Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనుకోని అన్వేషణ

[బాలబాలికల కోసం ‘అనుకోని అన్వేషణ’ అనే కథ అందిస్తున్నారు శ్రీ సలీం.]

స్కూల్‌ వదిలారు. పుస్తకాల సంచిని భుజాలకు తగిలించుకుని, మెల్లగా నడుస్తున్నారు అయాన్‌, స్మరణ్‌, తేజస్వి. వాళ్ళు ముగ్గురూ ఒకటో తరగతి నుంచి ఒకే జట్టు. వాళ్ళ యిళ్ళు కూడా పక్కపక్కనే ఉండటంతో బాల్యం నుంచి బలపడిన స్నేహం వాళ్ళది. స్కూల్‌ వదలగానే యిళ్ళ వైపుకు వడివడిగా పడే అడుగులు ఆ రోజు మందగించడానికి కారణం ప్రిన్సిపాల్‌ గారు పంపిన సర్కులర్‌. ప్రతి ఏడాదికి మల్లే ఈ ఏడాదికూడా విహారయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నామని, బీచ్‌ రిసార్ట్‌లో రెండు రోజుల విడిదితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న యాత్రాస్థలాల సందర్శన కూడా ఉంటుందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు రేపు సాయంత్రం లోపల తమ పేర్లు నమోదు చేసుకుని వెయ్యి రూపాయలు కట్టాలని దాని సారాంశం.

“ఏం చేద్దాం?” అన్నాడు స్మరణ్‌.

“సముద్రపు ఒడ్డున కూచోవడం అంటే నాకు చాలా ఇష్టం. మనకు దగ్గర్లో సముద్రం లేదుగా. స్కూల్‌ వాళ్ళు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. తప్పకుండా వెళ్దాం” అంది తేజస్వి.

“నాకైతే సముద్రంలో స్నానం చేయడం చాలా ఇష్టం. పోయినేడాది ఎండాకాలం శెలవల్లో నాన్నగారు ఎల్టీసీ కింద విశాఖపట్నం పిల్చుకెళ్ళారు. అప్పుడు అమ్మ తిట్టి బైటికి లాక్కొచ్చేవరకు అక్కడి సముద్రంలో ఆడుకుంటూనే ఉన్నాను తెలుసా?” అన్నాడు స్మరణ్‌.

“నేనిప్పటివరకు టీవీలో సినిమాల్లో తప్ప సముద్రమే చూళ్ళేదు” దిగులుగా అన్నాడు అయాన్‌.

“ఐతే నువ్వు తప్పకుండా రావాల్సిందే” అంది తేజస్వి.

“నాకూ రావాలనే ఉంది. కానీ మా నాన్న ఒప్పుకోడు. నన్ను చదివించడానికే చాలా కష్టపడ్తున్నాడు. విహారయాత్రలకు కూడా డబ్బులు ఎక్కడినుంచి తెస్తాడు?” అన్నాడు అయాన్‌.

తేజస్వి వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి. స్మరణ్‌ వాళ్ళ నాన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. కానీ అయాన్‌ వాళ్ళ నాన్న ఆటో తోల్తాడు. కొడుకు తనలా కాకుండా బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగస్థుడు కావాలనే కోరికతో ఫీజులు ఎక్కువైనా మంచి స్కూల్లో చదివిస్తున్నాడు.

“నువ్వు లేకుండా మేమెలా వెళ్తాం అయాన్‌? వెళ్తే ముగ్గురం కలిసే వెళ్దాం. నా దగ్గర కిడ్డీ బ్యాంకులో దాచుకున్న ఐదు వందలున్నాయి. వాటిని నీకిచ్చేస్తాను. కానీ మిగతా డబ్బులెలా?” అంది తేజస్వి.

“మిగతా సగం నేనిస్తాను. మా నాన్న నా పాకెట్‌ మనీ కోసం ఇచ్చిన డబ్బుల్లోంచి ఖర్చు పెట్టకుండా దాచిపెట్టిన డబ్బులు” అన్నాడు స్మరణ్‌.

అయాన్‌ వాళ్ళిద్దరి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ “మీలాంటి స్నేహితులుండటం నా అదృష్టం” అన్నాడు.

“నీ అంత తెలివిగలవాడు మా స్నేహితుడు కావడం మా అదృష్టం కూడా” అంది తేజస్వి.

