[దేశరాజు గారు రచించిన ‘అపరిచితుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
(ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించబడుతున్న ‘ఎఫైర్’ అనే కథాసంపుటిలో ఈ కథ చోటు చేసుకుంది.)
మా ఇద్దరికీ మెట్రోలో పరిచయం అయ్యింది. అయితే, అది మీరందరూ తిరిగే మెట్రో రైలూ కాదు, స్టేషనూ కాదు. హోల్ సేల్ రేట్లలో సరుకులు అమ్మే మెట్రో సూపర్ మార్ట్‌లో.
అక్కడ అందరూ షాపింగ్ చేయడానికి వీలుండదు. అది బిజినెస్-టు-బిజినెస్ హోల్‌సేల్ కావడంతో ఒక ప్రత్యేకమైన కార్డు వున్నవారికే అక్కడ అనుమతి లభిస్తుంది. ఇక అది ఒక భారీ గొడౌన్‌ను తలపించేలా వుంటుంది. లోపలకు ప్రవేశించిన దగ్గర నుంచీ అన్నీ ఆఫర్లే. ప్రతీ వస్తువు మీద లెక్కలేనన్ని ఆఫర్లు. ఒకటి ఇంత, రెండు కొంటే ఇంత, మూడు కొంటె ఇంకా తక్కువ ఖరీదులో ఇంత అని ధరలు సూచించే బోర్డులే మొదటగా ఎవరినైనా ఆకర్షిస్తాయి.
నేను ఆ ఆఫర్లన్నీ చూసుకుంటూ, మనసులో లెక్కలు వేసుకుంటూ, దాన్ని నా అవసరంతో బేరీజు వేసుకుంటూ కొనాలా, వద్దా అని ఆలోచించుకుంటూ వున్నా. డ్రై ఫ్రూట్స్ మీద ఆఫర్స్ బావున్నాయనిపించి, రెండుమూడు వెరైటీలు తీసుకుని ట్రాలీలో వేసుకున్నా.
ఇంతలో ఎవరో పలకరించారు. తిరిగి చూశా. ఎవరో అపరిచితుడు. చనువుగా నవ్వుతూ పలకరించాడు.
“ఇవన్నీ క్లియరెన్స్ కోసం పెట్టే ఆఫర్లండీ. అన్నిటినీ నమ్మడానికి వీల్లేదు. కావాలంటే చూడండి. ఏదో భారీ ఆఫర్ అని టూ హండ్రెడ్‌కే ఇస్తున్నామని అన్నాడు. మరి, ఇక్కడ చూడండి. అదే క్వాంటిటీ జస్ట్ వనెయిటీ వుంది” అంటూ మొబైల్ చూపించాడు.
నిజమే. ఆశ్చర్యపోతూ, ట్రాలీలో వేసుకున్నవి తీసి అక్కడ పెట్టేశా. వేరే వస్తువుల చూస్తూ ముందుకు వెళ్లా.
“ఆగండాగండి. అంత స్పీడుగా వెళ్లిపోతే చాలా మిస్సయిపోతారు. ఈ ఫ్లోర్ క్లీనింగ్ వీళ్ల ఓన్ ప్రొడక్ట్. అందుకని బాగా తక్కువ వుంది. తీసుకోండి” అని మళ్లీ ఏమనుకున్నాడో “అఫ్‌కోర్స్ మీకు అవసరమైతేనే” అన్నాడు.
ఒక బాటిల్ తీసుకుని ట్రాలీలో పెట్టుకున్నా. ఇప్పటికీ స్పందించకపోతే బాగోదనిపించి, నా పేరు, వివరాలు చెప్పా. ఆయన కూడా తన వివరాలు చెప్పాడు.
నాకు ఈ షాపింగ్ అదీ అలవాటు లేదని, ఎక్కువగా తనే చేస్తుందని చెప్పా. భార్యతో కలిసి వచ్చినా, ఫోన్ చూసుకుంటూ ఓ పక్కన కూర్చుంటానని చివర్లో కార్డు ఇవ్వడం, బిల్లు తీసుకుని బయటకు నడవడం మినహా ఇంకేం చేయనని కూడా వివరించా.
“ఈ రోజుల్లో అలా వుంటే కష్టమండీ. భార్యతో కలిసి మెలిసి వుండటం అలంకారప్రాయం కాకూడదు. మనం వాళ్లతో స్నేహంగా వుంటే, వాళ్లకెంతో తృప్తిగా వుంటుంది” అన్నాడాయన.
