[జి.ఎల్.ఎన్. ప్రసాద్ గారి ‘అపరంజి కలలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈసారి గురుపూజోత్సవం ఎలా ఉంటుందో అని కలలు కంటూ నిద్రలేచాను. మాకంటూ ఒక రోజుందని నా లాంటి అధ్యాపకులకు గుర్తుకు వచ్చేది ఇలాంటి సందర్భాలలోనే. లేచిందే తడవుగా వాట్సప్ చూసాను. కొన్ని వందల సందేశాలు కనపడ్డాయి. వాటిలో చాలా మటుకు కృత్రిమ మేధనుపయోగించి చేసిన పోస్టర్లు. నా క్లాసులకు ఏ రోజూ రాని వారు కూడా నన్ను ప్రశంసిస్తూ సందేశాలు పంపారు. ఇంస్టాలో మీ వీడియోలు చూసామని కొందరు సందేశాలు పంపారు. ఇవన్నీ గత పదేళ్లుగా నాకు అలవాటైన మూస సందేశాలే. ఏమంటే ఇటీవల వీటికి కృత్రిమ మేధ కొత్త సొబగులు అద్దింది అంతే. కానీ అందులో “మీకు ఫోన్ చేయొచ్చా?” అనే సందేశం నన్ను ఆకర్షించింది. తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఆ సందేశానికి బదులుగా ‘సరేనన్నట్టుగా’ ఒక ఎమోజీ పంపాను. అసలు ఈ ఎమోజీ కనిపెట్టిన గురూజీ ఎవరా అని ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాను నేను. ఈ ఎమోజీలు చేసే మేలు అంతా ఇంతా కాదు. బరువైన భావాలను కూడా ఒక చిన్న ఎమోజీ సమర్థవంతగా పలికించగలదు. ఇలా ఎమోజీ కనిపెట్టిన గురూజీ గురించి ఆలోచించుకుంటూ ఉండగానే ఆ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
“గురువు గారు! నేను ఒక ప్రఖ్యాత బంగారు నగల దుకాణం మానేజర్‌గా పని చేస్తున్నాను. కొద్దిమంది ఆచార్యులకు సన్మానం మా సంస్థలో ఈ రోజు చేయాలనుకున్నాము. మీరు ముఖ్య అతిథిగా రావాలి” అన్నాడు అవతలి నుంచి. నాకు ఒకటే అనిపించింది. బాల్యం నుంచి నేను ఏ రోజు కూడా పిసరంత బంగారాన్ని కొనిందిలేదు. కనీసం ఈ నెపంతోనైనా బంగారు నగల దుకాణాన్ని చూసి వద్దాం అనిపించింది. వెంటనే ‘సరే’ నంటూ నా ఆమోదం తెలిపేసాను.
“సాయంత్రం 5.30కు వచ్చేయండి” అంటూ ఫోన్ పెట్టేసాడు అతను. పేరు కూడా అడగడం మరిచిపోయాను. ట్రూ కాలర్ లో చూస్తే ‘బంగారు రాజా’ అని కనిపించింది. ఇక మొదటగా మా కాలేజీకి వెళ్లాలిగా!!!!!. స్నాన పూజాదికాలు ముగించుకుని కాలేజీకి వెళ్లాను. ప్రతి ఏడాది ఉన్నట్టుగానే వందల కొద్దీ విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. వీరి ఆదరణకు మించిన బంగారం ఏముంది అనిపించింది కాసేపు. వీరితో గడిపిన క్షణాలన్నీ బంగారు క్షణాలే అనిపించింది.
నేను చదువుకున్న రోజులను ఇప్పటి రోజులతో పోలిస్తే బోధనా విధానంలో విశేషమైన మార్పులు వచ్చాయి. ఆ మార్పులు అన్నిటినీ అందరు గురువులు శిక్షణ ద్వారా ఇట్టే పుణికి పుచ్చుకున్నారు. మార్పు అనివార్యం అయినప్పుడు అందరికంటే ముందే అంది పుచ్చుకునే వాళ్లే గురు స్థానానికి అర్హులు కదా!!!! అనూచానంగా వచ్చే ఆచారం ప్రకారం, మా కాలేజీలో కూడా మాకు ఏదో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. మా కళాశాలలో జరిగే ఇలాంటి కార్యక్రమాలకు మేము అలవాటుపడిపోయాము కాబట్టి నా ధ్యాస అంతా సాయంత్రం ఆ ప్రముఖ బంగారు నగల దుకాణంలో జరిగే కార్యక్రమం మీదే ఉండి పోయింది. బంగారు దుకాణంలో జరిగే సన్మాన కార్యక్రమానికి నేను హాజరైతే ఆ కనకం మీద మరులుగొంటానా???? ఏమో ఒక్కసారి అన్నా ఆ పైడి ధగధగలను దగ్గరి నుంచీ చూద్దాం. పెళ్లై ఇంతకాలం అయినా నా అర్ధాంగికి ఒక పసిడి ముక్కు పుడక కూడా తీసిచ్చిన పాపానికి పోలేదు నేను. నేను ఇంతవరకు ఆ హిరణ్య మాయకు లొంగలేదు. నాకు ఎందుకో బాల్యం నుంచీ డబ్బు పట్ల ఒక ప్రతికూల దృక్పథం ఉండి పోయింది. ఆ అభిప్రాయం ఈ రోజు మారబోతుందా!!!!!!! చూద్దాం.
