Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరుద్ర సినీ గీత వైభవం!-2

[శ్రీ కుంతి రచించిన ‘ఆరుద్ర సినీ గీత వైభవం!’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ భాగం.]

ప్రణయ గీతాలు:

“గడ్డం సరసానికి అడ్డమా” అంటూ చమత్కరించే ఆరుద్రలో ఒక మంచిప్రణయ,శృంగార కవి ఉన్నాడు..

పైగా “ఏమిటీ గడ్డం?” అని ఎవరో అడిగితేనవ్వేసి, ‘నానృషిః కురుతే కావ్యం’ అని చమత్కరించారట ఆరుద్ర గారు.

ఇక వారి పాటల్లో ప్రేయసీ ప్రియుల ప్రణయం సున్నిత శృంగార మధురంగా ఆహ్లాద భరితంగా ,భావస్పోరకంగా ఉంటూ శ్రోతలను,ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగులుస్తాయి.

తెలుగు సినిమాలలో ప్రణయ గీతాలు అంటే మొదటి పదిలో ఉండేది..

‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో.. కొండ‌గాలి తిరి‌గింది−‌ గుండె‌ ఊ‌సు‌లా‌డిందిగోదావరి పడవలాగా కోరిక చెలరేగింది..అన్న పాట .. అది చూద్దాం.

ఉయ్యాల జంపాల:

కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికిందీ… గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడిందీ పట్టరాని లేత వలపు పరవశించి పాడింది
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందీ. నాగమల్లి పూలతో నల్లని జెడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది

కన్నెపిల్ల వయ్యారంగా నడుం ఊపుతుంటే,అంతకంటే వయ్యారంగా వాలుజడను అటూఇటూ ఆడిస్తుంటే, అరనవ్వు నవ్వుతూ పంటకాలవ గట్టున నడిచివెళుతుంటే ప్రియుని మదిలో గోదావరి వరదలాగా కోరికచెలరేగడం.. కవిత్వం వరదలా పొంగడం ఖాయం .

గోదారి పొంగు.. కన్నెపిల్ల ఈడు ఆగనిది.. గోదారి సముద్రం లోకలవాలి.. కన్నెపిల్ల ఈడు తోడైన వాడితో కలవాలి.. ఆ కన్నె పిల్ల వలపులో ప్రియుడుపడితే పట్టరాని లేత వలపు పరవశించి పాడుతుంది..

ఈ సుందర భావాలు.. ఈ పాటకు ప్రాతిపదికలు.

పాట లో ప్రతీ వాక్యం రసాత్మకంగా సాగుతుంది.. ‘పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది’ వంటి వినూత్న పదప్రయోగాలతోను; ‘పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది’, ‘నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది’ లాంటి హృద్యమైన అభివ్యక్తితో.. ‘ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది’ అనే వేదాంత ధోరణితో ముగుస్తుంది.

అయితే ఈ పాట చివరలో ప్రాప్తమున్న తీరానికి పడవసాగిపోవడం అన్న నెగిటీవ్ భావం ఏమిటి? అది వేదాంతమా? అన్నీ వలపులు సుఖాంతం కావు అన్న సందేశమా? ప్రాప్తము ఉంటేనే వలపు దక్కుతుంది అన్నది సూచననా? ఏది ఏమైనా.. ఈ గీతం నాటికీ నేటికీ సుందరసుకుమార ప్రణయ భావసమాహారం అని చెప్పవచ్చును.

‘ఈడూ−‌జోడూ’ ఇదేమి లాహిరి ఇదేమి గారడి -ఎడా‌రి‌లోన పూలు పూచి ఎంత సందడి..

‘ముత్యాలముగ్గు’ – ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు-గూటి పడవలోనున్నది కొత్త పెళ్లి కూతురు..

ఇది సినారె గీతం అని చాలా వ్యాసాలలో ఉన్నా ఉన్నా, ఖచ్చితంగా ఇది ఆరుద్ర గారి గీతమే. బాపూ గారి సినిమా కాబట్టి ,శైలిని బట్టి ఇది ఆరుద్ర గారిదని కూడా చెప్ప వచ్చును.

ఏదో ఏదో అన్నది.. ఈ మసకవెలుతురు .. గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు.

చరణం 1:
ఒదిగి ఒదిగి కూచుంది.. బిడియపడే వయ్యారం.. ముడుచుకునే కొలది మరీ మిడిసి పడే సింగారం..
సోయగాల విందులకై.. వేయి కనులు కావాలీ..

చరణం 2:
నింగిలోని వేలుపులు.. ఎంత కనికరించారో.. నిన్ను నాకు కానుకగా.. పిలిచి కలిమి నొసగేరూ
పులకరించు మమతలతో.. పూల పాన్పు వేశారూ..

ఈ పాటలో.. మసక వెలుతురు.. గూటి పడవ.. బిడియపడే వయ్యారము.. మిడిసి పడేసింగారము.. వంటి పద ప్రయోగాలు వారికే చెల్లు.

‘బందిపోటు’ – ఊహలు గుసగుసలాడే.. నా హృదయం ఊగిలసలాడే.. ఈ గీతంలో పల్లవి ఎంత సుందరమో.. ఈ చరణం కూడా అంతే సుందరం..

వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు

‘వీరాభిమన్యు’ – రంభా ఊర్వశి తలదన్నె రమణీలలామ ఎవరీమె.. మరియు.. అదిగో నవలోకం వెలసే మనకోసం..

‘ప్రేమలేఖలు’ – ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి నా ఊహల జాబిలి రేకలు కురిపించెను ప్రేమలేఖలు..

‘వయసు పిలిచింది’

-జీవితం మధుశాల యౌవనం రసలీల రేపటి మాటేల – నమ్ముకో యీవేళ
పెదవే మధుకలశం.. అందుకో ప్రేమ రసం .. అందమే నీకు వశం.. చిందుకో వుల్లాసం
వచ్చిందీ మధుమాసం.. నేడే నీకోసం..జీవితం నీకు వరం.. చేరుకో సుఖతీరం
నాబిగి కౌగిలిలో.. రాసుకో శృంగారం.. జీవితం నీకు వరం.. చేరుకో సుఖతీరం
-ఇలాగే ఇలాగే సరాగమాడితే వయారము ఈ యవ్వనమూయలూగితే..

లాంటి పాటలు నాటికి నేటికీ రసమయ హృదయ ప్రేక్షకుల హృదయ శృంగార జలధిలో ఓలలాడుతూనే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? అన్న పాట.. రకరకాల సందర్భాలలో జనుల నోళ్ళల్లో ఇల్లు కట్టుకున్నది. నాయకుడిని సంపూర్ణంగా విశ్వసిస్తూ, తనను తాను అర్పించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలియ చేసే ఈ గీతం అప్పట్లో సంచలనం..

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా?

పాటలు సమాజంలో నుండి పుడతాయి. సమాజం పాటల నుండి స్ఫూర్తి పొందుతుంది, సామాన్య పాఠకుడు నన్నయ, అల్లసానివంటి వారి కవిత్వం నుండి వారి వారి జీవితాల్లో జరిగే సంఘటనలను పోల్చుకోరు.. వారు తమ ఆప్త భావాలను, ఉద్వేగాలను సినిమా పాటలతో ఐడెంటిఫై చేసుకుంటారు.

80వ దశకంలో ఈ పాట చాలా పాపులర్. ఒక రచయితను ప్రేమించి, మోసపోయి.. ఆత్మహత్య చేసుకున్న ఒక పాఠకురాలు తన డైరీలో ఈ పాటను రాసుకుంది.. దీనిని బట్టి పాట సామాన్యుని జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పవచ్చును.

వీరు ప్రణయ గీతాలతో పాటు అందమైన విరహ గీతాలు కూడా రచించారు.

‘మల్లెపూవు’ చిత్రంలో
ఓ ప్రియా – మరుమల్లియ కన్నా తెల్లనిది కన్నా – మకరందంకన్నా తీయనిది
మనప్రణయం అనుకొని మురిసితిని – అది విషమని చివరకు తెలిసినది
నీవెంతటి వంచన చేశావు – సిరిసంపద కమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం నిను విడవదులే నా హృదయం
తాలి పేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు-
చెలరేగిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదులే

ఈ పాత కొంచ ఆత్రేయ గారి శైలికి దగ్గరగా ఉంటుంది

చీరల పాటలు:

వీరి పాటలు చాలా వరకు ప్రతీకాత్మకంగా, అన్యాపదేశంగా భావాన్ని వ్యక్తపరుస్తాయి.

ఆరుద్ర చీరల మీద రాసిన రెండు పాటలు – ‘తూర్పుకు వెళ్ళే రైలు’ లో “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ” అయితే, మళ్ళీ ‘పెళ్ళి పుస్తకం’లోదే “సరికొత్త చీర ఊహించినాను” అనే పాట. ఈ రెండు చీరల పాటలే. ‘తూర్పు వెళ్ళే రైలు’ సినిమాలో నాయకుడు కవి కాబట్టి, ‘చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ – బొట్టూ కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి..’ అనే పాటలో.. పాటంతా రకరకాల చీరల్లో ఆమె సొగసుల్ని పొయెటిక్‌గా వర్ణిస్తాడు. అలాగే నాయిక పల్లెటూరి యువతి తన ఆశలను, కలలను పంచుకుంటూ ఉంటుంది. ఆమె సాధారణ జీవితం నుండి బయటపడి కొత్త ప్రపంచాన్ని చూడాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తుంది.

ఇది ప్రత్యక్ష తిరుగుబాటు కానప్పటికీ, సంప్రదాయ పరిధులను దాటి ఆలోచించే స్త్రీ మనస్తత్వాన్ని చూపుతుంది.

‘పెళ్లిపుస్తకం’ సినిమాలో.. ‘సరిగంచు చీర’ పాటలో హీరో డిజైనర్‌. ‘ఇది యెన్నో కలల కలనేత’ అంటాడు. ఈ పాటలో ఎక్కువగా చీర నిర్మాణం గురించి, ఆమె స్వభావం గురించి ఉంటుంది. ఈ రెండూ మంచి పాటలే.