‘అబ్బో.. సందు దొరికింది కదాని, నీతులు చెబుతున్నాడే’ అనుకున్నా. కానీ, నా మనోభావాలతో సంబంధం లేనట్టు అతను మళ్లీ అన్నాడు.
“చాలా మంది మగవాళ్లు కేవలం సంపాదించడం మాత్రమే తమ పని అనుకుంటారు. మిగిలిన పనుల్లో తమకే బాధ్యతలేదన్నట్టు భార్యల మీద వదిలేస్తారు. అవన్నీ సమర్థవంతంగా నిర్వహించడం ఎంత కష్టమో అర్థం చేసుకోరు” అంటూ ఉపన్యాసం దంచాడు.
‘వీడెవడ్రా బాబూ ఇలా తగులుకున్నాడ’ని తలపట్టుకున్నా.
అతను పియర్స్ సిక్స్ సోప్స్ వుండే ప్యాకెట్ తీసుకుని ట్రాలీలో వేసుకుంటూ “శీతాకాలం కదా. తను ఇవే వాడుతుంది స్నానానికి. సాయంత్రం ఫ్రెష్ అవ్వడానికి మాత్రం ఇది వాడుతుంది” అంటూ రోజ్ పాలెట్ సోప్స్ రెండు తీసుకుని ట్రాలీలో వేసుకున్నాడు. మళ్లీ తనే “ఇవి ఆర్గానిక్ దట్ టూ హ్యాండ్ మేడ్” అన్నాడు.
‘ఈయనకి కొత్త, పాత లేదనుకుంట అన్ని విషయాలు చెప్పేసుకుంటున్నాడు’ అనుకున్నా. నేను ఏ సోప్ వాడతానా అని ఆలోచించా. చటుక్కున గుర్తు రాలేదు. ఎప్పుడైనా సోప్ అయిపోతే, తనే పెడుతుంది. నా సోపే నాకు గుర్తు లేనప్పుడు ఇక తనేం వాడుతుందో మాత్రం ఏం గుర్తుంటుంది. దాంతో నేను అయోమయంగా చూస్తుంటే..
“మీరు కూడా ఈసారి ఈ వెరైటీ తీసుకుని చూడండి. మీ మిసెస్ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు” అన్నాడు.
అతడు చెప్పిన సోప్స్ తీసుకుంటూ “నాకు ఆఫీసు పనిలో తెలిసిన మెళకువలు, ఇలాంటి విషయాల్లో అంతగా తెలియవులెండి” అన్నా. ‘నేనేమీ అన్నిట్లోనూ చవటను కాదు’ అని సమర్ధించుకుంటూ.
“అంతేలెండి. మన పనిలో మనం, వాళ్ల పనిలో వాళ్లు ఆరితేరివుంటే సంసారానికి సమస్యే వుండదు” అని నవ్వేశాడు.
మిగిలిన షాపింగ్ కూడా ఇద్దరం కలిసే చేశాం. బిల్లింగ్ అయ్యాక, బయటకు వచ్చి అతడు తన సరుకులను కారులో తెచ్చుకున్న ఖాళీ సంచుల్లో సర్దుకున్నాడు.
నా కారు సర్వీసింగ్‌కు ఇవ్వడం వల్ల, క్యాబ్‌లో వచ్చేటప్పుడు ఖాళీ బ్యాగులు తెచ్చుకోవడం మర్చిపోయా. నాకేం చేయాలో అర్థంగాక దిక్కులు చూస్తుంటే, అతడు మళ్లీ వచ్చాడు.
“ఏంటి బ్యాగ్స్ తేలేదా? పోనీలెండి. లోపలకు వెళ్లి అడిగితే అట్టపెట్టెలు ఇస్తారు. తెచ్చుకుని, సర్దుకుంటే సరిపోతుంది” అని నాతోపాటు తను కూడా వచ్చి అట్ట డబ్బాలు తీసుకుని వచ్చాడు.
వాటిల్లో సరుకులు సర్దుతూ, తన కారులో దింపుతానని బలవంతం చేశాడు. క్యాబ్‌లో వెళ్తానంటే వినేలా లేడు. చేసేది లేక బయల్దేరా.
“మీది సంపూర్ణ, మాది అన్నపూర్ణ-రెండూ ఒకళ్లవే. అన్నదమ్ములన్నమాట. చాలా ఏళ్ల నుంచి వాళ్లు ఈ రియలెస్టేట్ బిజినెస్‌లోనే వున్నారు. మంచి క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ అని పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు అటు మాదాపూర్, గచ్చీబౌలీలో కూడా అన్నీ వీళ్ల వెంచర్సే” అతను చెప్పుకుపోతున్నాడు.