అయాన్‌ చాలా చురుకైన కుర్రవాడు. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్టుంటాడు. పజిల్స్‌ని, కష్టమైన రిడిల్స్‌ని పరిష్కరించడంలో దిట్ట. స్మరణ్‌కి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎక్కువ. వాళ్ళ నాన్న తన కంప్యూటర్‌ మీద అతని చేత సాధన చేయిస్తుంటాడు. తేజస్వికి సరదాగా ఉండటం ఇష్టం. జోకులేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది.

అందుకే వాళ్ళు ముగ్గురూ ఒక చోట చేరితే సరదాలకు, సమయస్పూర్తికి, విజ్ఞాన విషయాలకు కొదవే ఉండదు.

***

విహారయాత్ర కోసం ఏర్పాటు చేసిన బస్సులో విద్యార్థులతో పాటు యిద్దరు టీచర్లు కూడా బయల్దేరారు. బస్‌లో మాటలు సముద్రపు అలల్లా పొంగసాగాయి. నవ్వులు మువ్వల శబ్దంలా మోగసాగాయి.

ఎంత కోప్పడినా పిల్లలు మాట్లాడుకోకుండా ఉండలేరని అర్థమై “అంత్యాక్షరి ఆడదామా?” అంది మాధవి టీచర్‌. పిల్లలందరూ ఏక కంఠంతో “ఆడదాం టీచర్‌” అన్నారు. అంత్యాక్షరి ఆటలో పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

“మీలో ఎవరైనా జోక్స్‌ చెప్పగలరా?” అని అడిగాడు రాఘవ టీచర్‌.

తేజస్వి లేచి నిలబడి, చెప్పసాగింది. “ఈ గోంగూరపచ్చడి ఇలా తగలడిందేమిటి? ఇందులో ఉప్పూ లేదు కారం లేదు, ఎలా తినమంటావు అంటూ అరిచాడో భర్త. అప్పుడతని భార్య అతని ముందున్న గిన్నెని తీసేస్తూ ‘ఇది గోంగూర పచ్చడి కాదు, నేను నూరిపెట్టుకున్న గోరింటాకు’ అంది” అని చెప్పగానే పిల్లలందరూ నవ్వారు.

మరో జోక్‌ చెప్పింది. “కొంచెం స్టవ్‌ని సిమ్‌లో పెట్టమ్మా అని కోడలితో అంది అత్తగారు. అలాగే అత్తయ్యా, సిమ్ వన్‌లో పెట్టమంటారా సిమ్ టూ లో పెట్టమంటారా అని అడిగింది కోడలు.”

యింకో జోక్‌ చెప్పమని అందరూ అడగడంతో ఈ జోక్‌ చెప్పింది.

“మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు. నా ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌లో ఉన్నారా లేక వాట్సప్‌లో ఉన్నారా? అని ఒకతన్ని ఆపి అడిగాడు చలపతి. నేను మీ యింటి మేడ మీద రెండేళ్ళుగా అద్దెకుంటున్నానండి అంటూ అతను చక్కా పోయాడు.”

“నేను రిడిల్స్‌ చెప్తాను సర్‌” లేచి నిలబడ్తూ అన్నాడు అయాన్‌.

“ఓ ప్రశ్నకు అవును అని ప్రపంచంలోని ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఏమిటా ప్రశ్న?” అని అడిగాడు అయాన్‌. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.

“నువ్వు నిద్రపోతున్నావా అనే ప్రశ్నకు ఎవ్వరూ అవును అని సమాధానం చెప్పలేరు” అన్నాడు అయాన్‌.

“గోల్డ్‌ సూప్‌ ఎలా తయారుచేస్తారో తెలుసా?” అని మరో ప్రశ్న వేశాడు.

బంగారంతో సూప్‌ చేయడం అసంభవం కదా అనుకున్నారు విద్యార్థులంతా.

అయాన్‌ నవ్వుతూ “చాలా సులభం. పధ్నాలుగు క్యారెట్లతో సూప్‌ చేస్తే అదే పధ్నాలుగు క్యారెట్ల గోల్డ్‌ సూప్‌” అన్నాడు.

చాలా సేపటివరకు అయాన్‌ రిడిల్స్‌ని వదలడం, దానికి విద్యార్థులెవరూ సమాధానం చెప్పలేకపోతే తనే చెప్పడం జరిగింది. అతని రిడిల్స్‌ని అందరూ ఆసక్తిగా విన్నారు.