తూర్పు వెళ్ళే రైలు:

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మచుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళువంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూచుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

పెళ్లి పుస్తకము:

సరికొత్త చీర వూహించినాను సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత పడుగుపేకా – చీరలో చిత్రించినాను ఇది ఎన్నో కలల కలనేతా –
ఇది నా వన్నెల రాసికి సిరి జ్యోతా.
ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు ముల్లూ వాసనా ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకూ ఒక అందం
నీ అందాలన్నీ కలబోశా.. నీ కొంగుకు చెంగును ముడివేస్తా
చురచుర చూపులు ఒకమారు నీ చిరుచిరు నవ్వులు ఒకమారు
మూతివిరుపులు ఒకమారు నువు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువు ఏ కళనున్నా మాబాగే ఈ చీర విశేషం అల్లాగే

ఆత్రేయ గారు రాసిన చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. వేటూరి రాసిన అరుణము అరుణము ఒక చీర పాటలతో పోలేస్తే ఆరుద్రగారి పాటల్లో సాహిత్యపు బరువు ఎక్కువే అని చెప్పవచ్చు.

స్నేహము -బాల్యపు ఆనవాళ్ళ గీతం:

ఆత్రేయ రాసిన ‘ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఆ రోజులు మునుముందిక రావేమిరా.. ఆనాటి స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురము ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం’ అన్న పాట.. ‘స్నేహమేరా జీవితం..’ అన్న సినారె పాటలు స్నేహ గీతల్లో ప్రసిద్ధమైనవి.

‘స్నేహం’ చిత్రంలో..

ఎగరేసిన గాలిపటాలు దొంగాటా దాగుడుమూతలు-గట్టు మీద పిచ్చుక గూళ్లు కాలువలో కాగితం పడవలు గోలీలు గోటీబిళ్ల ఓడిపోతే పెట్టిన డిల్లా- చిన్ననాటి ఆనవాళ్లు స్నేహంలో మైలురాళ్లు.
పడగొట్టిన మామిడికాయ పొట్లంలో ఉప్పూకారం– తీర్థంలో కొన్న బూరా… కాయ్ రాజా కాయ్…
దసరాలో పువ్వుల బాణం దీపావళి బాణసంచా.. చిన్నప్పటి ఆనందాలు చివురించిన మందారాలు
నులివెచ్చని భోగిమంట మోగించిన గుడిలో గంట.. వడపప్పు పానకాలు పంచుకొన్న కొబ్బరిముక్కా
గోడ మీద రాసిన రాతలు జీడితో వేసిన బొమ్మలు.. చిరిగిపోని జ్ఞాపకాలు చిత్త స్వాతి వానజల్లులు.

పాటను గమనిస్తే ప్రతి వ్యక్తికి తన బాల్యం గుర్తుకు వస్తుంది. తెలుగు పిల్లవాడి జీవన విధానం కళ్ళముందుంచుతుంది.

ఈ పాట తరువాత వచ్చిన “గుర్తుకొస్తున్నాయి” వంటి పాటలకు బాలశిక్ష వంటివి.

స్త్రీవాద కవి:

ఆరుద్ర తన గీతాల్లో స్త్రీని బలమైన వ్యక్తిగా చూపుతారు. వీరి పాటల్లో స్త్రీ స్వాతంత్ర్యం వంటి అంశాలు మనల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి. మగవాళ్ళు ఎన్నటికీ ఆడవాళ్ళ హృదయ రహస్యాలను తెలుసుకోలేరని చెబుతూ,

“ఆకాశమున ఎగరనిమ్ము, అణువు గుండెలు చీల్చనిమ్ము, లోకాలు కనిపెట్టనిమ్ము, లోకేశునే గెలవనిమ్ము, లోగుట్టుతెలుసుకోననిమ్ము, ఏ కాలమందూమగవాడు, ఇంతి హృదయము అరయలేడు” అంటాడు.

పిన్ని– సినిమాలో “ఆడజన్మకు కంటినిండ నిదుర రెండుసార్లేనమ్మా.. అన్నె మెరుగని బాలప్రాయమున తొలిసారి.. అన్నీ ముగిసిన అవసానకాలాన కడసారి.. అలసిన నీ బ్రతుకు ఆవలించగనే కనరాని నిదురే కనికరించేను..” నిదుర పోని తన పాపకు జోలపాడుతూ స్త్రీల జీవితం లోని వివిధ దశలను వివరిస్తుంది తల్లి. స్త్రీలకూ విశ్రాంతి యెంత అవసరమో తెలుపుతుందీ పాట.

పిన్ని- సినిమాలోనే “ఏడవకు ఏడవకు వెర్రినాతల్లీ ఏడిస్తె నిన్నెవ్వరెత్తుకుంటారు, వేళగాని వేళ వియ్యాలవారు, అందాలతల్లిని అడగవచ్చారు, తాళజాలనివారు తరలివచ్చారు..”

అంటూ ఆనాటి స్త్రీల కట్టుబాట్లను, వివాహ వ్యవస్థ తీరు తెన్నులను వివరిస్తారు.

కన్నె మనసులు – సినిమాలో “ఓహో తమరేనా చూడవచ్చారు చూసి ఏం చేస్తారు.. సంతలోని జంతువును కాదు సుమీ, వంటయింటి కుందేలును అవను సుమీ…” అంటూ తిరుగుబాటు ధోరణిని ప్రకటిస్తుంది.

ఇక అసలు విషయానికి వద్దము.. ఆరుద్ర కేరాఫు అంత్య ప్రాస

అంత్యప్రాసా ముద్రుడు..

