Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూర్ణ సప్తాధ్యాయం ‘ఆంధ్రగీతి’

[డా. జి.వి.పూర్ణచందు రచించిన ‘ఆంధ్రగీతి’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. కొప్పరపు నారాయణ మూర్తి.]

జి.వి.పూర్ణచందు కలం నుంచి కొత్తగా జాలువారిన కవితాఝరి ‘ఆంధ్రగీతి’. ఏడు అధ్యాయాల చతుష్పదులతో పూర్తి కవితా గానంలా చెవుల్లో మారుమోగే తెలుగు సాంస్కృతిక పరిణామ వైభవగీతి ‘ఆంధ్రగీతి’. పూర్ణచంద్రాయణం, భాషావతరణం, ఆంధ్రులప్రశస్తి, పలుకుబడుల పరిమళాలు, మాండలిక శోభ, మినుకుపలుకులు, అధికార భాష వంటి ఏడూ ప్రకరణాలతో వెలువరించిన ఈ కవితామ తెలుగు తల్లికి రక్షణగా భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వథామ, కర్ణాది వీరుల్లా మండలి బుద్ధప్రసాద్, శ్రీ విహారి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, గుమ్మా సాంబశివరావు, మాడభూషి సంపత్ కుమార్ లు కదిలిరాగా రాజసం ఒలికిస్తూ మత్తగజంలా ముందుకు సాగుతుంది ఈ ‘ఆంధ్రగీతి’.

కృష్ణా జిల్లా రచయితల సంఘం తొలి వ్యవస్థాపకులు కీ.శే. మండలి వెంకట కృష్ణారావుకు నమస్కార బాణాలను అంజలిగా ఘటించిన వైనం అబ్బురం కలిగిస్తుంది. తెలుగువారికి, తెలుగు భాషకు మండలి వారు చేసిన ఎనలేని సేవలను స్మరిస్తూ, కీర్తిస్తూ ఉగాదిని తెలుగు ఉత్సవంగా నిలిపి, ‘మా తెలుగు తల్లిని’ తెలుగు జాతిగీతంగా మలచి, తెలుగును ‘ప్రపంచ తెలుగు’గా తీర్చిన ‘భాషామరీచి’, భాషకి తేజం నింపిన తెలుగు తోటమాలి! అంటూ ‘స్మృతిగీతి’ని అర్పించిన ఉద్దండ కవివరేణ్యుడు పూర్ణచందు.

‘తెలుగువారి తెలుగు సంస్థల రూపకర్త, దేశాంతర ఆంధ్రుల కోసం శ్రమించిన కార్యకర్త, జ్ఞానవీధుల్లో తెలుగుదీపం వెలిగించిన తపస్వి! పాఠాలలో మానవతను చేర్చిన విద్యామంత్రి యశస్వి!’- అని మరో పద్య కుసుమాన్ని సవినయంగా మండలివారి శతజయంతి వత్సర సందర్భంగా వారి పాదములందుంచిన వినమ్రశీలి పూర్ణచందు. ‘మండలి కృష్ణారావు నూరేళ్ళ పండగ, తెలుగు భాషోద్యమానికి వెలుగు నిండుగా, తెలుగు నామస్మరణకిది అమరిన కాంతి, భాషాభిమానానికిది సం-పూర్ణ ‘ఆంధ్రగీతి’ (‘హైఫన్’ ఈ వ్యాసకర్త పెట్టింది.  ‘సంపూర్ణ’ అన్నా ‘పూర్ణ’ అన్నా అర్ధం దాదాపు ఒక్కటే అన్న భావనతో అలా చేయడం జరిగింది) అని తన పద్య సౌరభాలతో శాలువ కప్పేశారు పూర్ణచందు మండలివారిని పూజ్యభావంతో.

‘ఆంధ్రగీతి’ కావ్యానికి కొన్ని కొత్త సొబగులు అద్దారు పూర్ణచందు. గతంలో ఈ సంప్రదాయాలు కొన్ని కావ్యాలలో కనిపించవు. ‘తెలుగుభాషా జాగృతి’ శీర్షికన తెలుగువారికి మేలుకొలుపులా 23 చతుష్పాదులతో ఒక ఖండిక రాశారు. ‘తెలుగమ్మా..! నీకు వందనాలు, ఆంధ్రమాతా.. మంగళ గానాలు!’తో ఆరంభమవుతుంది.

