Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాజాల్లాంటి బాజాలు-38: అప్పట్లో…

ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.

“ఈ రోజుల్లో పిల్లలకేం చెప్పలేమండీ, మన కన్నా తెలివిగా మాట్లాడుతున్నారు…” అనే మాట మనం చాలా సార్లు వింటూనే వున్నాం. ఈ రోజుల్లో అంటే ఇదివరకటి రోజుల్లో పిల్లలు యిలా లేరా అంటే లేరనే చెప్పుకోవాలి. పెద్దవాళ్ళేదైనా చెయ్యాలని చెపితే చేసేసేవాళ్లం తప్పితే “ఎందుకు చెయ్యాలీ! చెయ్యకపోతే యేమౌతుందీ!” అని ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఇప్పటి పిల్లల తెలివితేటలు అప్పుడే మాకుండుంటే అని ఆలోచిస్తుంటే నా చిన్నతనంలో జరిగిన విషయం ఒకటి గుర్తొచ్చింది.

ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదుర్చుకుందుకు మాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లేని రోజులు. కుటుంబం, సాంప్రదాయం చూసి పెద్దలే మూడొంతులు కుదిర్చేస్తే నామకః పెళ్ళిచూపులు జరిగే రోజులవి. కూతురికోసం తండ్రి మంచి చదువూ, ఉద్యోగం వున్న అబ్బాయినే చూసేవాడు. పిల్ల నిచ్చేటప్పుడు ఆ కాసిన్ని వివరాలతో సంతృప్తి పడేవారుకాదు ఇంట్లో ఆడవాళ్ళు. పెళ్ళికూతురి అమ్మమ్మ, నాన్నమ్మ, మేనత్తలూ, పిన్నిలూ కూడా ఆ అబ్బాయికి దురలవాట్లేమైనా వున్నాయో లేదో వాకబు చేసేవారు. అలాగని వీళ్ళు అలా పెళ్ళికొడుకు గురించి వాకబు చేస్తున్నట్టు మగపెళ్ళివారికి తెలీకూడదు. తెలిస్తే మళ్ళీ పౌరుషాలు నిద్ర లేస్తాయి. అందుకని ఈ ఆడాళ్ళు మగపెళ్ళివారి చుట్టాల్లో ఎవరైనా ఒక చిన్నపిల్లని కానీ, చిన్నపిల్లాణ్ణి కానీ పట్టుకునేవారు. పిల్లలు అబధ్ధం చెప్పరు కదా! ఆ పిల్లాడికి ఏమైనా దురలవాట్లు కానీ, చెడు సావాసాలు కానీ వుంటే ఈ పిల్లలు చెప్పేసేవారు. అంతే.. దెబ్బకి సంబంధం కాన్సిల్ చేసి పడేసేవారు.

ఆ ఆడంగులు వాకబు చేసేది కూడా ఎంత చాకచక్యంగా చేసేవారో! అలాంటి ఒకానొక సందర్భంలో నేను బలైపోయాను వాళ్లకి. అప్పుడు నాకు ఎనిమిదేళ్ళుంటాయేమో. మా చుట్టాలింట్లో పెళ్ళికి వెళ్ళేం. అందరు పిల్లల్తోటీ పందిట్లో స్తంభాలాట ఆడుకుంటూంటే ఎవరో పెద్దావిడ నన్ను చెయ్యెత్తి పిలిచేరు. ఎందుకోనని వెళ్ళేను. బోల్డుమంది చుట్టాలు ఇంటికొస్తే అన్నం వండే మా ఇంట్లో పెద్ద బొండాం గిన్నెలా ఉందావిడ. ఆవిడకి అటూ ఇటూ యింకో యిద్దరాడాళ్ళున్నారు. సైజులో ఈవిడతో సమానంగానే వున్నా ఆవిడకన్న కుంచెం నల్లగా వున్నారు. నన్ను పిలిచినావిడ నా చేతిలో ఒక మిఠాయుండ పెట్టి “తిను..” అంది. నేను దాన్ని నోటిదాకా తీసికెళ్ళేలోపల పందిట్లో కుర్చీల్లో కూర్చున్నవాళ్లని చూపిస్తూ, “ఆ చారలచొక్కా అబ్బాయి నీకేమవుతాడూ!” అంది.