దాదాపు వారి ప్రతీ పాటలో అంత్యప్రసాలు ఉంటాయి. ఆప్రాసల వల్ల భావం మరింత మెరుగుపడుతూ మురిపిస్తుంది.

ఇంటిగౌరవం:

చింతపువ్వు ఎరుపు చిలక ముక్కు ఎరుపు- చేయి చేయి కలుపు లేత వలపు తెలుపు-
మల్లెమొగ్గ తెలుపు మంచిమనసు తెలుపు- చేయి చేయి కలుపు నిండు వలపు నిలుపు-

ఉయ్యాల‌ జంపాల:

ఓ పోయే పోయే చిన‌దానా, నీ తీయని ‌మ‌నసు నాదేనా
కలలో చూసిన కమ్మని ప్రేమా కాయ పండా నెరజాణా

స్నేహం:

నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటే వలవల
గోదారి పాడింది గలగలా..దానిమీద నీరెండ మిల మిల మిల

చరణం 1:
నది నిండా నీళ్ళు ఉన్నా.. మనకెంత ప్రాప్తమన్నా కడవైతే కడివెడు నీళ్ళే.. గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే.. అంతే కాదా దక్కేది

చరణం 2:
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ చేతకానమ్మకే చేష్టలెక్కువ చెల్లని రూపాయికే గీతలెక్కువా

చరణం 3:
తమ సొమ్ము సొమవారం ఒంటి పొద్దులుంటారు
మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే.. పరులకింత పెట్టినదే.. పరలోకం పెట్టుబడి

-ఈ పాటలో అంతి ప్రాసలతో పాటు ప్రతీ వాక్యం ఒక కొటేషన్‌లా ఉంటుంది. వేదాంతం ప్రతిఫలిస్తుంది. మనుషుల్లో ఎంత స్వార్థం ఉంటుందో చెబుతుంది..

పరులకింత పెట్టినదే.. పరలోకం పెట్టుబడి.. అంటూ ఈ లోకంలో మంచి చేస్తేనే పరము అని చెబుతుంది.

వీరి భక్తి పాటల్లో కూడా అంత్య ప్రాసల విన్యాసం కనబడుతుంది.

‘ఉయ్యాల ‌జంపాల’ లో రాముడి పైన పాట-

‌‘తండ్రి మాటకై పద‌వుల త్యాగమే జేసెను −‌ తన తమ్ముని బాసకై తాను బాధ‌పొందెను – అను‌భ‌వించ‌ద‌గిన వయసు అడ‌వి‌పాలు జేసెను−‌ అడుగు పెట్టి‌నం‌త‌మేర ఆర్య భూమి జేసెను – ధర్మ పత్ని చెర‌బా‌పగ దను‌జుని దును‌మా‌డెను−‌ ధర్మము కాపా‌డు‌టకా సతినే విడ‌నా‌డెను-‌

అంటూ ప్రతి చరణం చివర ‌- అందాల రాముడు, ఇందీ‌వర శ్యాముడు, ఇన‌కు‌లాబ్ది సోముడు అందు‌వ‌లన దేముడు – అంటూ పల్లవి సాగుతుంది.. ఇదో అద్భుత ప్రక్రియ – మాస్టారు పిల్లకు చెప్పినట్లు ఉంటుంది. వీరి అంత్యప్రాసావిన్యాసాలు సహజం. ఆపాతమధురం.. పండిత పామర గాన గానయోగ్యం..

చమత్కా ర గీతాలు/హాస్య గీతాలు:

‘అత్తా ఒకింటి కోడలే’ – ‘పైలా‌పైలా పచ్చీసు, పరు‌వం‌లోనే లేడీసు−‌ మగా‌ళ్ల‌తోటి సమా‌న‌మంటూ ఎక్కా‌రండీ సైకిల్స్‌’

ముగ్గురమ్మాయిలు:

ఆకాశం నుండి నాకోసం వచ్చావా.. పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా… నువ్వు పక్క పక్కగా వుంటే స్వర్గం దున్నేస్తా.. నువ్వు పక్క పక్కగా వుంటే నే స్వర్గం దున్నేస్తా..
నువు కనపడకుండా పోతే బాల్చీ తన్నేస్తా..!! ఆకాశం నుండీ నాకోసం వచ్చావా..
పొంగే అందాలా మిఠాయీ పొట్లం తెచ్చావా..

చరణం 1:
నీ జడ పిన్ను నా తల రాతకు పెన్ను.. నీ సిగ పువ్వూ.. ఆ అదేమిటమ్మా .. బుజ బుజ రేకుల లవ్వు..
నీ చిలిపి బిడియం అమృతంలో.. ఊరిన వడియం నీ పెదవులు రెండూ.. నా ముక్కుకు దొండ పండ్లు
ఓ హో.. రోజ.. తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడీ రాజా.. ఆకాశం నుండీ నాకోసం వచ్చావా..
పొంగే అందాలా మిఠాయీ పొట్లం తెచ్చావా..

చరణం 2:
నీ లేడి కళ్ళూ వేస్తాయి నాకు సంకెళ్ళు.. నీ లేత వొళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు…
నీకు నేను ముద్దుల బందీ..నన్ను పెట్టకే ఇబ్బందీ.. నీకు నేను ముద్దుల బందీ..నన్ను పెట్టకే ఇబ్బందీ..
నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం.. నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం..
ఓ హో..రోజ ..తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడీ రాజా..

