Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అప్పట్లో.. నా స్వగతంలో స్వరకోకిల..

[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీ మహేష్ ధూళిపాళ్ళ.]

ఒక సినీ సంగీత దర్శకుడు, ఒక గాయని లేదా గాయకుడు.. ఇలా సినీరంగంలో లబ్ధప్రతిష్ఠులైన వారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారు స్వరకల్పన చేసిన లేదా పాడిన పాటలను గురించి, వాటి ప్రత్యేకత గురించి, వాటిలో వారు చేసిన కృషి గురించి చెప్పుకుంటూ పోవడం సర్వసాధారణంగా జరిగే పరిణామక్రమం. ఆ క్రమంలో వేర్వేరు సంగీత ప్రక్రియల మీద పట్టు ఉన్నవారు వాటిని ఆసరాగా చేసుకొని ఆ ప్రముఖుల ప్రత్యేకత గురించి ప్రధానంగా జరుగుతుంటుంది. ఇవేమీ తెలియని నాలాంటి పామర సినీప్రేక్షకుడు ఏదైనా రాయలనుకున్నప్పుడు స్వగతమే పెద్ద దిక్కు అవుతుంది. ఇటీవల దివంగుతలైన ప్రముఖ సినీగాయని ఎస్.జానకిగారి గురించిన నా వ్యాసానికి నేను దానినే ఆలంబనగా చేసుకున్నాను.

చిన్నప్పుడు, మద్రాసులో ఉన్నప్పుడు అమ్మ ఒడిలో కూర్చొని సినిమా హాలులో చూసిన ‘అన్నకిలి’ తమిళ సినిమా నాకు ఇప్పటికీ లీలామాత్రంగా గుర్తుంది. సంగీతదర్శకుడిగా ఇళయరాజాగారికి అది మొదటి సినిమా. ఆ సినిమాలో పాటలు ప్రజాదరణ పొందాయి. జానకిగారు ఆ సినిమాలో సింహభాగం పాటలు పాడారు. అలా మొదటిసారిగా ఆమె స్వరం వినే అవకాశం నాకు దక్కింది. అయితే ఆ పాటలు పాడింది ఆమేనని అప్పట్లో నాకు తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఆ తర్వాత మా నాన్నగారికి ఉద్యోగరీత్యా సింగరాయకొండకు బదిలీ కావడం.. ఆ ఊరిలో మా ఇంటికి ఎదురుగా ఉన్న రామకృష్ణ టాకీసులో ‘పదహారేళ్ల వయసు’ సినిమాను మా అమ్మతోనే చూశాను. అందులో ‘సిరిమల్లె పూవా’ పాటలో లేగదూడలు, పచ్చటి పొలాలు, అంత పెద్ద చెట్టుకు ఊయల కట్టుకొని ఒక అమ్మాయి ఊగడం నన్ను ఆకట్టుకున్నాయి. ఆ పాట గురించి అందరూ తెగ మాట్లాడుకోవడం విన్నాను.

సరిగ్గా ఆ కాలంలోనే మా ఇంట్లోకి రేడియో అడుగుపెట్టింది. జనరంజని, చిత్రసీమ, ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం, సంక్షిప్త శబ్ద చిత్రం, మరో అరగంటలో ఆవాల్టికి ప్రసారాలు పూర్తవతాయనగా రాత్రి పదిన్నరకు ప్రత్యేక పాటల కార్యక్రమం వంటి చలనచిత్రాలకు, వాటిలో గీతాలకు పెద్ద పీట వేసే కార్యక్రమాలు నా చెవినపడ్డాయి. అలాంటి కార్యక్రమాల్లో పాట వివరాలను సింహభాగం పాట మొదలు కావడానికి ముందే ప్రకటించేవారు పాటను సమర్పించే వ్యాఖ్యాతలు. అయితే అప్పుడప్పుడు పాట అయిపోయాక కూడా వివరాలు వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగని రేడియోకు అతుక్కొనిపోయి వినేంత వయస్సు, ఆసక్తి నాకు ఏర్పడని కాలమది. అలా వింటూ ఉండగా, మరికాసేపట్లో బడికి బయలుదేరుతాననగా “ఇప్పుడు చూద్దాం.. తనన తనన తన్న” అని వినిపిస్తున్న పాట దగ్గర ఆగిపోయాను. భలే ఉందే.. అనుకుంటూ వింటూ విడిపోయాను. పాట మొత్తం వినేసరికి మాటలలో చెప్పలేని అనుభూతి నన్ను ఆవరించింది. “ఆకలి రాజ్యం చిత్రానికి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్” అని పాట సమర్పకులు ప్రకటించడంతో అలా మొదటిసారిగా ఆమె పేరును వినడం ద్వారా ఆమె పాటను, గళాన్ని గుర్తుపెట్టే అభ్యాసాన్ని మొదలుపెట్టాను.

