులతో పున్నమి రాత్రి పండు వెన్నెలలో మనోహరమైన సరస్సు ఒడ్డున అద్భుతమైన పాటలు వింటూ, పాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ గడిపిన ఆ రాత్రి అరుణ్‌కే కాదు అందరికి సంతోషాన్ని కలిగించింది.. ఎలాంటి మార్పులు లేని నిస్సారమైన ఉద్యోగ జీవితం కలిగించిన అనాహ్లాద మేఘాలను చెదరగొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపింది ఆ రాత్రి.
రెండు మూడు నెలకొక సారి ఇలా పౌర్ణమి రాత్రి గడపడానికి ఈ అందమైన రిసార్ట్‌లో స్నేహితులందరూ గడపడం అయిదారు ఏళ్లగా అందరికీ అలవాటయ్యింది..
ఆ గుంపులో దాదాపు అందరు స్కూల్ రోజులనుంచి కలిసి చదువుకున్నవారు.. ఒకరి ఇష్టాలు మరొకరికి బాగా తెలిసిన వారు.. ఇప్పుడు రకరకాల ఉద్యోగ వ్యాసంగాల్లో ఉన్నా కూడా ఈ పౌర్ణమి రాత్రులలో పాల్గొనేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తారు.. తప్పకుండా వస్తుంటారు.
ఈసారి ఈ వెన్నల రాత్రి గడపడానికి ఒక కొత్త స్నేహితురాలు చేరింది.. అందరితోనూ కలివిడిగానూ భోళాగానూ మాట్లాడుతుండే లావుపాటి సంధ్య, శ్రీలత తన కజిన్ అనీ, ఈ మధ్యనే తను అరుణ్ పనిచేస్తూన్న కంపెనీలో హెచ్.ఆర్.లో చేరిందనీ, తను కూడా గుంపులోని ఇతర స్నేహితుల లాంటిదే అనీ పరిచయం చేసింది.
ఎంతో విశిష్టంగా కనిపించే పంథా.. తమతో కలిసే ఆలోచనలూ, ఇష్టాయిష్టాలూ తెలిసాక తనని ఈ గుంపులో చేర్చుకోవడానికి ఎవ్వరికీ అభ్యంతరం కనిపించలేదు.
శ్రీలత ఆ గుంపులో అందరిలాగానే కలివిడిగా ఉండే పిల్ల.. అయితే తను సంధ్యలా కాదు.. చాలా అందమైనపిల్ల.. నెమ్మదస్తురాలు.. ఎంతో స్నేహపూర్వకంగా ఉండే ముఖకవళికలతో గంభీరంగా ఉండడం తనకే చెల్లింది.. అది తనకొక ఆభరణం.
తనను మొదటసారి చూసినప్పడినుంచి అరుణ్‌కి ఏదో తెలియని ఆకర్షణ శక్తి తనను ఆ అమ్మాయి వైపుకి లాగేస్తున్నట్టుండేది.. ఆనంద్ బక్షి గారన్నట్టు ‘ముఝే డోర్ కోయి ఖించే తేరి ఓర్ లియే జాయ్’ అనుకున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే లేచినప్పటి నుంచీ శ్రీలతతో ఏం మాట్లాడాలి. .సంభాషణలో ఎలా దించాలి లాంటి ఆలోచనలతో కొంచం అన్యమనస్కంగా పళ్ళు తోముకుని.. స్నానం చేసి రెడీ అయ్యాడు.. తను తెచ్చుకున్న బట్టల్లోంచి తనకు నచ్చినవి వేసుకున్నాడు.
శ్రీలత వస్తుందని ఉహించకపోవడంతో తనకున్న బెస్ట్ బట్టలు తెచ్చుకోనందుకు కొంచం నిరాశ పడ్డాడు.
ఈ సంధ్య ఒకర్తి ఒళ్ళు పెంచింది కానీ బుర్ర పెంచుకోలేదు.. ఇలాంటి విషయాలు ముందే చెప్తే తన సొమ్మేం పోయేది.. కొంచం విసుగేసింది.. తల విదిలించుకుని టిఫిన్ తినడానికి వెళ్ళాడు.
అప్పటికే సంధ్య ప్లేటు నిండా రకరకాల పదార్ధాలు పెట్టుకుని తింటోంది.
“రాబోయే నెలకి సరిపడా ఇవాళే తినెయ్యాలా?” అనడిగాడు అరుణ్ నవ్వుతూ..
“ఈ శరీరాన్ని పోషించడానికి ఆ మాత్రం కావాలి లేరా.. నువ్వు కూడా గట్టిగా లాగించు.. మనం ఆ రెండో వైపున్న కొండ ఎక్కుదాం” అంది సంధ్య..
తన లావు గురించి సరదాగా జోకులు వెయ్యడం సంధ్యకి అలవాటే.. లావూ బరువూ తగ్గించుకోవడం అంటే శరీరాన్నీ, ఆత్మనూ కూడా హింస పెట్టుకోవడమని తాను శుద్ధ అహింసావాది కాబట్టి ఆ పని చెయ్యనని సరదాగా జోక్ చేస్తుంటుంది.
ఈ స్నేహ బృందంలో అరుణ్‌కి అందరికంటే చాలా దగ్గర స్నేహితురాలు సంధ్య.. వాళ్లిద్దరూ పక్కపక్క ఇళ్లలో పెరిగారు.. రెండు కుటుంబాలూ చాలా సన్నిహితంగా ఉంటాయి.. సంధ్య కన్నా ఒక రెండు నెల్లు చిన్న కాబట్టి అరుణ్‌ని తమ్ముడూ అని పిలుస్తూ ఏడిపిస్తుంటుంది.. కానీ ఇద్దరు సొంత అక్కా తమ్ముడిలా ఎంతో క్లోజ్ గా ఉంటారు.. అన్ని విషయాలూ మాట్లాడుకుంటారు..
టిఫిన్ తింటూ కొంచం అన్యమనస్కంగా ఉన్న అరుణ్ ని “ఏరా.. మా కజిన్ బాగా నచ్చినట్టుంది? రాత్రి తను మనసున మల్లెలు పాడుతున్నప్పుడు నువ్వు దాదాపు రామారావు లాగా ఎక్సప్రెషన్లు ఇచ్చావు.. ఏంటి విషయం” అనడిగింది సంధ్య
తన మనసులో భావాలూ సంధ్య పసిగట్టేసినందుకు కొంచం సిగ్గుగా అనిపించింది అరుణ్ కి..
“అలాంటివేమైనా ఉంటే దూరం పెట్టెయ్.. నేను నీకు దేవుడిచ్చిన అక్కను కదా.. అది నా కజిన్ సిస్టర్” అంది సంధ్య సరదాగా.
గతుక్కు మన్నాడు అరుణ్.. తాగుతున్న నీళ్లు పొలమారి ముక్కులోంచి బయటకు వచ్చాయి.. ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.
“ఒరేయ్..ఏమైంది.. జాగ్రత్త” కంగారుగా అరుణ్ తలమీద మోదుతూ అడుగుతోంది సంధ్య.
కాస్త సద్దుకుని “ఏమి లేదు.. నీళ్లు కొంచం పొలమారాయి” అన్నాడు అరుణ్
“తొలిచూపులోనే అంత ఆకర్షించేసిందా.. నువ్వు మామూలుగా చూపించే ఉత్సాహం చూపించలేదు.. ఏవో ఆలోచనలో ఉన్న శరత్ బాబు గారి హీరోలా అనిపించావు.. హృదయ టక్కొక్కటే మిస్సింగ్” అంది సంధ్య నవ్వుతూ.
“అలాంటిదేమి లేదు.. తను కూడా మన లాంటిదే అవడం బావుంది.. అయినా నాకు తెలియని ఈ కొత్త కజిన్ ఎక్కడనుంచి పుట్టుకొచ్చిందే?” అనడిగాడు అరుణ్..
“భూమిని చీల్చుకుని” అంటూ నవ్వింది సంధ్య.. “సారీ.. సారీ” అంది అరుణ్ మొహం చూసి.
“మా రెండు కుటుంబాలూ ఎప్పటినుంచో కలుసుకోవటం లేదు.. నేను శ్రీలతను విడిగా బయట కలిసేదాన్ని.. చిన్నప్పుడు అది ఇలా ఉండేది కాదు.. చాలా ముభావంగా ఉండేది.. తను ఎం.బి.ఏ. చదవడానికి హాస్టల్‌కి వెళ్లి వచ్చింది.. తన పంథాలో మార్పు వచ్చింది.. చాలా ఆత్మవిశ్వాసం చూపిస్తోంది.. ఇంతకు మూడు కనిపించని పరిణతి కనిపిస్తోంది.. వాళ్ళ ఇంట్లో ఏవో సమస్యలున్నాయి. అందుకనే మా అమ్మ ఆ కుటుంబంతో దగ్గరగా ఉండడం ఇష్టపడేది కాదు.. మా నాన్నా నేను విడివిడిగా ఈ బంధాన్ని కొనసాగించాం.. షి ఇస్ ఏ డార్లింగ్” అంది సంధ్య.
తలాడించాడు అరుణ్.
“ఇప్పుడు తనని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది.. అంత సంతులనంగా ఉండడం చాలా కష్టం.. తనని చూసి ఆకర్షితులవ్వని మనుషులు ఎవ్వరూ ఉండరు.. మీ అమ్మ కూడా తనని చూసి ఎంతో ముచ్చట పడింది.. అదే అవకాశంగా తీసుకుని నాకు నాలుగు చురకలేసింది కూడా.. బుద్ధి, పొందిక, అందమూ అంటూ ఏవేవో పెద్ద లిస్టే చదివింది” అంది సంధ్య.
“నాకు తెలియకుండా అమ్మెప్పుడు శ్రీలతను కలిసింది?” ఆత్రంగా అడిగాడు అరుణ్.
“కిందటి ఆదివారం తను మా ఇంటికి వచ్చింది.. ఆ టైముకి మీ అమ్మ అక్కడే ఉంది.. తను చాల అందంగా ఉండడమే కాకుండా ఒక రకంగా శాంతంగా నిండు కుండలా ఉంటుంది కదా.. మీ అమ్మెంతో ముచ్చట పడింది.. ఆ రోజున నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడదానికి వెళ్ళావు కదా, అందుకనే నీకు తెలియదు” అంది సంధ్య
“అయినా మా అమ్మ నాతోనూ నాన్నతోను ఈ మాట చెప్పకుండా ఎలా ఉందబ్బా? ఆవిడకి నచ్చిన విషయం ఈ పాటికి నూటొక్కసార్లు చెప్పుండాలి.. ఈ పాటికి తనకు కడుపులో నొప్పి ప్రారంభమవ్వలే” అన్నాడు అరుణ్ నవ్వుతూ.
“అక్కడే పప్పులో కాలేసావు.. చూడడానికి భోళాగా కనిపించినా, ఆడవారి మనసు లోతులు ఎవ్వరూ తెలుసుకోలేరు” అంది సంధ్య నవ్వుతూ.
నవ్వి ఊరుకున్నాడు అరుణ్.
“తనకు ఈ పిల్లను కోడలిగా చేసుకోవాలని ఉంది.. అందుకనే విషయాలన్నీ కనుక్కునే వరకు ఆ విషయం ఎత్తవద్దని నాకు మా అమ్మకు కూడా హెచ్చరిక జారీ చేసింది.. మా అమ్మకు పూర్తి విషయాలు తెలియక పోయినా వాళ్ళింట్లో ఏవో సమస్యలున్నాయని తెలుసు కదా.. కొంచం జాగర్తగా ఉండమని మీ అమ్మను హెచ్చరించింది” అంది సంధ్య
“సమస్యలంటే.. ఏవైనా పెద్ద విషయాలా?” అనడిగాడు అరుణ్
“వాళ్ళ అమ్మగారికి ఏదో ఆరోగ్య సమస్య ఉంది.. అందుకని శ్రీలత సాధారణంగా ఎక్కడికి రాదు.. ఎవ్వరిని దగ్గరకు రానివ్వదు.. అయితే అసలు సమస్య ఏమిటో నాక్కూడా వివరంగా తెలియదు.. కానీ జాగ్రత్త రోయ్.. తను చాలా సున్నితమైన మనిషి.. బాధ పెట్టకుండా చూసుకోవాలి.. నన్నడిగితే ఈ ఇష్టం స్నేహం దగ్గరే ఆపేయ్.. అదే మీ ఇద్దరికీ మంచిది” అంది సంధ్య.
అరుణ్ ఏమి అనలేదు.. తలాడించి లేచి కాఫీ కప్పు పట్టుకుని రూమ్‌కి వచ్చేసాడు..
ఈ పిల్ల ఎంత ఆకర్షణీయమైనదో అంతకు మించిన రహస్యమయమైనదిలా ఉంది అనుకున్నాడు.
కాఫీ చప్పరిస్తూ తన రూమ్ బాల్కనీ లోంచి కనిపిస్తున్న రంగు రంగుల పూల తివాచి పరచినట్టున్న సుందరమైన లోయను.. ఒక పక్కగా గంభీరంగా నిలబడి ఆడుకుంటున్న పిల్లలను మురిపెంగా చూస్తున్న తండ్రిలా కనిపిస్తున్న కొండను చూస్తూ ఆలోచిస్తున్నాడు..
సంధ్య స్నేహం దగ్గరే ఎందుకు ఆపెయ్యమంది? శ్రీలత సున్నితమైన మనిషి అని ఎందుకు హెచ్చరించింది? కిందటి వారం ఆఫీసులో రాహుల్‌కి జెన్నీకి మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన సమస్యను ఎంతో బాగా సంభాళించింది అన్నారు అందరూ.
సెన్సిటివ్ మనుషులకు మానసిక స్థైర్యం తక్కువ ఉంటుందంటారు.. అలాంటి వాళ్ళు ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలనుంచి పారిపోతారే గాని కుదురుగా కూర్చుని పరిష్కరించలేరు.
అలాంటి పరిష్కారాలు సాధించాలంటే ఎంతో మానసిక బలం కావాలి.. మనుషుల గురించి చాలా మంచి అవగాహన ఉండాలి.. ఆ ఇద్దరి మానసిక స్థితి గురించి అంతర్దృష్టి కావాలి.. శ్రీలత ఆ సమస్యను అలవోకగా పరిష్కరించేసింది అని అన్నారు అందరూ.. బాస్ కూడా తన గురించి చాలా మంచి మాటలు చెప్పారు..
తనతో స్నేహం పెంచుకోవాలనీ, తన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరిక చాలా బలంగా కలుగుతోంది.. కానీ ఎక్కడ మొదలు పెట్టాలి.. ఏమి చెయ్యాలి.. ఏమీ పాలుపోవటంలేదు
తన బాల్య స్నేహితురాలైన సంధ్య తనకెప్పుడూ సహాయం చేసింది.. ఇప్పుడు కూడా తన మీదే ఆధారపడాలి అనుకున్నాడు.. కానీ సంధ్యకు కూడా తన గురించి ఎక్కువ తెలిసినట్టు లేదు.. అరుణ్ తలలో రకరకాల ఆలోచనలు కలగాపులగంగా తిరుగుతున్నాయి.
ఇంతలో రూంలోని ఫోన్ మోగింది.. తన గుంపులోని రాజేష్ చేసాడు “ఒరేయ్, రెడీ అయ్యావా? ఇప్పుడు మనం కొండ ఎక్కడానికి వెళ్ళాలి” అన్నాడు
“ఆ నేను రెడీగానే ఉన్నాను రా.. వస్తున్నాను” అని ఫోన్ పెట్టేసాడు.
ఒక్క క్షణం నిలబడి ఆలోచించాడు.. ఈ కొండ ఎక్కే కార్యక్రమం ఏ ఆలోచనా లేకుండా చేసేద్దాం.. ఆ సందర్భంలో శ్రీలతతో మాట కలిపే అవకాశం వస్తే మామూలు విషయాలే మాట్లాడదాం.. తన గురించి.. తన ఆలోచనల గురించి అస్సలు మాట్లాడకూడదు అనుకుంటూ లాబీలోకి నడిచాడు.
తన స్నేహితులు అయిదుగురూ అక్కడ రెడీగా ఉన్నారు.. కానీ శ్రీలత కనిపించలేదు.. అరుణ్ మొహంలోని ప్రశ్నను ముందుగానే పసిగట్టి నట్టు “శ్రీలత పొద్దున్నే వెళ్లిపోయింది.. తను మనతో రాత్రి గడపడమే గొప్ప.. పదండి మనం ఆ పెద్ద కొండ ఎక్కి మన చిన్న బొజ్జ కొండలు తగ్గించుకుందాం” అంది సంధ్య.
చాలా నిరాశపడ్డాడు అరుణ్.. ఇవాళ ఎలాగైనా శ్రీలతతో స్నేహం కలపాలన్న అతని ప్లాన్ భంగం అవడంతో చిరాకు వచ్చింది.. మిగిలిన రోజంతా కొంచం ముభావంగానే గడిపాడు.
సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో సంధ్య మళ్ళీ శ్రీలత విషయం ఎత్తింది “ఏరా.. మా లత చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినందుకు చాలా నిరాశపడినట్టున్నావు.. అంత నచ్చేసిందా? ప్రేమా?” అనడిగింది.