‘అన్నమయ్య ఆలాపనే నీ శ్వాస, త్యాగయ్య గానమే నీ ధ్యాస! మంగళంపల్లి స్వరమే నాదసారంగం! ఘంటశాల గానమే రసగంగా తరంగం!’ అంటూనే, నన్నయ్య తిక్కన ఎఱ్ఱన–పద్య ధార! తెలుగు దారిన వెలుగుల అరుణతార! సోమన ద్విపదలు ప్రగతి దీపకాంతులు, వేమన నీతులు నిత్య ధర్మ రీతులు’ అని తెలుగు జాగృతి మూలలను మనకి జ్ఞప్తి చేశారు కవి, రచయిత పూర్ణచందు. ‘తెలుగంటే అచ్చతెలుగే.. పోయిన పదాలెన్నో పోగా మిగిలింది! ఒక్కోమాటలో అనంత కాలం చరిత్ర.. ఒక్కోపదబంధంలో నిబిడీకృత సంస్కృతి.’ అని పూర్ణచందు అనటంలో న్యాయం ఉంది.

పూర్ణచందు రచనల్లో ముఖ్యమైనవి గతంలో ఉన్న అచ్చమైన తెలుగుపదాలను వెలుగులోకి తేవటం. పూర్ణచందు ‘సొంపైన తెలుగు’ (2024లో ప్రచురితం)లో పోయిన పదాలగురించిన ఒక ఆవేదన కనిపిస్తుంది. అందులోనే ప్రస్తుతం పూర్వ పదాలకు మారిన అర్ధాలు కనిపిస్తాయి. ‘శష భిషలు’ నుంచి ‘చురచిచ్చు’ వరకూ కొన్ని పదాల గత వైభవం, ప్రస్తుత ప్రయోగ స్థితి చర్చ మనకు ఈ ‘సొంపైన తెలుగు’లో కనిపిస్తుంది. ఇటీవల కాలంలో పూర్ణచందు రాసిన ‘రాయలకాలంనాటి భువన విజయ గాథలు’ పుస్తకంలో కూడ నాటి రాజ్యంలో వాడిన పదాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అందుకేనెమో, ‘తత్సమ పుష్పాలతో పూసిన గీతం, తద్భవ పరిమళం నింపిన మధుర స్వరితం, అచ్చ తెలుగు వెలుగుల జాతిజీవనంలో, ఆంధ్రభాష వైభవమిది జాతిజీవితం’ అని ముక్తాయించారు.

‘అచ్చులు, హల్లులు పసుపు కుంకుమలతో, పదాల వెలుగుల్నిపాదాలపై ‘వార’ పోసి, నిసర్గ, విసర్గలతో రాజాతిలకం దిద్ది, తెలుగు వర్ణమాలతో చంద్రుడికి స్వాగతం’ పలుకుతూ తొలి అధ్యాయం ‘పూర్ణచంద్రాయణం’ తెలుగు వర్ణాక్షరమాల ఔన్నత్యం ఆవిష్కరిస్తారు పూర్ణ చందు. గోదావరి ఉరకలు క్షీర స్రవంతులుగా.. కృష్ణవేణీ ధ్వని తరంగాలు ఓంకారంగా.. పెన్న, వంశధార, తుంగభద్ర, గుండ్లకమ్మ, కిన్నెర సాని, తెలుగు నదుల అక్షరాభిషేకం విభవం! అని తెలుగు నేల ఎంత పవిత్రమో అంత సస్య శ్యామలమని చెప్పకనే చెబుతారు కవి పూర్ణచందు. ‘తెలుగు తల్లి.. నాద స్వర సరస్వతి.. సప్త స్వరాల కల్పవల్లి, సకల కళావతి, సమభావపు దీపాలు వెలిగించి, విశ్వశాంతిని ప్రసరించే ప్రేమరూపవతి’.. అంటూ కైమోడులర్పిస్తున్నారు  అపర కాళిదాసై పూర్ణచందు.