అప్పుడే మా కుటుంబం అంతా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాం. కొండ నుంచి కిందకు దిగిరాగానే తిరుపతిలో ‘కార్తీకదీపం’ సినిమాను మేమంతా చూశాం. ఆ సినిమాలో ‘ఆరనీకుమా ఈ దీపం.. కార్తీకదీపం’ పాటను ఇద్దరు పాడితే అందులో జానకిగారి గళాన్ని ఇట్టే గుర్తుపట్టేశాను. ఆ క్షణంలో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినంతగా ఆనందపడిపోయాను. ఆ తర్వాత మా నాన్నగారికి తెనాలి బదిలీ కావడంతో మా కుటుంబమంతా అక్కడికి వెళ్లిపోయాం. అప్పుడే అక్కడ ప్రియా టాకీస్లో ఉదయం ఆటలు మాత్రమే ప్రదర్శించే ‘మౌనగీతం’ సినిమా చూశాను. అందులో ‘పరువమా.. చిలిపి పరుగు తీయకూ..’ పాట నాకైతే విపరీతంగా నచ్చేసింది. జానకిగారు ఆమె గళంతో చేసిన భావవ్యక్తీకరణలు నన్ను కట్టిపడేశాయి. అదే పట్టణంలో ‘సప్తపది’ సినిమా చూస్తున్నప్పుడు ‘గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లనా’ పాటలో పసిపిల్లవాడికి ఆమె తన స్వరాన్ని అరువిచ్చిన వైనాన్ని వింటూ అబ్బురపడిపోయాను.

ఒంగోలు, బాలకృష్ణ టాకీసులో ‘శ్రీవారి శోభనం’ సినిమా చూస్తున్నప్పుడు ‘అలకపానుపు ఎక్కనేల’ పాట కోసం బామ్మ, మనవరాలికి ఆమె స్వరమాయజాలాన్ని అనుభూతించాను. అదే ఒంగోలులో రైల్వే స్టేషను దగ్గర ఉన్న సినిమా హాలులో, క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘మయూరి’ సినిమాలో ‘ఇది నా ప్రియ నర్తన వేళ.. తుది లేనిది జీవన హేల’ అంటూ కృత్రిమ కాలుతో, నూతన ఉత్సాహంతో శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేస్తున్న సుధారామచంద్రన్‌ను తెరమీద చూస్తున్నప్పుడు జానకి గారి గొంతు ఆ సందర్భానికి జీవం పోసింది. బీవీఎస్ టాకీసులో ‘ప్రతిఘటన’ సినిమా చూస్తున్నప్పుడు, ‘ఈ దుర్యోధన దుశ్శాసన  దుర్వినీత లోకంలో’ పాట వచ్చినప్పుడు, ఆమె గళం పలికించిన రౌద్రం, ఆవేశం, ఆవేదన థియేటర్లో ఉన్నవారిని నిశ్చేష్టులను చేయడం నాకు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతోంది.

చిలకలూరిపేటలో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు, మంగా టాకీసులో నేను చూసిన ‘మౌన పోరాటం’ సినిమాకు జానకిగారు తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అందులో పాటలన్నీ దాదాపుగా మాధుర్యభరితమై ఉండటం విశేషం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చెన్నయ్లో రైలు ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు రాయడానికి వెళ్లినప్పుడు, ఉదయం సినిమాస్ కాంప్లెక్స్లో తమిళ సినిమా ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చూస్తున్నప్పుడు, పల్లె పడుచుగా ప్రముఖ సినీనటి రేవతి గారి అభినయంలో,  ‘ఇంజి ఇడుప్పళగా.. మంజ చెవప్పళగా’ అంటూ జానకిగారి పాట వింటున్నప్పుడు, అప్పటివరకు తీవ్రమైన భావోద్వేగాలతో సాగుతున్న సినిమా నడక ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయినట్టుగా నాకైతే అనిపించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే నా స్వగతంలో ఆమెకు చెందిన విశేషాలకు పేజీలు సరిపోవు. ఈ సందర్భంగా జానకిగారితో అద్భుతమైన పాటలను పాడించుకున్న రమేష్ నాయుడు, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకులను, ఆ పాటలకు మంచి సాహిత్యాన్ని అందించిన ఆచార్య ఆత్రేయ, వేటూరి, తదితర ప్రముఖ గీత రచయితలను గుర్తు చేసుకోవడం సముచితం.

Exit mobile version