సంధ్య వైపు చూసి నవ్వాడు.. ఇది నా ఆల్టర్ ఇగో లాంటిది.. ఇలాంటి స్నేహితురాలుండడం నా అదృష్టం అనుకున్నాడు.. “ఏమోరా.. ప్రేమ అనలేను కానీ ఏదో తెలియని ఆకర్షణ, అలాంటి భావనలు ఇంతకు ముందు ఎప్పుడు అనుభవం లోకి రాలేదు” అన్నాడు అరుణ్ కారు నడుపుతూ
అకస్మాత్తుగా తనను రా అని సంబోధించడంతో విషయం కొంచం అర్ధమయ్యింది సంధ్యకు.. వీడు బోర్లా పడ్డాడు అనుకుంది.. తనక్కూడా శ్రీలత అంటే ఇష్టముండడం, ఆ అమ్మాయిని తన తమ్ముడు లాంటి బాల్య స్నేహితుడు ఇష్టపడడం తనకెంతో నచ్చింది..
వాతావరణం కొంచం బరువెక్కడం గమనించింది.. నవ్వుకుంది.. ఇలాంటివి మనకు సరిపడవు అనుకుని కొంచం మాములు చెయ్యడానికి “పెళ్లి చేసుకుందామనుకుంటున్నావు కదా.. కొంచం మానసిక స్థితి మారుతుంది.. అమ్మాయిలందరూ కొత్తగా కనిపించడం మొదలెడతారులే” అంది నవ్వుతూ.
అరుణ్ కూడా నవ్వాడు “ఒక రకంగా నువ్వు అనేది నిజమే.. కానీ శ్రీలతను ఆ దృష్టితో చూడలేదు.. తన గురించి ఆ ఆకర్షణ తప్ప మరో విషయం ఏమీ ఇంకా ఆలోచంచలేదు.. నిజం చెప్పాలంటే తనలో ఏవో తెలియని రహస్యాలున్నట్టు అనిపించింది.. తన గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నాను.. తనను నా పెళ్లి సంబంధాల లిస్టులో చేర్చలేదు” అన్నాడు
“మీ అమ్మ చేర్చేసిందిలే.. మొన్నే తన వివరాలు అడిగింది” అంది సంధ్య.
గట్టిగా నవ్వాడు “మా అమ్మ ఇప్పడికి రెండువందల డెబ్బై మందిని లిస్ట్‌లో వేసేసింది.. అందులో రెండువందలమంది పేర్లు కూడా తెలియదు.. మాల్ లోనో హోటల్ లోనో చుసిన బాపతు.. ఏదైనా పెళ్ళికో పేరంటానికో వెడితే వరసైన అందరి అమ్మాయిల వివరాలు ఆరా తీస్తుంది.. నా అభిప్రాయం అడుగుతుంది.. కొంచం పాతకాలం పద్ధతిలే” అన్నాడు.
“మీ అమ్మ గురించి నాకా చెప్పేది.. ఈ అమ్మాయిల్ని లిస్ట్‌లో వెయ్యడం నా ప్రాణం మీదకు వచ్చింది.. నాజూగ్గా ఉండడంతో మొదలు పెట్టి పొద్దున్న లేవడం, ఇంటి పనులు ఇలా ఎన్నో విషయాలు లింకులు లేకుండా కలిపి నాకు లెక్చర్లు ఇస్తుంది.. తన పాకులాట చుస్తే ఎంతో ముద్దొస్తుంది” అంది సంధ్య నవ్వుతూ.
“మా అమ్మ ఇంకా నాతో శ్రీలత విషయం మాట్లాడలేదు.. కానీ నేను కలిసిన సమయంలో పడిన భావనలు ఇంకా తన గురించి ఆఫీసులో విన్న విషయాలు కలిపితే ఏదో తెలియని ఆకర్షణ అయితే కలుగుతోంది.. అయితే ఆ ఆకర్షణ సాధారణంగా లేదు.. ఇది బహుశా డాక్టర్ బ్రియాన్ వీస్ గారు చెప్పిన జన్మ జన్మల బంధమేమో” అన్నాడు అరుణ్.
“ఓర్నీ, నువ్వేదో చాలా హేతుబద్ధంగా ఉంటావనుకున్నాను.. ఇంత మెలోడ్రామా అవసరమా?” అనడిగింది సంధ్య మురిపెంగా చూస్తూ.
అరుణ్ తన వయసు కన్నా ఎక్కువ పరిణతి చూపించడం సంధ్యకు నచ్చని విషయం.. ఇప్పుడీ విషయంలో సాధారణ మానవుడిలా ప్రవర్తించడం ముచ్చటేస్తోంది.
కొంచం సిగ్గు పడ్డాడు అరుణ్.. తనలా ఆలోచిందడం తనకే ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేయ్యసాగాడు..
“కానీ ఒరే.. నువ్వు బ్రియాన్ వీస్ గారి నువ్వు పెడ్రో అయితే అయ్యావు గాని తాను కాథెరిన్లా అనిపించటం లేదు.. నీకు కలిగిన ఆకర్షణ తనలో కలిగినట్టు లేదు.. నీ వైపుకి ఆరాధనగా చూడలేదు.. నీతో మాట కలపాలని ప్రయత్నించ లేదు.. అందరితో ఉన్నట్టే నీతోనూ ఉంది.. పొద్దున్నే లేచి హడవిడిగా ఇంటికి వెళ్ళిపోయింది.. నీ కోసం సందేశాలేమీ కూడా వదిలిపెట్టలేదు” అంది సంధ్య.
“అదే నాకు అర్థం కావటం లేదు.. నాకొక్కడికే అలాంటి ఆలోచనలు కలగడం కుదురుతుందా? తనలో ఏ చలనమూ లేదా? నేనే ఎక్కువ ఉహించుకుంటున్నానా? సరేలే ఈ విషయం ఇంతటితో పోనిద్దాం..
తను నా ఆఫీసులో హెచ్.ఆర్. మేనేజర్, స్నేహితుల క్లబ్‌లో మెంబరు కూడా.. తనని బాధ పెట్టే పనేదీ మనమెవ్వరమూ చెయ్యకూడదు..
కానీ ఒక విషయం చెప్పు.. తను చాలా సున్నితమైన మనిషి అన్నావు నువ్వు.. తను ఎంతో క్లిష్టమైన హెచ్.ఆర్. సమస్యలను సులువుగా పరిష్కరించేస్తోంది..ఈ రెండిటికి పొంతన కుదరటం లేదు “ అన్నాడు అరుణ్
“నేను సున్నితం అన్నది బంధాల విషయంలో..తను మారిన తరువాత చూపించే పరిణతి ఒక్కోసారి నాకే భయం పుట్టిస్తుంది..ఒక సమస్యను పరిష్కారించాలంటే తన భావోద్వేగాలను ఆ సమస్యలో కలపకుండా చాలా నిర్లిప్తంగా వ్యహరించగలదు..రేపు నీగురించి ఏదైనా సమస్య వస్తే స్నేహితుడివి కదా అని కూడా చూడకుండా అవసరమైతే నిన్నే గుండేసి కాల్చేస్తుంది” అంది సంధ్య.
నవ్వాడు అరుణ్.
ఇల్లొచ్చింది.. సంధ్య తన అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది.. అరుణ్ ఇంటికి చేరాడు..
“బాగా అలసిపోయావేరా? తొందరగా స్నానం చెయ్యి భోజనం చేసి పడుకుందువు గాని” అంది అరుణ్ తల్లి
అలసట వల్ల కాబోలు మూడు గంటల పైగా మత్తు నిద్ర పోయాడు అరుణ్.. అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఒక్కసారిగా మెలకువ వచ్చింది.. గొంతు ఎండి పోతున్నట్టుంది.. నీళ్లు తాగి మళ్ళీ పడుకునే ప్రయత్నం చేసాడు.. ఇంక నిద్ర రాలేదు..
అతని ఆలోచనలన్నీ శ్రీలత చుట్టూ తిరుగుతున్నాయి.. సంధ్య మాటల ప్రకారం తనకు ఏవో కుటుంబ సమస్యలున్నాయి.. అవెలాంటివో.. సాధారణంగా కుటుంబ సమస్యలున్నవాళ్ళు అంతగా పరిణితి చెందరు.. శ్రీలత అలాంటివేవీ చూపించటం లేదు.. తనొక పెద్ద మర్మమైన మనిషిలా అనిపించసాగింది.. తప్పకుండా తనలో ఏదో విశిష్టత ఉంది.. మొదటిసారి చూసినా చాలా పరిచయం ఉన్నట్లనిపించింది..
ఏవో పుస్తకాలూ చదివి తను ఎక్కువ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? నిజంగా అంత విషయమేమీ లేదా?
రకరకాల ఆలోచనలతో సతమతమౌతూ, అటూ ఇటూ దొల్లుతూ ఎప్పటికో నిద్ర పోయాడు అరుణ్.
తరువాత రోజు ఆదివారం కావటంతో రెండిళ్ళకూ కలిపి జాయింటు టిఫన్ ఏర్పాట్లు చేద్దామని అరుణ్ తల్లి, సంధ్య తల్లితో కలిసి పూరీలు చేసే కార్యక్రం చేపట్టింది.. సంధ్య కూడా వాళ్లతో చేరి కబుర్లు చెప్తోంది.
తండ్రులిద్దరూ (ఒకరు అరుణ్ తండ్రి మరొకరు సంధ్య తండ్రి అని మాత్రమే అర్థం) సోఫాలో కూర్చుని రక రకాల న్యూస్ ఛానళ్ళు పెట్టుకుని ఎందులో ఎక్కువ వినోదం పాలుందా అని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అరుణ్ మెల్లిగా లేచి తయారై హాల్లోకి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ మీద కూచుని మధ్యలో పూరీలు కూర పెట్టుకుని తింటూ జీవిత సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు..
“సరే గాని గాయత్రీ.. ఈ అరుణ్ గాడి పెళ్లి విషయం ఏమైనా ముందుకి వెళ్తోందా” అనడిగింది సంధ్య తల్లి అరుణ్ తల్లిని.
“లేదోయ్.. సంధ్య ఈ పోటీలో నెగ్గి ముందు పెళ్లి చేసుకుంటుందేమో అని భయంగా ఉంది.. వీడొట్టి పాతకాలం పప్పు సుద్దగాడు.. ఈ పాటికి ఎవరో ఒకర్ని ప్రేమించి మన నెత్తిమీదకు తెచ్చిఉంటే ఈ శ్రమ తప్పేది కదా” అంది అరుణ్ తల్లి.
“జీవ హింస జరగకుండా వీడి పెళ్లి అయ్యేలా లేదంటావా?” అన్నాడు సంధ్య నాన్న భళ్ళున నవ్వుతూ
“నువ్వు మరీను.. నేను చూడడానికి అలా కనిపిస్తాను గాని మా ఆయన్ను ప్రేమగానే చూసుకుంటాను నాన్నా” అంది సంధ్య కూడా నవ్వుతూ
“ఇదే నయం.. ఇంకా దాని పెళ్లి గురించీ, మొగుడు గురించీ ఎవ్వరు మాట్లాడటం లేదు అయినా ఆ సోమలింగాన్ని వెనకేసుకొస్తోంది” అన్నాడు అరుణ్ తండ్రి.
అందరు గట్టిగా నవ్వేశారు.. “నవ్వులాపి కొంచం సీరియస్‌గా ఆలోచించండి.. సంధ్య సోమలింగానికి ఒక పేరుంది.. వాళ్ళ బావ వేద్.. సంధ్య కోసం కాచుకూచున్నాడు.. నీక్కూడా పెళ్లి కుదిరితే ఇద్దరికీ ఒకసారి చేసేద్దామని చూస్తుంటే నువ్వెంట్రా” అంది సంధ్య తల్లి కొంచం దిగులుగా.
“మీరు కూడా వాడికి ఒక మరదల్ని ఏర్పాటు చేసుంటే బావుండేది ఆంటీ.. ఇప్పుడు వాడిమీద ఇలా ఒత్తిడి తేవడం వల్ల లాభమేముంది?” అంది సంధ్య నవ్వుతూ.
“సరిపోయింది.. అది కూడా మా పనేనా? అసలు మొగపిల్లాడు పుట్టాడు కదా చేతికి అంది వస్తాడనుకున్నాను.. వాడి పెళ్లే వాడు చేసుకోలేక పోతున్నాడు.. ఇంకా మేమేం చెయ్యగలం” అన్నాడు అరుణ్ తండ్రి.
“నా మటుకు నాకు మొన్న మనింటికి వచ్చిన పిల్ల.. మన సంధ్య స్నేహితురాలు.. చాలా నచ్చింది.. తనను కదిలించకూడదే సంధ్యా?” అంది అరుణ్ తల్లి నిశ్చయంగా.
“శ్రీలత మన అరుణ్ గాడికి కూడా చాలా నచ్చింది.. నిన్నటి పార్టీకి తనను కూడా తీసుకెళ్ళాం.. కానీ నిన్న తను చెప్పా పెట్టకుండా పొద్దున్నే చెక్కేసినందుకు కొంచం కోపంగా ఉన్నాడు” అంది సంధ్య
“తను మీ అందరితోనూ బాగానే కలిసిపోయిందా.. పొద్దున్నే ఎందుకు వెళ్లిపోయింది? ఇప్పుడే కదా మొదటి సారి చూడడం, వీడికి కోపం వచ్చేంత స్నేహం ఎక్కడ ఏర్పడింది?” అంటూ ప్రశ్నలు గుప్పించింది అరుణ్ తల్లి.
“అవును.. రాత్రి తాను మంచి మంచి పాటలు కూడా పాడింది.. ఫోన్లో నేపథ్య వాయిద్యాలు పెట్టుకుని పాడింది.. దాదాపు రికార్డెడ్ పాటలు వింటున్నట్టు అనిపించింది.. నీలాగే వాడు కూడా మనసు పారేసుకున్నట్టున్నాడు.. ఆ పరిస్థితుల్లో కోపాలొచ్చే అవకాశం ఉంది కదా” అంది సంధ్య
“ప్రణయ కోపమేరా?” అన్నాడు అరుణ్ తండ్రి భళ్ళున నవ్వుతూ.
“ఇంకా నయం.. నిన్నే కదా కలిసాను.. అప్పుడే ప్రణయము దాని పైన ప్రణయకోపం కూడాను” అన్నాడు అరుణ్ నవ్వుతూ
“ఏరా.. ఆ శ్రీలతను కదిపి చూడకూడదూ? సంధ్య సాయం చేస్తుందిలే” అంది అరుణ్ తల్లి.
“నాక్కూడా అదే అనిపిస్తోంది రా.. నాకు మీరు ఇద్దరూ ఇష్టం.. మీరు పెళ్లి చేసుకుంటే నాకన్నా సంతోషించే వాళ్ళెవరూ ఉండరు.. నీకేం సాయం కావాలన్నా చేస్తాను” అంది సంధ్య.
“అబ్బా నువ్వుండమ్మా.. ఇంకా పూర్తిగా పరిచయం కూడా కాలేదు, అప్పుడే పెళ్లి ప్రస్తావన ఎలా తెస్తాను? అదీగాక నేనెంత దగ్గర కావడానికి ప్రయత్నించానో తను అంత ముడుచుకు పోయింది.. నేను అడిగిన ప్రశ్నలకు చాలా సూటిగా సమాధానం ఇచ్చి ఊరుకుంది.. నువ్వంతగా ఆగలేకపోతే ఇదో పెళ్లి సంబంధం లాగ అనుకుని వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడు” అన్నాడు అరుణ్
“ఓరి దద్దమ్మా.. నువ్వు చక్కగా ప్రేమ పెళ్లి చేసుకుంటావని మేము కలలు కంటుంటే, నువ్వేంట్రా పాత చింతకాయ గాడివి.. మా కాలంలో మేము ప్రేమ పెళ్లి చేసుకున్నాం కదా.. ఆయన నా బావే అనుకో” అంది అరుణ్ తల్లి.
అందరూ ఘొల్లున నవ్వారు.
“అయితే గాయత్రీ.. వీడు ముందు ప్రొపోజ్ చేశాడా నువ్వు చేసావా” అనడిగాడు సంధ్య తండ్రి.
“ఇప్పుడు సమస్య మా ప్రేమ గురించి కాదు.. దాన్ని గురించి మనం మన సీనియర్ సిటిజెన్ మీటింగ్‌లో మాట్లాడుకుందాం.. ఇప్పుడు వీడిని ప్రేమకు రెడీ చెయ్యడం మన సమస్య” అంది అరుణ్ తల్లి.
“ఆ మాట నిజం రా.. శ్రీలతను మాములు సంబంధంలా చూడడం కుదరదు.. నువ్వు తనతో మాట్లాడు” అన్నాడు సంధ్య తండ్రి.
“సరే.. నేను సరైన సమయం చూసి మాట్లాడతాను” అన్నాడు అరుణ్.
“గుడ్, సమయం మించిపోకుండా చూసుకో” అన్నాడు అరుణ్ తండ్రి.
టిఫిన్ ముగుంచి ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు.
అరుణ్ తన గదిలో కూర్చుని బయటకు చూస్తున్నాడు.. మనసు పరి పరి విధాల పోతోంది.. తనకు నిజంగానే వేరే సంబంధం ఉందా? లేక నేనో, నా స్తోమతో నచ్చలేదా? ఏమి చెయ్యడం?
ఆలోచనలతో పిచ్చెక్కేలా ఉంది.. ఇంక ఈ మూడ్ నుంచి బయటకు రావాలి అనుకున్నాడు.. చేతికందిన పుస్తకం తీసుకుని చదివే ప్రయత్నం చేసాడు.. ముందుకు సాగలేదు.. టీవీ చూద్దామని కూర్చున్నాడు.. ఏమి అర్థం కావటం లేదు.. అలాగే రకరకాల పనులు ఏ గమ్యం లేకుండా చేస్తూ నిద్రపోయాడు..
తల్లి రెండు మూడు సార్లొచ్చి లంచ్‌కి పిలిచింది.. అరుణ్ కదలక పోయేసరికి మంచి నిద్రలో ఉన్నాడని కదిలించలేదు.
