[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీ కె. వి. భాస్కర రావు.]
మహాదేవుణ్ణి తేనెతో అభిషేకిస్తే మరు జన్మలో చక్కటి గాత్రాన్ని ప్రసాదిస్తాడని వేదవేద్యులు చెప్పింది నిజమే అయితే జానకమ్మ ఎన్ని బిందెలతో కపర్ధిని గతజన్మలో అభిషేకించిందో కదా!..
రేపల్లె పేరు వింటేనే జగద్గురు శ్రీకృష్ణుడు తలంపున రాక మానడు. అందుకేనేమో రేపల్లె వాసి ఆయన శ్రీమతి జానకి తన పాటల పుస్తకంపై ఆ నందనందుణ్ణి పటాన్ని ఉంచుకుంటుంది.. జానకి రాములను విడదీయడం ఇష్టంలేని తండ్రి శ్రీరామమూర్తి సత్యవతి దంపతులు శ్రీరామమూర్తి జానకి కి జానకి అని పేరు పెట్టి ఉంటారు. అదే నేపథ్యంలో భర్త రాముని పేరు చేర్చుకుని రాంప్రసాద్‌గా జానకిని చేపట్టాడు ఏ స్వయంవరం లేకుండానే..
శిష్ట్లా శ్రీ రామమూర్తి జానకి అదేనండి.. మన ఎస్. జానకి సిరిమల్లె పువ్వా అంటూ తనలోని సువాసనను ఆస్వాదించి కురుల్లో తురుముకునే మల్లెల్ని సైతం ప్రేమగా పిలిచి వాటి గుండె ఆత్రం చేసింది. సంగీత గగనంలో తాకని రాగ నక్షత్రం లేదు జానకికి. గోవుల్లు తెల్ల గోపయ్య నల్లన అంటూ ఎంతో నిగూఢమైన అర్ధం అమాయకంగా చెప్పిన పసి గొంతుతో వేటూరి కలంలోని అమృత తుల్యమైన భావాన్ని గ్రహించి పాడింది.
అదే కలానికి రెండోవైపు కూడా పదునున్నట్టు ఆరవ వేదాన్ని ఆవిష్కరించిన సుందరరాముని హృదయ ఘోషను తన గొంతులోంచి సభ్య సమాజం సిగ్గుపడేలా లావాలా వెళ్లగక్కింది మహాగాయని మన జానకి.
భూషణాలు పద్మాలై ఆమె శిరసున్న చేరాయి.
ఏదేవి పూజాఫలమొ కాని పగలేవెన్నెలను కురిపించిన మధురగాయని నీ లీలపాడేద దేవ అంటూ ప్రాణం లేని సన్నాయి వాయిద్యం తో పోటీపడి రచ్చగెలిచింది కళామామనై జానకి.
అసలేం గుర్తుకు రాదు నీవు ఉండగా అంటూ పాటలే ప్రాణంగా ఉండే జానకి తెలుగు పాటల పాలవెల్లిలో ఓ గున్న మామిడే సుమా..
మౌన మేలనోయి అని ప్రియుణ్ణి ప్రశ్నించిన ఆగొంతుతోనే వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా? అని చిలిపిగా అడిగి ఇది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజని కూడా చెప్పింది.
జానకి స్వరపేటిక సరస్వతి దేవి పడపీటిక.
జయ జయ ప్రియభారత జనయిత్రీ అంటూ దేవులపల్లి వారి సాహిత్యాన్ని తెలుగు వారికి అందించడమే కాదు తమిళ, కన్నడ, హిందీ, తుళు ఒకటేమిటి ఎన్నో భారతీయ భాషలలోని కవుల హృదయంలోంచి పుట్టిన ప్రతి భావనను తన గాత్రంతో మనోహరంగా ఆలపించింది భారత కోకిల.
అలనాటి ఘంటసాల నుంచి ఈ నాటి రెహమాన్ వరకు జానకి గొంతులోంచి తాము కూర్చిన పాట రసగుళికలా బయటపడి ప్రేక్షకులను రంజింపచేయాలని ఆరాట పడినవారే..