బస్‌ రిసార్ట్‌ ముందు ఆగింది. విద్యార్థులందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళి బ్యాగులు సర్దుకున్నారు.

సమయం పదిన్నర కావస్తోంది. ఎదురుగా సముద్రపు హోరు రారమ్మని పిలుస్తోంది.

“మీకు సముద్రంలో స్నానం చేయడానికి గంటన్నర సమయం ఇస్తున్నాను. పన్నెండుకల్లా అందరూ నీళ్ళలోంచి బైటికి రావాలి. ఎవ్వరూ ఈత కొట్టకూడదు. అర్థమైందా?” అన్నాడు రాఘవ.

ఆడపిల్లల్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు స్నానం చేయడానికి ఆసక్తి చూపలేదు. తీరంలో ఉన్న ఓ యిసుక తిన్నెమీద కూచుని, సముద్రపు అలల్ని చూస్తూ గడపడానికే నిర్ణయించుకున్నారు. తేజస్వి కూడా వాళ్ళతో పాటే కూచుని, నీలాకాశం కింద కనువిందు చేస్తున్న అనంత జలరాశిని, ఎగసిపడ్తున్న అలల్ని, అలల శిరస్సులమీద కిరీటంలా మెరుస్తోన్న తెల్లటి నురగని చూస్తూ కూచుంది.

“సముద్రం యింత బావుంటుందా? అంతెత్తున లేస్తున్న అలల్ని చూస్తుంటే నాకు భయం కూడా వేస్తోంది” అన్నాడు అయాన్‌.

“భయమెందుకు? నేనున్నానుగా” అన్నాడు స్మరణ్‌.

అయాన్‌ అతని చేయి పట్టుకుని లోపలికెళ్ళాడు. ఓ పెద్ద అల వాళ్ళిద్దరి శరీరాల్ని ముంచెత్తింది. అయాన్‌కి ఎంత బాగుందనిపించిందో.. ఒక్కసారి భయం పోయాక, గంట వరకు అయాన్‌ స్మరణ్‌తో కలిసి సముద్రపు అలల్తో ఆడుకున్నాడు.

పన్నెండు కాగానే టీచర్లు విద్యార్థుల్ని బైటికి రప్పించి రిసార్ట్‌కి పిల్చుకెళ్ళారు. వొంటిగంటకు అందరూ భోజనాలు చేశారు.

“సరిగ్గా మూడింటికి మీచేత ట్రెజర్‌ హంట్‌ గేమ్ ఆడిస్తాను” అన్నాడు రాఘవ. “ఒక్కో జట్టులో ముగ్గురు విద్యార్థులుంటారు. ట్రెజర్‌ కనుక్కోడానికి కొన్ని సూచనలు రిడిల్స్‌ రూపంలోనో, పజిల్స్‌ రూపంలోనో ఇవ్వబడ్తాయి. నాలుగున్నరకు వెతుకులాట ఆపి ఐదు లోపల నా ముందుండాలి” అన్నాడు రాఘవ టీచర్‌.

“ట్రెజర్‌లో ఏముంటుంది సార్‌?” అని ఒకతను అడిగాడు.

“అది సస్పెన్స్‌.. అప్పుడేగా దాన్ని వెతకడంలో మీరందరూ ఉత్సాహం చూపిస్తారు” అంటూ నవ్వింది మాధవి టీచర్‌.

***

అయాన్‌, స్మరణ్‌, తేజస్వి ఒక జట్టుగా ఏర్పడ్డారు.

మొదటి క్లూ చాలా సులభమైంది ఇవ్వడంతో అన్ని జట్లు దాన్ని కనుక్కుని, రెండో క్లూని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడసాగాయి. ‘సముద్రానికి ఎదురుగా నిలబడి మీ విధేయతను ప్రతిజ్ఞ చేయండి’ అనేది రెండో క్లూ. అందరూ సముద్ర తీరం వెంబడి పరుగెత్తారు. కానీ దాన్ని ఎక్కడ దాచిపెట్టారో ఎవ్వరికీ అర్థం కాలేదు.

స్మరణ్‌ అయాన్‌ వైపు చూసి, “దీని అర్థం ఏమై ఉంటుంది?” అని అడిగాడు.