సాయంత్రమయ్యాక లేచాడు అరుణ్.. చిరాగ్గా తలనొప్పిగా ఉంది.. టీ తాగి బాల్కనీలో కూర్చున్నాడు.. దూరంగా చెట్లు వాటిమీద వాలుతూ హడావిడి పడుతున్న పక్షులను చూస్తున్నాడు..
తను ప్రేమించిన అమ్మాయి దక్కదేమో అన్న బెంగతో కుంగిపోవడం.. పాతకాలపు శరత్ బాబు గారి ప్రేమికుడి పాత్రలా మథనపడడం..నేపథ్యంలో అరిజిత్ సింగ్ పాటలూ.. ఏమీ బాగా లేదనిపించింది..
ఏ విషయమూ శ్రీలతతో డైరెక్ట్‌గా మాట్లడడం మంచి పని.. తను అనుకుంటున్నట్టు శ్రీలత నిజంగా నిదానమైనదీ, పరిణతి చెందినదీ అయితే ఆ సంభాషణ ఏదో ఒక దారిలోకి తీసుకెళ్తుంది.. లేకపొతే ఇద్దరమూ ఎవరు దార్లో వాళ్ళు వెడతాము అనుకున్నాడు
తెగని చిక్కుప్రశ్నల మధ్యలోంచి ఒక మంచి దారి దొరికినట్టనిపించింది అరుణ్‌కి.. కొంచం ఉత్సాహం వచ్చింది.. రాత్రి బాగానే నిద్ర పోయాడు.
***
పొద్దున్నే ఆఫీసుకి బయల్దేరుతూ ఇవాళ ఎలాగైనా శ్రీలతను కలిసి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు.. అసలా ఆలోచనే అతని మూడ్‌ని మార్చేసింది.. ఉత్సాహంగా బయలుదేరాడు.
వెడుతూనే రోజూ చెయ్యవలసిన తక్షణ కార్యక్రమాలు అంటే ఇమెయిల్ చూసి సమాధానాలివ్వడం, ప్రాజెక్ట్ రిపోర్టులు చూడడం లాంటివి చేసాడు.. అతను మామూలు కంటే మంచి మూడ్‌లో ఉన్నాడని అందరికి అర్థం అయింది కారణం తెలియక పోయినా.
పదకొండయ్యేటప్పడికి కొంచం ఖాళీ దొరికింది.. శ్రీలత అంతర్గత లైనుకి ఫోన్ చేసాడు.. ఎవ్వరు ఫోన్ తీయలేదు.. బిజీగా ఉందేమో అని ఊరుకున్నాడు.
రోజంతా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.. ఫోన్ రింగ్ చప్పుడు తప్ప సమాధానం ఏమీ లేదు..
సాయంత్రమయ్యేటప్పడికి నీరసం వచ్చింది.. తనను కలవక పోవడం కొంచం నిరాశగా అనిపించినా ధైర్యం పోలేదు.. తానేదో పనిలో తిరుగుతూ ఉండుంటుంది.. లేకపొతే ఆఫీసుకే రాలేదేమో అనుకుని సరిపెట్టుకున్నాడు.
తరువాత రెండు రోజులు శ్రీలతను కలవడానికి చాలా ప్రయత్నాలు చేసాడు.. తనకి కూడా కస్టమర్లతో ఫోన్ మీటింగులుండటం వల్ల కుదిరి నప్పుడల్లా తన అంతర్గత లైనుకి ఫోన్ చేస్తూ వచ్చాడు..
రెండు రోజులూ తను దొరకలేదు.. పనిలో తిరుగుతోందో లేక ఉండి కూడా ఫోన్ తీయడం ఇష్టం లేక వదిలేస్తోందో అనే అనుమానం వచ్చింది అరుణ్‌కి.. శ్రీలత కాబిన్‌కి వెళ్లి చూసాడు.. నిజంగానే తనక్కడ లేదు..
ఫ్రంట్ ఆఫీస్‌లో కూర్చునే సుప్రియని అడిగాడు.. ఏదో ఒక వేధింపు కేసు వచ్చిందని దాంతో గత రెండు రోజులుగా తాను చాలా హడావిడిగా ఉంది అని తెలిసింది..
ఈ మగాడిదలకు పనిలేదు.. వేధింపులేమిటి.. చేసాడే అనుకో.. ఇప్పుడే చెయ్యాలా.. వాడెవడో దొరికితే ఉతికేయ్యాలి అనుకున్నాడు విసుగ్గా.
మూడో రోజు సాయంత్రం శ్రీలత దగ్గర నుంచి ఫోన్ వచ్చింది “అరుణ్ మీరు నాతో మాట్లాడాలని ప్రయత్నించినట్టున్నారు.. చాలా సారీ.. ఒక ముఖ్యమైన విషయం చూడాల్సి వచ్చింది.. చెప్పండి మీ టీంలో ఏమైనా సమస్య వచ్చిందా?” అనడిగింది
“లేదు.. అలాంటిదేమి లేదు” అన్నాడు అరుణ్.. మరెందుకని అన్ని సార్లు ఫోన్ చేసారు అని ఆమె అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక.. అరుణ్ గుండె గొంతుకలోకి వచ్చేసింది.
అదృష్టవశాత్తూ ఆ మాట శ్రీలత అడగలేదు “సరే.. ఒక పని చేద్దాం.. ఒక అరగంటలో నా పనైపోతుంది.. మీకు కూడా ఖాళీ అయితే మనం ఆఫీసు బయట ఉన్న కాఫీ పాయింట్లో కాఫీ తాగుదాం” అంది.
తనకు విషయం అర్థం అయ్యి ఆలా అందా లేక కాఫీ పాయింట్‌లో తనను వాయించేస్తుందా? తనతో ఆఫీసు విషయం కాకుండా స్వవిషయం మాట్లాడాలనుకోవడం అంత తప్పా? కొంచం కంగారు పుట్టింది అరుణ్‌కి.
కానీ దీన్నుంచి పారిపోవడం వల్ల పని కాదు.. తను అనుకున్నట్టు విషయం తేల్చేసుకోవడం మంచిది కదా? సాగదీయడం అనవసరం.. చూద్దాం ఏమౌతుందో అనుకున్నాడు బింకంగా.
పని అవగొట్టుకుని కాఫీ పాయింట్ చేరి శ్రీలత కోసం ఎదురుచూడసాగాడు అరుణ్.
పదినిముషాలు ఆలస్యంగా వచ్చింది “సారీ.. ఒక ముఖ్య విషయం అన్నానుకదా దానికి సంబందించిన డాక్యుమెంటేషన్ ఇవాళే చేసెయ్యాలి.. కొంచం లేటయ్యింది” అంది.
“పరవాలేదు” అంటూ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసి కూచున్నాడు అరుణ్.
అయిదు నిముషాలు ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు.. టేబుల్ మీద ఎదురెదురుగా తలలు దించుకుని ఆలోచనల్లో మునిగి ఉన్నట్టు కూర్చున్నారు ఇద్దరూ.
చివరకు శ్రీలతే మొదలెట్టింది “ఆఫీసు పనేమీ లేకుండా పదిహేడు మిస్స్‌డ్ కాల్సు అంటే ఏదో వ్యక్తిగత విషయమే.. మీరు చెప్తారా లేక నేను ఉహించి మొదలెట్టనా?” అనడిగింది కొంచం గొంతులో నవ్వు తెచ్చుకుంటూ.
అరుణ్ ఏమి అనలేదు.. ఏమనాలో తెలియటం లేదు.
మళ్ళీ శ్రీలతే కలగజేసుకుని “మనం రిసార్ట్‌కి వెళ్లినప్పుడు మీరు నా వైపు ఆసక్తిగా చూడడం గమనించాను.. మీకు నన్ను చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది కదా” అంది.
గుండె గుభేల్ మంది.. ఈ సంధ్య కొంప ముంచేసినట్టుంది.. తన ఆలోచనలన్నీ శ్రీలతకు చెప్పేసిందా? “అవును..మీకెలా” అంటూ ఆపేసాడు అరుణ్.
“నాకెవరూ చెప్పలేదు.. ఆ రోజు తరువాత సంధ్యతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదు.. మీ మొహం లోని భావాలు నాకలా అనిపించాయి” అంది శ్రీలత.
కొంచం కుదుట పడ్డాడు అరుణ్.. కానీ ఏమనాలో ఇప్పటికి అంతుచిక్కటం లేదు.
“నిజానికి నాక్కూడా మిమ్మల్ని చూడగానే చాలా పరిచయం ఉన్నవాళ్ళ లాగా అనిపించారు.. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా గమనించాను” అంది.
“అలాగా.. మీరు నన్ను గమనించడం నేను గమనించలేదు” అన్నాడు అరుణ్ కొంచం తికమకగా.
“బావుంది వర్డ్ ప్లే” అంది శ్రీలత నవ్వుతూ
అరుణ్ కూడా నవ్వాడు.. వాతావరణం కొంచం తేలిక పడింది
“శ్రీలతా.. మీరన్నది నిజం.. మొదటిసారి మిమ్మల్ని ఆఫీసులో చూసినప్పుడు నాకు చాలా దగ్గర మనిషిని చూసినట్టు అనిపించింది.. మీరు హెచ్.ఆర్.మీటింగ్‌లో ఉన్నారు.. ఆ తరువాత మీ గురించిన మంచి విషయాలు చాలామంది చెప్పారు.. మనం ప్రత్యక్షంగా కలవడం రిసార్ట్ లోనే.. నిజానికి మీరు నన్ను అప్పుడే చూసారు” అన్నాడు అరుణ్ గొంతు సవరించుకుని.
“ప్రత్యక్షంగా కలవడం రిసార్ట్ లోనే కానీ మీగురించి నాకు ఆఫీసులో చెప్పారు.. మీ టీం ని కలిసుండేలా చెయ్యడానికి మీరు వాడే వినూత్నమైన పద్ధతుల గురించి మా బాస్ చాలా చెప్పారు.. నిజానికి నాక్కూడా మీ గురించి కొంత ఆసక్తి కలిగింది.. రిసార్ట్‌లో కలిసినపుడు చాలా సంతోషంగా అనిపించింది” అంది శ్రీలత.
“మీరు చాలా లోతైన మనిషనుకుంటాను.. ఇప్పుడు మీరు చెప్పినవేవి మీ ముఖంలో కనపడలేదు” అన్నాడు అరుణ్.
“కనపడినా అవి నా పద్ధతిలో ఉంటాయి.. మీరున్న ఈ పరిస్థితిలో మీకు కావలసిన భావనలే అర్ధమౌతాయి” అంది శ్రీలత నవ్వుతూ.
అరుణ్ కూడా నవ్వాడు.. శ్రీలత నిజంగా చాలా ప్రతిభ గల మనిషి.. తన పరిస్థితి గమనించి వాతావరణాన్ని ఎంత చక్కగా తేలిక పరచిందో అనుకున్నాడు మెచ్చుకోలుగా..
“లోతైన మనుషుల్ని అందరూ మెచ్చుకుంటారు అరుణ్.. కానీ వాళ్ళతో జీవించడం అంత సులభం కాదు” అంది శ్రీలత చిన్నగా నవ్వుతూ.
ఆ నవ్వులో అలసట ఉంది.
ఒక్క క్షణం తన కళ్ళు టేబుల్ మీదే ఆగిపోయాయి.
“కొన్ని సంవత్సరాల తరువాత మనుషులు ఏడవడం మానేస్తారు.. కానీ బాధ పడడం మాత్రం మానరు” అంది చాలా మామూలుగా.
ఆ మాట చెప్పిన వెంటనే మళ్లీ మామూలు ముఖంలోకి వెళ్లిపోయింది.
ఆ ఒక్క క్షణం చూసినప్పుడు – ఈ అమ్మాయి తనకు కనిపిస్తున్నదానికంటే చాలా ఎక్కువ అనిపించింది అరుణ్‌కి.
“చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందేమో గాని నాకు మనం కలవడం డాక్టర్ బ్రియాన్ వీస్ గారి ఓన్లీ లవ్ ఈస్ రియల్ అనే కథలా అనిపించింది.. కొంచం నాటకీయంగా.. అంటే మెలోడ్రామాటిక్‌గా ఉందనుకుంటాను.. సారీ” అన్నాడు అరుణ్.
గట్టిగా నవ్వేసింది శ్రీలత “నేను ఆ పుస్తకం చదవలేదు కానీ అది పునర్జన్మలు, వ్యక్తులు మళ్ళీ మళ్ళీ కలవడం గురించి కదా..ఈ విషయం చెప్పడానికి అంత డ్రామా అవసరమా?” అంది..
కొంచం సిగ్గుగా అనిపించింది అరుణ్‌కి..కానీ ఇంక ఆగేది లేదు అనుకున్నాడు..
“ఆలా పరిచయమైన మీరు తరువాత రోజు పొద్దున్నే వెళ్లిపోతారని అనుకోలేదు.. ఒకవేళ వెళ్లిపోయినా మాకు చెప్పే వెడతారు అనుకున్నాను” అన్నాడు.
“మాకు అంటే మీ ఉద్దేశ్యం మీకు స్వయంగా చెప్పి వెళ్లి ఉండాల్సిందనా” అనడిగింది.
ఆమె గొంతులో ఏ భావమూ ధ్వనించక పోవడంతో ఏమనుకోవాలో అర్థంకాలేదు అరుణ్‌కి. “ఆలా అని కాదు.. అకస్మాత్తుగా మీరు వెళ్లిపోయారని విని కొంచం నిరాశం పడ్డాను” అన్నాడు అరుణ్
“ఒక వ్యక్తిగతమైన సమస్య చెప్పి మీ అందరి సంతోషాన్ని పాడుచెయ్యడం ఎందుకని చెప్పలేదు.. అయినా సంధ్యకు, రవళికి చెప్పే వెళ్ళాను.. మీక్కూడా చెప్పాలనిపించింది కానీ కొంచం అతిగా ఉంటుందేమో అని ఊరుకున్నాను” అంది శ్రీలత కొంచం క్షమార్పణ చెప్తున్న గొంతుతో.
“అయ్యో.. పరవాలేదు” అన్నాడు అరుణ్..
“ముందు రోజు రాత్రి చాలా బాగుంది.. మీ అందరికీ మంచి టేస్ట్ ఉంది.. మీరు చాలా బాగా పాడారు కూడా.. కానీ యస్ రాజేశ్వర రావు గారి ప్రైవేట్ పాటలు పాడారు.. అంత పాత పాటల వరకు వెళ్లాలా.. కొంచం పాస్ట్ లో చిక్కున్నట్టనిపించింది.. తరువాత కాలంలో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి కదా.. బాలు గారి కంచికి పోతావా పాడొచ్చు కదా” అంది శ్రీలత.
“పాత పాటల వల్ల ఒక లాభం ఉంటుంది.. ఆ కాలం మనకు తెలియదు కాబట్టి మనం మనకు తోచినట్టు ఊహించుకోవచ్చు.. నిజానికి మన అనుభవాలు అన్నీ అలాగే రూపాంతరం చెందుతాయి.. అసలు అనుభవం నిస్సారంగా.. మామూలుగా ఉంటుంది కానీ కాలం గడిచే కొద్దీ మనం ఆ అనుభవానికి రంగులద్ది దాన్ని ఒక మంచి భావనగా రూపొందించుకుంటాం.. ఇక్కడ మనకు అనుభవం కూడా లేదు కదా దాంతో మనకు కావలసినట్టు ఉహించుకోవొచ్చు” అన్నాడు అరుణ్.
నవ్వి ఊరుకుంది శ్రీలత..
“నేను శ్రీరంగం గోపాలరత్నంగారి పాట కనిపించు నా గతము విన్నప్పుడు నాకు ప్రేమ భగ్నమవనందుకు చాలా బాధేసేది.. ఆ పాట నాలో అంత బాధ పుట్టించేది” అన్నాడు అరుణ్.
గట్టిగా నవ్వింది శ్రీలత “నేను అనుకున్న దాని కంటే పెద్ద భావుకులే.. అయినా మంచి మేనేజర్‌గా పేరెలా తెచ్చుకున్నారు అరుణ్” అంది.
నవ్వాడు అరుణ్.. సంభాషణ సాగుతుండడం కొంచం సంతృప్తి ఇచ్చినా.. ముందుకు కదలకుండా అక్కడక్కడే గుడుగుడు గుంచం ఆడటం కొంచం చిరాకు తెప్పించింది.
“సో” అన్నాడు గంభీరంగా ఏదో చెపుదామని.. కానీ ఏం చెప్పాలి? ఒక్కసారిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేయలా? అది హాస్యాస్పదంగా ఉండదూ.. గందరగోళంగా అనిపించింది అరుణ్‌కు.
“సో” అంటూ రెట్టించింది శ్రీలత.. తరువాత గట్టిగా నవ్వేసింది ప్రశ్నార్థకంలా ఉన్న అరుణ్ మొహం చూసి. “తరువాత ఏమిటి అనేది మీ ప్రశ్న” అంది.
“అవును.. నాకు ఊరికే అలా తిరగడం.. ఏ లక్ష్యం లేకుండా ఉండడం నచ్చదు” అన్నాడు.
“ఒక్కసారి ఏ లక్ష్యం లేకుండా ఉండి చూడండి.. భలే సరదాగా ఉంటుంది” అంది శ్రీలత నవ్వుతూ.
అరుణ్ కి నవ్వు రాలేదు.. అసహనం పెరిగిపోతోంది..
అది గుర్తించినట్టు శ్రీలత “సారీ సారీ.. మనం ఈ బంధానికి ఏదో పేరు పెట్టాలి.. ఆఫీసు కొలీగ్స్ ముందే అయ్యాము.. స్నేహితులం రిసార్ట్‌లో అయ్యాము.. ఇంకా ఈ కొత్త బంధాన్నేమనాలి? అది తెలిస్తే మీకు కావలసిన లక్ష్యం దొరుకుతుంది” అంది.
