Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంటని అంటు

[తెలుగు సాహితీ వనం – శ్రీమతి గడ్డం కృష్ణకుమారి స్మారక మినీ కథల పోటీ లో ద్వితీయ బహుమతి గెలుచుకున్న కథ.]

మా పిన్ని కూతురు ఓణిల పండుగ హైదరాబాదులో జరుగుతుంటే వెళ్ళడానికని రైల్వేస్టేషనుకు వచ్చాను. రైలు రాత్రి పదిగంటలకయితే, మిస్టర్ కంగారు.. అదేనండి మా శ్రీవారు నమ్మళ్వారుగారు, నన్ను ఎనిమిది గంటలకే మమ్మల్ని స్టేషనులో తెచ్చి పడేశారు. ఎలాగు చెబితే వినరని తెలిసి, ఆరునెలల వయసున్న శ్రీహృదిని తీసుకుని ముందుగానే స్టేషనుకు వచ్చాము. ప్లాట్ఫామ్ మీద జనసమ్మర్దం అంతగా లేదు. బల్లలు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. శ్రీహృదిని బల్లమీద పడుకోబెట్టి పడకుండా దిండు అడ్డంపెట్టి కూర్చున్నాను. ఇప్పుడే వస్తానని చెప్పి ఎటో వెళ్ళిపోయారు శ్రీవారు. ఎటో ఏముంది.. టీ త్రాగడానికయి ఉంటుంది. అదేమిటో ఈ మగజాతికి, ఇంట్లో ఆడవారు ఎంత రుచిగా కాఫీలు, టీలు పెట్టియిచ్చినా, వీధిలోకి వెళ్ళి టీకొట్లో రోజుకొక్కసారన్న టీ తాగనిదే తృప్తి ఉండదు. పాపం.. అదో బలహీనత.

“అమ్మా.. అవిటిదాన్ని ఒక రూపాయుంటే దానంచెయ్యి తల్లీ” అంటూ వచ్చింది ఒక అమ్మాయి. ఆమె పంజాబి ధరించి ఉండడంతో ఆమె కాలు వంకరగా ఉన్నట్లు కనిపించింది. కర్రసాయం లేకపోయినా ఊగుతూ నడవగలుగుతున్నది. ఆమె చేతిలో అటుయిటుగా శ్రీహృది వయసున్న పసిపిల్ల వున్నది. పర్సులోనుంచి అయిదురూపాయల బిళ్ళతీసి ఇచ్చాను.

“సల్లని తల్లివి.. నువ్వు, నీ బిడ్డ సల్లంగా ఉండాలమ్మా” అని దీవించి కాలు ఎగరేసినడుస్తూ ముందుకు కదిలింది.

ఇంతలో దూరంనుంచి “లచ్చక్కా..లచ్చక్కా” అని ఎవరో పెద్దగా అరవడంతో వెళుతున్న ఆమె ఆగిపోయింది. పరుగెత్తుకుంటూ వచ్చిన పదిహేనేళ్ళ కుర్రాడు గసపెడుతూ, “అక్కా.. మన సెంద్రం గాడిని టీ బంకు రాజన్న కొట్టబోతున్నడు. నువు తొరగా రా అక్కా” అని చెప్పాడు.

“ఆడేం సేసినాడురా”

“ఆడు పైసలియ్యకుండా బన్ను తీసుకున్నడంట. దొంగతనం సేత్తావంటరా అని రాజన్న కొట్టనికి సేయెత్తిండు. ఆడేమో ‘నే పైసలిచ్చినా మావా.. నువ్వు పెట్టెలో ఏసుకుంటివే’ అంటున్నా, ‘అబద్దాలు సెపతావంటరా’ అని కొట్టబోతన్నడు. రా అక్కా” అని తొందరపెట్టాడా కుర్రాడు.

“అదేంట్రా.. నేనే ఆడికి పది రూపాయలు యిచ్చి బన్ను తెచ్చుకు తినరా అని చెప్పినా, ఆడు యిచ్చే తీసుకుని ఉంటడు. ఆ రాజన్న వట్టి గాబరా మడిసి, సూసుకుని ఉండడు. పదపోదాం” అని వేగంగా కదలబోతుంటే చేతిలో పాప బరువుకు అడుగులు వేగంగా పడడంలేదు ఆమెకు. చుట్టూచూసింది. ఎవరికన్నా పాపను అప్పజెప్పడానికేమో అనిపించింది నాకు. దరిదాపుల ఎవరూ కనిపించలేదు ఆమెకు. నా వైపు చూసింది. ఆమె మనసు తెలిసినట్లుగా చిరునవ్వు నవ్వాను. దాంతో ఆమెకు ధైర్యం వచ్చినట్లున్నది. నా దగ్గరకు వచ్చి, “అమ్మా.. తవరేవనుకోకపోతే.. ఈ సంటిదాన్ని ఈడ పడుకోబెట్టి వోతా. ఆడ నా కొడుకును కొట్టబోతున్నరంట. తొందరగపోవాల.. దీన్నేసుకు పరిగెత్తలేను. కాత్త సూత్తా ఉండండమ్మా. ఇప్పుడే వత్తా” అని బ్రతిమాలింది.