అయాన్‌ కొన్ని క్షణాలు ఆలోచించి, “ప్రతిజ్ఞ చేయాలని కదా రాసి ఉంది. మనం జాతీయ జెండా ముందు నిలబడి ప్రతిజ్ఞ చేస్తాం కదా. నా ఉద్దేశంలో ఎక్కడో ఓ చోట జెండాని పాతి ఉంటారు. సముద్రానికి ఎదురుగా నిలబడమన్నారు కాబట్టి అది తీరానికి దగ్గరగా ఉంటుందనిపిస్తోంది” అన్నాడు.

ముగ్గురూ తీరం వెంబడి నడుచుకుంటూ కొంత దూరం పోయాక, అక్కడ చిన్న కర్రకు వేలాడుతున్న జెండా కన్పించింది. ఆ కర్రకు దారంతో కట్టి వేలాడుతున్న ఓ కాగితం ఉంది.

స్మరణ్‌ ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చదివాడు. అందులో “మొదళ్ళు మళ్ళా చిగురిస్తాయి” అని రాసి ఉంది.

“యిక్కడే ఎక్కడో మొదలు నరికిన చెట్టు ఉండి ఉంటుంది. దాన్లోనే మనక్కావల్సిన క్లూ దొరుకుతుంది” అన్నాడు అయాన్‌.

తీరానికి ఎదురుగా రెండు వందల గజాల దూరంలో కొన్ని చెట్లు కన్పించాయి. వాటిలో మొదలు నరికిన చెట్టు కోసం చాలా సేపు వెతికాక, కన్పించింది. దాని మధ్యలో చేసిఉన్న రంధ్రంలో ఓ కాగితం దూర్చి ఉంది. దాన్లో “నేనూ శ్వాసిస్తాను కాని నాలో ఎముకలుండవు. నా రెక్కల్లో రహస్యాన్ని దాచాను” అని రాసి ఉంది.

“రెక్కలున్నాయంటే పక్షి అని అర్థమా?” అంది తేజస్వి.

“కాదు. పక్షులకు ఎముకలుంటాయిగా” అన్నాడు స్మరణ్‌.

అయాన్‌కు దూరంగా సరుగుడు తోట కన్పించింది. “ఇది కూడా చెట్ల గురించే రాశారనిపిస్తోంది. రెక్కలంటే అర్థం రెమ్మలు కావొచ్చు” అంటూ ముందుకు కదిలాడు.

సరుగుడు తోట వంద మీటర్ల దూరంలో ఉంది. మధ్యలో ఎగుడు దిగుడుగా ఉన్న యిసుక నేల తప్ప చెట్లేమీ లేవు. వడివడిగా నడుస్తున్న అయాన్‌ గుంటలో కాలేసి దేనికో తట్టుకుని పడబోయాడు.. యిసుక లోంచి అడుగు పొడవున్న చెక్క పైకి పొడుచుకొచ్చి కన్పిస్తోంది.

అయాన్‌ మోకాళ్ళమీద కూచుని, యిసుకను తొలగించి, చెక్కను బైటికి లాగడానికి ప్రయత్నించాడు. చెక్కలో కొద్ది భాగమే బైటికి కన్పిస్తోందని, లోపల చాలా వెడల్పయిన చెక్క ఉండిఉంటుందని అర్థమైంది.

“యింత పెద్ద చెక్క పలకని ఇసుకలో ఎందుకు దాచిపెట్టారు? కుక్కలో వేరే జంతువులో తవ్వడం వల్ల ఈ కాస్త భాగం బైటపడింది. యిసుకని తవ్వి పూర్తిగా చెక్క పలకని బైటికి తీసి చూద్దాం” అంటూ అయాన్‌ చేతుల్తో మరింత ఇసుకను తవ్విపోయసాగాడు.

“మనకంత సమయం లేదు అయాన్‌. దీని సంగతేమిటో రేపు చూద్దాం. సరేనా” అన్నాడు స్మరణ్‌.

అయాన్‌ లేచి, వాళ్ళతో పాటు సరుగుడు తోట వైపుకు కదిలాడు.