సాయంత్రం ఒక అర్ధగంట ముందుగానే కారులో ఆ ప్రముఖ దుకాణానికి చేరుకున్నాను. నిజం చెప్పొద్దూ.. ద్విచక్ర వాహనం పై వెళ్లడానికి నామోషీ వేసింది. ఈ నామోషీని మనకు నేర్పింది గ్లోబలైజేషన్ అని నా సూత్రీకరణ. డబ్బు సంపాదించడం నాకు చేత కాక నేను ఇలాంటి అభిప్రాయం ఏర్పరుచుకున్నానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైతేనేమి లేని స్టేటస్‌ను ప్రదర్శించడం నాకు తెలిసో తెలియకో అలవాటై కూచుంది. నన్ను ఆ నగల దుకాణం వారు ఆహ్వానించిన తీరులోనే డబ్బు ఇచ్చే హుందాతనం తెలిసి వచ్చింది. డబ్బు ఉండేవారిది పొగరా??? హుందాతనమా? నాకిప్పటికీ పూర్తిగా అర్థం కాదు. ఆహ్వానం పలికిన వారందరూ చాలా క్రమశిక్షణతో కనిపించారు. ప్రతి ఒకరు నగల దుకాణం ఎంబ్లమ్ ఉన్న నల్లటి కోటు ధరించారు. ఆ కోటు మీద ‘పరుస వేది’ అని రాసి ఉంది. సంపద, అందం కలగలిపితే ఎంత సౌకర్యం ఉంటుందో కొద్దిగా తెలిసివచ్చింది నాకు. నాకు ఆహ్వానం పలికిన వారిలో కొన్ని తెలిసిన ముఖాలు కనిపించాయి. పోల్చుకోలేక పోయాను నేను. నాతో పాటు మరి కొందరు గురువులు దిగారు. అందరికీ అలాంటి సాదర ఆహ్వానమే అందింది. దుకాణం లోపల చాలా విశాలంగా ఉంది. మేము నడిచి లోపలికి వస్తుంటే వీడియో తీస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో పెడతారు కాబోలు. ఇటీవల కాలంలో అనామకులు కూడా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని రాత్రికి రాత్రి సెలెబ్రెటీలుగా మారిపోతున్నారు. ఈ దుకాణంలో చాలా అంతస్తులే ఉన్నాయి. అన్ని అంతస్తులు తిప్పి చూపించారు. ఒక్కో అంతస్తు ఒక్కో ప్రత్యేక రకమైన నగల విక్రయానికి కేటాయించబడింది. మొదటి అంతస్తు బంగారు నగలకు, రెండో అంతస్తు వజ్ర వైఢూర్యాలకు, మూడో అంతస్తు వెండికి, నాలుగో అంతస్తు ప్లాటినంకు కేటాయించారు. అందరు ఉద్యోగులకు ఒకే డ్రెస్ కోడ్. క్రమశిక్షణ ఉన్న చోటనే సంపద నిలుస్తుంది అని చిన్నప్పుడు మా గురువు చెప్పిన వాక్యం గుర్తుకు వచ్చింది. దుకాణం నిండా ఏ వైపు చూచినా బంగారాల సింగారాలే, సింగారాల బంగారాలే. ప్రతి నగ తనదైన రీతిలో చూపరులను ఆకర్షిస్తోంది. ఆ హాలులో నడుస్తుంటే ‘ఆహా.. బంగారానికి ఇన్ని వగలా!!!! ఇన్ని హొయలా!!!!!’ అనిపించింది. అప్పో సొప్పో చేసైనా బంగారాన్ని కొనాలనే మానసిక స్థితిలోనికి అందరూ జారుకునేలా చేసే పరిసరాలు. ఈ నగల నగిషీల వెనుక ఎంత మంది శ్రమ దాగి ఉందో కదా!!!! శ్రమ సంపద సృష్టించినట్టుగా తీరిక సంపద సృష్టించలేదు కదా!!!!!! శ్రామిక వర్గాలు సంపద సృష్టిస్తే తీరిక వర్గాలు అనుభవిస్తాయి. నిజంగా ఇన్ని నగల మీద ఇన్ని నగిషీలు చెక్కడానికి అగసాలలో ఎంత మంది ఎన్ని అగచాట్లు పడి ఉంటారో అనిపించింది. నాకు ఈ ముదిమి వయసులో సంపద గురించిన ఇంత అవగాహన అవసరమా అని కూడా అనుకున్నాను. సంపాదించేవాడు సంపన్నుడా!!! ఖర్చు పెట్టే వాడు సంపన్నుడా!!! అనే విషయాన్ని ఇప్పటికీ తేల్చుకోలేకుండా ఉన్నాను. డబ్బును మార్కెట్ లోకి ప్రవేశ పెడితేనే సంపద రెట్టింపు అవుతుంది. అలా సంపదను చక్రభ్రమణం చేయించడానికే ఇలాంటి నగల దుకాణాలు వెలిసేది. చేతులు మారినప్పుడే డబ్బు బలం పుంజుకుంటుంది.