“మా పెద్దనాన్నగారబ్బాయి. అన్నయ్యవుతాడు.”

“అతని కేమైనా అగ్నిహోత్రం ముట్టించే అలవాటుందా!”

అగ్నిహోత్రమంటే అగ్గిపుల్లేకదా అనుకున్న నేను, “ఒక్క అన్నయ్యేవిటీ ఇంట్లో అందరూ ముట్టిస్తారూ..” అన్నాను.

వాళ్ళు ముగ్గురూ తెల్లబోయేరు. వెంటనే ఇటు పక్కావిడ కాస్త ముందుగా తేరుకుని, “మీ అన్నయ్యకి తీర్థం పుచ్చుకునే అలవాటుందా!” అనడిగింది.

ఇదేవిటీ ఇంత పెద్దవాళ్ళకి ఆమాత్రం తెలీదా, ఇలాంటి ప్రశ్నలడుగుతున్నారూ అనుకున్న నేను, “ఇంట్లో అందరూ తీర్థం తీసుకుంటారూ..” అన్నాను.

వెంటనే ఇంకోపక్కనున్నావిడ “అలాంటి ఇంట్లో పిల్లనెలా యిస్తాం వదినా..” అంది.

ఆ లోపల మా సీతపిన్ని అటు వెడుతూ నన్ను వీళ్ళ దగ్గర చూసి అగింది.

“ఏవిటండీ సీతగారూ, పిల్లాడు బుధ్ధిమంతుడన్నారు. తీరాచూస్తే అతనికి అగ్నిహోత్రం, తీర్థం అన్ని అలవాట్లూ ఉన్నట్టే ఉన్నాయీ.” అని దీర్ఘం తీసింది బోండాం గిన్ని.

“ఎవరు చెప్పేరు మీకూ!”

“ఇంకెవరూ! ఈ పిల్లే.. ఈ పిల్లకి వరసకి అన్నగారవుతాడటగా. అతనే కాదు. ఇంట్లో అందరూ అలాంటివాళ్ళేట..”

సీతపిన్ని నన్ను చూసి, “అయ్యో, అది చిన్నపిల్లండీ. దానికి వాటి అర్ధాలు తెలీవు, అందుకని అలా చెప్పింది.”

నాకు పౌరుషం పొడుచుకొచ్చింది. నా అంతదాన్ని నేనయ్యాక చిన్నపిల్లంటుందా అనుకుంటూ, “మనం రోజూ ఇంట్లో అగ్గిపుల్లలు వెలిగించమా, పూచ్చేసి తీర్థం తీసుకోమా!” అనడిగేను పిన్నిని.

సీతపిన్ని పకపకా నవ్వుతూ, “నీ మొహం, వాళ్ళు అగ్నిహోత్రమన్నది మీ అన్నయ్యకి సిగరెట్టు అలవాటుందా అనీ, తీర్థమన్నది తాగుడలవాటుందా అనీ తెల్సుకుందుకు. వీళ్ళమ్మాయిని వాడికిచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నారు. అలాంటి అలవాట్లుంటే పిల్ల నివ్వరుగా. నువ్వవన్నీ ఉన్నాయని చెప్పేవు, అందుకని అలా అంటున్నారు.” అని విడమరిచి చెప్పింది. అంత గొప్ప విషయాలన్నీ అప్పట్లో నాకు తెలీనందుకు ఎంత సిగ్గేసిందో..

అదే ఇప్పటి పిల్లలయితేనా. ఆ బోండాంగిన్నెకి సరైన సమాధానం  చెప్పేవారు. హూ ఎన్ననుకుని ఏం లాభం! ఇప్పటి పిల్లలు పిల్లలుకాదు…నిజంగా పిడుగులే.. వాళ్ళకి తెలీని విషయం లేదు కదా!

Exit mobile version