తోట మధ్యలో ఓ చెట్టు కాండానికి కట్టిన ఎర్రటి ముఖమల్‌ సంచి కన్పించింది. సంచిలోపల ఏపిజె అబ్దుల్‌ కలాంగారు రాసిన వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ అనే పుస్తకం ఉంది. పుస్తకం మధ్యలో ఓ కాగితం మీద “మీకు నిధి దొరికింది. అభినందనలు. దీంతో పాటు మూడు వేల నగదు బహుమతిని కూడా మీరు గెల్చుకున్నారు” అని రాసి ఉంది.

సంతోషాతిరేకంతో ఆ ముగ్గురూ వేగంగా నడుస్తూ రిసార్ట్‌ చేరుకున్నారు. రాఘవ టీచర్‌, మాధవి టీచర్‌తో పాటు మిగతా విద్యార్థులందరూ వాళ్ళని అభినందించారు. రాఘవ వాళ్ళకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు నగదు బహుమతిగా ఇచ్చాడు.

అయాన్‌ తన దగ్గర ఉన్న రెండు ఐదు వందల నోట్లని స్మరణ్‌కు తేజస్వికి యిచ్చేస్తూ, “మీరు నా కోసం ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగిస్తున్నాను” అన్నాడు.

***

మరునాడు ఉదయం తొమ్మిదింటికి చుట్టుపక్కల విహార స్థలాలు చూడటానికి అందరూ బస్‌లో బయల్దేరారు. కడుపునొప్పిగా ఉందన్న సాకు చెప్పి అయాన్‌, స్మరణ్‌, తేజస్వి రిసార్ట్‌లోనే ఉండిపోయారు.

బస్‌ బయల్దేరిన అరగంట తర్వాత ముగ్గురూ నిన్న చెక్క పలక కన్పించిన ప్రదేశాన్ని చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో యిసుకను తవ్వడానికి తెచ్చుకున్న కర్రముక్కలున్నాయి.

ముగ్గురూ వేగంగా యిసుకను తవ్వసాగారు. చాలాసేపు శ్రమ పడ్డాక నేలలో రెండు అడుగుల లోపల ఉన్న నలుచదరపు పలక బైటపడింది. అది మూడడుగుల పొడవు, మూడడుగుల వెడల్పుతో అంగుళంమందాన ఉంది. దానికో వైపున, పైకెత్తడానికి వీలుగా కొక్కేలు బిగించి ఉన్నాయి. ముగ్గురూ తమ బలమంతా ప్రయోగించి చెక్క పలకను పైకి ఎత్తారు. లోపల చెక్కతో చేసిన మెట్లు కన్పించాయి.

“ఏం చేద్దాం?” అన్నాడు స్మరణ్‌.

“లోపలికి దిగి చూద్దాం. యిందులో ఏ నిధి నిక్షేపాలు ఉన్నాయో” అంటూ నవ్వాడు అయాన్‌.

స్మరణ్‌ తన దగ్గరున్న మొబైల్‌ ఫోన్లోని టార్చ్‌లైట్‌ని వెలిగించాడు. మొదట స్మరణ్‌, అతని వెనగ్గా అయాన్‌, తేజస్వి మెట్లు దిగారు.

గోడ పక్కన స్విచ్‌ బోర్డ్‌ కన్పించింది. స్మరణ్‌ అన్ని స్విచ్‌లని నొక్కాడు. ట్యూబ్‌లైట్లు వెలిగాయి. అవి బ్యాటరీతో పనిచేసే ఎల్‌ఈడి లైట్లని వాళ్ళకు అర్థమైంది. ముగ్గురూ కళ్ళు విప్పార్చి లైట్లకాంతిలో కన్పిస్తున్న విశాలమైన హాల్‌ని చూశారు. దానికి నాలుగు వైపులా నాలుగు గదులున్నాయి. హాలు మధ్యలో టేబుల్‌ వేసి ఉంది. దానిమీద రెండు ల్యాప్‌టాప్లు పెట్టి ఉన్నాయి. వాటితో పాటు టీవీ రిమోట్‌లా కన్పిస్తున్న వస్తువేదో ఉంది. దాని పై సగభాగంలో మొబైల్‌ ఫోన్‌కున్నట్టు స్క్రీన్‌ ఉంది. కింది సగభాగంలో నాలుగు రంగుల మీటలున్నాయి.

ఆ టేబుల్‌కి కొద్ది దూరంలో ఆరడుగుల పొడవున్న మరో టేబుల్‌ ఉంది. దానిమీద ప్రయోగశాలలో ఉన్నట్టు రకరకాల గాజుపాత్రలు, ట్యూబులు, గడ్డకట్టిఉన్న ద్రావణాలు కన్పించాయి.