ఏమీ అర్థం కాలేదు అరుణ్‌కి.. ఏమిటీ అమ్మాయి, ఎక్కడకు తీసుకెళ్తోంది ఈ సంభాషణని? కొంపదీసి తను ప్రేమిస్తున్నాని చెప్పేయదు కదా.. కంగారు పడిపోయాడు
“ఒక పని చేద్దాం.. ఇప్పుడు లేట్ అవుతోంది.. రేపు సాయంత్రం కొంచం తొందరగా బయటకు రాగలరా? మనం ఈ సంభాషణని ముందుకు తీసుకెళదాం” అంది.
బాగా సాగుతున్న విషయం అకస్మాత్తుగా వాయిదా పడడంతో నిరాశ పడ్డాడు అరుణ్.. ఈ విషయం ఇప్పుడే తేలిపోతే బావుండేది అనుకున్నాడు.
“ఇది అంత తొందరగా తేలే విషయం కాదు అరుణ్.. కొంచం ఓపిక పట్టాలి.. సారీ” అంది శ్రీలత అరుణ్ మోహంలో మారుతున్నా భావాలను గమనించి.
“సరే.. రేపు నేను మూడున్నరకు ఖాళీ అవుతాను” అన్నాడు.
“మూడున్నరకు ఇక్కడే కలుద్దాం.. ఇక్కడే మాట్లాడుకుందామా లేక ఎక్కడికైనా వెళదామా ఆలోచిద్దాం” అంది శ్రీలత కదులుతూ.
***
వాళ్ళ సంభాషణ గురించి విని అరుణ్ తల్లీ, సంధ్యా నానా అల్లరీ చేసారు.
“ఒరేయ్.. నీకన్నా శ్రీలతే ధైర్యవంతురాలురా.. రేపు నీకు ఐ లవ్ యు చెప్పేస్తుంది” అంది సంధ్య
“అలాంటి పిల్ల నాకు కోడలుగా వస్తే ఇంక దిగులుండదు.. వీడి ముక్కుకి తాడు పడినట్టే.. జాగర్తగా చూసుకుంటుంది” అంది అరుణ్ తల్లీ మురిపెంగా.
అంతవరకూ జరిగిన సంభాషణలు మళ్ళీ మళ్ళీ తలచుకున్నాడు.. దాన్నుంచి ఏం అర్థం చేసుకోవాలో తెలియటంలేదు.
ఒకపక్క శ్రీలతకు కూడా తనంటే ఇష్టమనిపిస్తోంది.. మరోపక్క తన నిర్లిప్తత కంగారు పెడుతోంది.. చివరకు రేపొచ్చి సరే మనం మంచి స్నేహితులుగా ఉందాం అంటే..
మొదటిసారిగా తన గుండె శబ్దం తననే కంగారు పెట్టసాగింది.. పరీక్షా ఫలితాలకోసం వేచి చూసే విద్యార్థి లాగా గిల గిలా కొట్టొకున్నాడు.
ఆ రాత్రి ఆందోళన తో నిద్ర పట్టలేదు..
తరువాత రోజు అరుణ్ మనసు మనసులో లేదు.. కుదిరినన్ని పనులు తరువాత రోజుకి వాయిదా వేసాడు.. తప్పనిసరి విషయాలు తొందర తొందరగా ముగించేశాడు.. రోజులో ఇరవై తొమ్మిది సార్లు గడియారం చూసాడు.. నాలుగు సార్లు సంధ్య కు ఫోన్ చేసాడు.. అయిదు సార్లు సంధ్య తిట్లు తిన్నాడు..
అనుకున్న టైం అయ్యింది.. గబా గబా కాఫీ పాయింట్‌కి చేరాడు అరుణ్.
శ్రీలత అప్పడికే అక్కడ ఉంది..
అద్భుతం అనుకున్నాడు.. అయితే భయం మాత్రం పెరిగింది..
“ఏం చేద్దాం? ఇక్కడే మాట్లాడుకుందామా? లేక ఎక్కడికైనా వెళ్దామా?” అనడిగింది
“బీచ్ కి వెళ్దాం” అన్నాడు అరుణ్
మాట్లాడకుండా బీచ్‌కి చేరారిద్దరు.
“ఇప్పుడు చెప్పండి అరుణ్” అంది శ్రీలత.. చాలా నిదానంగా కనిపించింది.. ఈ ఆడపిల్లలు అసాధ్యులు.. ఎంతో భోళాగా కనిపించే సంధ్య కూడా మనసులో మాట బయటకు తెలియనివ్వదు అనుకున్నాడు అరుణ్..
“మీరే చెప్పాలి.. మనిద్దరికీ ఒకరిని చూస్తే మరొకరికి తెలిసిన మనిషి అనిపించింది.. దానిక్కారణం తెలియదు.. తరువాత?” అన్నాడు శ్రీలతతో.
“తరువాత ఏమీ ఉండదు.. అలా ఎందుకనిపించింది తెలియాలి.. కానీ మనం ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చెయ్యలేం కదా ..ఇంకేం చెయ్యాలి” అంది శ్రీలత.
“నేను చెప్తాను.. మనిద్దరమూ పాతికేళ్ళు దాటిన వాళ్ళమే.. మేనేజర్లుగా పని చేస్తున్నాం.. అంటే బాధ్యత తీసుకోవడం తెలుసు.. అందువల్ల మన ఇద్దరి మధ్య భావన ఒక యవ్వనపు ఆకర్షణ కాదు.. ఆ విషయం తెలిస్తే చాలు.. ఖచ్చితంగా అదేమిటో తెలియక పోయినా పరవాలేదు” అన్నాడు
“బావుంది.. తరువాత” అంది శ్రీలత కొంచం మెచ్చుకోలుగా చూస్తూ.
“ఇది ప్రేమో కాదో అనవసరం.. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. మనిద్దరి మధ్యలో ఒక రకమైన ఆకర్షణ ఉంది.. అది ఒక దీర్ఘకాలిక బంధం ఏర్పడేందుకు దోహదం చేస్తుందనిపిస్తోంది.. సో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. మీరేమంటారు?” అనడిగాడు సూటిగా.
“సాహసం చేసావు రా డింభకా” అంది శ్రీలత నవ్వుతూ.. అంతలోనే “సారీ సారీ” అంది వివర్ణమైన అరుణ్ మొహం చూసి.
అరుణ్ కి కంగారుగా ఉంది.. జోకులు విని ఆనందించే చేసే పరిస్థితిలో లేడు. “జోకులు కాదు.. సమాధానం కావాలి” అన్నాడు
“అబ్బో.. ఎంత కంగారో.. మీకు సంబంధించి ఒక ప్రపోసల్ పెట్టారు.. దానికోసం రాత్రంతా అలోచించి ఉంటారు.. చాలా కంగారు పడుంటారు.. దానికి నేను ఒక్క మాటలో జవాబు చెప్పాలా.. అన్యాయం కదా” అంది లత.
అరుణ్ ఏమీ అనలేదు..
“అది నేను ఒక్క మాటలో చెప్పలేను.. మూడు అడుగులు నడవాలి.. పరవాలేదా?” అనడిగింది
తస్సాదియ్యా.. ఈవిడ పిల్లా, పజిలా అనుకున్నాడు “సరే” అన్నాడు చేసేదేమి లేక.
“ముందీ బంధానికి పేరు పెడదాం, అది మొదటి అడుగు” అంది శ్రీలత
“సరే.. పెళ్లి ప్రతిపాదన ఇది” అన్నాడు అరుణ్.
“బావుంది, చాలా తొందరగా మొదటి అడుగు వేసేసాం.. ఇంక రెండో అడుగు, నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మానాన్నని కలుస్తాను.. మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మని కలవండి.” అంది.
కధ అంత సొగసుగా సాగుతుండటం ఎంతో సంతోషాన్నిచ్చింది అరుణ్‌కి.. అది అతని మొహంలో కనిపిస్తోంది.
“సరే.. ఎప్పుడు?” అనడిగాడు.
“తొందరగా ఉందా?” అనడిగింది శ్రీలత ఆట పట్టిస్తున్నట్టు.
నవ్వుతూ తలొంచుకున్నాడు అరుణ్.
“ఎల్లుండి శనివారం నేను మీ ఇంటికి లంచ్‌కి వస్తాను” అంది శ్రీలత.
“ఆ రోజు సాయంత్రం నేను మీ ఇంటికి వస్తాను” అన్నాడు అరుణ్.
“సరే, బాగుంది” అంది శ్రీలత బయలుదేరడానికి లేచి నిలబడుతూ.
అరుణ్ ఆనందానికి పట్ట పగ్గాలు లేవు.. శ్రీలత ఎలాగూ తన తల్లికి నచ్చేసింది.. తనలో శ్రీలత తల్లికి నచ్చక పోవడానికి ఏమీ లేదు.. ఇదంతా ఇంక నల్లేరు మీద బండి నడకే అనుకున్నాడు.
ఈ విషయం తెలిసి అరుణ్ తల్లితండ్రులు చాలా సంతోషించారు.
“నా తమ్ముడివైనందుకు గర్విస్తున్నాను రా” అంది సంధ్య సంతోషంతో..
ఈ సందర్భంగా ఆమె పెళ్లి కూడా చేసెయ్యొచ్చని సంధ్య తల్లిదండ్రులు కూడా సంతోషంతో ఉన్నారు.
తరువాతి రెండురోజులూ గాలిలో తేలుతూ గడిపాడు అరుణ్.. కావాలనే శ్రీలతను కలిసే ప్రయత్నం చెయ్యలేదు.. తను నిజంగానే చాలా బిజీగా ఉంది.
***
శనివారం రానే వచ్చింది.. ఉదయం పది గంటల తరువాత శ్రీలత సంధ్య ఇంటికి వచ్చింది.. అక్కడ నుంచి స్నేహితురాళ్ళిద్దరూ అరుణ్ ఇంటికి వచ్చారు.
“చుట్ట పక్కల జాగ్రత్తగా గమనించు.. నువ్వింక ఉండాల్సింది ఇక్కడే” అంటూ అట పట్టించింది సంధ్య.
అన్నిటికి చక్కని తన నవ్వే సమాధానం చేసుకుంది శ్రీలత..
శ్రీలత రావడం ఒక పండగలా చేసింది అరుణ్ తల్లి.. గుమ్మానికి తాజా పూలదండ వేసింది.. హాల్లో గుమ్మానికి ఎదురుగా ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి ఒక తెల్లని దండ వేసింది.. కొత్త కర్టెన్లు, సోఫా కుషన్ కవర్లు.. ఇల్లంతా కళ కళ లాడి పోతోంది
అవన్నీ చూసి చూసి “ఆంటీ ఇంక మీరు హారతి ఇచ్చి కుడి కాలు లోపల పెట్టమనడమే” అంది సంధ్య నవ్వుతూ.
మురిపెంగా నవ్వింది అరుణ్ తల్లి “నా తల్లే మంచి మాటన్నావే” అంటూ సంధ్య బుగ్గలు నిమిరింది.
భోజనం ఏర్పాట్లు కూడా బాగా చేసింది.. స్వీట్లు చేసింది.. పులిహార చేసింది.
అరుణ్ తండ్రి కూడా అందరితో కూర్చుని శ్రీలతతో మాట్లాడాడు.
తన తండ్రి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని, తల్లి ఇంట్లోనే ఉంటుందని చెప్పింది శ్రీలత.. ఇంతకన్నా బంధువులెవరు లేరు తనకు.. మిత్రుల బృందం మాత్రం పెద్దది.
“చిన్నపట్నుంచి మా ఇంట్లో పిల్లలా పెరిగిన ఈ సంధ్య కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది.. ఇంక నువ్వే నా కూతురివి” అంటూ మురిసి పోయింది అరుణ్ తల్లి.
“సారీ.. మా వాళ్ళు కొంచం పాత కాలం వాళ్ళు.. అలా కుదిరింది వాళ్లకు దాంతో వాళ్ళు మానసికంగా ఎదగలేదు.. మీరేమి అనుకోవద్దు. ఇలాగే పాత చింతకాయ పచ్చడిలా ఉండాలని మేమెవరమూ బలవంత పెట్టము..మీ ఇష్టం” అన్నాడు అరుణ్.
అక్కడ అంత హడావిడి జరుగుతున్నా చక్కని చిరునవ్వుతో ఉంది గాని తన భావాలు ఏమాత్రం బయట పెట్టలేదు శ్రీలత.
అరుణ్ తల్లీ, సంధ్యా భోజనాల ఏర్పాట్లు చేస్తుంటే అరుణ్ గది లోకి వచ్చింది శ్రీలత.. పుస్తకాలూ.. పాటల సీడీలు, గోడలకి పెట్టిన అతని స్నేహితుడు వేసిన పెయింటింగ్స్, ఒక పక్కగా ఉన్న టేబుల్, దాని మీద సగం తెరిచి పెట్టున్న అరుణ్ లాప్టాప్, పుస్తకాల దొంతరమీద పెట్టి ఉన్న వేణువు అన్ని శ్రద్ధగా చూసింది.. ఏమీ అనలేదు.
భోజనాలయ్యాక ఒక గంట ఆగి శ్రీలత ఇంటికి బయలుదేరింది.. నేను దింపడానికి రానా అని అడిగిన అరుణ్‌ని వద్దని ఆపేసింది.. సాయంత్రం ఎలాగా రావాలి కదా అని.
అరుణ్ తల్లికి పెళ్లి ఎక్కడ ఎలా చెయ్యాలి, ఎవర్ని పిలవాలి, ఎవరికేమి బట్టలు పెట్టాలి వగైరా ఆలోచనలు ముసురుకోవడం ప్రారంభమైపోయాయి.. ఆ ఊహల్లో తేలిపోతూ తన గదిలోకి వెళ్లి పడుకుంది.
సాయంత్రం నాలుగున్నరకు శ్రీలత ఇంటికి వెళ్ళాడు అరుణ్.
చక్కటి ఇండిపెండెంట్ ఇల్లు.. కిందా పైనా రెండు వాటాలు ఉన్నాయి.. చుట్టూరా చిన్న గార్డెన్.. చక్కని పూల చెట్లు.. ఆ ఇల్లు కూడా శ్రీలత లాగానే ఎంతో గంభీరంగాను పొందిక గాను ఉంది.
లోపలి తీసుకెళ్లింది శ్రీలత.
విశాలమైన హాల్‌లో ఒక పక్క సోఫా, మరో పక్క డైనింగ్ టేబుల్.. గదంతా అందమైన విగ్రహాలూ.. ఆకర్షణీయమైన వస్తువులు చూసి కొంచం జంకాడు అరుణ్.. అవేవి ఇప్పుడు తానొస్తున్నందుకు ఏర్పాటు చేసినవిలా లేవు.. నిజానికి తను ఆ ఇంటికి రావడం ఒక మాములు కార్యక్రమంలా ఉంది.. శ్రీలత కోసం తన తల్లి చేసిన హడావిడి గుర్తుకు వచ్చింది అరుణ్‌కి.
శ్రీలత చూపించిన సోఫాలో కూర్చుని.. వీళ్ళు మనకంటే ఎంతో మంచి జీవితాన్ని గడుపుతున్నారు.. సాధారణంగా అలాంటి ఇళ్లలోని వారు తక్కువ మాట్లాడుతూ గంభీరంగా ఉంటారు.. పాత కాలం మాటలు మాట్లాడే మన వాళ్ళను వీళ్ళు భరించగలరా?..రకరకాల ఆలోచనలతో కంగారు పడుతున్నాడు అరుణ్.
ఇంతలో పక్క గుమ్మం లోంచి శ్రీలత తల్లి వచ్చి సోఫాలో కూర్చుంది.
తెల్లగా, అందంగా ఉన్న ఆవిడ మఫ్టీలో ఉన్న మహారాణిలా ఉంది.. అరుణ్‌ని చూసి చిన్నగా నవ్వింది.. ఈవిడలో దేవతా విగ్రహాలను చూసినప్పుడు కలిగే ఆకర్షణ ఉంది అనుకున్నాడు అరుణ్.
ఆవిడ కళ్ళల్లో ఏదో తెలియని విచారం లీలగా కనిపిస్తోంది.. పజిళ్లకే అమ్మలా ఉందీవిడ అనుకున్నాడు అరుణ్.
“భోజనం బావుందని అమ్మాయి చెప్పింది.. చాలా సంతోషం” అందావిడ ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా
తన ఇంటిలో శ్రీలత చేసిన భోజనం గురించి అని అర్థం అయ్యింది అరుణ్‌కి.
చిన్నగా నవ్వాడు.. కలగ జేసుకుని టాపిక్ లోంచి టాపిక్ లోకి తీసుకెళ్తూ ఎంతో సేపు సంభాషణ సాగించగల అరుణ్ అక్కడ నిశ్శబ్దంగా కూచున్నాడు.
శ్రీలత టీ తీసుకుని వచ్చింది.. అందరు టీ తాగారు.
“శ్రీ నాకంతా చెప్పింది.. మీకు అన్నీఅంగీకరమైతే నాకేమీ అభ్యంతరం లేదు.. ఇది మీ జీవితం.. మీరిద్దరూ కూడా బాగా చదువుకున్నవాళ్ళే.. మంచి నిర్ణయమే తీసుకుంటారని నా నమ్మకం” అంది శ్రీలత తల్లి
“థాంక్ యు ఆంటీ” అన్నాడు అరుణ్
ఆవిడ లేచి లోపలకి వెళ్లి పోయింది.. విచిత్రంగా అనిపించింది అరుణ్‌కి.. ఇంతేనా? కూతురు ఎలాంటి ఇంటికి వెడుతుంది? ఆ మనుషులెలాంటి వాళ్ళు ఇవేవీ ఆవిడకు పట్టవా? సొసైటీ లేడీస్ అంటే వీళ్లేనా? అనుకున్నాడు.