నేను ఆయన వాక్ప్రావాహాన్ని మధ్యలో అడ్డుకుంటూ, “మీ అపార్ట్‌మెంట్స్ రాగానే ఆపేయండి. నేనక్కడ్నించి ఆటో మాట్లాడుకుని వెళ్లిపోతా” అన్నా.
“భలేవారే. అదేంటి? అలా వెళ్లిపోనిస్తే, ఇంకేమైనా వుందా? మా ఆవిడ చంపేయదూ? కాఫీ తాగి బయల్దేరండి. తొందరేముంది” అన్నాడు.
“అయ్యో వద్దండీ. ఇలా ముక్కూ ముఖం తెలియకుండా..” తర్వాత ఏమనాలో నాకు అర్థం కాలేదు.
“ముక్కూముఖం తెలియకపోవడం ఏమిటండీ? కళ్లున్నాయిగా, స్పష్టంగా కనిపిస్తుంటేనూ..” అంటూ పెద్దగా నవ్వాడు.
ఈయన అమాయకుడా లేక మంచివాడా అనేది నేను తేల్చుకోలేకపోయాను. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారాగింది. అడుక్కునే వాళ్లు చుట్టుముట్టారు. అందులో ఒకళ్లు అరచేతులు చరచుకుంటూ, కాస్త గట్టిగా కారు మీద తట్టి డబ్బులడిగారు. అతను వెంటనే అద్దం దించి పది రూపాయలు ఇచ్చాడు. అప్పుడు ‘ఢాం’ అంటూ నా బుర్రలో పెద్ద విస్ఫోటనం సంభవించింది.
‘అంటే, నన్ను నా దారిన వదిలిపెట్టకుండా లాక్కుపోతున్న ఈ మహాశయుడు కొంపదీసి కొ.. కాదు కదా? ఛీఛీ అలా అంటే కోపాలు వస్తాయి మళ్లీ. అనవసరంగా ఇరుక్కుపోయానే’ అనుకోగానే నాలో టెన్షన్ పెరిగింది. వెధవ సరుకులు పోతే పోయాయి, గబుక్కున కారు దిగెద్దామనుకున్నా. కానీ, నా కర్మకొద్దీ ఇంతలో గ్రీన్ లైట్ పడి, కారు కదిలింది.
నా ఆందోళనను పసిగట్టినట్టున్నాడు. “ఏంటో టెన్షన్‌గా వున్నారు. వాళ్లు మన్నేం చేయరండీ.. వాళ్లూ బతకాలికదా, మనలాగా వాళ్లకి ఉద్యోగాలు, పనులూ దొరకవు. అందుకని ఇదో మార్గం” అన్నారాయన.
సమాధానం చెప్పడానికి నా నోరు పెగల్లేదు. డ్రైవింగ్ చేస్తున్న అతడిని పరిశీలనగా చూశా. మామూలుగానే వున్నాడు. లిప్‌స్టిక్‌లు, మేకప్‌లు వున్నట్టు కనబడలేదు. ప్యాంటూ, షర్ట్ కూడా మామూలుగా డిగ్నిఫైడ్‌గానే వున్నాయి. అయినా, వాళ్లు ర్యాలీలు అవీ చేసినప్పుడే అలా విచిత్రమైన డ్రెస్సెస్ వేసుకుంటారేమో? అయినా, అతడి మాటలు వింటుంటే అనుమానించాలని అనిపించడం లేదు. నేనింకా గందరగోళంలో వుండగానే అతడు కారు ఆపాడు.
ఏదో అపార్ట్‌మెంట్‌లో వుంటున్నానని చెప్పిన అతడు, ఓ ఇండిపెండెంట్ హౌస్ ముందు కారు ఆపడం చిత్రంగా అనిపించింది. కారు దిగి, గేటు తెరుచుకుని వచ్చి.. లోపల పార్కింగ్ చేశాడు. ఆశ్చర్యపోతున్న నన్ను చూసి, రెండు చేతులతో సరుకుల సంచులు దించుకుంటూనే, తల ఎగరేసి “అదే మీకు చెప్పిన అపార్ట్‌మెంట్. ముందు అందులోనే వుండేవాడిని. ఇప్పటికీ ఫ్లాట్ వుంది. అద్దెకిచ్చేశా. అక్కడ వుంటే ప్రతీ చిన్న పనికీ అసోసియేషన్ మీద ఆధారపడాలి. లక్షలు పోసి ఫ్లాటు కొనుక్కునేది మనం. పెత్తనమేమో వాళ్లది. అందుకే ఇక్కడే ఇల్లు అమ్మకానికి వస్తే తీసుకుని, మారిపోయా” అన్నాడు వివరంగా.
