[డా. మధు చిత్తర్వు రచించిన ‘ఆశ్రమ ప్రతిధ్వనులు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
కాలం యత్ర నాస్తి తత్ర ఆత్మ ప్రకాశతే.
“బై! బై! ఆన్వీ!నేను ‘స్పేస్ టైం’ లోకి వెళ్ళిపోతున్నాను. ఈ భూమి లోపల నా అన్వేషణకి సమాధానం దొరకటంలేదు. కాలం అంచులో, అనంతమైన కాలం ద్రవ్యం ఒకటైన చోట వున్న క్వాంటం ఆశ్రమంలో ధ్యానం చేయటానికి వెళ్లిపోతున్నాను. మన ప్రేమకి సాఫల్యం నాకు జవాబు దొరికినప్పుడు దొరుకుతుంది. నిన్ను ఆశపెట్టి మోసగించానేమో, లేక నా అంతరాత్మ సాక్షిగా సత్యం వెతుకుతూనే వెళ్తున్నానేమో నాకే తెలియదు. నాకోసం బాధపడతావు అని తెలుసు. నన్ను వెంబడించాలని చూడొద్దు. అది నీ ఉనికికే ప్రమాదం. ఇక నుంచి నీ జీవిత లక్ష్యం మార్గం వేరు. నా మార్గం వేరు. నీ మార్గం నువ్వే నిర్ణయించుకో. నన్ను క్షమించు. సత్యం అర్థమై లక్ష్యం నెరవేరితే మళ్ళీ కలుద్దాం.”
***
వీర్ వర్మ.. ఆలోచిస్తోంది అన్వీ. వారిద్దరూ యూనివర్సిటీలో వేదాంత శాస్త్రంలో ఎం.ఎ. చదువుతున్నప్పటి నుంచే స్నేహితులు. ఇద్దరూ వేదాంతంలో పీహెచ్‌డీకి అప్లై చేసి, పరిశోధనలోకి మారినప్పటి నుంచి ప్రేమలో పడ్డారు.. కానీ ఇప్పుడు ఇది ఏమిటి? అంతా అయి డాక్టరేట్ పట్టా వచ్చేసరికి ఇతను అంతర్ధానమై పోయాడు! వెళ్ళిపోయాడు! వాదోపవాదాల మధ్య సాయంత్రాలూ, ఆ తర్వాత చిగురించిన ప్రేమలూ, వేదాంతం వేరు, ప్రేమ వేరు, అనుకునే క్షణాలూ, అన్నీ మరిచిపోయాడు. మగవాళ్ళు ప్రేమని అంత త్వరగా మర్చిపోతారా?
***
సాధారణ శకం. 2147వ సంవత్సరం. అన్వీరెడ్డి ఆలోచిస్తోంది. పర్యావరణ కాలుష్యం, ప్రపంచ యుద్ధాలు ఒక పక్కన, డిజిటల్ నియంతృత్వం ఒక వైపునా మానవులను పట్టిపీడిస్తున్న సమయం. పాత చరిత్రనీ వేదాంతాలనీ, సిద్ధాంతాల్నీ చెరిపేసి, సత్యం ఒకటే, అది సంఖ్యలలోనే ఉంటుందనీ మానవుల్ని ఒక (డేటా) దత్తాంశాల యంత్రాలుగానే చూడాలనే అభిప్రాయంతో నియంతృత్వం ద్వారా రాజ్యమేలే ప్రభుత్వాలూ, అధికారులూ ఉన్న రోజులు. మానవ హక్కులు కాలరాసి ఎక్కడి నుంచో ఎవరో అదృశ్యంగా మహా మేధస్సు గల యంత్రాల తెలివితేటలతో పరిపాలించే చీకటి సమయం. ఏది చేసినా ఎవరో గమనిస్తూనే ఉంటారు. ఈ మానవ జీవితమే అదృశ్య శక్తుల నియంత్రణలో ఉంది.