“నా రూమ్ చూద్దామా?” అనడిగింది శ్రీలత.
ఈ మాట నచ్చింది అరుణ్ కి “సరే” అంటూ లేచి నిలబడ్డాడు.
సోఫాకి దగ్గరలో ఉన్న గుమ్మం చూపించి “ఆ రూమ్ మా అమ్మది.. నా రూం ఆ పక్కన ఉంది” అంటూ దారి తీసింది శ్రీలత.
శ్రీలత రూమ్ తనలాగానే సొగసుగాను, శుభ్రం గాను ఉంది.. అందమైన తెరలు.. చక్కటి స్టడీ టేబుల్, దాని మీద ఆపిల్ లాప్టాప్, ఒక పక్కగా పుస్తకాల షెల్ఫ్.. అందులో హెచ్.ఆర్.తో బాటుగా మనోవిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలూ, క్లాసికల్ లిటరేచర్.. తన టేస్ట్‌ను తెలియ జేస్తున్నాయి.
ఎక్కడివక్కడ చక్కగా ఉన్న రూంని చుస్తే శ్రీలత ఎంత పొందికైన మనిషో తెలుస్తుంది అనుకున్నాడు అరుణ్.
అస్తవ్యస్తంగా ఉండక పోయినా ఇంత పొందికగా ఉండని తన రూమ్ గుర్తుకొచ్చి కొంచం ఆత్మన్యూనతకు లోనయ్యాడు.. తను వచ్చాక మార్చుకుందాం అనుకున్నాడు.
ఆ గదిలోనే ఒక పక్కగా సోఫా ఉంది.
“అమ్మతో కలిసి చూస్తే హాల్ లో టీవీ.. ఒక్కోసారి అమ్మకు టీవీ చూడాలని ఉండదు. అప్పుడు ఈ టీవీలో నాకు కావాల్సినవి చూసుకుంటాను” అంది శ్రీలత గోడ మీద తగిలించి ఉన్న చిన్న టీవీ ని చూపిస్తూ.
అయిదు నిముషాలు మౌనంగా కూర్చున్నారు.. అరుణ్‌కి ఇంటికి వచ్చి నట్టు లేదు.. ఏదో రాజభవనంకో లేక పెద్ద మ్యూజియంకో వచ్చినట్టుంది.
ఇద్దరు లేచి హాల్ లోకి వెళ్లారు.. అప్పటికే వచ్చిన శ్రీలత తండ్రి ఒక సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నారు.
అరుణ్‌ని చూసి లేచి నిలబడి “వెరీ నైస్ యంగ్ మాన్” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
కాసేపు పిచ్చాపాటీ మాట్లాడారు.. ఆయన మాములు మనిషి లాగే ఉన్నారు.. పైపెచ్చు పాఠాలు చెప్పే ప్రొఫెసర్ కావడంతో కుర్రకారుతో సంభాషించడం అలవాటే కాబట్టి రకరకాల విషయాలు మాట్లాడారు.
అరుణ్ తల్లిదండ్రుల గురించి అడిగారు.. అరుణ్ చదువు గురించీ, ఉద్యోగం గురించీ మాట్లాడారు.
అరుణ్కి ఇష్టమైన పుస్తకాల గురించి కూడా కొంత సంభాషణ జరిగింది.
అయన రూమ్ ఎక్కడో అనుకున్నాడు అరుణ్.. ఎందుకంటే ఆ పక్క రూమ్ తన తల్లిదని చెప్పింది శ్రీలత.. పేరెంట్స్‌ది అనలేదు..
కాసేపు సంభాషణ జరిగిన తరువాత “బేబీ..డిన్నర్ ప్లాన్ ఏమిటి” అనడిగాడు శ్రీలతను.
“మేము బయటకు వెడతాము డాడీ.. మమ్మీకి నేను ఏర్పాటు చేశాను.. మీరు మీ పద్ధతి ప్రకారం చేసుకోండి” అంది శ్రీలత.. ఆ సంభాషణలో ఏదో తెలియని దూరం ధ్వనిస్తోంది.
“సరే కన్నా.. ఒకే యంగ్ మాన్” అంటూ బయటకు వెళ్ళిపోయాడు అయన.
మాములుగా ఎవరితో మాట్లాడినా శ్రీలత ఎంతో ఆదరంగా అనిపిస్తుంది.. మాట్లాడిన ప్రతివారు ఒక వ్యక్తిగత స్పర్శ లోనవుతారు.. అలాంటిది తన తండ్రి అంత పొడి సంభాషణ?
ఇది ఇల్లా మాంత్రికుడి గుహా అనుకున్నాడు.. అన్ని విషయాలూ మర్మగర్భంగా ఉన్నాయి.. తనకు పరిచయమైన జీవితం కాదిది.. ఇలాంటి జీవితంలోంచి వచ్చిన శ్రీలత అంత కలుపుగోలుగా ఎలా ఉంటుంది? అంత వ్యక్తిగత స్పర్శ ఎలా ఇస్తుంది? ఏమీ అర్థం కావటం లేదు అరుణ్‌కి.
ఇద్దరు లేచి బయటకు నడిచారు “మీకు నచ్చిన చోటుకు తీసుకెళ్లండి” అంది శ్రీలత.
తనకు నచ్చిన పాత రాజభవనం లాంటి ఇంట్లో పెట్టిన హోటల్‌కి తీసుకెళ్లాడు అరుణ్.
ఇద్దరి మధ్య ఏమీ మాటలు జరగట్లేదు.
భోజనం ఆర్డర్ చేసాక “మన ప్లాన్‌లో రెండో అడుగు పూర్తయ్యింది.. మూడవదేమిటి?” అనడిగాడు అరుణ్
“రేపు మీరు సెలవు పెట్టగలరా?” అనడిగింది శ్రీలత
“మూడో అడుగు సాక్షాత్తూ వామనుడిదా రోజంతా కావాలంటున్నారు?” అన్నాడు అరుణ్ నవ్వుతూ.. అంత సీరియస్ వాతావరణం అంత సేపు భరించడం కష్టంగా ఉంది అతనికి..
“అలాగే అనుకోండి.. సమస్య వామనుడంతే కానీ అడుగు పెద్దది.. నేను ముందే సెలవు పెట్టాను” అంది శ్రీలత.
ఇదేదో పెద్ద మాస్టర్ ప్లాన్‌లా ఉంది.. తను అన్ని అడుగులకు ప్లాన్ చేసుకుంది.. నాకు మాత్రం ఒక్కో అడుగు చెప్పుకుంటూ వస్తోంది అనుకున్నాడు.. సరే చూద్దాం అనుకున్నాడు శ్రీలత మీద నమ్మకంతో.
“రేపు నాకు పదకొండు గంటలకొక కస్టమర్ కాల్ ఉంది.. మనవాళ్ళు కొంచం కష్టపెట్టారు, వాళ్ళను తొందరగా సుఖమర్లు చెయ్యకపోతే ఇబ్బంది.. లంచ్ టైం నుంచి నేను ఖాళీ అవగలను..పరవాలేదా?” అనడిగాడు.
“పరవాలేదు.. ఒంటి గంటకు మా ఇంటి దగ్గర నన్ను పిక్అప్ చెయ్యండి.. ఎక్కడైనా లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం.” అంది శ్రీలత.
శ్రీలత ఇంట్లో తనకు కలిగిన అనుభవాలు మంచివా చెడ్డవా తేల్చుకోలేక సతమతమౌతూ ఇంటికి చేరాడు అరుణ్.
“ఏరా.. అంతా బాగా జరిగిందా? శ్రీలత తల్లిదండ్రులను కలిసావా? నీ ఉద్దేశ్యం ఏమిటి?” అంటూ ప్రశ్నలు సంధించింది సంధ్య.
“అంతా బాగానే జరిగింది.. రేపు మళ్ళీ కలుస్తున్నాము.. అసలు విషయం అప్పుడు తేలుతుంది” అన్నాడు అరుణ్.
“అల్ ది బెస్ట్ రా” అంది సంధ్య
అరుణ్ తల్లీ, సంధ్య తల్లీ దేని గురించో వాదించుకుంటున్నారు.. ఏదో టీవీ సీరియల్ గురించి అయ్యుంటుంది.. ఇద్దరికీ తక్షణ సమస్యలేమీ లేకపోవడంతో ఇలా కథల గురించీ, సినిమాల గురించీ చర్చించు కుంటూ వాదించుకుంటూ గడిపేస్తుంటారు.
“అదిగో అరుణ్ వచ్చాడు.. వాడినే అడుగుదాం” అంది సంధ్య తల్లి అతను హాల్లోకి రాగానే
“వాడి మొహం.. వాడికేం తెలుసు.. నువ్వు లోపలకి వెళ్లి కాళ్ళు మొహం కడుక్కోరా” అంది అరుణ్ తల్లి
“ఏమిటి విషయం.. ఈసారేం సమస్య” అనడిగాడు అరుణ్ సోఫాలో కూలబడుతూ.
“పిచ్చి వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అంటోంది మీ అమ్మ.. కాదు అది పరిస్థితుల వల్ల కలుగుతుంది గాని జన్యు పరమైన కారణాలేమీ ఉండవని నేనంటున్నాను” అంది సంధ్య తల్లి.
“అదేం కాదు.. మా ఊళ్ళో రామకృష్ణారావు గారని ఉండేవారు.. ఆయన భార్యకు పిచ్చి.. వాళ్ళ పెద్దమ్మాయికి కూడా తరువాత అలాంటి సమస్యలే వచ్చాయి.. అప్పుడందరూ తల్లి నుంచి వచ్చింది అనే అన్నారు” అంది అరుణ్ తల్లి
“మిగతా పిల్లకు రాలేదు కదమ్మా? పెద్దమ్మాయి తల్లికి దగ్గరగా ఉండి ఉంటుంది.. చిన్నతనంలో అలాంటి విషయాలు చాలా ఆందోళన కలిగిస్తాయి.. అందువల్ల తనకు వచ్చుండొచ్చు” అన్నాడు అరుణ్.
“నువ్విలాగే ఏదో అర్థం లేని అద్వైతం చెప్తావు.. నేను మాత్రం నమ్మను” అంది అరుణ్ తల్లి కోపంగా.
“నాకు తెలిసినంత వరకు పిచ్చి పరిస్థితుల ప్రభావం వల్లనే కలుగుందోయ్.. జన్యు పరమైన కారణాలేమీ ఉండవనుకుంటాను.. ఇంట్లో ఒకళ్లకు సమస్య ఉంటే మిగతా వాళ్ళు ఆ సమస్య దగ్గర నుంచి చూస్తారు కనుక వాళ్ళు నిస్పృహకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.. అలా ఒకే ఇంట్లో జరగవచ్చు.. దాని వల్ల మనం అవి జన్యుపరంగా వస్తున్నాయనుకుంటాం” అన్నాడు అరుణ్ తండ్రి.
“సరేలే..ఇదోదో మన ఇంట్లో విషయంలా ఆవేశపడొద్దు.. సీరియల్ చూద్దాం” అంది సంధ్య తల్లి సమస్యకు అక్కడ సమాప్తి ప్రకటిస్తూ.
నవ్వుతూ తన గదిలోకి నడిచాడు అరుణ్. .అతని మనసులో శ్రీలత లేపిన కల్లోలం సద్దుమణగట్లేదు.. ఈ జరిగిన రెండు అడుగులూ బావున్నట్టా లేనట్టా? మూడో అడుగులో ఏముంది.. ఏమీ అర్థం కాలేదు.. రాత్రి కలత నిద్ర పోయాడు
***
మర్నాడు కస్టమర్ మీటింగ్ బాగా జరిగింది.. దాదాపు అన్ని సమస్యలూ పరిషరించగలిగాడు అరుణ్.. చాలా ఉత్సాహంగా ఉన్నాడు.. అనుకున్నట్టే లంచ్ టైంకి శ్రీలత ఇంటికి వెళ్లి తనను ఎక్కించుకున్నాడు.
“ఎక్కడికెళదాం? ఎలాంటి ఫుడ్ తినాలనుంది?” అనడిగాడు శ్రీలతను
“ఏదైనా పరవాలేదు.. కొంచం ఏకాంతం ఉండాలి.. మూడు నాలుగు గంటలు కూర్చున్నా సమస్య రాకూడదు” అంది శ్రీలత..
తనలో మామూలుగా ఉండే నెమ్మదితనం కొంచం తగ్గినట్టనిపించింది.. ఏదో విషయం గురించి కొద్దిగా ఆందోళన పడుతున్నట్టుంది.
సముద్రం ఒడ్డున తనకు తెలిసిన ఒక నక్షత్రాల రిసార్ట్‌కి తీసుకెళ్లాడు అరుణ్.. ఆ రిసార్ట్ రోడ్డు నుంచి ఇసుక వరకు పాకి ఉంటుంది.. ఇసక దగ్గరలో చెట్టుకింద ఒక టేబుల్ ఉంటుంది.. చక్కటి ఏకాంతం.. ఎంత సేపు కూర్చున్న ఎవ్వరూ అడగరు.. అది అరుణ్‌కి ఇష్టమైన టేబుల్..
అక్కడ కూర్చుని సింపుల్ ఫుడ్ ఆర్డర్ చేసారు ఇద్దరూ..
కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది..
“అరుణ్.. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. నా కుటుంబం గురించీ, మా జీవితాల గురించీ సంధ్య చెప్పే ఉంటుంది.. అయినా నేను కూడా చెప్తాను” అంది శ్రీలత
“సంధ్య ఏమీ చెప్పలేదు.. మీ ఇంటికి వచ్చే వరకు మీ కుటుంబం గురించి నాకెలాంటి ఉపోద్ఘాతమూ లేదు.. మీ అమ్మగారూ నాన్నగారూ ఎలా ఉంటారు అని ఊహించడానికి కూడా ఏమీ వివరాలు తెలియదు.. అదేమీ పెద్ద సమస్య కాదు.. మీరు చెప్పండి.. ఏమీ సంకోచించ వద్దు” అన్నాడు అరుణ్
ఈ లంచ్ ప్లాన్, ఎక్కువ టైం, ఏకాంతం కావలనడం లాంటి సూచనల వల్లా.. తనకు ఏవో కుటుంబ సమస్యలున్నాయని సంధ్య ముందే చెప్పి ఉండడంవల్లా.. శ్రీలత ఏదో ముఖ్యమైన విషయమే చెప్తుంది అనుకున్నాడు అరుణ్..దానికి మానసికంగా సంసిద్ధం గానే ఉన్నాడు..
“మా ఇల్లు చూసారు కదా.. కింద ఒకటి, పైన ఒకటి రెండు వాటాలు ఉంటాయి” అంటూ మొదలు పెట్టింది శ్రీలత.
కొంచం ముందుకు వంగి, టేబుల్ మీద చేతులానించి, పాదాలు రెండు క్రాస్ చేసి కూర్చుని శ్రద్ధగా వింటున్నాడు అరుణ్.
“నేనూ మా అమ్మా కింద ఉంటాము.. మా డాడీ పై వాటాలో ఉంటారు.. మీరు తెలుసుకోవాల్సిన మొదటి ముఖ్యమైన విషయం ఇదే..
మా అమ్మ నాన్నా విడిపోయి ఇరవై రెండు ఏళ్ళు అయ్యింది.. నాకు పెరుగుదల సమస్యలు రాకూడదని వాళ్లిద్దరూ ఈ అమరిక చేసుకుని ఉంటున్నారు.. వాళ్లిద్దరూ మాట్లాడుకోరు.. నాతో మాత్రం ఇద్దరూ విడివిడిగా మాట్లాడుతుంటారు” అంది శ్రీలత.. ఈ విషయం చెప్తుండగా తన మొహం కొంచం పాలిపోవడం గమనించాడు అరుణ్.
ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందని ఉహించాడు కాబట్టి ఈ విషయం విని ఏమీ స్పందించలేదు.. మోహంలో ఎలాంటి భావాలూ చూపించలేదు.. తన కూచున్న భంగిమను మార్చలేదు.. శ్రీలతకు అది కొంచం ధైర్యాన్ని ఇచ్చింది.. ఈ మాట విని అరుణ్ ఎలా స్పందిస్తాడో అని ఎంతో కంగారు పడింది.
“రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నా పెళ్లి అయిన తరువాత మా నాన్న ఈ ఇల్లు వదిలి వెళ్లి పోవాలని ఒప్పందం.. ఆ పై వాటాలో నేను ఉండి మా అమ్మను చూసుకోవాలి” అంది
“అర్థం అయ్యింది.. మీరున్న ఇంటిలో అమ్మ నాన్నా ఇద్దరూ ఉన్నా నిజానికి మీరు మీ అమ్మతోనే పెరిగారు.. మీ నాన్న అవసరమైన మద్దతు ఇచ్చారు.. మీ పెళ్లి తరువాత మీకొక జీవితం వస్తుంది కాబట్టి మీ నాన్న వెళ్లిపోతారు.. ఆయనకు మీ అమ్మగారి బాధ్యత ఏమీ లేదు.. అదే కదా విషయం” అన్నాడు అరుణ్.