చరణం 3:
అందాల ఓ రామచిలకా..నేను అవుతున్నానెందుకో తికమకా.. ఈ దేవదాసు లైలా వేనా..హాయి లైలా.. ఈ మజునూ పార్వతి వేనా..ఓ పారు.. అయ్యో బుల్ బుల్ నాకెందుకే ..ఈ ట్రబుల్…

ఈ పాటలో అంత్యప్రాసలు సరదాగా ఉండడమే కాకుండా హాస్య రసస్ఫోరకంగా ఉంటాయి. ..
(వచ్చావా.. తెచ్చావా, దున్నేస్తా.. తన్నేస్తా , పువ్వు..లవ్వు, ఎక్కిళ్ళు.. సంకెళ్లు,బందీ.. ఇబ్బంది బుల్ బుల్ …ట్రబుల్)

ఇది తెలుగు సినిమా పాటలలో చక్కని హాస్య గీతంగా కూడా చెప్పవచ్చు.

ఆరుద్ర రచించిన అనేక చమత్కార భరితమైన హాస్యపు పాటల్లో కూడా చక్కని అభివ్యక్తి సౌందర్యం ద్యోతకమవుతుంది. ఉదాహరణకు

“సోడా సోడా ఆంధ్ర సోడా కోరి కోరి తాగుతారోయ్.. అది లేకుంటే వడదెబ్బకు వాడుతారోయ్.. ఒక గుక్క తాగి చూడు మండుటెండలో హిమాలయం చల్లదనం నీ గొంతుకలో” –

లక్ష్మీ నివాసం – “ఓ మేరి ప్యారీ మొదల్ హై దిమాక్ దిల్ దివానా.. మాది మనసు ఖజానా మీకిహిస్తాలే నజరానా” –

పల్లె పడుచు– “వగలాడి వయ్యారం భలే జోరు, నీ వయ్యారం ఒలికించు వన్స్ మోరు”

‌మా ఇంటి మహా‌లక్ష్మి– కోర్టు భాషా పద‌జాలంతో రాసిన గీతం – ‘నువ్వం‌టేనే నాకు మోజు−‌ అలా రాసి‌స్తానే దస్తా‌వేజు−‌ మేను లాంటి నా కన్నులు అమీనై−‌ జామీను లేని నా మదిని జప్తు చేసినై’ అంటూ సాగు‌తుంది.‌ ‌

చదువుకున్న అమ్మాయిలు – ఒక చక్కని హాస్య గీతం:

ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం పాత రోజులు గుర్తుకొస్తున్నవి – ఉన్నది ఏదో వ్యవహారం చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం
పౌడరు తెచ్చెను నీ కందం – ఇంకా వెయ్‌ వేలెడు మందం తట్టేడు పూలని తలను పెట్టుకొని – తయారైతివా? చిట్టి వర్ధనం!
వయసులోన నే ముదురుదాననా వయ్యారానికి తగని దాననా వరస కాన్సులె వన్నె తగ్గినా అందానికి నే తీసిపోదునా
దేవకన్య ఇటు దిగి వచ్చిందని – భ్రమిసి పోదునా కలనైనా మహంకాళి నా పక్కనున్నదని – మరచి పోదునా ఎప్పుడైనా
నీరు కలపని పొలవంటిది – పిండి కలపని వెన్నవంటిది నిఖారు సైనది నా మనసు – వూరూవాడ ఇది తెలుసు

ఆరా‌ధన– ‘ఇంగ్లీ‌షు‌లోన మ్యారేజి, హిందీలో అర్ధము షాది, ఏ భాషలో ఏమ‌న్ననూ మన తెలు‌గు‌లోన పెళ్లి’‌

లక్ష్మీ నివాసం-సోడా సోడా ఆంధ్రా సోడా గోలీ సోడా జిల్ జిల్ సోడా.. సోడా తాగు తెలుగోడా చల్లని సోడా దీనీ మహిమా చెప్పలేడు దేవుడు కూడా

దేవాంతకుడు– గో గో గో గో గొంగూర …జె జె జె జె జైఆంధ్ర.. వంటి పాటలు అన్నీ సరదా పాటలే.

టీజింగ్ సాంగ్స్:

నేనంటే నేనే – గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడిగుమ్మ

దేవుడు సేసిన మనుషులు – దోర వయసు చిన్నది -భలే జోరుగున్నది

వన భోజనం:

మన తెలుగు సినిమా పాటలలో వివాహ భోహనం (మాయబజారు) లో ప్రసిద్ధమైనది కాగా, వనభోజనం పాట (పెళ్లి పుస్తకం) ప్రసిద్ధమైనది. తెలుగు వారు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో వనభోజనాలకై వెళుతుంటారు. ఆధ్యాత్మిక, ఆనందయాత్రగా దీనిని చెప్పవచ్చు. ఇది ఆట విడుపు. పాట విడుపు. అయితే ప్రస్తుతం ఇవి కులభోజన యాత్రలుగా, వధూవరుల పరిచయ వేదికలుగా మారాయి.

‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో పాట తెలుగు వారి కార్తీక వనభోజనాలు.. ఆహారపు అలవాట్లు, రుచులు కలగలిసినది..,

పల్లవి:
పప్పు దప్పళం అన్నం.. నెయ్యి వేడి అన్నం.. కాచినెయ్యి
వేడీ వేడీ అన్నం మీద.. కమ్మని పప్పు కాచినెయ్యి పప్పూ దప్పళం కలిపి కొట్టడం
భోజనం వన భోజనం వన భోజనం జన రంజనం

చరణం 1:
తల్లితోడు పిల్లామేకా ఆలూమగలు అత్తాకోడలు బాసూబంటూ ఒకటేనంటూ కలవడం
భోజనం వన భోజనం భోజనం.. వన భోజనం
మన వయసుకి నచ్చినట్టి ఆటలూ మన మనసుకు వచ్చినట్టి పాటలూ

చరణం 2:
మసాలా గారెలూ మా మా జిలేబీ బాదుషా పా.. పా
సమోసా తీసుకో దా.. దా పోటాటో చిప్స్ తోనా.. నీ
మిఠాయి ఖావొరే.. ద పకోడీ తిందువా పా.. పా మలాయి పెరుగిది మా.. మా
టోమాటో చట్నితో గా.. గా పసందు పూర్ణమూ బూ.. రీ నంజుకో కారప్పూసా..సా.. ఆ..

చరణం 3:
అరిశెలు బూరెలు వడలూ ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలూ కమ్మని ఘుమ్మని నేతి చిప్సులు
కరమగు నోరు ఊరగల కక్కలు ముక్కలు ఫిష్ కబాబులూ
కరమగు నోరు ఊరగల కారపు పచ్చడి తీపి జాంగిరి
త్వర త్వర సర్వ్ చేయవలె తైతక్కలాడగ పిక్కునిక్కులు

ధనము ప్రాముఖ్యము తెలిపే గీతాలు:

లక్ష్మీ కటాక్షము:

ధనమేరా అన్నిటికీ మూలం -ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
మానవుడే ధనమన్నది సృజియించెనురా దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన సపెట్టినవాడే గుణవంతుడు – బలవంతుడు – భగవంతుడురా !
ఉన్ననాడు తెలివికలిగి పొదుపు చేయరా లేనినాడు ఒడలువంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చునితింటే –

అంటూ సాగే పాటలో ధనం పొదుపు, అదుపు మదుపు అన్న విషయాలపై చక్కని సందేశాన్ని ఇస్తాడు

కొత్తల్లుడు:

రూపాయి – రూపాయి నమోనమో శ్రీ రూపాయి – నమోస్తుతే శ్రీరూపాయి..
పాపం చెయ్యర – రూపాయాయితే – ఫరవాలేదురా పుణ్యం చెయ్యర పైసాలేనిదే – బతుకే లేదురా
రొక్కంవుంటే కురూపికూడా – చుక్కల్లో చందురుడే
ధనమూల మదమ్‌ జగత్‌ – డబ్బుకులోకం దాసోహం
ఓట్టు కొంటుంది రూపాయి – సీట్లు తెస్తుంది రూపాయి మంత్రం తంత్రం న్యాయం ధర్మం – మనీపర్సులో వుంటాయి-బూజును సహితం రూపాయి – రాజుని చేస్తుంది రాజునుసైతం రూపాయి రాళ్లపాలు చేస్తుంది..మనీ మేక్స మేనీ ధింగ్‌? – మనీ మేక్స్‌ సోమెనీధింగ్‌ అమెరికన్‌ డాలర్‌ రష్యనీ రూబుల్‌ -ఫ్రాన్స్ ప్రాంకూ ఇటలీ లీరా –ఏ పేరైనా ఏ వూరైనా – ఆత్మ మాత్రం రూపాయి పరమాత్మ రూపం రూపాయి

అని రూపాయి మాహాత్మ్యాన్ని వర్ణించాడు ఇలాంటి పాటలే (సిరివెన్నెల) ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకు బంధువు’ అన్న పాటలకు ప్రేరణ కావచ్చు.

సాహిత్య రుద్రుడు:

వారు అలా వచ్చి ఇలా పోయే పాటలే కాక గొప్ప సాహిత్య, భాషా సుగంధాలు వెదజల్లే గీతాలు రాశారు.

ఆనంద నిలయం – పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికి అన్న పాటలో భావం మధుర భక్తి భరితమై ఉంటుంది.

‌భక్తపో‌తన– ‌‘నాగ‌రాజ కన్య, జగ‌దేక మాన్య కమ‌నీయ దివ్యక‌ల్యాణ ధన్య’‌ అనే పాటలో శ్రీనాథుడి నుడికారాలు కనిపిస్తాయి.

బాల భారతం– మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మహనీయుడు మంచిని తలపెట్టిన మనిషికద్దు లేదులే ప్రేరణ దైవానిదైనా సాధించును నరుడే..

ఈ పాటలో.. వారు నాస్తికులైనా.. ప్రేరణ దైవానిదైనా సాధించును నరుడే.. అన్న మాట వాడాడు.