ప్రతి సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన నగలు ఉన్నాయి. పెళ్లిళ్లకీ, పేరంటానికి, వ్రతాలకి.. ఇలా ప్రతి సందర్భానికి తగ్గట్టుగా ధరించాల్సిన నగలు మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. నన్ను నేను ఒకసారి పరిశీలించి చూచుకున్నాను. నా చుట్టూ నగలున్నా, నా ఒంటి మీద మాత్రం ఒక్క నగా లేదు. నా చుట్టూ ఉన్న వారిని పరిశీలించి చూచాను. అందరూ కూడా ఏదో ఒక ఆభరణాన్ని ధరించి కనపడ్డారు. జీవితంలో అలంకరణకు ఎంత ప్రాధాన్యముంది కదా ఈ కాలంలో అనిపించింది. ఈ నగలు వేసుకున్నవారి నడకలో వగలు చూడాలి!!! సంపదలో ఏదో తెలియని మహత్తు ఉంది.
ఇంతలో క్రింది అంతస్థులో మా సన్మానం ఏర్పాటు చేసినట్టుగా మైక్‌లో ప్రకటించారు. గురువులందరం క్రిందికి చేరిపోయాము. చుట్టూ బంగారం.. మధ్యలో ఆసీనులైన గురువులను చూస్తుంటే, సరస్వతీ, లక్ష్మీ కలిసి కూచున్నట్టుగా ఉంది. గురువుల ప్రాధాన్యతను ఒక యువతి చక్కగా వర్ణించింది. ప్రతి ఒక్కరికీ ఒక ‘ఇన్వెస్ట్మెంట్ గురువు’ ఉండాలని చక్కగా చెప్పింది. బడిలో పెట్టుబడి పాఠాలు మా విద్యార్థులకు నేను ఎందుకు నేర్పలేదు???? లేదా ఎందుకు నేర్పలేక పోయాను???? సంపద పెంచినప్పుడే చదువు విలువ పెరుగుతుంది అని నాకు ఇప్పుడు బుర్ర కెక్కుతూ ఉంది. బుర్ర మొత్తం తెల్లగా మారిన ఈ వయసులో ఈ చిత్త పరిపాకం అవసరమా అనుకున్నాను. మార్పు ఏ వయసులో వస్తే ఏమి????? మార్పు ఎప్పటికీ మంచిదే. అసలు మా విద్యార్థులు అన్ని దేశాల కరెన్సీలు చూసారా???? యాభై ఐదు వసంతాలు దాటిన నేనే డాలర్‌ను సరిగా చూడలేదు. డబ్బు పట్ల ప్రతికూల ధోరణిని మేము విద్యార్థులకు అలవరుస్తున్నామా???? ఆ అమ్మాయి మాటలు నాలో ఏదో మౌలికమైన మార్పుకు నాంది పలుకుతున్నాయి. అందరు గురువులను పరికించి చూసాను. మార్పు తెచ్చే వెలుగు అందరి కళ్లల్లో కనిపిస్తోంది.