“సరే వెళ్ళు.. రైలు రావడానికి చాలా టైముందిలే” అన్నాను.

“బేగి వత్తా తల్లి” అని పిల్లను బెంచిముందు గుడ్డపరిచి పడుకోబెట్టి పరుగులాంటి నడకతో వెళ్ళింది లచ్చి.

పాపవైపు చూశాను. కాళ్ళు, చేతులు ఆడిస్తూ, నవ్వుతూ ఆడుకుంటున్నది. ప్రక్కకు తిరిగి శ్రీహృదిని చూశాను. హాయిగా లోకాన్ని మరచి నిదురపోతున్నది.

మావారు ఇంకా రాలేదేమిటని చూస్తున్నాను. ఇంతలో లచ్చి కూతురు ఏడవడం మొదలుపెట్టింది. దగ్గరకు వెళ్ళి చిటికలు వేస్తూ ఏడుపు ఆపించాలని ప్రయత్నం చేశాను. ఆపినట్లు ఆపి మరల ఏడవడం మొదలుపెట్టింది పాప. ఆకలవుతున్నదిలా ఉందని అనిపించింది. పట్టడానికి దగ్గర పాలసీసా కూడ లేదు. సమయానికి ఈయన కూడ రాలేదు. నాకు సమృద్ధిగా పాలు ఉత్పత్తి అవుతుండడంతో పోతపాల వైపుగా మా ఆలోచనలు వెళ్ళలేదు. శ్రీహృదికి అవసరమైన దానికంటే ఎక్కువగా పాలు వస్తుండడంతో, అప్పుడప్పుడు మిల్క్ బ్యాంకుకు వెళ్ళి కూడా పాలిచ్చిరావడం జరిగేది.

ఏడుపు ఆపగలిగే స్థితిని దాటిపోయింది పాప. ఈ ఏడుపు విని ఎక్కడ శ్రీహృది లేస్తుందోననే భయం ఒకవైపు, పసిబిడ్డ ఆకలితో అలమటిస్తుందనే జాలి ఒక వైపు. లచ్చి వస్తున్న జాడలు కనిపించలేదు. ఏంచెయ్యాలో పాలుపోలేదు. పిల్ల ఏడుపుతో గుక్కపట్టింది. ఇక ఆలస్యం చేయకూడదనుకుని బిడ్డను చేతిలోకి తీసుకుని స్తన్యాన్ని నోటికి అందించాను. తల్లి వద్ద పాలుతాగే అలవాటేమో, ఆకలితీర్చే అమృతభాండం నోటికి అందగానే పాప ఏడుపు ఆపేసింది. పసిబిడ్డ పెదవుల స్పర్శకు, తల్లి క్షీరగ్రంథుల చైతన్యానికి మధ్య సయోధ్యతను కుదిర్చిన ఆ భగవంతుడి చేతలకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఒక్క అయిదు నిముషాల తరువాత నన్ను వదిలేసింది పాప. ఇంతలో లచ్చి, ఆమె వెంట చిన్న బాబు వచ్చారు. వారి వెనుకనే మావారు కూడ వచ్చారు. పాపకు నేను పాలివ్వడం దూరంనుంచే చూసినట్టుంది లచ్చి.

“అయ్యో.. అయ్యో.. ఎంతపని సేశారమ్మా. తమరేంటి.. నా బిడ్డకు పాలీడమేంటి. పాపిట్టిదాన్ని బిడ్డనెత్తుకెల్లినా బాగుణ్ణేది. ఈ అంటరానిదాని బిడ్డ నోరుదగిలి తమకు అంటొచ్చేలా సేశాను. ఈ యెధవ వల్లే ఇదంతా” ఏదో జరగరాని ఘోరం జరిగినట్టు ఏడవసాగింది లచ్చి.

“లచ్చి.. ఏడవకు. ఇప్పడేమి ఘోరం జరిగిపోయిందని. నీ బిడ్డ ఆకలయి ఏడుస్తున్నది. ఎంత సముదాయించినా ఏడుపు ఆపక గుక్కపట్టింది. పిల్లలు అలా గుక్కపెడితే అది ప్రాణాలకే ప్రమాదమవుతుంది. సమయానికి పట్టడానికి నీళ్ళుకాని, పాలుకాని లేవు. నేను కూడ నీలాంటి తల్లినే.. అందుకని పాపకు పాలిచ్చాను. దానికే అంత ఇదయిపోతావు ఎందుకు” అని అడిగాను.

“తవరు గొప్పింటోల్లు తల్లి.. అడుక్కునేదాని పిల్లకు మీరు పాలు ఈయడమంటే..” తరువాత మాట్లాడలేకనేమో వంగి నా పాదాలకు తలను ఆనించింది లచ్చి.

“అయ్యో.. ఇదేంటి లచ్చి.. లే” అని లచ్చి భుజాలు పట్టుకుని లేపాను.