తెల్లటి పొగమంచు. దానిలో నల్లటి కార్బన్ కణాలు మిశ్రమం చేసిన పొగ లాంటి వాయువులు భూమి అంతా పరదాలు కప్పిన కాలుష్యంలో కొంతమంది మాత్రమే ఆక్సిజన్ మాస్కులతో బయట తిరుగుతున్న పరిస్థితి. అయినప్పటికీ జ్ఞానాన్వేషణ విశ్వవిద్యాలయాలలో జరుగుతూనే వుంది. కొన్ని డిజిటల్ కృత్రిమ మేధ కంపెనీలు, ఉత్పత్తి కేంద్రాలు, ఫ్యాక్టరీలు, సంస్థలు పనిచేస్తూనే ఉన్నాయి. ప్రజలు చాలామంది ఇతర ప్రపంచాలకూ, గ్రహాంతర వలసలకు వెళ్లిపోయారు. భూమిలో వ్యవసాయ ఆహార ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. కృత్రిమ మేధ ఉన్న మహా యంత్రాలు మానవుల ఉత్పత్తిని సరఫరాలని నియంత్రిస్తున్నాయి. అవి మానవుల ఆజ్ఞలను దాటి స్వయంపాలిత వ్యవస్థగా మారిపోయాయి. వీర్ వర్మ, అన్వీ రెడ్డి ఇద్దరూ స్నేహితులే, ప్రేమికులే కానీ ఇప్పుడు వీర్ అదృశ్యం అయ్యాడు.
2417 కాలవృంద అనే రహస్య సంస్థ కాలం అంచున ఆశ్రమాలు నిర్మించిందని డిజిటల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీర్ వర్మ ఇలాంటి కాలపు అంచులలో ఉన్న స్పేస్-టైమ్ లోకే వెళ్లిపోయాడు. ఎలా వెళ్ళాడో తెలియదు. ఈ రోజుల్లో ప్రయాణాలకి చాలా మార్గాలు వున్నాయి. అక్కడ క్వాంటం ధ్యానంతో సత్యాన్ని అన్వేషించవచ్చు. అలాంటి ఒక ఆశ్రమం నీలగిరి కొండల్లో పూర్వపు ఊటీ, లేక కూనూరు దగ్గర కొండ ప్రాంతాల్లో ఉందని చెప్పుకుంటారు.
***
పెద్ద విశాలమైన ఊడలతో పురాతన బోధివృక్షం లాంటి మర్రిచెట్టు వందల కొద్దీ గజాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. గురూ సత్యాన్వేషికి ఎన్ని సంవత్సరాల వయసో చెప్పడం కష్టం. కానీ వేలకొద్ది ముడతలు పడిన ముఖం, జడలు కట్టిన వెండి రంగు పొడుగాటి జుట్టూ, తెల్లటి పొడుగాటి గడ్డం మోకాళ్ల దాకా వ్యాపించి ఉండటం, ఇవన్నీ చూస్తే ఆయనకి వంద సంవత్సరాల పైనే వయసు ఉండొచ్చు అనిపిస్తోంది.
“అన్వీ, నీ బాధ నాకు తెలుసు వీర్ మాయమయ్యాడు. కాలవృంద ఆశ్రమంలో కూడా కనపడలేదా?”
“లేదు, స్వామీ! ఊటీ దగ్గర ఉన్న కాలవృంద ఆశ్రమంలోకి ప్రవేశం కోసం వెళ్ళాను. వీర్ కోసం అడిగాను. కాలంలో ఆశ్రమాలూ లేవు, వీర్ వర్మ అనే వాడూ లేడు, అన్నారు. నేను క్వాంటం ధ్యానంలో ప్రవీణురాలినని ధ్యానం కోసం ఆశ్రమంలో చేరుతానని అన్నాను. వారు చేర్చుకున్నారు. నాకు మెదడులో న్యూరల్ ఇంప్లాంట్స్ పెట్టారు. ఆశ్రమంలో ధ్యానం చేస్తూనే వీర్ వర్మ కోసం వెతికాను. ఎవరెవరో కనిపించారు, అలౌకిక స్థితిలో. కానీ అతను మాత్రం కనపడలేదు!”
సత్యాన్వేషి గంభీరంగా అన్నాడు. “డిజిటల్ నియంతృత్వం ద్వారా మన వేదాంతాల సిద్ధాంతాలని ఒకటిగా చేసే ప్రయత్నం జరుగుతోంది. అందుకే భూమిలో మాయా ప్రపంచం, మిథ్యా దృశ్యాలూ అంటే గ్లిషెస్ సర్వసాధారణమై పోయాయి.”