అంతస్తులు:

వినరా విస్పన్నా నే వేదం చెపుతా వినరన్నా పేదోళ్ళ నీతిలో భేదాలు లేవన్నా
ఉన్నప్పుడు హాయిగా వరిగంజి నీళ్లు లేకుంటే చాలులే యీ సంపు నీళ్లు
సాటోళ్లతో సుకపడుట మేలు చల్లనిచెట్టు వీడను దొరికేదే సౌఖ్యం –
నీరిడిసిపెడితే సేస బతికుంటదా- నీతిడిసి పెడితే మనిషి పరువుంటదా
నిజమాడితే నిష్టురమేగా అయినా పేదలు కలలోకూడా -కల్లా కపటాలాడరు
లోకాన తాడిసెట్టు ఎత్తయినది ఆ సెట్టు తలదన్నేది ఒకటున్నది
అంతస్తుకి అంతెక్కడున్నది ఏడంతస్తుల మేడకు కూడా పునాది భూమిలో వుండాలి.

సామ్యవాద భావాలు ,సామాజికస్పృహ, దీనజన పక్షపాతం ఈపాటలో నిలువెత్తుగా ఉంటుంది.

దేశభక్తి:

దేశభక్తిని ప్రేరేపించేవీ, చారిత్రాత్మకమైనవీ అయిన ఎన్నో పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి.

అల్లూరి సీతారామరాజు – రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరె అల్లూరి సీతారామరాజు.. అనే టైటిల్ సాంగ్ లోని “కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు” అన్నవాక్యం వీరరస స్ఫోరకంగా సాగగా మరియు

“వందేమాతరమంటూ నినదించిన బంగాళం, స్వరాజ్యమ్మె జన్మహక్కు అని చాటిన మహరాష్ట్రం; హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం; అన్నిటికీ నెలవాయెను ఆంధ్రవీర హృదయం రామరాజు హృదయం..”

అన్న వాక్యాలు నాటి దేశభక్తులకు వివిధ ప్రాంతాలలో జరిగిన జాతీయోద్యమాలు సీతారామరాజుకు ఎలా ప్రేరణ అయ్యాయో తెలుపుతుంది.

పవిత్రబంధం:

గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది-నాటి,నేటి సామాజిక పరిస్థితులను,స్వార్ధ పూరితప్రపంచాన్ని కవితా రూపంలో వర్ణించాడు. ఇదే పాటలో ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు –

అన్న వాక్యం ద్వారా యువశక్తి ఎలానిర్వీర్యమవుతుందో తెలిపాడు.

దొంగలకు దొంగ :

ఓ ఎవరే మన్నను తోడు రాకున్నను
ఒంటరిగానే పోరాబాబూ పో రా నీదారి నీదే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా
మదిలో జ్వాల రగిలిననాడు లోకం చూపదు నీపై జాలి కు నమ్మకముంటే జగతిని నీవే మార్చాలి

ఊరికి మొనగాడు:

కదలిరండి మనుషులైతే కదలిరండి మమత వుంటే ఉప్పెనగా ఉమ్మడిగా బలి కోరిన దీనుల కోసం బతకలేని చావలేని ప్రాణుల కోసం

..వంటి గీతాలలో సామాజిక స్పృహ ,సమాజం లో మన బాధ్యతను తెలియజేశాడు.

కరుణాసముద్రుడు:

ముద్దుబిడ్డ– చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది.. వంటి పాటల ద్వారా సెంటిమెంట్ తో గుండెలను పిండే పాటలు రాయగలడు అని నిరూపించుకున్నాడు.

సంవాద గీతాలు:

ధర్మసందేహాల్నీ, వాదసంవాదాల్నీ, జీవిత సత్యాలను, తత్వసారాలను తేట తేట తెలుగులో సంవాద గీతాలుగా పలికించగల గొప్ప కవి ఆరుద్ర. పరస్పరం భావాల సంఘర్షణ, పాత్రల సంభాషణల మధ్య సాగే సంవాదాలు కూడా పాటలో పలికించగల ప్రజ్ఞ వీరిది.

బాలరాజు కథ – అడిగానని అనుకోవద్దు, చెప్పకుండ దాటెయ్యద్దు ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం.. అన్న పాట ప్రశ్నలు సమాధానాల రూపంలో సంవాదరూపంలో ఉంటుంది. వారి హేతువాద ధోరణిని తెలియ జేస్తుంది.

పల్లవి:
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం
చరణం 1:
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు
అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు..
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ …

చరణం 2:
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు ఊరుమీద పడి చందాలెందుకు
లోకులు చూచి తరించుటకు.. పలుగాకుల బొజ్జల పెంచుటకు

చరణం 3:
మహమ్మదీయులు పిలిచే దేవుడు .. క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు.. గోవిందా .. గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు .. వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు .. వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
సర్వవ్యాపి నారాయణుడు .. సర్వవ్యాపి నారాయణుడు.. ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా .. తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా .. . ఆఁ అట్టా రండి దారికి …
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు .. మీరొక్క దెబ్బతో తేల్చారు ..
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు ..ఏ రాతికి మొక్కను వచ్చారు

..ఈ పాట కేవలం సంవాదమే కాదు జనుల మనసులో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం.. కవియన్నా అంటూ తెలియని విషయాలను వ్యాఖ్యానించాలి. అలా చేయడంలో ఆరుద్రది అందేవేసిన చేయి.