సరుకుల సంచులు లోపల పెట్టడంలో అతడికి సహాయం చేద్దామనుకున్నా. కానీ, అసలు ముట్టుకోనివ్వలేదు. లోపలకు తీసుకెళ్లి నన్ను హాల్లో కూర్చోబెట్టాడు. ఇల్లంతా ఎంతో శుభ్రంగా మాత్రమే కాదు, చాలా కళాత్మకంగా వుంది. టీపాయ్ మీద గానీ, షోకేసుల్లోగానీ చక్కని బొమ్మలు కొలువుదీరి వున్నాయి. గోడలకు వేళాడుతున్న పెయింటింగ్స్ అబ్‌స్ట్రాక్ట్‌గా వుండి ఏదో పజిల్‌ని ముందుంచుతున్నట్టున్నాయి. ఓ మూల చెట్టు తొలిచి చేసినట్టున్న అల్మారాలో బుక్స్ వున్నాయి. అంత పరిశీలనగా చూడటం బాగోదని అనిపించినా, ఆ వాతావరణం నా అభిప్రాయాలను అధిగమించింది.
ఇంతలో అతను వచ్చి “ఇంకొక నిమిషం పాలు కాగుతున్నాయి. ఇల్లు చూస్తున్నారుగా, లేచి అలా తిరిగి మరీ చూడండి. నేనేమీ అనుకోను. అన్నట్టు ముందే చెబుతున్నానండోయ్.. ఈ ఇల్లు మీకు అందంగా, అద్భుతంగా కనిపించిందంటే అందులో నా ప్రమేయం వెంట్రుకవాసే అనుకోండి. అలంకరణ అంతా ఆమె అభిరుచి మేరకే. దాన్ని పాడు చేయకుండా వుండటమే నేను చేసే ఘనకార్యం” అంటూ పెద్దగా నవ్వాడు.
పాలు గుర్తొచ్చినట్టున్నాయి, అతను లోపలకు వెళ్లాడు. నేను హాలంతా పరికించిన తర్వాత, తెరిచి వున్న బెడ్రూమ్‌లను బయట నుంచే చూశా. అన్నీ బావున్నాయి. నాకు మా ఇల్లు గుర్తుకు వచ్చింది. హాల్లోని సోఫాలో వుతికిన బట్టలు, టీపాయ్ మీద అడ్డదిడ్డంగా రిమోట్లు, టాబ్లెట్టు, బెడ్రూమ్‌ల్లో మడతపెట్టని దుప్పట్లు-రణరంగంలా వుంటుంది. ఏమైనా అంటే ‘అన్నీ ఒక్కదాన్నీ చేసుకు చావద్దూ’ అంటుంది తను. ఆలోచిస్తూనే హాలుకి ఆ చివర వున్న డోర్ దగ్గరకు వెళ్లాడు. అక్కడి నుంచి పెరట్లోకి వెళ్లడానికి తలుపులున్నాయి. వాటికి, బెడ్రూమ్ డోర్‌కీ మధ్య చిన్న గది కనిపించింది. దానికి సింగిల్ డోర్ వుంది. దాని మీదంతా పూలు, లతలతో అందమైన పెయింటింగ్ వుంది. అక్కడికి వెళ్లి నిలబడగానే ఏదో చెడు వాసన గుప్పు మంది. లోపల ఏవో చప్పుళ్లు వినిపించాయి. స్టోర్ రూమ్ అనుకుంట, బహుశా ఎలకలై వుంటాయనుకున్నా.
నేను అక్కడంతా పరిశీలిస్తుండగానే “అక్కడేం చేస్తున్నారు?” అని అరుచుకుంటూ అతడు హాల్లోకి వచ్చాడు. అతడి ముఖంలో సున్నితత్వం మాయమైంది. కంఠం కటువుగా వుంది. కానీ, అంతలోనే సద్దుకున్నాడు. “కాఫీ తీసుకోండి” అంటూ నన్ను వెనక్కి పిలిచాడు.
“ఈ పెయింటింగ్‌లు మా ఆవిడ వేసినవే. ఆ డోర్ మీదది కూడా. సరే, కాఫీ ఎలా వుంది?” అన్నాడు.