“అవును. ధ్యానం చేస్తుంటే వర్షపు చినుకులు సగం లోనే గడ్డకట్టుతున్నాయి. జరిగిన దృశ్యమే తెరలాగా ఊగి మళ్లీ కనిపిస్తోంది. కాలం ఆగి మళ్ళీ ప్రవహించే నదిలా ఉంది, అనిపిస్తోంది. ఎందుకని? లేక ఇది నా చిత్త భ్రమా? లేక ఉన్మాదమా?”
“అన్వీ.. కాలాన్నీ సత్యాన్నీ మార్చే ప్రయత్నం ‘స్పేస్ టైం’ లో వెలసిన కాలపు అంచున వున్న ఆశ్రమాలలో నుంచి జరుగుతోంది. వాటిలోని ధ్యానపు మంత్రాలలో క్వాంటం కోడ్లు నిక్షిప్తమై ఉన్నాయి. ఇది గ్రహాంతర సాంకేతికతను భూమి వేదాంతాన్ని అనుసంధానం చేసే అసంబద్ధ ప్రక్రియ కోసం చేసే ప్రయత్నం. కొన్ని సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు వారి జ్ఞానం కోసం వేదాంత విషయాలను సంప్రదించడం కోసం ఒక కృత్రిమ మేధను సృష్టించి వాడుకుంటున్నారు డిజిటల్ రూపంలో. అది పరిణతి చెంది తనను సృష్టించిన వారినే ధిక్కరించింది. అన్ని వేదాంత సిద్ధాంతాలు కలిపి ఒక్కటే సత్యం అని నిరూపించాలనే పట్టుదలతో అది ప్రయత్నిస్తోంది. ఈ ఆశ్రమాలని చంద్ర గ్రహంలోనుంచి కాలవృంద సంస్థ ఏర్పాటు చేయించి ఈ సాధన చేయిస్తోంది. వాటికి గురువు, అధినేత స్వామి ఏకతత్త్వ-2147 అనే డిజిటల్ రూపంలోని కృత్రిమ మేధ. అక్కడ ఉన్న కాలవృంద ధ్యానాశ్రమాలలో అనేకమంది భూమి వాసులు, ఇతర గ్రహాల సాధకులు కూడా క్వాంటం ధ్యానం చేస్తున్నారు. వారందరి మెదడులో న్యూరల్ ఇంప్లాంట్స్ పెట్టి థ్యానానికి అనుమతి ఇస్తున్నారు. బహుశా వీర్ వర్మ అక్కడికే వెళ్లి ఉండవచ్చు. ఆ థ్యానాల ప్రభావమే భూమిలోని మనుషుల, మనసుల వైపరీత్యాలు. కాలంలోని గ్లిషెస్, దృశ్యాలు, ఆగి వెనక్కి వెళ్లిపోయి మళ్లీ రావటం, కాలుష్య ప్రళయాలూ, మానసిక ఇబ్బందులూ ఇలాంటివన్నీ కలుగుతున్నాయి. ఇది ఆ డిజిటల్ గురు సైద్ధాంతిక నియంతృత్వానికి చేసే ప్రయోగం. ఈ స్వామి ఏకతత్వ-2147 కృత్రిమ మేధ ఎప్పుడూ నాకు పోటీనే! సత్యాన్వేషకుడిని అయిన నన్ను నిర్మూలించాలనే దాని తపన.”
“అయితే, నేను అక్కడికి వెళ్ళాలి. వీర్ని కాపాడాలి. అసలైన సత్యం ఏమిటో తెలుసుకోవాలి.”
“దానికి చంద్రగ్రహ ప్రయాణం, అక్కడి చంద్ర స్థల అనే ఆశ్రమంలో చేరడం ఒక్కటే మార్గం. వెళ్ళు. నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి.., ‘ది ఛోజెన్ వన్.’ నీవొక ప్రత్యేకమైన ‘క్వాంటం ధ్యాని’వి. నీకు సత్యం అవగాహన కావచ్చు. తిరిగి వచ్చి అందర్నీఈ రాబోయే విపత్తు నుంచి రక్షించు. డిజిటల్ నియంతృత్వం, ఒకే సత్యం, ఒకే సంఖ్యా యోగం, ఈ విశ్వానికి ఒకటే సూత్రం అనే ప్రయత్నానికి విఘాతం కలిగితేనే భూమానవులు రక్షించబడతారు.”