ఇద్దరు మిత్రులు:

పల్లవి:
హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి -ఆడపిల్ల అలిగినచే వేడుకొనడు అబ్బాయి
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి-ఆదినుంచి లోకంలో ఆడవారిది పై చేయి

చరణం 1:
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు నాటికీ నేటికీ మీకు అలవాటే
హలో హలో ఓ అమ్మాయి అవును మీదే పై చేయి

చరణం 2:
బెట్టు చేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి- బెట్టు చేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి
మనసులో మమతలూ పైకి వేషాలూ- ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి

చరణం 3:
లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి – గెలుపు కోసం మగవారు..
కాళ్ళ బేరము లాడకపోరు-
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి-
హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్ బై

నాయికా నాయకుల మధ్య సాగే సరదా సంభాషణ గీతం ఇది.

వాక్యాలు కావు కావ్యాలు:

ఆరుద్ర గారు అంటేనే వాక్య నిర్మాతలు.

-నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు.
-బ్రూటు వేసిన ఓటు బురదలో గిరవాటు, కడకు తెచ్చును చేటు.
-కొంటె పిల్లకాయలు లేని కన్నతండ్రి-గోదావరి పొంగులేని రాజమండ్రి
-నమ్మకాన్ని భద్రంగా ఉంచుకోలేనివాడికి ప్రేమ మీద అధికారం లేదు.
-కవిత కోసం నేను పుట్టాను-క్రాంతి కోసం కలం పట్టాను.
-జాతికి జీవనాళిక జానపద గీతి
-జీవితం రేడియో సెట్టుకు భర్త ఏరియల్, భార్య ఎర్త్.
-మార్నింగ్ వాక్‌లు తక్కువై అతనికి, ఈవినింగ్ వాక్లు ఎక్కువై ఆమెకి – కడుపొచ్చింది..

ఇవి వారి ప్రముఖ కొటేషన్లు.. వివిధ వారి కవితలలో ఉన్నవి.

ఇవే కాక వీరి పాటల్లో మాటలు.. మాటలు కావు.. ముత్యాల మూటలు- రసాత్మకమై, ప్రబోధాత్మకమై, నినాదలై, సూక్తులై, దైనందిన జీవనంలో ప్రజల నోట ఇల్లు కట్టుకొని నివసిస్తాయి..

కొన్ని మచ్చుకు..

లేతమనసులు– పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపట మెరుగనీకరుణామయులే..

సిపాయి చిన్నయ్య -నాజన్మ భూమి ఎంత అందమైన దేశం నా ఇల్లుఅందులోన కమ్మని ప్రదేశము..

మంచి కుటుంబం -మనసే అందాల బృందావనం

మీనా – పెళ్ళంటే నూరేళ్ళ పంట అది పండాలి కోరుకున్న వాడి ఇంట

బుద్ధిమంతుడు – ప్రియురాలి వలపుల కన్నా నులి వెచ్చనిదేది లేదు ..ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదు

అందాల రాముడు– ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందరా

దేవదాసు – కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది.. జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ.. వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖమున్నదీ

తరానికో వందకవులు తయారవుతారు. ఎపుడూ వందలోను మందలోనూ మిగిలేది ఒక్కడే అంటారు ఆరుద్రగారు. నిజమే వందలో మిగిలిన ఒక్కరి లాంటి వారే వీరు.

మొదట శ్రీశ్రీ అడ్రసే తన అడ్రస్‌గా జీవించిన కవి ఆరుద్ర. తనదైన శైలిలో తన రచనలతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఎవరో శ్రీశ్రీకి ఉత్తరం రాస్తూ ఆరుద్రను సంబోధిస్తూ, తమ శిష్య రత్నం అన్నాడట.. దానికి శ్రీశ్రీ నా శిష్యుడంటే ఆయన ఒప్పుకోడు.. రత్నమంటే నేను ఒప్పుకోను అన్నాడట.

వారు ఒప్పుకోకున్నా వారు కవిరత్నమే.

ఆదుర్తి గారికి ఆత్రేయలా.. విశ్వనాథ్ గారికి వేటూరిలా.. బాపూ గారికి ఆరుద్ర.. వీరు ఇతరుల సినిమాలలో ఎన్ని గొప్పగీతాలు రాసినా.. వీరిలా ఆలోచించే దర్శకులతో పనిచేయడం వలన వీరి ప్రతిభ, అభివ్యక్తి, విద్వత్తు మరింత బాసించింది. శోభిల్లింది.

బాపురమణలు టీవీకి తీసిన భాగవత కథల్లో సుందరకాండను సుదీర్ఘగీతంగా రచించారు ఆరుద్ర. ఇదే ఆరుద్ర చిట్టచివరి రచన. నాస్తికులైన ఆరుద్ర గారి తమ రచనా వ్యాసంగం సుందరాకాండతో ముగియడం రామచంద్రుని నిర్ణయం కావచ్చు.

ప్రతిభ, సృజనాత్మకత, చదివించగలిగే గుణం ఉన్న రచయిత కలకాలం పాఠకుల గుండెల్లో నిలుస్తాడు. చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించగలుగతాడు.. అలాంటి వారే ఆరుద్ర.

ఆరుద్ర గారు 73వ ఏట 1998 జూన్ 4 చెన్నైలో అస్తమించారు.

అనేక కావ్యాలు, రచనలే కాక సమగ్రాంధ్ర సాహిత్య సృష్టి ద్వారా తెలుగు జాతికి ఎనలేని సాహిత్య సేవ చేసిన ఆరుద్ర గారికి ఇదే నా అక్షర నీరాజనం.

(సమాప్తం)

Exit mobile version