“మీకు పరవాలేదా? ఈ విషయం మీ ఇంట్లో ఎలా తీసుకుంటారో అని భయంగా ఉంది” అంది శ్రీలత
“మీ నాన్నగారు మానవ నిర్మాణ శాస్త్ర ఆచార్యులు కదా.. చూడడానికి మంచి ఆయన లాగే ఉన్నారు.. విడిపోవడం ఎందుకు జరిగిందో తెలుసుకోవచ్చా? ఇది చెప్పాలనే బలవంతం ఏమీ లేదు.. మీరు చెప్పదలుచుకుంటేనే చెప్పండి.. ఈ విషయాన్ని ఎలా మా ఇంట్లో చెప్పాలో తరువాత ఆలోచిద్దాం” అన్నాడు అరుణ్.
“చెప్తాను.. మా జీవితాల్లో అది చాలా ప్రముఖమైన ఘట్టం.. మీకు తెలియాలి.. కానీ విషయాన్ని ఎలా చెప్పాలో ఆలోచించడం ఏమిటి? ఈ విషయం వింటే మీ అమ్మ నాన్న స్పందన ఏమి అవ్వచ్చో మీకు తెలియదా?” అనడిగింది శ్రీలత
“నాకు సంబంధించినంత వరకు మీ అమ్మా నాన్న జీవితాల్లో జరిగినది వాళ్ళ వ్యక్తిగత విషయం.. దానికి కారణాలు వాళ్ళ భూత కాలంలో ఉన్నాయి.. మనం ఆ విషయాన్నిఇప్పడి పరిస్థితులలో వ్యాఖ్యానించడం తప్పని నా ఉద్దేశ్యం.
నాకు తెలిసినంత వరకు మా అమ్మానాన్నలకు అభ్యంతరం ఏమీ ఉండదు.. సాధారణంగా ఇలాంటి విషయాల్లో అభ్యంతరం ఆ విడిపోవడం వల్ల పిల్లల మీద పడే చెడ్డ ముద్రలేముంటాయో అని.. ఒక్కోసారి ఇలాంటి ఘట్టాల వల్ల ప్రవర్తనా పరమైన సమస్యలు రావొచ్చు.. కానీ మీ విషయంలో అలాంటిదేమీ జరగలేదు.. ఈ సమస్యను ఎదుర్కొంటూ మీరు మట్టి గడ్డలా చితికి పోకుండా చిల్ల పెంకులా గట్టి పడ్డారనిపిస్తోంది” అన్నాడు అరుణ్.
చిన్నగా నవ్వింది శ్రీలత “అలా అయితే చాలా మంచిది.. విషయమేమిటంటే మా అమ్మకు మా నాన్నతో పెళ్లి ఇష్టం లేదు.. తప్పనిసరిగా ఒప్పుకుంది.. ఎలాగైనా సమాధానపడి బతకాలనుకుంది.. కానీ నేను పుట్టాక ఆ ఆలోచన మారింది.. ఎట్టి పరిస్థితి లోను కలిసి ఉండడం కుదరదు అంది” అని ఆపింది.
మొహంలో ఏ భావాలూ చూపించకుండా వింటున్నాడు అరుణ్.. అది చాలా ముఖ్యం అని అతనికి తెలుసు.. ఈ విషయం చెప్తూ శ్రీలత అపరాధ స్పృహకు లోనవ్వొచ్చు.. దాని వల్ల తనతో బంధం శాశ్వతంగా తెగిపోవచ్చు
తను వింటున్న విషయాలను బట్టి శ్రీలత తల్లిదండ్రుల జీవితాలని బేరీజు వేసే ప్రయత్నం కూడా చెయ్యటం లేదు.. ఆ విషయాల ప్రభావం శ్రీలత మీద ఎంత ఉంది, దానివల్ల భవిష్యత్తులో తానేమైనా సమస్యలు ఎదుర్కొంటుందా అనేదే అతని ఆలోచన.
“వాళ్ల బంధాన్ని గురించి చెప్పే ముందు మూడవది ఆఖరిది అయిన విషయం ఒకటి మీకు చెప్పాలి.. మా అమ్మకు పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ ఉంది.. ఆవిడకి ఆందోళన అటాక్‌లు వస్తుంటాయి.. అందువల్ల తను చాలా నిర్లిప్తంగా ఉంటుంది.. అర్థం లేని భయాలున్నాయి.. ఒక్కో సారి ఎందులోకి దిగదు.. ఒక్కోసారి విపరీతమైన శ్రమ చేస్తుంది.. దానికి చికిత్స నడుస్తోంది.. నాకు జ్ఞానం వచ్చేటప్పడికే ఆవిడకి ఈ రోగం ఉంది” అని ఆపింది అరుణ్ స్పందన కోసం
నిస్చేష్టుడైపోయాడు.. గుండె గొంతులోకి వచ్చేసింది అరుణ్‌కి..
తన తల్లి సంధ్య తల్లితో ఇలాంటి విషయమై వాదించడం గుర్తుకు వచ్చింది.. ఇప్పుడీ విషయం వింటే తను ఎలా స్పందిస్తుందో..
నాన్న కొంచం హేతుబద్ధంగానే ఆలోచిస్తాడు.. ఇందులో శ్రీలత తప్పేమి లేదు.. తనకు ఎలాంటి మానసిక సమస్యా లేదు కదా.. వాళ్ళ అమ్మ అనారోగ్యం కోసం తనను వదులుకోవాల్సి వస్తుందా? ఏం చెయ్యాలి?
అయిదు నిముషాలు ఇద్దరి మధ్య ఏం మాటలూ జరగలేదు.. కొంచం సంభాళించుకుని “అంటే ఆవిడకు..” మాట పూర్తి చెయ్యలేక ఆగాడు అరుణ్.
“అవును.. ఇప్పుడు రుగ్మత.. అటాక్ లాంటి అందమైన పదాలు వాడుతున్నారు కానీ పాత కాలంలో దీన్నే పిచ్చి అనేవారు” అంది శ్రీలత నిర్వికారంగా.
“అది సరే.. పేరేమైనా.. విషయం ముఖ్యం.. ఈ పిటిఎస్‌డి సమస్య ఆవిడకు పుట్టుకతో వచ్చిందా లేక ఇంక ఏమైనా కారణాలున్నాయా?” అనడిగాడు
“ఇది జెనెటిక్ సమస్య కాదు.. కొన్ని దురదృష్టకరమైన అనుభవాల వల్ల వస్తుంది.. అందువల్ల ఆవిడకు పిటిఎస్‌డి సమస్య ఉంది కదా అని నాకు గాని నా పిల్లలకు గాని రాదు” అంది శ్రీలత
ఆమె గొంతు కొంచం వణికింది.. అరుణ్ అలా ఆలోచిస్తాడని అనుకోవడమే కొంచం కష్టంగా ఉందామెకి.
తనకు అలాంటి భావన కలిగించినందుకు బాధపడ్డాడు అరుణ్ “నా ఉద్దేశ్యం అది కాదు.. ఇన్నేళ్ళలో తగ్గలేదంటే చాలా దీర్ఘకాలిక సమస్య అయ్యుంటుంది కదా.. సాధారణంగా దీర్ఘకాలిక సమస్యలు జన్యు సంబంధమైనవి అంటారు.. అలాంటి సమస్యలకు చికిత్స కూడా ఏమి ఉండదు” అన్నాడు కొంచం నొచ్చుకుంటున్నట్టు.
“సారీ.. మా బంధువులందరూ దూరమై పోవడానికి కారణం అలాంటి నమ్మకాలే.. దానివల్ల నేను కొంచం రక్షాత్మకంగా తయారయ్యాను” అంది సంజాయిషీ చెప్తున్నట్టు.
“ఏమీ పరవాలేదు.. నేను నా మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చినా చెప్పేస్తాను.. మీరు కూడా మీ భావోద్వేగాలు ఆపుకోకండి.. అవన్నీ అనుభవిస్తూ మీరు చెప్పేది చెప్పండి.. వినడానికి నాకు ఓర్పు ఉంది.. తెలియని విషయం అడిగి తెలుసు కోవడానికి తగిన ధైర్యం ఉంది.
అన్నింటి కంటే ముఖ్యం ఈ సమస్యలకు మీరు గాని, మీ అమ్మగారు గాని కారణం కాదని నాకు అర్థం అవుతుంది.. మరో ముఖ్యమైన విషయమేమిటంటే నా నిర్ణయం అయిపొయింది.. ఈ సంభాషణ మీ గురించి మరింత తెలుసుకోవడానికి మాత్రమే” అన్నాడు అరుణ్.
ఆ మాటతో కొంచం తేటపడింది శ్రీలత “మా అమ్మ తప్పనిసరిగా మందులు వేసుకుంటుండాలి.. వ్యాయామం చేస్తుండాలి.. మంచి తిండి తింటుండాలి.. ఇవన్నీ జాగర్తగా చూసుకోవాలి” అంది కథను కొనసాగిస్తూ.
“మీ నాన్నగారు విడిపోవడానికి ఇదే కారణమా?” అనడిగాడు అరుణ్.
“కాదు.. వాళ్ళు విడిపోవడం మా అమ్మ నిర్ణయం” అంది శ్రీలత.
“ఆయనకు ఈ సమస్య ఉందని తెలుసా? దానికి అయన స్పందన బాగులేక పోవడం వల్ల మీ అమ్మగారు ఆలా కోరుకున్నారా?” అనడిగాడు అరుణ్
“తెలుసు.. ఒక ముఖ్య విషయం ఏమిటంటే మా నాన్నగారు మా అమ్మకు మామయ్య అవుతారు.. వాళ్ళ పెళ్లి టైముకే మా అమ్మగారికి ఈ సమస్య ఉంది” అంది శ్రీలత.
శ్రీలత తండ్రి ఒక గొప్ప సంస్కర్తలా అనిపించాడు అరుణ్‌కి.. ఆయనను అపార్థం చేసుకుని దూరం చేసుకుంటున్నారా అని అనుమానం వచ్చింది.. ఆ మాటే అన్నాడు శ్రీలత తో
“మా అమ్మగారికి పిటిఎస్‌డి సమస్య రావడానికి కారణం తెలుసా? మా అమ్మగారి తల్లి తండ్రులు తనకు మూడేళ్ళ వయసులో ఒక ఆక్సిడెంట్‌లో పోయారు.. దాన్లో ఆవిడ అన్న కూడా పోయాడు.. ఒంటరిదై పోయింది.. ఆ పిల్లను వాళ్ళ పితామహులు పెంచి పెద్ద చేసారు..
మా నాన్న మా అమ్మ తాతగారికి మేనల్లుడు.. అలా ఆవిడకు అయన మామయ్య.. ఆయన తల్లిదండ్రులు అయన పదిహేనో ఏట మరణిస్తే వాళ్ళ మేనమామగా ఆయన్ను చేరదీసి పెంచారు” అంది శ్రీలత.
“అంటే మీ అమ్మగారికి నాన్నగారికి చాలా ఏజ్ గ్యాప్ ఉండుంటుంది” అన్నాడు అరుణ్
“అవును.. పన్నెండేళ్ళు” అంది శ్రీలత
“పెంపకంలో లోపాల వల్లనా మీ అమ్మగారికి ఈ సమస్య వచ్చింది?” అనడిగాడు అరుణ్
ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు శ్రీలత.. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేసింది.
ఒక్క పది నిముషాలు ఆమెను కదిలించకుండా ఓపిగ్గా కూర్చున్నాడు అరుణ్..ఆమె కొంచం కుదుట పడ్డాక ఒక టిష్యూ పేపర్ ఇచ్చాడు.. అతని మోహంలో శ్రీలత గురించిన ఆందోళన కనిపిస్తోంది.
అతను చూపించిన సున్నితమైన ప్రతిస్పందనకు సంతోషించిన శ్రీలత అతని వైపు మెచ్చుకోలుగా చూసింది.
“పరవాలేదా? మీకు కష్టంగా ఉంటే ఆపెయ్యండి.. నేను అర్థం చేసుకోగలను.. నా కుటుంబానికి కూడా అర్ధమయ్యేలా చెప్ప గలను” అన్నాడు అరుణ్
“లేదు.. మీకు ఈ విషయం తెలియాలి.. మనం పెళ్లి చేసుకో పోయినా కూడా.. ఈ సమస్యను ఇంత శాంతంగా నేను ఎవ్వరితోను చెప్పే సందర్భం రాలేదు.. సంధ్యకు కూడా సమస్య ఉందని తెలుసు గాని కారణాలు తెలియదు” అంది శ్రీలత
“శ్రీలత గారూ.. మీరు ఏమి చెప్ప దలచుకున్నా నిశ్చింతగా చెప్పండి.. ఇందాక చెప్పినట్టు ఏ భావోద్వేగం కలిగినా ఆపకండి.. మీ మనసు విప్పి మాట్లాడే అవకాశంగా దీన్ని భావించండి” అన్నాడు అరుణ్
“మా అమ్మ తాతగారిది పెద్ద దివాణం.. అయన భార్య పోయి చాలా ఏళ్ళయి పోయింది.. వయసులో ఉన్నప్పుడు ఊరి బయట ఆయనకొక మనిషి ఉండేదని చెప్పుకునే వారుట.. మా అమ్మను, నాన్నను చేరదీసేటప్పడికి ఆయనకు అరవై ఏళ్ళు ఉంటాయి.. ఆ ఒంటరితనం వల్లో మరేమైనా మానసిక వికృతిల వల్లో గాని అయన మా అమ్మను వేధింపులకు గురి చేసాడు” అని ఆపింది శ్రీలత..
ఆ మాట తలుచుకోవడం తనకు చాలా కష్టంగా ఉందని అర్థం అయ్యింది అరుణ్‌కి.. నెమ్మదిగా తన చెయ్యి శ్రీలత చేతి మీద వేసి నొక్కాడు..
కొంచెం తేరుకుని “మూడేళ్ళ పిల్లను స్వయానా తాత అలా చెయ్యడం..ఊహించగలరా? అది సమస్య అని కూడా తెలియని వయసు.. అప్పుడు మొదలైన ఆ వికృతం మా అమ్మకు పదిహేను ఏళ్ళు వచ్చేవరకు కొనసాగింది..
చిన్నతనంలో ఇబ్బందిగా అనిపించే విషయం వయసు వస్తున్న కొద్దీ లైంగిక వేధింపు అని అర్థం అయ్యింది. కానీ ఎవరికీ చెప్పుకోవాలి?
వయసు వస్తున్న కొద్దీ తను వ్యతిరేకించడం ప్రారంభించింది.. దానికి ప్రతిగా వాళ్ళ తాతగారు కర్రతోనూ, కొరడాతోనూ కొట్టేవారుట.. ఆ కొట్టడం కూడా ఒకరకమైన లైంగిక క్రీడ అయిపోయింది ఆయనకు” అంటూ ఆపింది శ్రీలత.
ఆ భావోద్వేగాన్ని అనుభవిస్తోందేమో తన కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారిపోతున్నాయి.
గ్లాస్లో మంచి నీళ్లు పోసి ఇచ్చాడు అరుణ్.
నీళ్లు తాగి కొంత సేపు సముద్రం వైపు నిశ్శబ్దం గా చూస్తూ కూచుంది శ్రీలత
ఆవిడను ఏ మాత్రం కదిలించకుండా కూచున్నాడు అరుణ్.. తన మనసులో ఎంతో కాలంగా అణగి ఉన్న అగ్ని పర్వతాలు బద్దలౌతున్నాయి అని అర్థం అయ్యింది అతనికి.
ఒక అరగంట గడిచింది.. అరుణ్ మోహంలో ఏమాత్రం తొందర లేదు.. శ్రీలత వైపుకి చూస్తున్నాడు.. అతని మోహంలో విషయం అర్థం అవడం వలన కలిగిన బాధ.. తరువాత ఏమిటో అనే కుతూహలం మిళితమై ఉన్నాయి.
“సారీ” అంది శ్రీలత కళ్ళు తుడుచుకుంటూ. ఏం పరవాలేదన్నట్టు తల ఊపాడు అరుణ్.
“ఆ వేధింపులు తట్టుకోలేక ఒకసారి వాళ్ల ఇంట్లో వంట చేసే పెద్దమ్మకు చెప్పుకుంది మా అమ్మ.. ఆవిడ సహాయం చెయ్యక పోగా ఆ విషయం వాళ్ళ తాతగారికి చెప్పేసింది..
దాని వల్ల మా అమ్మకు శిక్షలు ఇంకా ఎక్కువైపోయాయిట.. ఆవిడ మనస్తత్వమేమిటో నాకెప్పుడూ అర్థం కాదు.. అంత చిన్న పిల్ల వేధింపులకు గురవుతుంటే ఆపాల్సింది పోయి వేధించే వాడికి సాయం చేసింది..
ఆ వంట చేసే పెద్దమ్మ కొడుకే సంధ్య వాళ్ళ నాన్న.. మా అమ్మ కన్నా రెండేళ్లు చిన్న.. అప్పటికి చాలా చిన్న పిల్లవాడు కదా తన చదువూ గోలా చూసుకునేవాడు గాని మా అమ్మ సమస్య అర్థం చేసుకునే వయసు లేదతనికి..
ఆ సమయంలో అదే ఇంట్లో ఉండి చదువుకుంటున్న మా నాన్నకు చెప్పుకుందట మా అమ్మ.. ఆయన సహాయం చెయ్యకపోగా తను కూడా వేధింపులు ప్రారంభించాడుట..
మా అమ్మ పరిస్థితి ఆలోచించండి.. నిస్సహాయంగా ఎన్నో ఏళ్ళు బాధ పడుతూ గడిపింది.. రెండు సార్లు గర్భస్రావాలు చేశారట.. ఆ భయాలూ.. నిరాశల వల్ల తనకు పిటిఎస్‌డి సమస్య వచ్చింది” అంటూ ఆపింది శ్రీలత.