నేను ‘బావుందండీ’ అంటుండగానే
“మీరేదో మొహమాటానికి అంటున్నారు. తనుంటే ఇంకా బాగా కలిపేది. అంతేకాదు, మిమ్మల్ని భోజనం చేయకుండా వెళ్లనిచ్చేది కాదు” అన్నాడు చిన్నగా నవ్వుతూ.
‘ఆమె లేరా? ఎక్కడకు వెళ్లారు?’ అని అడుగుదామని నోటి చివరి వరకూ వచ్చింది. కానీ, అడగలేకపోయా.
ఇంతలో అతడే “తను వాళ్ల చెల్లెలింటికి వెళ్లింది. అప్పుడప్పుడు పుట్టింటి వాళ్లను కలుసుకుంటుంటేనే కదా. వాళ్లు మళ్లీ రిజునివేట్ అయ్యేది” అన్నాడు అలాగే నవ్వుతూ.
నా భార్య ఎప్పటి నుంచో తన పుట్టింటికి వెళ్లాలని అడుగుతున్న సంగతి గుర్తుకు వచ్చింది. ఒకసారి నాకు సెలవు లేకపోవడం, మరోసారి తనకు దొరక్కపోవడం. రెండూ కుదిరితే పిల్లలకు ఎగ్జామ్స్. అలా వాయిదా పడుతూ వస్తోంది. ఈయన భార్య ఎంత అదృష్టవంతురాలో. తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని తీర్చిదిద్దుకునే వీలుంది. కావాలనుకున్నప్పుడు పుట్టింటికో, లేకపోతే తన బంధువులింటికో వెళ్లే అవకాశం వుంది. నా ఆలోచనలు బయట పడకుండా మనసులోనే నిట్టూర్చి కాఫీ కప్పు అక్కడ పెట్టి, లేచా.
“ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టా. లేటవుతోంది. ఇక నేను బయల్దేరతా” అన్నా.
“ఇందులో ఇబ్బందేముందండీ. అయినా, మీ శ్రీమతిగారికి ఓ ఫోన్ చేసి ‘లేటుగా వస్తున్నట్టు’ చెప్పి వుండాల్సింది. ఎందుకంటే, ఈ భార్యలున్నారు చూశారూ, వీళ్లకి ఎంతసేపూ ప్రాణాలన్నీ మన మీదే వుంటాయంటే నమ్మండి. సరే, అప్పుడప్పుడు సరదాగా కలుస్తూ వుండండి. దగ్గరే కదా” అన్నాడు కలుపుగోలుగా.
నేను నవ్వి ఊరుకున్నా. అస్తమానూ ‘తిన్నాననీ, తాగాననీ, వస్తున్నాననీ’ ఫోన్లు చేసి చెప్పడం నాకు అలవాటు లేదు. అందుకు తనెంతో నొచ్చుకుంటుంది. ‘కనీసం ఓ మెసేజ్ అయినా పారెయ్యొచ్చుగా’ అని విసుక్కుంటుంది. ‘వీళ్లావిడ మాత్రం అదృష్టవంతురాలు. తన అభిప్రాయాలను గౌరవించే భర్త దొరికాడు’ అనుకున్నా.
అతను రెండడుగులు రోడ్డు మీదకు వేసి ఆటో కోసం చూస్తున్నాడు.
అప్పుడే గమనించా. వీళ్లింటికి ఎదురుగా, రోడ్డుకు అటువైపు ఓ తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నావిడ మా వైపే ఆరాగా చూస్తోంది. ఆమె చూపులు కోపంగా వున్నట్టు కూడా అనిపించాయి.
ఇంతలో అతను ఆటో తీసుకుని వచ్చాడు. కారు లోంచి నా బ్యాగ్‌లు తనే తీసి ఆటోలో పెట్టాడు. ఆటో ఎక్కబోతుంటే “ఒక్క నిమిషం” అని ఆపి “ఓసారి ఇలా రండి” అని ఓ పక్కకు తీసుకువెళ్లి “అలా చూడండి” అంటూ వేలు చూపిస్తూ ఓ మూలగా ఆకాశంలోకి చూపించాడు. “అక్కడ కనిపిస్తోంది కదా, బ్లూ కలర్ బిల్డింగ్. అదే మీది. మీకు అటువైపు మెయిన్ రోడ్ కాబట్టి, ఈ సందులోకి ఎప్పుడూ రావాల్సిన అవసరం పడి వుండదు. దారి గుర్తు పెట్టుకుంటారని చెబుతున్నా” అన్నాడు.