“అమ్మా.. బిడ్డ ఆకలి తెలిసిన తల్లివి. నూరేళ్ళు బిడ్డ, పాపలతో సల్లంగ ఉండాలి. ఒరేయ్ సెంద్ర..అమ్మ కాల్లకి దణ్ణమెట్టు” అని పిల్లవాడికి చెప్పడంతో వాడు నా పాదాలకు సాష్టాంగపడ్డాడు. “ఏంటి లచ్చి ఇది.. లే నాన్నా” అంటూ వాడిని లేపి దీవించాను.

“తల్లీ.. నువ్వు నా బిడ్డ కడుపు నింపిన అన్నపూర్నమ్మవి. నీ రునం తీర్సుకోలేను. వత్తానమ్మా” అని చేతులెత్తి నమస్కరించి, పిల్లను చంకకు ఎత్తుకుంది లచ్చి.

“అది సరే.. ఇంతకు మీ అబ్బాయిని ఎందుకు కొట్టబోయారట” అడిగాను.

“తప్పంతా టీకొట్టు రాజన్నదమ్మా. ఈడు పదిరూపాయలు ముందే ఆయనకిచ్చిండు. ఆయన గల్లాపెట్టిల ఏసుకున్నడు. పైసలిచ్చినగదా అని ఈడు రొట్టె తీసుకురాబోయిండు. అంతే.. దొంగతనం సేత్తావంటరా అని ఈడ్ని పట్టుకుని ఓ దెబ్బ ఏసిండు. ఈడు ఏడత్తా ‘పైసలిచ్చినా మావా’ అని సెబుతున్నా ఈణ్ణి వదల్లే. ఇంతలో నేనాడికిబోయినా, నా కొడుకు నన్ను సుట్టుకుని బోరుమన్నడు. నేనప్పుడు సెప్పినా.. ఆ పది రూపాయల కాయితంలో గాంధీ తాత నెత్తిమీద పెన్నుతో గీసిన బానం గురుతుందని. అప్పుడు రాజన్న గల్లాపెట్టి తీసిసూత్తే.. అట్టాంటి నోటు కనిపించినాది. అది సూసుకుని తప్పయిపోనాదని.. సెమించమన్నడు రాజన్న. పెద్దోడు గదా సూసుకుని ఉండడనుకుని వచ్చిసినాము” చాలా తేలికగా చెప్పింది లచ్చి.

“మరి చూసుకోకుండా పసివాణ్ణి కొడితే ఎలా? వాడెంత బాధపడి ఉంటాడు” కోపంతో అన్నాను.

“పోనీలే తల్లి.. ఆయన పెద్దోడు. ఒక దెబ్బ ఏత్తే ఏమయితది. అట్టా ముందుగాలే పైసలిత్తే ఇలా జరిగిద్దని ఈడికో పాటం తెలిసింది గదా. ఉంటా తల్లి.. మీ రుణం ఎన్ని జలమలెత్తినా తీర్సుకోలేను” అని నమస్కరించి వెళ్ళింది. ఇదంతా మౌనంగా చూస్తున్నారు మావారు. ఇంతలో రైలు వస్తున్న అనౌన్సుమెంటు వినిపించింది.

***

“మృణా.. నీకు ఆచారాలన్నా, సంప్రదాయాలన్నా మక్కువ ఎక్కువ కదా. మరి బిచ్చగత్తె కూతురికి ఇవన్నీ ఆలోచించకుండా స్తన్యాన్ని ఎలాయిచ్చావు?” అడిగారు రైలు ఎక్కిన తరువాత శ్రీవారు.

“మీరు చెప్పింది వాస్తవమే. నిజానికి ఆచారం, సంప్రదాయం అనేవి శరీరానికే తప్ప ఆత్మకు కాదు. పసిబిడ్డలు భగవంతునికి ప్రతిరూపాలు. అందుకే అమృతసమానమైన తల్లిపాలకు అంటు లేదని అంటారు. ఇందులో మడికి అంటుకునే మైల ఏముంది. ఆడపిల్లకు అమ్మమనసు పుట్టుకతోనే వస్తుంది. అయినా నేను పాలు ఇచ్చింది భగవంతుని ప్రతిరూపానికి. మానవత్వాన్ని మించిన మతం, కరుణకు మించిన కులం ఎక్కడుందండి?” అంటూ ఆయనకే ఎదురుప్రశ్న వేశాను.

“ఏమో మృణా.. మీ ఆడవాళ్ళు ఒకపట్టాన అర్థంకారు. మీ చేతల వెనుక ఎన్ని ధర్మసూక్ష్మాలు, అర్థాలు వుంటాయో మీకు తప్ప ఎవరికి అర్థంకాదు. ఏదయితేనేం.. నువ్వొక బిడ్డకు ఆకలి తీర్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ నన్ను అభినందించారు ఆయన.

చిరునవ్వు నవ్వుతూ పాపను ఒడిలోకి తీసుకున్నాను.

Exit mobile version