తను ఎంతోకాలంగా మనసు లోతుల్లో దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి కొంచెం ఉక్కిరి బిక్కిరి అయినట్టుంది.. ముక్కూ కళ్ళు ఎర్రగా అయిపోయాయి.. తన సంతులనాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంది
“అర్థం అవుతోంది.. అన్నేళ్ల నిరుత్సాహకారమైన జీవితం.. భరించరాని వేధింపులు, హింసా ఆవిడలో పేరుకుపోయి ఈ రుగ్మత రూపంలో బయటకు వచినట్టున్నాయి.. ఇంత జరిగిన తరువాత మీ అమ్మగారు మీ నాన్నను ఎందుకు పెళ్లి చేసుకున్నారు?” అనడిగాడు అరుణ్
మా అమ్మకు పద్దెనిమిది ఏళ్ళున్నపుడు వాళ్ల తాత గారు మరణించారు.. దాంతో ఆవిడకు మిగిలిన బంధువులు మా నాన్నా.. ఆ ముసలి వంటమనిషి.. ఆవిడ కొడుకు.. అంటే సంధ్య వాళ్ళ నాన్నా.
మా నాన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి టీచింగ్ ఉద్యోగంలో చేరాడు.. అప్పడికే తన తప్పు తెలుసుకుని వేధింపులు మానేసాడు.
చిన్నతనం లోనే తనకంటే చిన్న బాలిక మీద లైంగిక వేధింపులు చేసినందువల్ల కలిగిన అభద్రతా భావమో లేక తాను చేసిన పనుల వల్ల తనమీద తనకే కలిగిన అసహ్యం వల్లనో మా నాన్నకు ఆడవాళ్లంటే చాలా భయం ఉండేది.
ఒక రోజు ఆయనా, ముసలి వంట మనిషి మా అమ్మ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని ఈ పెళ్ళికి ఒప్పించారు.
మా అమ్మ ఒంటరి ఆడపిల్ల.. దాని పైన పిటిఎస్‌డి సమస్య.. చేసేదేమి లేక సమాధాన పడి ఆయన్ను చేసుకుంది..
జీవితం కొంచం దారిలో పడడం వల్లా.. మా నాన్న దగ్గర నుంచి కొంచం ప్రేమ దొరకడం వల్లా మా అమ్మ ఆరోగ్యం బాగుపడడం ప్రారంభించింది..
అప్పుడు నేను పుట్టాను.. నేను అడ పిల్లను కదా.. మా అమ్మకు తన బాల్యం గుర్తుకు వచ్చింది.. మా నాన్న నన్ను మళ్ళీ వేధింపులకు గురి చేస్తాడేమో అనే భయం ఎక్కువై భయాందోళనల అటాక్స్ రావడం ప్రారంభమైంది..
హైపర్ విజిలెన్సు వల్ల సరిగ్గా నిద్ర పోయేది కాదు.. దానివల్ల విపరీతమైన ఆందోళన కలిగేది..
ఇంక భరించలేక మా నాన్నను వదిలి పారిపోవాలని ప్రయత్నించింది.. ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా నన్నూ మా నాన్నను ఒకే ఇంటిలో ఉంచడానికి ఆవిడ ఒప్పుకోలేదు..
మా నాన్నగారు తన తప్పు అప్పడికే తెలుసుకున్నారు.. చదువు వల్ల ఆయన కొంచం పరిణతి చెందారు.. కానీ సమయం మించి పోయింది.. మా అమ్మ దగ్గర నుంచి విశ్వాసం పొందలేరు.
మా ఇద్దరి శ్రేయస్సు కోసం ఈ ఏర్పాటు చేసారు.. నాకు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు ఆయన మా ఇంటిలో అడుగు పెట్టలేదు.. నాతో మాట్లాడాలంటే స్కూలుకి వచ్చేవారు.
ఇలా వేరుచేయడం వల్ల మా అమ్మ ఆరోగ్యం కొంచం మెరుగు పడినా ఇప్పడికీ ఏదోక బాహ్య కారణాల వల్ల తన పాత జ్ఞాపకాలు కలల రూపంలో రావడం వల్ల మా అమ్మకు భయాందోళనల అటాక్స్ వస్తూనే ఉన్నాయి.
ఆవిడ వాడే మందులు చాలా శక్తిమంతమైనవి అందుకనే ఆవిడ నెమ్మదిగా ఉంటుంది.. ఏ విషయాన్నైనా నిర్లిప్తంగా తీసుకుంటుంది” అని ఆపింది శ్రీలత.
“ఇదంతా వినడానికే ఎంతో బాధాకరంగా ఉంది.. మీరు ఎలా భరించారో.. మీతో పరిచయమవ్వడం నా అదృష్టం.. ఇంతటి కష్టమైన జీవితం లోంచి మీలాంటి కమలం పుట్టడం ఎంతో సంతోషించదగిన విషయం” అన్నాడు అరుణ్.
ఏ భావము చూపించకుండా అతని వైపు చూసింది శ్రీలత.
“సారీ.. సినిమాల్లోలా మెలోడ్రామాటిక్ భాష వాడాను” అన్నాడు కొంచం సిగ్గుపడుతూ.
నవ్వింది శ్రీలత.. పెద్ద వాన తరువాత వచ్చిన సూర్య బింబంలా తన మొహం వెలిగి పోయినట్టనిపించింది
“ఈ విషయమై మీ ఉద్దేశ్యం ఏమిటి? భయాలూ అనుమానాలూ ఏమున్నా మొహమాట పడకుండా చెప్పేయండి.. మీ నిర్ణయం విషయం పూర్తిగా అర్ధమై.. ఏ అనుమానాలూ లేనప్పుడే తీసుకోండి.. ఈ మొత్తం విషయం అందుకే చెప్పాను.. మిమ్మల్ని భావోద్వేగాలకు గురిచేసి మీ నిర్ణయాన్ని నాకు కావలసినట్టు తెచ్చుకోవడానికి కాదు” అంది శ్రీలత.
“ఇలాంటి సమస్యల గురించి నేను కొంత చదివాను.. నా ఉద్దేశ్యంలో జరిగిన దాంట్లో మీ అమ్మగారి తప్పేమీ లేదు.. మీ నాన్న క్షమించరాని తప్పు చేసినా తన తప్పు తెలుసుకున్నాడు కనుక ఆయన్ని కూడా మనం వదిలేయొచ్చు.
ఇంత పెద్ద సమస్య ఎదుర్కొంటూ కూడా మీరు అంత సంతులనంతో ఉండడం, మానవ సంబంధాల గురించి ఎంతో పరిపక్వమైన అవగాహన చూపించడం మీ మానసిక స్థితికి అద్దం పడుతుంది.. ఈ సమస్య నుంచి మీరు పారిపోలేదు.. మీ అమ్మగారికి ఒక ముఖ్యమైన శక్తిగా నిలబడ్డారు” అని ఆపాడు అరుణ్.
కొన్ని క్షణాలు ఆగి “నేను ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను” అన్నాడు కొంచం ఆవేశంగా.
“ఆవేశపడొద్దు.. కావాలంటే మనం ఒక రెండు మూడు రోజులాగి మళ్ళీ కలుసుకుందాం” అంది శ్రీలత.
“ఈ ఆవేశం భావోద్వేగాలకు సంబంధించినది కాదు.. ఇంత తీవ్రమైన విషయం విని అరిగించుకునే శక్తి లేకపోవడం వల్ల వచ్చినది.. మీరేం కంగారు పడకండి” అన్నాడు అరుణ్.
“అలా అయితే ఇప్పుడు చెప్పండి.. మన ఎదురుగా ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి?” సూటిగా అడిగింది.
“దాని కంటే ముందు ఒక ప్రశ్న.. మీ అమ్మగారిని హిప్నోథెరపీ చేయించారా? రిగ్రెషన్ వల్ల ఇలాంటి సమస్యలు పరిష్కారమౌతాయంటారు” అన్నాడు అరుణ్
“నిజమే.. గత అయిదారు ఏళ్ల నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాం.. ఆవిడ మూడు ఏళ్ల నుంచీ పదిహేను ఏళ్ల వరకు పడ్డ బాధలు ఎంత కష్టమైనవంటే.. ఎంత ప్రయత్నించినా ఆ దుర్భరమైన అనుభవాలు గుర్తు చేసుకోవడానికి ఒప్పుకోలేదు.
మానసిక బలం పెంపొందడం కోసం ధ్యానం చేయిస్తున్నాను.. అదృష్టం బాగుంటే మరో ప్రయత్నం చేసే అవకాశం దక్కుతుంది” అంది విచారంగా.
“మన ప్రయత్నాలు మనం చేద్దాం.. ఇప్పుడు మనకు రెండు సమస్యలు ఉన్నాయి.. మగవారి మీద నమ్మకం పోయింది కాబట్టి మీ అమ్మగారు నన్ను అంగీకరించడం కష్టమే.
మనకు గనక అమ్మాయి పుడితే ఆవిడకు భయాందోళన అటాక్స్ పెరిగిపోతాయి.. అది మనం ఆలోచించాలి.. డాక్టర్ గారిని కూడా అడగాలి” అన్నాడు.
అరుణ్ వైపుకి మెచ్చుకోలుగా చూసింది శ్రీలత.. తన మోహంలో ఏదో బరువు దిగిపోయిన భావన స్పష్టంగా కనిపిస్తోంది
“మీరీ మాట చెప్పి నా మీద ఒక పెద్ద బరువును దింపేశారు.. నేను కూడా ఈ విషయమై ఎంతో భయపడుతున్నాను.. కానీ ఎలా చెప్పాలా అని తటపటాయిస్తున్నాను.. మీరే ఆమాట అనడం నాకెంతో ధైర్యాన్నిస్తోంది” అంది.
“ఇంక మా వాళ్ల విషయానికొస్తే.. వాళ్ళు చాలా సాధారణమైన మనుషులు.. చెడ్డవాళ్ళు కాదు కానీ పరిణతి తక్కువ.. వాళ్లకు మొత్తం కథ చెప్పలేం.. చెప్పినా అర్థం కాదు.. అందువల్ల ఈ సమస్యను అర్థం చేసుకోలేరు.. అందరి లాగానే ఇదొక జన్యు సంబంధమైన సమస్య అని అనుకునే ప్రమాదం ఉంది.. దానివల్ల మీకు ఇలాంటి సమస్య ఉండొచ్చు లేదా మీ పిల్లకు రావొచ్చు లాంటి భయాలు పెట్టుకునే అవకాశం ఉంది” అన్నాడు అరుణ్..
“ఏం చేద్దాం? ఈ విషయం చాలా సున్నితమైనదని తెలుసు.. మీ ఇంట్లో కూడా అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే మనం పెంచుకుందామని చూస్తున్న ఈ బంధానికి అర్థం ఉంటుంది” అంది శ్రీలత
“ఇదంతా విన్న తరువాత నేను మిమ్మల్ని పోగొట్టుకోలేను.. మీరు పరిచయమవడమే ఒక అదృష్టం, అలాంటిది మీతో జీవితం పంచుకునే అవకాశం పోగొట్టుకోవడం అంటే నా జీవితాన్ని పోగొట్టుకోవడమే” అన్నాడు అరుణ్.
“మళ్ళీ డ్రామలోకి దిగారు..ఇది ఆవేశంతో తీసుకోవలసిన నిర్ణయం కాదు.. మీ తల్లిదండ్రులకు ఏమైనా అనుమానాలుంటే అదేమీ తప్పు కాదు.. మా పరిస్థితి సాధారణమైనది కాదు కదా.. ఒక్కగానొక్క కొడుకుకి పెళ్లి చేసేటప్పుడు వాళ్లకు పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉండాలి కదా” అంది శ్రీలత
“అది నిజంలా కనిపించినా కాదు.. వాళ్లకు కొన్ని అభిప్రాయాలూ ఉండవచ్చు.. కానీ అవి నామీద ఎప్పుడు రుద్దలేదు.. ఇప్పుడైనా అంతే.. వాళ్ళ భావనలను గౌరవిస్తూనే వాళ్లకు అర్థమయ్యేలా చెప్తే సమస్య ఉండదు” అన్నాడు అరుణ్.
విచారంగా తలొంచుకుని కూర్చుంది శ్రీలత.
“ఎవరు అడ్డు వచ్చినా నేను మిమ్మలిని వివాహం చేసుకుంటాను.. ఆ నమ్మకంతో మనం రెండు మూడు రొజులు ఆలోచిద్దాం.. మనం అంటే నేను.. మీరు అలోచించి చేయగలిగేది ఏమీ లేదు.. మీరు కంగారు పడకుండా బలంగా ఉండండి” అన్నాడు అరుణ్.
“విషయం ఇంత దాకా వచ్చాక ఆ రెండు మూడు రొజులు టెన్షన్ నేను భరించలేను” అంది శ్రీలత.. తన మనసులో ఇంతకాలం గూడు కట్టుకున్న బాధ పంచుకోవడంతో కొంచం తేలికగా ఉంది.
“ఇన్నేళ్లు ఇంత పెద్ద సమస్య ఎదుర్కున్న మీరు మీ స్వార్థం వచ్చేసరికి మెత్త బడిపోతున్నారా” అన్నాడు అరుణ్.
నవ్వింది శ్రీలత.. తను మెల్లిగా తన సంతులాన్ని వెనక్కి తెచుకుంటోందని అర్థం అయింది అరుణ్‌కి..
భోజనం పూర్తి చేసి వెనక్కు బయలుదేరారు ఇద్దరూ..
***
శ్రీలతను వాళ్ళింట్లో దింపి తన ఇంటికి చేరిన అరుణ్ తీవ్ర ఆలోచనలో పడ్డాడు..ఈ విషయం ఎలా చెప్పినా తన తల్లిదండ్రులకు అర్థం కాదు.. శ్రీలత అన్నట్టు ఒక్కగానొక్క బిడ్డకు ఇలాంటి సంబంధమా అని బాధ పడిపోతారు.. ఈ బంధం ఏర్పడక ముందే తెగిపోవడమే కాకుండా శ్రీలతా వాళ్ళ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటారు.
దానికితోడు ఇంతకు ముందు టీవీ సీరియల్‌లో ఇలాంటి సమస్య వస్తే అమ్మ చాలా గోల చేసింది.. నాన్న కొంచం బాగానే ఆలోచించాడు.. ఇప్పుడీ విషయం నిజజీవితంలో జరుగుతోందని చెప్తే తప్పకుండా గొడవ జరుగుతుంది.
అలా అని ఈ విషయం దాచి పెట్టి ఏమీ చెయ్యకూడదు.. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పాలి.. అర్థమయ్యేలా చెప్పాలి.. ఇదేదో శ్రీలతను ఉద్ధరించడానికి చేసే పని కాదనీ, తన ఇష్టం కోసం చేసే పని అని అర్ధమయ్యేలా చెయ్యాలి.. పెద్ద చిక్కే..
అరుణ్ ఆలోచనలు అన్నివైపులా పాకుతున్నాయి..
ఆ ఆలోచనలతో తల వేడెక్కి ఎప్పడికో నిద్ర పట్టింది.
***
పొద్దున్న ఏడు గంటలకు ఫోన్ మోగడంతో మెలకువ వచ్చింది.. శ్రీలత దగ్గర నుంచి.. ఇంత పొద్దున్నే ఏం విశేషాల్లో అనుకుంటూ ఫోన్ తీసాడు అరుణ్
“అరుణ్ గారూ ఒక విషయం చెప్పాలి అందుకు ఆగలేక పొద్దున్నే ఫోన్ చేశాను..సారీ” అంది
“ఏమీ పరవాలేదు.. పొద్దున్నే మీ గొంతు అదీ ఇంత ఉత్సాహంతో వినడం కన్నా నాకు సంతోషం ఏముంటుంది..చెప్పండి” అన్నాడు
“మా అమ్మకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది.. అందులో మిమ్మల్ని తన తండ్రి గా చూసింది.. అంటే మీలో ఆవిడకు తన తండ్రి కనిపించాడు..
ఆవిడకు తండ్రి అసలు పరిచయం లేదు.. మూడేళ్ళ వయసులోనే మరణించాడు.. ఆయన రూపాన్ని కలలో తలచుకుని కొంత భద్రత పొందుతున్నట్టు ఉహించుకునేది..
అయితే ఆ కలలోని తండ్రి రూపానికి మొహం ఉండేది కాదు.. అస్పష్టంగా ఉండేది.. నిన్న మిమ్మల్ని చూసింది కదా.. రాత్రి కలలో ఆవిడ తండ్రి వచ్చాడు..
ఆయన మొహం అచ్చంగా మీదేనట.. అప్పటినుంచి ఆవిడ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది.. నాకెంతో సంతోషంగా ఉంది.. మీతో పంచుకోకుండా ఉండలేక పోయాను” అంది.
“అద్భుతం.. మనమొక మంచి పని చెయ్యాలనుకుంటే సమస్త జగత్తు సాయం చేస్తుందన్నారు పౌలో కొయిలో.. మనకి అలంటి అనుభవాలే కలుగుతున్నాయి.. ఒక్కరోజు టైం ఇవ్వండి.. నేను కూడా ఒక అద్భుతమైన వార్త చెప్తాను” అన్నాడు అరుణ్.. అప్పటికే అతని మనస్సులో ఏదో ఆలోచన మెదులుతోంది
“నేను ఎదురు చూస్తుంటాను” అని ఫోన్ పెట్టేసింది శ్రీలత.
గబా గబా రెడీ అయి ముందు రూమ్ లోకి వచ్చాడు అరుణ్.
“ఒరే నాన్నా.. నిన్న శ్రీలత వాళ్ళింటికి వెళ్ళావు కదా ఏమైయింది” అనడిగాడు అరుణ్ తండ్రి.
“అంతా బాగానే ఉంది నాన్నా.. కానీ మీతో ఒక విషయం మాట్లాడాలి” అన్నాడు అరుణ్.