అతడి ఆత్మీయతకు ముగ్ధుడనవుతూ, ఆటో ఎక్కా. ఇలాంటి మంచివాళ్లు ఇంకా వుండబట్టే ఈ కలియుగంలో సైతం సమయానికి ఈ మాత్రమైనా వర్షాలు పడుతున్నాయని అనుకున్నా.
***
అపరిచితుడితో పరిచయం తర్వాత మా ఇంట్లో మార్పు వచ్చింది.
ఇప్పుడు నా భార్య చాలా సంతోషంగా వుంటోంది.
ఎక్కడ తీసినవి అక్కడ పెట్టడం, లేదంటే వెనక వెనకే తిరిగి సర్దడం వంటి పనులన్నీ నా మీదే వేసుకున్నా. అందుకు వీకెండ్స్ పూర్తిగా కేటాయించా. మొదట్లో చాలా పని అనిపించేది. కానీ, నన్ను చూసి పిల్లలు దారిలో పడటంతో నా పని చాలావరకు తగ్గింది.
ఆమెకు టిఫిన్‌కు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు తరిగి ఇవ్వడం; కూరలకు అవసరమైన పప్పుల పొడి లాంటివి మిక్సీలో వేసిస్తే, తిప్పేసి ఇవ్వడం చేస్తుండటంతో ఆమె మొదట్లో ఆశ్చర్యపోయినా, ఇప్పుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది.
ఓ రోజు సరదాగా కూర్చొన్నప్పుడు “నువ్వు కూడా పెయింటింగ్స్ వేయడం నేర్చుకోరాదూ? సరదాగా మన ఇంటి గోడలకు అలంకరించొచ్చు” అన్నా.
తను వెంటనే “అమ్మో” అని గట్టిగా అరిచి “పెయింటింగ్స్ కావాలంటే కొనుక్కోవచ్చులెండి. నా వల్ల మాత్రం కాదు. కానీ, మీకు అభ్యంతరం లేదంటే వీణ నేర్చుకుంటాను” అంది.
ఈసారి అరవడం నా వంతయ్యింది. “వీణ ఇంకా కష్టం అనుకుంటోయ్” అన్నా.
“ఏం కాదు. నాకు చాలా వరకు వచ్చు. మీకు గుర్తుందో లేదో.. పెళ్లి చూపుల్లో కూడా వీణ వాయించా” అందామె సిగ్గుపడుతూ.
నాకు గుర్తులేనందుకు సిగ్గుగా అనిపించింది.
ఇలాంటి ఓ సరదా సంభాషణ సాగుతున్న సమయంలోనే తను అడిగింది “మీలో ఈ మార్పుకు కారణమేంటో? ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తున్నారు”.
అదిగో, ఆ అపరిచితుడు మళ్లీ అలా గుర్తుకు వచ్చాడు. లెక్కలు వేసుకుని చూస్తే అతడిని కలిసి దాదాపు ఏడాది కావస్తోంది. ఎన్నిసార్లు అనుకున్నా, ఆఫీసు పనుల వల్ల కుదరలేదు. ఆ అపరిచితుడితో ముఖాముఖీకి సంబంధించిన వివరాలననీ తనకి చెప్పాను.
ఆశ్చర్యంగా విని “ఈసారి కలిస్తే ఓ ఫొటో పట్టుకు రండి. దండేసి, దణ్నం పెట్టుకుంటా” అంది గట్టిగా నవ్వుతూ.
“నీకు మేలు చేసినవాడిని అలా నిర్దాక్షిణ్యంగా చంపెస్తావా, ఎంత దుర్మార్గం” అన్నా నవ్వుతూ. తనూ మరింత గట్టిగా నవ్వింది.
కానీ, అప్పటికి నాకు కూడా తెలీదు అతడు చనిపోయాడని.
***
తర్వాత తెలిసింది, అతడు చనిపోలేదు చంపేశారని.
తనతో మాట్లాడిన తర్వాత వాళ్లింటికి వెళ్లి, ఆ భార్యాభర్తలిద్దరినీ భోజనానికి ఆహ్వానించాలని అనుకున్నాం. అందుకే ఆ వీకెండ్ వీలు చేసుకుని, పాత దారిని వెతుక్కుంటూ వెళ్లా.