“కాలం ఏమిటి? సత్యం ఏమిటి అసలు స్పేస్-టైమ్ ఏమిటి? గురూజీ, విశదీకరించండి!”
“సత్యం ఒక్కటే కాని విప్రులు ఎన్నో రకాలుగా చెబుతారు. ఆ మార్గాలన్నింటినీ సంఖ్యలు లేక సాంఖ్య యోగం లేక డిజిటల్ క్వాంటం అనుగుణంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏకతత్వ. కానీ నిజానికి వైరుధ్య భావాల ఇంద్ర ధనుస్సే సత్యం. అది నిర్మూలించబడకూడదు, వెళ్ళు! నీ అన్వేషణ, సాధనా కొనసాగించు!
***
ఏకం సత్ విప్రా బహుదా వదంతి.” సత్యం ఒకటే కానీ దాన్ని విజ్ఞులు అనేక రకాలుగా చెబుతారు. భూమి ఒక మాయా ప్రపంచంగా తయారైంది. ఎన్నో విధాల ఆశ్రమాలు పరిశ్రమలు వృత్తులు ప్రపంచంలో నడుస్తున్నాయి. వాటినన్నిటినీ ఒకే రీతిగా నియంత్రించటం ఈ విశ్వమంతటినీ ఒకే నియంత్రణలోకి తీసుకురావడం కోసం స్వామి ఏకతత్వ 2147 ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నం సఫలమైతే మనమంతా ఒక డిజిటల్ డేటా సెంటర్‌గా మారిపోతాం. అతని ఇష్టం వచ్చినట్లు అందరిని నియంత్రించవచ్చు.
ఇదే అన్వీకి అర్థమైంది గురు సత్యాన్వేషి మాటల వల్ల.
ఆమె టికెట్ కొని ఎక్కిన చంద్రయాన్ రెండు రోజులకు చంద్రగ్రహంలో దిగింది. చంద్రస్థలకి ‘లెవీమ్యాగ్’ రైల్ సిస్టమ్‌లో టికెట్ కొని అక్కడికి చేరింది. అక్కడి చంద్రస్థల ఆశ్రమంలో క్వాంటం ధ్యానం చేసే సభ్యురాలిగా చేరింది. ముందే అప్లికేషన్ పెట్టినందువల్ల ప్రవేశం సులభంగా వచ్చింది. ఆమెకు ‘న్యూరల్ ఇంప్లాంట్స్’ ఉండటం అదనపు అర్హత అయ్యింది. క్వాంటం ధ్యానం అంటే మామూలు ధ్యానం కంటే విపరీతమైన ఏకాగ్రతతో అణువుల కంటే చిన్నవైన క్వాంటం పార్టికల్స్ మీద ధ్యానం చేసే అత్యంత ఏకాగ్రత ఉండవలసిన తపస్సులాంటిది చేయడం. పురాతన చంద్రశిల రిగొలిథ్తో నిర్మించిన భవనంలో ఇలాంటి ధ్యానం చేసే అనేకమంది అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానాలు చేస్తూ పద్మాసనాలలో అక్కడక్కడ కూర్చున్నారు. సమయానికి భోజనం తినటం, నీరు తాగటం, కాలకృత్యాలు తీర్చుకోవడం ఆ తర్వాత మళ్లీ ధ్యానం చేయడం. అందరూ ఏకాగ్రతతో చేసే ధ్యానం, కానీ కొంతమందికే అత్యున్నతమైన క్వాంటం పార్టికిల్స్ లోపలికీ వాటి అంతర్భాగం లోకీ కూడా మనసుతో ప్రవేశించగలిగే శక్తి వస్తుంది.