“చెప్పు.. ఉండు అమ్మను కూడా పిలుస్తా” అన్నాడాయన..
“ఒద్దు నాన్నా.. మీతోనే మాట్లాడాలి.. అలా బయటకు వెళ్లి నడుస్తూ మాట్లాడుకుందాం” అన్నాడు అరుణ్
“స్నానం చేసాక నడక ఏమిట్రా” అన్నాడాయన నవ్వుతూ..
తండ్రి కొడుకు బయలుదేరారు.. అయిదు నిముషాలు నడిచిన తరువాత “నాన్నా.. నేనింత కాలం పెళ్లి వద్దు అని ఎందుకనే వాడినో తెలుసా?” అనడిగాడు.
“నువ్వింకా రెడీ అవలేదనేవాడివి” అన్నాడు తండ్రి
“కాదు.. నాకొక సమస్య ఉంది నాన్నా.. ఎలా చెప్పాలో తెలియట్లేదు” అన్నాడు అరుణ్.
“ఏమీ మొహమాట పడకు.. ఏమైనా బయట కక్కుర్తిపడ్డావా? దానివల్ల ఏమైనా సమస్యలా?” అనడిగాడు అయన.
“అలాంటిదేమి లేదు నాన్నా.. నాకు ఒక సైకలాజికల్ డిసార్డర్ ఉంది” అన్నాడు.
షాక్ తిన్నాడు తండ్రి.. రోడ్డు మధ్యలో ఆగిపోయాడు..
“నాన్నా.. యిలా పక్కకు రండి.. కూచోండి” అంటూ ఆయనను అక్కడున్న పార్కులోకి తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టాడు అరుణ్.
“ఏమిట్రా నువ్వనేది.. ఏమిటి నీ సమస్య?” అనడిగాడు తండ్రి కంగారుగా
“ఎరేక్టాయిల్ డిస్ఫంక్షన్ అంటారు.. అంటే అంగస్తంభన లోపం” అన్నాడు అరుణ్ నెమ్మదిగా.
“అంటే నువ్వు సంసారానికి పనికి రావా?” అయోమయంగా అడిగాడు తండ్రి
“ఆలా అని కాదు.. నాది మానసిక సమస్య.. శారీరక సమస్య అయుంటే ఇంకేమి చెయ్యలేం కానీ నా సమస్య చికిత్స వల్ల తగ్గుతుంది” అన్నాడు అరుణ్.
“కానీ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇంక నీకు పిల్లనివ్వరు” అన్నాడు తండ్రి కంగారుగా
“ఇప్పుడీ విషయం శ్రీలతకు చెప్పడం ఎలాగా అని నాకు చాలా భయంగా ఉంది నాన్నా” అన్నాడు అరుణ్ దీనంగా మొహం పెట్టి.
ఒక్క క్షణం ఆలోచించాడు తండ్రి “కష్టమే.. కానీ చెప్పి తీరాలి రా.. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యలేం కదా? ముందు మనం మనం ఒక డాక్టర్ని చూసి దీనికి చికిత్స ప్రారంభించాలి” అన్నాడు తండ్రి
“గత నెల రోజుల నుంచి నేను మందులేసుకుంటున్నాను నాన్నా.. మీకు చెప్పలేక దాచాను.. ఇప్పుడీ పరిస్థితుల్లో చెప్పకపోవడం ఇటు మిమ్మల్ని అటు శ్రీలతను తన కుటుంబాన్ని మోసం చేసినట్టు అవుతుంది కదా.. అందుకే బయట పెట్టాను” అన్నాడు అరుణ్.
తండ్రి మొహం పాలిపోయింది.. మాట్లాడకుండా వడివడిగా అడుగులూ వేస్తూ ఇంటికి చేరాడు
ఆయనతో బాటే అరుణ్ కూడా వచ్చాడు..ఇద్దరూ గంభీరంగా ఉన్నారు.
“పొద్దున్నే తండ్రి కొడుకు ఎక్కడికి వెళ్లారు? నాకు తెలియని రహస్యాలు మాట్లాడుకోవడానికా.. వీడి పెళ్ళై నా కోడల్ని రానివ్వండి, మేము కూడా రహస్యాలు మాట్లాడుకుంటాం” అంది అరుణ్ తల్లి నవ్వుతూ.
అరుణ్ తండ్రికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు.. ఒక వెర్రి నవ్వు పడేసి లోపలకి వెళ్లి పోయాడు.
అరుణ్ తన రూంలోకి వెళ్లి.. ఆఫీస్ డ్రెస్ వేసుకుని, లాప్టాప్ తీసుకుని ఆఫీసుకి బయల్దేరాడు..
“టిఫిన్ ఇంకా రెడీ అవలేదురా.. పదినిముషాలు ఆగు” అంది అరుణ్ తల్లి.
“టైం లేదమ్మా.. ఆఫీసు లో తినేస్తాను లే” అంటూ ఆఫీసుకి బయలుదేరేసాడు
***
అరుణ్ తండ్రికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.. ఈ విషయం భార్యకు చెప్పడం ఎలా అని చాలా సేపు మథనపడ్డాడు.. చివరకు గుండె గట్టి చేసుకుని భార్యను పిలచి విషయం చెప్పాడు..
ముందు ఆవిడ నమ్మలేదు.. ఏదో జోక్ అనుకుంది.. భర్త మరీ మరీ చెప్పిన మీదట నమ్మాల్సి వచ్చింది..
ఈ విషయం అర్థం కాగానే ఆవిడ కూలబడిపోయింది “ఇదేం ఖర్మం అండీ.. ఎక్కడా వినలేదు కనలేదు.. మనం ఏం పాపం చేసుకున్నామని ఈ సమస్య?” అంటూ విలవిలలాడింది.
ఇద్దరూ సాయంత్రం వరకు విచారంగా గడిపారు..
సాయంత్రం అరుణ్ ఆఫీసు నుంచి వచ్చాక మళ్ళీ సంభాషణ ప్రారంభం అయింది.
“నువ్వు ప్రేమ పెళ్లి అని ఉత్సాహం చూపించకపోతే నీకేమైనా సమస్య ఉందా అని ఆలోచించకుండా నీ మీద ఒత్తిడి తెచ్చేదాన్ని.. ఇంత భారం ఎలా మోసావురా కన్నయ్యా” అంటూ బావురుమంది తల్లి.
“అందులో తప్పేమీ లేదమ్మా.. నీకలాంటి ఆలోచనలుండడం ఏమీ తప్పు కాదు” అన్నాడు అరుణ్.
“ఒరే నాన్నా ఇప్పుడు రెండు సమస్యలు.. దీనికి ట్రీట్మెంట్ ఎంతకాలం పడుతుంది? ఈ విషయం చెప్పి శ్రీలత వాళ్ళని ఆగమంటే ఆగుతారా? మాకు శ్రీలత కాకుండా ఇంకొక అమ్మాయి కోడలుగా వద్దు” అన్నాడు అరుణ్ తండ్రి.
“డాక్టర్ గారిని కలిసాను.. పదిహేను వారాలు మందు తిని మూడు వారాలకొకసారి హిప్నోథెరపీ తీసుకుంటే దాదాపు పూర్తిగా నయమైపోతుంది అన్నాడు.. కానీ ఈ విషయం చెప్తే శ్రీలత ఎలా స్పందిస్తుందో.. ఆగుతుందో లేదో” అన్నాడు భయంగా
రాత్రి అంతా తల్లీ తండ్రీ బాధపడుతూ గడిపారు.. వాళ్ళ బాధ చూసి అరుణ్ కూడా చాలా బాధ పడ్డాడు.. వాళ్ళెంతో కలలుకన్న తన పెళ్లిని ఇలాంటి పరిస్థితులలో పడెయ్యడం అతనికేమి బాగా అనిపించలేదు.
తరువాత రోజు పొద్దున్న అరుణ్ తొందరగా రెడీ అయి ముందు గదిలోకి వచ్చాడు..
“మీరు కంగారు పడకండి.. నేను ఇవాళ సెలవు పెట్టాను.. శ్రీలతను కూడా సెలవు పెట్టమన్నాను.. ఏం జరిగితే అది జరుగుతుంది.. నేను శ్రీలతకు అంతా చెప్పేస్తాను.. తను అర్థం చేసుకుని ఒప్పుకుంటే మంచిదే.. లేకపోతే మన దురదృష్టం” అన్నాడు.
“నేనలా సరిపెట్టుకోలేక పోతున్నాను రా.. ఆ పిల్ల నా కోడలు కాదు.. కూతురు.. తనను ఎలా వదులుకుంటాను” అంటూ బాధపడింది తల్లి.
“ఊరుకో గాయత్రీ.. వాడు చెప్పేది నిజం.. ఒకవేళ తను ఒప్పుకోకపోతే మనం ఆ పిల్లకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం” అన్నాడు తండ్రి
గట్టిగా నిట్టూర్చి బయలుదేరాడు అరుణ్.
శ్రీలతను వాళ్ళింటి దగ్గర పికప్ చేసుకున్నాడు.. ఇద్దరూ మళ్ళీ ఆ బీచ్ రెస్టారెంట్ కు వెళ్లారు.. చెట్టుకింద టేబుల్ మీద కూర్చుని కాఫీ ఆర్డర్ చేసారు..
“శ్రీలత గారూ.. నేనొక తప్పు చేశాను.. మీకు చెప్పకుండా ఒక విషయం దాచాను. అదిప్పుడు మీకు చెప్పాలి” అన్నాడు
ఏమిటన్నట్టు చూసింది శ్రీలత.
“నాకు ఒక సైకలాజికల్ డిస్ఫంక్షన్ ఉంది.. మీకు చెప్పలేదు” అన్నాడు అరుణ్
షాక్ అయింది శ్రీలత..
“మీరు అంత భయంకరమైన విషయాలు చెప్పాక నా సమస్య మీకు చెప్పుకోలేక పోయాను” అన్నాడు
“ఏమిటా సమస్య?” అనడిగింది కంగారుగా శ్రీలత
“ఎరేక్టాయిల్ డిస్ఫంక్షన్ అంటారు” అన్నాడు అరుణ్
నివ్వెర పోయింది శ్రీలత “ఇప్పుడెలా?” అనడిగింది
“చికిత్స జరుగుతోంది.. పదిహేను వారాల్లో నయమైపోతుంది అన్నారు.. మనం ఆ తరువాత పెళ్లి చేసుకోవచ్చు” అన్నాడు
శ్రీలత మొహం పాలిపోయింది.. చాలా సేపు సముద్రం వైపుకి చూస్తూ నిశ్శబ్దంగా కూచుంది.. ఈ కొత్త సమస్య లేపిన కల్లోలాలు ఆమె మోహంలో కనిపిస్తున్నాయి..
ఆమెనే శ్రద్ధగా చూస్తూ కూచున్నాడు అరుణ్..
కొంతసేపు తరువాత అరుణ్ వైపుకి తిరిగింది శ్రీలత.. చిన్నగా నవ్వింది “సరే, ఇందులో మీ తప్పు ఏమీ లేదు కదా.. నాకు అభ్యతరం లేదు.. మనం ఈ చికిత్స అంతా జరిగే వరకు ఆగొద్దు.. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా పెళ్లి చేసుకుందాం.. ఈ విషయం కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకోలేను” అంది శ్రీలత.
“బాగా ఆలోచించుకోండి శ్రీలత గారు.. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం.. మళ్ళీ వెనక్కు తీసుకోలేం” అన్నాడు అరుణ్.
“నా సమస్య ఇంతకంటే పెద్దది.. మా అమ్మ నేను పుట్టక ముందు నుంచి సైకియాట్రిక్ పేషెంట్.. మీరు అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు.. ఇది చిన్న విషయమే మాత్రమే కాదు.. తొందరగా నయమైపోయే సమస్య.. దీని గురించి మనం పెద్ద చర్చలు ఏమీ పెట్టవద్దు” అంది శ్రీలత.
“ఇదిగనక నయం కాక పొతే మనకు పిల్లలు ఉండకపోవచ్చు.. పరవాలేదా?” అనడిగాడు అరుణ్
“ఇప్పుడు ఎన్నో రకాల పద్ధతులు వచ్చాయి.. అవేమి కాక పొతే ఎవరినైనా పెంచుకుందాం” అంది శ్రీలత
“సరే.. నేను మా తల్లిదండ్రులను తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను.. తరవాత ఏం చేద్దామో మాట్లాడడానికి” అన్నాడు అరుణ్.
“నేను ఎదురు చూస్తుంటాను.. కానీ ఒక్క షరతు.. ఈ విషయం ఎత్తొద్దు.. మా అమ్మ ఎలా స్పందిస్తుందో తెలియదు.. ఎందుకైనా మంచిది” అంది శ్రీలత ఆలోచిస్తూ
ఇంటికి చేరిన అరుణ్ తల్లిదండ్రులను పిలిచాడు “నేను ఈ విషయమంతా శ్రీలతతో చెప్పేసాను.. తను అయినా కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది” అన్నాడు
సంతోషంతో ఏడిచేసింది అరుణ్ తల్లి.. తండ్రికి కూడా కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి.
“తనకు విషయం అర్థం అయ్యిందా?” అనడిగింది తల్లి
“అయ్యింది.. శ్రీలతకు మానసిక సమస్యల గురించి తెలుసు.. వాళ్ళ అమ్మగారికి అప్పుడప్పుడు భయాందోళనల అటాక్స్ వస్తాయి అంటే కంగారుతో కాళ్ళు చేతులు ఆడకపోవడం.. దానికి మందులు తీసుకుంటున్నారు” అన్నాడు అరుణ్.
“అది వంశ పారంపర్య సమస్య కాదు కదా? శ్రీలతకు లేకపోయినా పిల్లలకు రావొచ్చు” అన్నాడు అరుణ్ తండ్రి.
“మీరురుకోండి.. అలాంటి సమస్యలు చిన్నతనంలో ఆందోళనకు గురవ్వడం వల్ల వస్తాయి.. శ్రీలత వాళ్ళ అమ్మ మూడేళ్ళ వయసులో తల్లి తండ్రులను పోగొట్టుకుంది.. ఎన్నో చూసుంటుంది.. అది తన తరువాత తరాలకు రాదు” అంది అరుణ్ తల్లి కోపంగా.
“అదీ నిజమేలే” అన్నాడు అరుణ్ తండ్రి.
“ఒరే కన్నా.. అది చాలా చిన్న సమస్య.. ఒకసారి శ్రీలత నా కోడలయ్యాక ఆమె తల్లి కూడా ఈ కుటుంబంలో మనిషే.. ఒకవేళ ఆవిడకున్న వ్యాధి వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలొస్తే సద్దుకుపోదాం.. నీది చాలా పెద్ద సమస్య అయినా తను పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంది” అంది తల్లి.
***
మర్నాడు అందరు కలిసి శ్రీలత ఇంటికి వెళ్లారు..శ్రీలత తల్లి సంతోషంగా కనిపించింది.. ఆవిడ కళ్ళల్లో నిరాశా, విచారం కొంచం తగ్గాయి.. చక్కగా నవ్వుతోంది.. భర్తతో కూడా మాట్లాడుతోంది.
అరుణ్‌ని చూడగానే ఆవిడ పట్టరాని సంతోషంతో చేతులు పట్టుకుని “నాన్నా ఎంత మంచి పనిచేస్తున్నావ్” అంటూ ఊపేసింది.
ఆవిడ ప్రేమను చూసి అరుణ్ తల్లి తండ్రి ఎంతో సంతోషించారు.. వాళ్లకు శ్రీలత తల్లికి వచ్చిన కల గురించి ఏమీ చెప్పలేదు అరుణ్.. అందువల్ల ఆవిడ భావాలన్నీ అల్లుడి గురించే అనీ.. అల్లుడిని కొడుకులా ప్రేమిస్తోందని అనుకున్నారు.
శ్రీలత తండ్రి కూడా అరుణ్‌తో చాలా బాగా మాట్లాడాడు.. మధ్యలో పక్కకు తీసుకెళ్లి అరుణ్‌కి థాంక్స్ చెప్పాడు కూడా.. ఒక రకంగా అరుణ్ వల్ల తన భార్య కొంత కోలుకుని తనను అంగీకరించిందని చెప్పాడు.. అదే కాదు ఆవిడ స్వయంగా ఫోన్ చేసి హిప్నోథెరపీ కోసం అపాయింట్మెంట్ తీసుకుంది అని చెప్పాడు
పెళ్లయిపోయింది.. అదే సమయంలో సంధ్య పెళ్లి కూడా అయిపొయింది.. సంధ్యా భర్త అమెరికా వెళ్లిపోయారు.
ఏడాది తిరగకుండా పండంటి బిడ్డను కంది శ్రీలత..
అరుణ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.. కొడుకు జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్న వాళ్లకు మనవడు ఎంతో సంతోషాన్నిచ్చాడు
దెబ్బకు దెయ్యం భయపడుతుంది.. పెళ్ళైయితే ఎలాంటి రోగమైనా కుదురుతుంది అంటుండేది అరుణ్ తల్లి అందరితోనూ..
తన తల్లిదండ్రులను శ్రీలత తల్లి సమస్యనుంచి దూరం తీసుకెళ్లడానికి తానొక పెద్ద సమస్యను సృష్టించానని అరుణ్ ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు.. శ్రీలతకు అర్థమైనా ఉరుకుందేమో అరుణ్‌కి తెలియదు.
పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్‌లో. చాలా కాలంగా బెంగళూరులో ఉంటున్నాను.. సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది.. లాక్డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను. గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, డాక్టర్ కేశవరెడ్డిగార్లు అభిమాన రచయితలు. శ్రీశ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు.