“ఇదేదో రహస్యంగా ఏవో ప్రయోగాలు జరిపిన ల్యాబొరేటరీలా ఉంది” అన్నాడు స్మరణ్‌.

తేజస్వి తలుపులు మూసిఉన్న నాలుగు గదులవైపు భయం భయంగా చూస్తూ “ఆ గదుల్లో ఎవరో ఉన్నారనిపిస్తోంది. అందుకే బైటినుంచి గడియలు పెట్టి లేవు గమనించారా?” అంది.

“నిజంగానే ఆ గదుల్లో ఎవరైనా ఉండిఉంటే మన అలికిడికి బైటికి వచ్చేవారు. అక్కడ ఎవరూ లేరు. భయపడకు” అన్నాడు అయాన్‌.

స్మరణ్‌ ఓ ల్యాప్‌టాప్‌ని ఆన్‌ చేసి చూశాడు. ఒకే ఒక వీడియో తప్ప మిగతా డిస్క్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ వీడియోని ప్లే చేశాడు. తెరమీద దాదాపు ఎనభై యేళ్ళ వయసున్న ఓ వ్యక్తి మొహం కన్పించింది. అతను చాలా బలహీనంగా కన్పించాడు. అతను మాట్లాడుతుంటే గొంతు వణుకుతోంది.

“నా పేరు విశ్వనాధం. నేనో శాస్త్రవేత్తని. ప్రపంచ మానవాళిని పీడిస్తోన్న డయాబెటిస్‌ అనే వ్యాధికి శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా ఎన్నో సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తున్నాను. చివరికి విజయం సాధించాను. ఓ ప్రత్యేకమైన మొక్క ఆకుల పసరుతో కొన్ని మూలికల్ని కలిపి తయారు చేసిన మందు ఒక్క మోతాదులో వాడినా డయాబెటిస్‌ వ్యాధి శాశ్వతంగా నయమౌతుందని తెల్సుకున్నాను. ఆ మొక్క గురించి ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు.

నా ప్రయోగాల గురించి తెల్సుకున్న ఫార్మసీ కంపెనీలు నన్ను నిరోధించడానికి గూఢచారుల్ని నియమించాయి. నా మందు మార్కెట్‌లోకి వస్తే వాళ్ళకు కొన్ని బిలియన్ల నష్టం వాటిల్లుతుంది కదా. వాళ్ళకు నా ఆచూకీ తెలియకూడదనే ఈ భూగృహాన్ని నిర్మించుకుని నా ప్రయోగాల్ని కొనసాగించాను.

ఈ ఫార్ములాని ప్రభుత్వానికి అందచేయాలనుకున్నాను. కానీ వృద్ధాప్యం వల్ల ఈ బంకర్‌ దాటి బైటికి రాలేని పరిస్థితి. నేను ఎక్కువ రోజులు బతకనని అర్థమైంది. అందుకే ఫార్ములాని సీక్రెట్‌ కోడ్‌ ఏర్పరచి అందులో దాచిపెట్టాను. దాంతోపాటు అసాంఘిక శక్తుల చేతుల్లో పడకుండా రక్షణ వలయాన్ని తయారుచేసి పెట్టుకున్నాను.

ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకో విన్నపం.. రక్షణ వలయాన్ని ఛేదించి, సీక్రెట్‌ కోడ్‌ ఏమిటో కనుక్కోండి. ఫార్ములాని ప్రభుత్వానికి అందచేయండి. దానివల్ల కొన్ని కోట్ల ప్రజలకు మేలు చేకూరుతుంది. జై హింద్‌.”

స్మరణ్‌ మరో ల్యాప్‌టాప్‌ని కూడా తెరిచి చూశాడు. అందులో కూడా అదే వీడియో తప్ప మిగతా స్పేస్‌ అంతా ఖాళీగా ఉంది.

“రక్షణ వలయం అన్నాడు కదా. ఏంటది?” అంది తేజస్వి,

“అదే తెలియడం లేదు” అంటూ స్మరణ్‌ టేబుల్‌ మీద టీవీ రిమోట్‌లా కన్పిస్తున్న దాన్ని చేతిలోకి తీసుకుని, ఆన్‌ అని రాసి ఉన్న బటన్‌ని నొక్కాడు. స్క్రీన్‌ నిండా వెల్తురు పర్చుకుంది. అదే సమయంలో ఎక్కడినుంచో ‘ఇన్‌ట్రూడర్స్‌ డిటెక్టెడ్‌’ అంటూ మెటాలిక్‌ గొంతుతో పాటు కుక్కల అరుపులు విన్పించాయి.