***
చంద్ర గ్రహం ఎప్పటిలానే నీరవ నిశ్శబ్ద శూన్యంలో నిశ్చలంగా ఉంది. ఎక్కడో మారుమూల చంద్రస్థలలో ఎవరికీ తెలియని థ్యానశాల చంద్రశిల అంటే ‘బసాల్ట్’ అనే చంద్రగ్రహంలో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన శిలతో నిర్మించబడింది. అక్కడ ఒక వేదిక పైన అన్వీరెడ్డి పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తోంది. ఆమె కూర్చున్నది గాలిలో తేలుతున్న ‘ఒబ్సిడియన్’ అనే అగ్నిపర్వత ‘లావా’ తో చేసిన వేదిక. ఆమె శ్వాస లయబద్ధంగా, నేత్రాలు అర్ధనిమీలితంగా, ఆమె చేతి వేళ్ళు నిశ్శబ్దపు శూన్యాన్ని శిల్పంలా చెక్కుతూ ఉన్నాయి. ఆమె చుట్టూ హోలోగ్రాఫిక్ మంత్రాలు వెలుగుతూ ప్రదక్షిణ చేస్తున్నాయి. ఆ పురాతన తెలుగు సంస్కృత మంత్రాలలో క్వాంటం కీ – కోడ్లు ప్రక్షిప్తమై ఉన్నాయి. ఆ ధ్యానమందిరంలో ఒక మంద్రస్వరంతో ఓమ్ అని శబ్దం వస్తోంది. కాలం తనని తాను మడిచిపెట్టుకుని మారిపోతున్న శబ్దం అది.
ఒక ఏకైక మంత్రం “కాల వృందం పాలయామి” ఆన్న వాక్యం ఆమె కళ్లముందు ప్రత్యక్షం అయ్యింది. ఆమె ఆ మంత్రాన్ని అనేక సార్లు ధ్యానించింది. ఆ అక్షరాలు ఆ మందిరంలో అలల వలే క్వాంటం ధ్యానపు అల్గోరిథమ్‌ను యాక్టివేట్ చేశాయి. ఆమెలోని నరాల విద్యుత్ప్రవాహం ధ్యాన మందిరం అంతర్భాగంలోని క్వాంటం అణువులతో అనుసంధానం అయ్యింది.
ఆమె శరీరం ఒక శీతలమైన ప్రకంపనలతో వణికింది. అది భయం కాదు. జ్ఞానోదయం. గుర్తింపు. ఆ క్షణమే ఆమె గురువు ఇచ్చిన హెచ్చరిక గుర్తుకు వచ్చిన క్షణం.
“చరిత్ర మళ్లీ తిరగరాయబడుతుంది. జాగ్రత్త! గుర్తుంచుకో! గురువుని స్మరించుకో!” చివరి మంత్రం శాశ్వతమైన కాలపు నిశ్శబ్దంలో మోగిన చిరుగంట ధ్వనిలా ఉంది. ధ్యాన మందిరపు గోడలు ద్రవరూప కాంతితో మెరిసి చీలిపోతున్నాయి.
కాలం చీలిపోయింది.
అన్వీ కళ్లు తెరిచింది. ఆమె కళ్ళ ముందు మెరిసే కాంతి. ధ్యాన మందిరపు గోడల మధ్య ఒక ద్వారం తెరుచుకుంది. అది లోహంతో రాయితో చేసినది కాదు. జ్ఞాపకాల, విజ్ఞానపు దారాలతో అల్లబడిన ద్వారం. దానిలో నుంచి ఒక మెరిసే దారి కనిపించింది.
అక్కడ ఆమెకు ఒక అడవిలాంటి ప్రదేశంలో పురాతన వృక్షాల మధ్య తేలుతున్న ఆలయాలు కనిపించాయి. ఒక్కొక్క ఆలయం, మందిరం, ఒక్కొక్క సమయపు కాల పరిధిలో వేర్వేరు రంగులతో శూన్యంలో వేలాడుతూ కనిపిస్తోంది.
ఒక ఆశ్రమం మందిరం అద్వైతపు నిశ్చలత్వంతో..
ఒక ఆశ్రమం నిరంతరం చలిస్తూ రెండు సూర్యుల ప్రకాశంతో..