వాళ్లింటికి ఎదురుగా కూరగాయలామె కూర్చుని నన్నే చూస్తోంది. నాకేం అర్థం కాలేదు. ‘ఇన్ని రోజులైనా గుర్తు పెట్టుకుందా?’ అని అనుమానం వచ్చింది. నిజం చెప్పొద్దూ.. ఆ కూరగాయల ఆమెను చూశాకే, ఆ ఎదురిల్లే వాళ్లదని గుర్తుపట్టాను. ఆ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టా. గ్రిల్ డోర్ మాత్రమే వేసి వుంది. ఇల్లు ఇంతకుముందులాగే శుభ్రంగా, అందంగా, కళాత్మకంగా కనిపిస్తోంది. కానీ, ఈసారి కనిపిస్తున్న అందంలో ఏదో జీవం తొణికిసలాడుతున్నట్టు అనిపించిందతడికి. ఇంతలో ఒకావిడ గబగబా బయటకు వచ్చింది.
గంభీరమైన ముఖం, విశాలమైన కళ్లు, వస్త్రధారణలో సింప్లిసిటీ కలిపి బాగా చదువుకున్నావిడని అర్థమవుతోంది.
ఆమె ప్రశ్నార్థకమైన చూపులకు సమాధానం చెప్పలేక, తడబడుతూ “ఆయన..” అని మాత్రం అనగలిగా.
ఆమె తన గాంభీర్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా, వెనక్కి తల తిప్పి హాల్లోకి చూసింది. అక్కడ ఆయన ఫొటోకి దండవేసి వుంది. నేను ఒక్కసారిగా షాకయ్యాను. ‘ఏం జరిగింద’ని అడగాలంటే నేనెవరో చెప్పాలి. అది ఎలా, ఏమని చెప్పాలో అర్థం కాలేదు.
గొంతు పెగల్చుకుని “సారీ” అని మాత్రం అనగలిగా. ఆమె వెనుదిరిగింది. విరబోసుకున్న జుట్టు నల్ల సముద్రంలా వీపు మీద తొణికిసలాడింది. ఇంత అందమైన సంసారంతో ఆ దేవుడు ఎందుకలా చెలగాటమాడాడో అర్థం కాలేదు. కళ్లు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. నీరసంగా వెనక్కు తిరిగిన నాకు, నన్నే కొరకొరా చూస్తున్న కూరగాయలామె కనిపించింది. నెమ్మదిగా అటువైపు నడిచా.
“ఏం గావాల?” అందామె.
“ఏం వద్దుగానీ, ఏం జరిగిందో చెప్పు” అన్నా, ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా.
“ఏం జరుగుతుంది. దొంగముం.. కొడుకు దిక్కుమాలిన చావు సచ్చిండు. పెళ్లామే ఆడిని పొడిసి పొడిసి సంపింది” అని, మౌనం వహించింది.
ఏ గుండెపోటుతోనో, యాక్సిడెంట్‌లోనో పోయాడనుకున్న నాకు ఆమె మాటలు మళ్లీ షాకిచ్చాయి. నాకెందుకో కాళ్లూ, చేతులు లాగుతున్నట్టనిపించాయి. ఆమెకేసి అయోమయంగా చూస్తూ “కొంచెం వివరంగా చెప్పమ్మా” అన్నా.
ఓసారి నా ముఖంలోకి చూసి, లేచి తాను కూర్చొన్న స్టూలు నాకిచ్చింది. ‘నేను ఫర్వాలేద’ని అంటున్నా వినిపించుకోకుండా, రోడ్డు పక్కకు ఇంకో రెండడుగులు వేసి, నోట్లో వున్నది ఉమ్మి, కొంగుతో మూతి తుడుచుకుంది. ఆ పక్కన వున్న కిరాణా షాపులోంచి మరో స్టూలు తీసుకుని నాకు కాస్త దూరంగా వేసుకుని కూర్చుంది.