ముగ్గురూ భయంగా ఆ అరుపులు విన్పించిన గది వైపు చూశారు. తలుపుల్ని నెట్టుకుంటూ రెండు కుక్కలు నాలిక బైటపెట్టి భీకరంగా అరుస్తూ వాళ్ళ వైపుకు దూసుకురాసాగాయి. వాటి కళ్ళు ఎర్రటి కాంతితో మెరుస్తున్నాయి.

స్మరణ్‌ తన చేతిలో రిమోట్‌ని గట్టిగా పట్టుకుని “పరుగెత్తండి” అంటూ అరిచాడు.

వాళ్ళు హాల్లో కుడివైపున్న గదిలోకి పరుగెత్తి, తలుపు మూసి గడియపెట్టారు.

“అవి మామూలు కుక్కలు కాదు. రోబో కుక్కలు” అన్నాడు అయాన్‌.

స్మరణ్‌ రిమోట్‌ స్క్రీన్‌ మీద కన్పిస్తున్న కుక్కల్ని చూశాడు. “వీటిని డీయాక్టివేట్‌ చేయాలంటే గురిపెట్టి, కింద ఉన్న రెడ్‌ బటన్ని నొక్కండి” అని వాటికింద రాసి ఉంది.

కుక్కలు పెద్దగా మొరుగుతూ తలుపు మీద కాళ్ళతో రక్కుతున్నాయి.

“నేను తలుపు వెనక నిలబడి తలుపుని కొద్దిగా తెరుస్తాను. కుక్కలు లోపలికొచ్చి మనల్ని గమనించేలోపల వాటికి గురిపెట్టి బటన్‌ నొక్కితే చాలు” అన్నాడు అయాన్‌.

స్మరణ్‌ సరే అనడంతో అయాన్‌ రెండు కుక్కలు పట్టేటంత మేర తలుపు తెరిచాడు. కుక్కలు దూసుకుంటూ లోపలికి రావడం స్మరణ్‌ రెడ్‌ బటన్‌ నొక్కడం ఏక కాలంలో జరిగిపోయాయి. రోబో కుక్కలు అచేతనంగా పడిపోయాయి.

“అటు చూడండి” భయంతో వణికిపోతూ అంది తేజస్వి.

వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి చూపిస్తున్న వైపు చూశారు. గదిలో ఓ మూల నిలబడి ఉంది రోబో నిప్పుకోడి.. దాదాపు ఏడడుగుల ఎత్తులో చూడటానికి భయంకరంగా ఉంది. అది పరుగెత్తుకుంటూ వాళ్ళ వైపు రాసాగింది. ముగ్గురూ తలుపు తీసుకుని హాల్లోకి పరుగెత్తారు. నిప్పుకోడి వాళ్ళ వెంటబడింది.

స్మరణ్‌ పరుగెత్తుతూనే రిమోట్‌లో స్క్రీన్‌ మీద కన్పిస్తున్న ఇమేజ్‌ని చూశాడు. నిప్పుకోడి బొమ్మ కింద ‘డీయాక్టివేట్‌ చేయడానికి గ్రీన్‌ బటన్‌ నొక్కండి’ అని రాసి ఉంది. స్మరణ్‌ గిరుక్కున నిప్పుకోడి వైపు తిరిగి గ్రీన్‌ బటన్‌ నొక్కాడు. అది బొమ్మలా నిలబడిపోయింది.

అదే సమయంలో మూడో గది తలుపులు తెర్చుకుని గొరిల్లా బైటికి రాసాగింది. స్మరణ్‌ రిమోట్‌లో ఉన్న బ్లూ బటన్ని నొక్కడం, అది కదలిక లేకుండా నిలబడిపోవడం ఒకే సమయంలో జరిగాయి.

నాలుగో గది తలుపు తెర్చుకుని బైటికొచ్చే రోబో జంతువు కోసం ముగ్గురూ ఆందోళనగా ఎదురు చూశారు. తలుపు తెరుచుకోలేదు.