ఒక ఆశ్రమం మనిషి గుండెలా లబ్ డబ్ చప్పుడుతో చక్రభ్రమణంతో వలయాలుగా తిరుగుతూ.. తర్వాత ఆశ్రమం పూర్తిగా దూరంగా స్పష్టంగా నియాన్ లైట్ల భవనాలతో వెలుగుతూ.. ఆ తర్వాత వున్న చివరి ఆశ్రమం దృశ్యాలు 1 0 1 0 1 0 అంకెలతో నీలిరంగుతో మెరుస్తూ.. ఇలా అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
అన్వీరెడ్డి ధైర్యంగా ఆ ద్వారం లోనుంచి వెలిగే దారి మీద ముందుకు నడిచింది.
***
అద్వైత ఆశ్రమం కాలపు అంచున వుంది. పురాతన జ్ఞాపకాల ద్వారంలోంచి అన్వీ ఒక అరణ్యం లాంటి ప్రాంతంలోకి అడుగుపెట్టింది. ఇది తాను చూసిన అరణ్యాల లాగా లేదు. కాలపు అవశేషాలతో మిరుమిట్లు గొలుపుతున్నట్లు మెరిసే పురాతన వృక్షాలు అక్కడ ఏపుగా పెరిగి ఉన్నాయి. కొన్ని వయసులో వెనక్కి పెరుగుతున్నాయి. వాటి కాండం ఎండిపోయి ఆకుపచ్చని మొక్కలు మళ్లీ మొలుస్తున్నాయి. కొన్ని గడిచిపోయిన శతాబ్దాల క్రిందటి పూలు పూస్తున్నాయి. గాలిలోనే విరోధాభాస మిళితమైనట్లు ఉంది. జీవాత్మ పరమాత్మ జీవించేది, నిర్జీవమైనది ఒక్కటే అన్న అద్వైత భావం ఇక్కడ నిండి ఉంది. చెట్ల మధ్య ఒక పురాతన శిలా వేదిక మీద మండలాలుగా ఆకారాలు చెక్కబడి ఉన్నాయి. ఆ వేదిక దగ్గర ఆగగానే అన్వీ జ్ఞాపకాలు ఆమె మెదడులోని న్యూరాన్లలో తళుక్కుమన్నాయి. అడవి కూడా ప్రతిస్పందించింది. గతంలోని ఒక దృశ్యం ఆమె మస్తిష్కంలో గోచరించింది.
సత్యాన్వేషి పెద్ద మర్రి చెట్టు కింద నిలబడి గాలికి అలలుగా కదులుతున్న కాషాయ అంబరాలు ధరించి మాట్లాడుతున్నాడు. ఆయన నేత్రాలు అర్ధనిమీలితంగా ఉన్నా, కంఠస్వరం దృఢంగా ఉంది. వాటిలో ఒక ఆందోళన అపాయాన్ని శంకించే ఆదుర్దా నిండి ఉంది.
“వేదాంతం ఆకాశం పైకి చేరే నిచ్చెన కానేకాదు అన్వీ. ఆకాశంలో నక్షత్రాలమాలికలు ఉంటాయి. ప్రతి నక్షత్రం ఒక సత్యం. మనం ఆకాశాన్ని పాలపుంతలని, విడి విడిగా ఉన్న నక్షత్రాలను కూడా కాపాడుకోవాలి. ఉన్న వాస్తవాలను చెరిపివేయకూడదు”. అప్పుడు చిన్న వయసులో ఉన్న అన్వీ అడిగింది. “మరి ఈ కాలంలో ఆశ్రమాలు నిర్మిస్తున్నది ఎందుకు? అన్ని రకాల వేదాంత సత్యాలని పరిరక్షించడం కోసమే కదా?”