సహచర గాయకులతో ఆవిడ ప్రవర్తించే తీరు చూసి నేర్చుకోవాలి..
సంగీత రాజా మాస్ట్రో ఇళయరాజ అభిమానించే గాయని జానకి ఆయనే కూర్చే స్వరాలకు ఎదురు చెప్పకుండా అచ్చ అచ్ఛా అంటూ సందేపొద్దుకూడా చూడకుండా పాట పూర్తిచేసి నిర్మాతల చేతిలోని గోరుముద్దగా శ్రోతల హృదయాలకు హాయమ్మా హాయమ్మా అంటూ రంజించేయడం ఒక్క జానకికే సాధ్యం.
ఆరానీకుమా ఈ దీపం అని ఆకాశంలోని మత్తైదువులు పెట్టిన నక్షత్ర తళ తళ లు చూసి మురిసిపోయే జానకి విరిసిన సిరిమల్లె పువ్వు నా నవ్వు అంది.
‘నువ్వు నాకు పాడవద్దు’ అని మొహమ్మీదే చెప్పిన మహా నటి సావిత్రికి తిరిగి పాడకుండా పట్టుదల కల్గిన ధీరురాలు.
తీగచాటు రాగాలు దాగి ఉన్నట్టు సన్నని ఆమె గొంతులో పలకని రాగం లేదు స్వరం లేదు.
తెలుగులో డబ్ అయిన రంగీలాలో టైటిల్ సాంగ్ హిందీలో పాడిన లతాజీకి ఏమాత్రం తీసి పోకుండా పాడింది ఎస్ జానకి..
గంధర్వ గానాల గురించి వినడమే కానీ విని ఆస్వాదించడం తెలియని వారెందరో..
శాపవశాత్తూ దివినుంచి భువికి చేరిన గంధర్వ గాయని జానకి అంటే అతిశయోక్తి కాదు.
బాలు, జేసుదాసు, ఘంటసాల, పిబి శ్రీనివాస్ వంటి మహామహులతో ధీటుగా పాడి సెహభాష్ అనిపించుకుంది..
ముఖ్యంగా ఈనాటి వారికి తెలిసిన సినిమా బాలకృష్ణ బాలగోపాలుడులో బావా బావా బంతిపువ్వా అనే పాటలో బాలుని అదరగొట్టేసింది జానకమ్మ.
నీ కౌగిలిలో అనేపాటలో శ్రీదేవి అభినయం జానకి గాత్రం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది..
విధి వశాత్తూ ఇంట్లో ఎన్నో గుండెలు పిండేసే బాధలు క్రుంగదీసినా ధైర్యంతో ఎదుర్కొని పైకి నవ్వుతూ పాటలు పాడుతూ మనల్ని మన అదృష్టం కొద్ది కొంతసేపైనా ఎన్నో బాధలనుంచి సేద తీరేలా తన గాన మాధుర్యాన్ని ప్రసాదించిన గాన విదుషీమణి తిరిగి తన లోకమైన గంధర్వ లోకం వెళ్లినందుకు బాధ పడాలా లేక మెట్టినింట గెలిచి అమ్మ వడికి చేరిందని సంతోషపడాలో తెలియడంలేదు.
ఒక గాయక మహా వృక్షం పడిపోయిన తర్వాత సంగీత ప్రియుల హృదయాలలో బాధ పుట్టడం సహజమే కానీ షేక్స్పియర్ చెప్పినట్టు ఈ ప్రపంచంతా ఒక నాటక స్థలి. ఎవరి పాత్రలు ముగిసిపోతే వాళ్ళు స్టేజ్ దిగాల్సిందే.
కొందరు బ్రతికి చస్తారు మరికొందరు చచ్చినా బ్రతికే ఉంటారు. అటువంటిదే మన అభిమాన గాయని డా.ఎస్.జానకి మహా నిభిష్క్రమణం..