“మీ మగాళ్లందరిలాగే అనుమానపు నంజికొడుకు. ఈళ్లు ఇంతకుముందల ఆ అపార్ట్‌మెంట్‌ల వుండేటోళ్లు. నేను ఆళ్ల ఇంట్ల పని చేసేదాన్ని. అమ్మను చూసినావుగా, ఎట్టుంది? సిదిమి దీపమెట్టుకునే లెక్క వుందా, లేదా? ఇంక ఊకే ఆమెను కాల్చుకుతినేవాడు. ఆమె భరించుకుంటనే వుండేది. ఈ కొట్లాటల మధ్య సదువులు సక్కగ సాగవని పిల్లలను తల్లిగోరింటికి పంపేసింది. ఈడి పైశాచికత్వం రోజురోజుకీ ఎక్కువైపోయింది. కాలేజీల సదువు చెప్తా, లెక్చర్‌గా పనిచేసేటొమ్మని గొడ్డుని బాదినట్టు బాదెటోడిని మనిషంటారా? ఓ సుట్టు ఇక తిరగబడింది. సానా గొడవైంది. అపార్ట్‌మెంట్‌లోని వాళ్లందరూ జమయ్యారు. ఎప్పటి నుంచో అవకాశం కోసం చూస్తన్నారు. ఇక అందరూ ఆడినే తిట్టేతలికి, దొరబాబుకి ముఖం సెల్లలే. వచ్చి మళ్లీ ఈడ పెట్టినాడు పెంట. ఆమెను ఉద్యోగం మానిపించిండు. బయట తిరక్కుండా, స్టోర్రూముల వెట్టిండు. మళ్లా కనబడినోళ్లందరికీ సానా మంచోడు లెక్క బిల్డప్పులిస్తాడు, బిల్డప్పులు” అని స్టూలు మీంచి లేచి, పక్కకు వెళ్లి గట్టిగా ఊసింది.
‘ఈడియట్.. ఎంత మోసం, ఎంత నటన. ఎంత నమ్మాను గాడిద కొడుకుని’ కోపంగా అనుకుంటుండగా, ఆమె మళ్లీ కొనసాగించింది.
“పని చేసే ఓపిక పోయినంక, ఇగో ఇక్కడ దుకాణం ఎట్టుకున్నా. మా సుట్టుపక్కలోళ్లందరికీ ఆళ్ల కత ఎరుకే. కానీ, మొగుడు పెళ్లాల మధ్య ఎట్టా దూరాలాని వూకే వుండేటోళ్లు. తన గురించి తెలీనోళ్లందరినీ తీసుకొచ్చి, ఆడొక సీరామచంద్రుడు, ఆడి సంసారమొక రామాయణం అన్నట్టు కతలు సెప్పీవోడు. మంచోడనిపించుకోవాలని తాపత్రయం. ఎప్పుడో వారానికి, పది రోజులకు తలుపులు తీసేవోడు. అప్పటి వరకు ఆమె పనులన్నీ ఆ గదిలోనే. మరి ఏటనుకుందో, ఇక ఇసిగిపోయిందో.. ఓసారి కత్తితోని ఏసేసింది. కూరలు తరుక్కునే కత్తితోని ఏటైతాది. కూరగాయలే సక్కగా తెగవు కదా. ఈడకెళ్లి నేనే చూసిన మొదట. ఎబంటే కేకలేసిన. అందరొచ్చినారు. ఆడు ఆయమ్మపై తిరగబడే లోపు అందరూ ఆడ్ని కమ్ముకున్నారు. అదిగో ఆ కొట్లో అటుతిరిగి కూసున్నాడు. ఆడే మొదట ఆడ్ని వాటేసుకుని కదలకుండా పట్టుకున్నాడు. అటెనక అందరూ పనికానిచ్చీసినారు. ఇన్నాల్లంటే అమ్మ కోసరం ఆగినాం. ఇపుడు ఇంకేటి ఆలస్యం” అంది. ఏదో ఘనకార్యం చేసిన సంతోషం, తృప్తి ఆమె ముఖంలో వ్యక్తమవుతోంది.
‘మరి పోలీసులు, కేసులు’ అని అడగాలనుకున్నా. చుట్టూ ఇంతమంది మంచి మనుషులున్నప్పుడు పోలీసుల్లో మాత్రం వుండరా ఏంటనిపించింది. ‘ఛ.. అప్పుడు వుండి వుంటే, చెత్త నా కొడుకుని నేను కూడా కసకసా రెండు పోట్లు పొడిచేవాడిని’ అనుకున్నా.
ఇల్లు సమీపిస్తుంటే కొత్త సమస్య వచ్చిపడింది. అతడి వల్లే తన సంసారం కొత్త పుంతలు తొక్కిందని సంతోష పడుతున్న నా భార్యకు వాడి అసలు స్వరూపం గురించి చెప్పాలా, వద్దా అని?
ఎందుకైనా మంచిది, ఆ అపరిచితుడిని అపరిచితుడిలానే వుంచేయడం మేలనిపించింది.
దేశరాజు చక్కని కవి. సంక్లిష్టమయిన భావాలను సరళంగా లలితంగా కవితల్లో ప్రదర్శిస్తారు. జర్నలిజం వృత్తి అయినా కవితలల్లటం ప్రవృత్తి.