ఆకాశానికి అక్షర మేఘమాల అల్లిన కవి! చంద్రమౌళికి మణిగా మెరిసిన చందమామ–’అన్న చతుష్పదిలో పూర్ణచందు తండ్రిగారు ‘చంద్రమౌళి’ అని తెలుపగానే తెలిపారని వ్యాఖ్యానించారు డా గుమ్మా సాంబ శివరావు. అలానే ‘మేఘమాల’ అని పేర్కొనటం ద్వారా చిన్నప్పుడు పూర్ణచందు ‘మేఘమాల’అనే ఒక లిఖిత పత్రికను నడిపిన సంగతి వెల్లడిచేస్తున్నారంటారు గుమ్మా సాంబ శివరావు. ‘పూర్ణ చంద్రుడు..! ‘తెలుగు వారి వాకిట వెలుగు.. తెలుగింటి తేజోరాశి, తెలుగువారి మేనమామ.’ అని అనటంలో ‘పూర్ణచంద్రుడు’ శ్లేష ప్రయోగం చేసినట్టు తెలుస్తుంది. ఆకాశంలో పూర్ణచంద్రుడిని శ్లాఘిస్తూనే, తను కూడా అంతటి వాడినే అని చెబుతున్నట్టనిపిస్తుంది. కవులకు స్వోత్కర్ష ‘సహజ కవచమే’ కదా! ఇదేమి దోషం కాదంటారు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి. ‘తెలుగులో తానూ నెలకొన్నాని.. ‘ఆ’ అనే అక్షరంలో చంద్రవంకలా!’ అని అనటం కూడా అలాంటిదే. నిజానికి తెలుగు వర్ణాక్షరమాలలోని అన్ని అక్షరాలు, పూర్ణ బిందువు (సున్నా) నుంచే వచ్చాయని ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి దశాబ్దాల క్రితం వివరించారు.

‘సూరులపుట్టుక, శాస్త్రాని కందని కథనం! దేవతల జన్మకథ, ఓ దివ్యరహస్య సంజాతం! యేరుల మూలం, మరుగునున్న మహాతత్వం.. ప్రతిధ్వనించే ప్రళయమే భాషకు మూలధ్వని!’– అంటూ ఆరంభిస్తారు భాషావతరణం. ‘తెలుగుకూ అక్షర రూపం దక్కింది, ప్రతి అక్షరం బంతి పువ్వై మురిసింది. గుండ్రటి ముత్యంలా మురిపించే ఆకృతులతో వయ్యారపు వలయాల వ్రాత అవతరించింది’ అని తెలుగు అక్షర సౌందర్యం కీర్తిస్తూ, ‘మంచి ముత్యపు రాసులు దొర్లినట్టు, సుడివేసిన గుండ్రని బొమ్మరిల్లులా, తీరి ఉంటాయి తెలుగు అక్షరాలు, తాళపత్రంపై తల్లి చేతి వ్రాత ముగ్ధగీత!’ అని ముక్తాయిస్తారు. నిజానికి ప్రపంచ జాతీయ గీతాలలో ‘జనగణమన’ ఎంతటి మధుర స్వరమని ప్రపంచం కీర్తించిందో, తెలుగు భాషాక్షరాలు (వర్ణమాల) దేశంలోని అన్ని భాషల్లోకల్లా అతి సౌందర్యమైందనటంలో సందేహం లేదు. తెలుగు భాషా శబ్ద సౌందర్యం కూడా అంతే గొప్పది. ఎవడో ఇటలీవాడు (నికోలో డి కొంటి) ‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ అని మెచ్చుకొన్నాడని మనం చెప్పుకోవటమేమిటి సిగ్గులేకుండా? ఇటాలియన్ శబ్దంకన్నా ‘తెలుగు శబ్ద సౌందర్యమే ఘనం’ నిర్ద్వందంగా. ఆఖరికి తిట్టుకున్నా, అరుచుకున్నా కర్ణపేయంగా ఉంటుందని అంటారు ప్రముఖ హాస్య, వ్యంగ తెలుగు రచయిత ముళ్ళపూడి వెంకటరమణ.