ఇలా కొద్దిగా గురువుల గురించి మంచి మాటలు చెపుతూనే వారి దుకాణంలో స్కీముల గురించి చక్కగా చెప్పింది. స్కీముల వెనుక ఉన్న స్కాముల గురించి కూడా జాగ్రత్తలు చెప్పింది. నాకైతే సన్మానానికి వచ్చినట్టు లేదు.. సంపద పట్ల అవగాహనా సదస్సుకు వచ్చినట్టు ఉంది. మాకు ఒక మెమరీ పరీక్ష కూడా పెట్టారు. ఒకనిమిషం పాటు మాకు బొమ్మల చార్ట్ చూపించి దానిలో ఉన్న వస్తువుల పేర్లు ఒక నిమిషంలో రాయమన్నారు. ఎక్కువ రాసిన ముగ్గురికి బహుమతులు ప్రకటించారు. గెలుపొందినవారందరూ మహిళలే కావడం విశేషం. ఆర్థిక విషయాల పట్ల మహిళలకు ఉన్న అవగాహన నిజంగా అమోఘం. మన ఇళ్లల్లో తమాషా ఏమిటంటే సంపద కోసం లక్ష్మీ దేవిని పూజిస్తూనే, ఇంట్లో మహిళలను మాత్రం డబ్బు విషయంలో సలహాలు అడగము. నేను కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇక్కడ కూడా నేను మారాలి. అంటే నేను కాలేజీ లోనే కాదు, ఇంటి విషయాల్లో కూడా మారాలి అనేది నాకు అర్థం అవుతూ వస్తోంది. ఇలాంటి మెమరీ పోటీలు నా విద్యార్థులకు నేను కూడా పెట్టాలి. వారికి డబ్బు పట్ల ఒక గౌరవం ఏర్పడాలి. పొదుపు, మదుపుల అవసరం తెలియాలి. డబ్బు గురించి యుక్త వయసులో అవగాహన రావడం వారి జీవితాలను మారుస్తుంది. కానీ ఈ జెన్ జీలతో ఒక సమస్య ఏమిటంటే దేనిని ఎక్కడ ఆపాలో వారికి తెలియకపోవడం. అది కూడా నేర్పాలి. డబ్బు పరిమితులను కూడా తెలియజెప్పాలి.
చివరగా నాలాంటి కొద్ది మంది గురువులతో కేక్ కోయించారు. ప్రతి అంశాన్ని వీడియో తీస్తూనే ఉన్నారు. బంగారాన్ని నమ్ముకుంటే మీ భవిష్యత్తు బంగారం అవుతుందని ప్రకటించారు. గురువులందరికి ఘన సన్మానం చేసారు. ఒక కానుక ఇచ్చారు. సన్మానం పొందిన వారందరిలో ఏదో ఒక ఆనందం కనిపించింది. నాకు కూడా సన్మానం చేసి మంచి ఘనమైన పట్టు శాలువా కప్పారు. అలా కప్పేటప్పుడు దుకాణం యజమాని “ఈసారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ క్రింద మీ కళాశాల విద్యార్థులకు పుస్తక వితరణ చేయాలి అనుకుంటున్నాం సర్” అన్నాడు. “అలాగే” అన్నాను. అప్పటికే నేను ఒక పరవశంలో ఉన్నాను. ఇన్ని రోజులు నేను చూసిన సన్మానాలు వేరు. ఈ సన్మానం వేరు. ఈ అనుభవం నాకు నేనుగా బోధనా పద్దతిలో చేసుకోవాల్సిన మార్పులను తెలియజేసింది. రేపటి నుంచి నేను తరగతి గదిని అవకాశాల గనిగా మార్చబోతాను. పెట్టుబడి పాఠాలు చెపుతాను. వృత్తిగత మరియు వ్యక్తిగత నైపుణ్యాలు పిల్లలు మెరుగుపరుచుకునేలా బోధిస్తాను. చదువు ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చో నేర్పిస్తాను. పడినా లేవడం ఎలాగో మా విద్యార్థులకు నేర్పిస్తాను.
జీవితం పట్ల ఒక మారిన దృక్పథంతో నగల దుకాణం నుంచీ నూతనోత్సాహంతో బయటకు వచ్చాను. నాలో ఇంత మార్పునకు కారణమైన ఆ బంగారు నగల దుకాణం ఉద్యోగులకు, మేనేజర్‌కు మనస్సులోనే నమస్సులు సమర్పించుకున్నాను. రేపటి నుంచి నా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారం లాంటి బాటలు వేస్తాను. ‘ఇప్పుడు నేనో నడుస్తున్న పరుసవేదిని. I am a Philosopher’s stone in flesh & blood’ అనుకుంటూ, అపరంజి కలలు కంటూ కారులో ఇంటి దారి పట్టాను.