“మనమే ఆ తలుపు తెరిచి చూద్దాం” అన్నాడు స్మరణ్‌.

అయాన్‌ ఆ తలుపుని కొద్దిగా తెరిచి, దాని చాటున నిలబడ్డాడు. స్మరణ్‌ తన చేతిలో రిమోట్‌తో బటన్‌ నొక్కడానికి సన్నద్ధంగా ఉన్నాడు. లోపలినుంచి బుసలు కొడ్తూ పడగవిప్పి బైటికొచ్చింది ఆరడుగుల పొడవున్న నాగుపాము. రిమోట్‌ సాయంతో దాన్ని చలనరహితంగా చేశాడు స్మరణ్‌.

ముగ్గురూ కలిసి, నాలుగు గదుల్ని, హాల్‌ని క్షుణ్ణంగా పరిశీలించారు. కోడ్‌ కనుక్కోడానికి క్లూ ఏమీ దొరకలేదు. వెతికి వెతికి అలసిపోయి, హాల్లో ఉన్న కుర్చీల్లో కూచుని, మెదళ్ళకు పదును బెట్టసాగారు.

“నాకెందుకో ఈ నాలుగు గదుల్లోనే సీక్రెట్‌ కోడ్‌ దాగి ఉందనిపిస్తోంది” అన్నాడు స్మరణ్‌.

“అణువణువూ గాలించాంగా. ఏమీ కన్పించలేదుగా” అన్నాడు స్మరణ్‌.

“క్లూలు కన్పించవు. మనమే కనుక్కోవాలి” అంటూ “నువ్వో విషయం గమనించావా? నువ్వు రిమోట్‌ని ఆన్‌ చేశాకే కుక్కల్లో చలనం వచ్చింది. కుక్కలు డీయాక్టివేట్‌ అయ్యాకే నిప్పుకోడిలో కదలిక వచ్చింది. ఈ బంకర్‌లోకి వచ్చిన వాళ్ళని చంపాలనుకుంటే సైంటిష్ట్‌గారు నాలుగు గదుల్లోని జంతువులు ఒకేసారి దాడి చేసేలా ప్రోగ్రామ్ చేసి ఉండేవారు. వారి ఉద్దేశం లోపలికొచ్చిన వ్యక్తులు సీక్రెట్‌ కోడ్‌ని కనుక్కోవడంలో సాయపడటం తప్ప, వాళ్ళకు హాని కలుగచేయడం కాదు” అన్నాడు అయాన్‌.

“నీ ఉద్దేశం ఏమిటి?” అని అడిగాడు స్మరణ్‌.

స్మరణ్‌ చేతిలోంచి మొబైల్‌ ఫోన్‌ తీసుకుని, మెసేజెస్‌లోకి వెళ్ళి డివోజీఎస్‌ అని టైప్‌ చేశాడు. దానికింది ఆస్ట్రిచ్‌ అని రాశాడు. దానికింద వరసగా గొరిల్లా, స్నేక్‌ అని రాశాడు.

ఆ నాలుగు పేర్ల వైపు నిశితంగా చూశాడు. అతని మెదళ్లో బల్బు వెలిగింది. వాటి మొదటి అక్షరాల్ని కలిపితే డాగ్స్‌ అని వస్తోంది.

“ఈ కుక్కల్లోపలే ఫార్ములా దాచిపెట్టి ఉండాలి. వెదుకుదాం రండి” అన్నాడు.

ఓ రోబోకుక్క శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దాని పొట్ట కింద ఓ స్విచ్‌ కన్పించింది.

దాన్ని నొక్కగానే చిన్న అర తెర్చుకుని అందులోంచి ఫార్ములా రాసి ఉన్న కాగితం బైటపడింది. కానీ ఆ కాగితం సగమే ఉంది. మరో కుక్క పొట్ట కింద మిగిలిన సగం కాగితం దొరికింది.

వాళ్ళు ముగ్గురూ ఫార్ములా ఉన్న కాగితాల్ని టీచర్లకు అందచేయడం, వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్ళడం వెంటవెంటనే జరిగిపోయాయి.

వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్ళు ఆ ముగ్గుర్ని ప్రశంసలతో ముంచెత్తాయి.

బాలల దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం ఆ ముగ్గుర్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, ఘనంగా సత్కరించింది.

Exit mobile version