ఆదికాలమర్మంలో అంధకుల గాథలలో నిలిచిన జాడలం, ఆంధ్రుడి ఆదిస్వరూపంగా భారత భగవతాలలో అవుపించిన నీడలం’–అనే చతుష్పాదితో ‘ఆంధ్రుల ప్రశస్తి’ ప్రారంభిస్తారు. ‘ఆంధ్ర జాతీయులు ఆదిజాతుల ఆరంభనేతలు, అమరిన అక్షర స్వరూప దివ్యాఖ్యాతులు పాళీ ప్రాకృత సంస్కృతుల కలయికలో వెలిగిన, ఉపనిషత్తుల జ్ఞాపకాల ఆంధ్రజ్యోతులు..!’ అంటూ, ఆంధ్రం, ఆంధ్రపథం, ఆంధ్రమండల ఘోష క్రీస్తుకు పూర్వపు స్వతంత్ర స్మరణలివి! అంధక నుండి ఆంధ్రాదాకా సాగిన యాత్ర.. భాషోపనిషత్తులలో ప్రతిధ్వనించిన చరిత్ర!’అని కీర్తించారు. వేదన — ఉత్సాహం — వేకువల కాంతి — భావాల ఆత్మ విలాసం భాష — ఒప్పిరితో కలసి ఊసులై, మనసుతో కలసి భావాలై, ప్రతిపలుకులో అమ్మతనపు సంస్పందన! — అని తెలుగు ‘పలుకుబడుల పరిమళాలు’ వివరించసాగారు. తెలుగు తల్లి ఒడిలో తలపెట్టుకుని మాటల చరిత్ర సేద తీరింది.. దేశీ పదాలకు దేశాంతర పరిమళాలు నింపింది. తేట తెలుగు మాటల్లో తేనె నిండింది! — వంటి చతుష్పాదులలో తెలుగు పలుకుబడుల గొప్పతనం చాటారు. ‘పలుకుల వాడకం తగ్గిన ప్రతిక్షణమూ ఒక భయానక నిశ్శబ్ద శవక్రియ.., మాట చేజారిన ప్రతిసందర్భమూ, మనసంస్కృతి మరణానికి వీలునామా! –అని పూర్ణచందు హెచ్చరించటంలో న్యాయం ఉంది.

‘మాండలికాలన్నీ అచ్చ తెలుగు పలుకులే! అగ్నికణాల చెకుముకులు.. ఒరుసుకొంటే అంటుకొనే దీపశిఖలు’ అని మాండలికాల్ని వర్ణించారు కవి పూర్ణచందు ‘మాండలికశోభ’లో. ‘కనురెప్పల పొలం గట్లమీద కాసిన కలల దోసపండ్లు మాండలికాలు! వాక్యాల తేనెలో సుదానందం రంగరింపు ‘భాషా సేద్యానికి’ అరక మాండలికం’–అని సూక్ష్మంలో మోక్షంగా వర్ణించారు. మినుకు చినుకులు (పారిభాషిక  పదాలు),  ‘అధికార భాష’ అధ్యాయాల్లో కూడ పూర్ణచందు వైఖరి స్పష్టం. భాషాపరంగా అనేక సంక్లిష్టతలుండే ఇలాంటి ‘అంశాలలో’ తనదంటూ అనేక భావాలను ఏకపక్షంగా ప్రకటించటం ఒక సాహసమే. ఇవన్నీ రాబోయే కాలంలో లోతైన పరిశోధనతో పరిశీలించవలసి ఉంటుంది. అధికార భాషగా తెలుగు అమలు గురించి, వాడుక భాషగా తెలుగు అభివృద్ధి గురించి, శాస్త్ర సాంకేతిక భాషగా తెలుగు రూపు దిద్దుకోవలసిన అవసరం గురించి పూర్ణచందు ఆవేదన చక్కగా ప్రకటితమైందన్నది కాదనలేని సత్యం. వీటిని నాలుగు పదాలలో చెప్పటం ఒక క్రొత్త ప్రయోగంగా భావించవచ్చు.

***

ఆంధ్రగీతి (దీర్ఘకావ్యం)
రచన: డా. జి.వి. పూర్ణచందు
ప్రచురణ: కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ
పేజీలు: 104
వెల: ₹ 200/-
ప్రతులకు:
కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ
ఫోన్: 94401 72642, 94401 67697

Exit mobile version