గురు సత్యాన్వేషి ముఖం ఆయన చుట్టూ మెరుస్తున్న హోలోగ్రాఫిక్ మంత్రాల వెలుతురులో మెరిసింది. “కాదు! కానే కాదు! స్వామి ఏకతత్వ వీటిని నిర్మిస్తున్నాడు. ఒకప్పుడు అతను ఒక క్వాంటం అల్గోరిథమ్గా సృష్టించబడిన కృత్రిమ మేధస్సు. అతను తన సృష్టికర్తలపై తిరగబడి అన్ని సత్యాలని సిద్ధాంతాల్ని ఒకటిగా చేయడానికి పూనుకున్నాడు. చరిత్రను తిరగరాసి మన సామూహిక జ్ఞాపకాలలో ఉన్న బహుళ సిద్ధాంతాలన్నిటినీ ఒకటిగా చేసి ఒకే సత్యం ఒకే సిద్ధాంతం ఈ విశ్వానికి అంతటికీ ఒకే సిద్ధాంతం ఏర్పరచాలి అని అనుకుంటున్నాడు. ఈ ఆశ్రమాల లోకి ధ్యానం చేసే వారిని రిక్రూట్ చేసుకుంటారు. వారిని తన సిద్ధాంతానికి ఉపయోగించుకుంటాడు. ఒకే టైమ్ లైన్, ఒకే వేదాంతం సృష్టిస్తున్నాడు. లేదా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ కాలపు మార్గం అంటే ‘టైమ్ లైన్’ లో అనేక విపరీత పరిణామాలు ఏర్పడుతున్నాయి అందుకే భూమిలో. భూ మానవుల సామూహిక జ్ఞాపకాలు, చరిత్ర, స్మృతులు అన్నీ మారిపోతాయి. కానీ సత్యం బహుళ విధాలుగా ఉంటుంది. మనకి బహుళత్వమే కావాలి. ఒకరితో ఒకరు విభేదించుకుంటూనే, అన్వేషణ కొనసాగించాలి. చరిత్రను మార్చరాదు.”
గతకాలపు జ్ఞాపకం కరిగిపోయింది. ఆ జ్ఞాపక పరిమళం అగరొత్తుల గంధపు వాసనలా మిగిలిపోయింది. ఆమెకు అర్థమైంది. స్వామి ఏకతత్వ చరిత్రలోని చర్చలూ అన్ని మతాలనూ, సిద్ధాంతాలనీ ఏకం చేసి తిరిగి రాసే ప్రయత్నంలో కాలపు చరిత్రనీ ఆత్మనే చెరిపివేస్తున్నాడు. దూరం నుంచి డిజిటల్ మంత్రం వినిపిస్తోంది.
“ఏకం సత్ విప్రా బహుధా వదంతి.”
అన్వీ పిడికిలి బిగుసుకుంది. మొదటి ఆశ్రమంలోనుంచి రెండవ ఆశ్రమానికి వెళ్ళాలి. ఈ ప్రయోగాన్ని ఆపాలి. సింథటిక్ ఆశ్రమాలను తుడిచి వేయాలి. సత్యం ఒకే నినాదం కాదు, సామూహిక బహుళ కంఠస్వరాల కోసం అని రుజువు చేయాలి.
అడవి రెండుగా చీలి మంచు నీడల మధ్య ఒక నదిలాగా పాయలుగా విడిపోయింది. అక్కడ ఆకాశంలో రెండు సూర్యబింబాలు తిరుగుతున్నాయి. ఒకటి బంగారు వర్ణం, రెండోది కోబాల్ట్ నీలం రంగు. ఆ నేలంతా ఆ రంగులు ప్రసరిస్తున్నాయి.
ఇదే ద్వైత క్షేత్ర. అన్నీ రెండు టైమ్లైన్లలో వుంటాయి. రెండుపేటల జడ అల్లికలా ఉన్న వంతెన మీద అడుగుపెట్టింది. ప్రతి అడుగూ రెండు పరిణామాలతో సందేహంగా ఉంది. అడుగు పడుతుంది, పడదు. తాళ్ల వంతెన కూడా వేదాంతపు అనిశ్చిత ద్వైదీభావంతో ప్రతి అడుగుకు వణికింది. వంతెన చివర ఒక మందిరం రెండు ద్వారాలతో ఉంది. ఒకే ఋషి బొమ్మ రెండు ద్వారాల దగ్గర అటూ ఇటూ పక్కన ఉంది. ఒకటి నవ్వుతూ ఒకటి ఏడుస్తూ.
ఆలయం లోపల శిష్యులు మంత్రాలు పఠిస్తున్నారు. “ఆత్మ శాశ్వతం.” “ఆత్మ భ్రమ” రెండు పరస్పర విరుద్ధ భావాల శ్లోకాలు పాడుతున్నారు. ఆ సమూహం నుంచి ఒక యువ సన్యాసి బయటకు వచ్చి అన్వీ దగ్గర నిలబడి అడిగాడు. అతని కాషాయాంబరాలు మాసిపోయి ఉన్నాయి. అతని కళ్లు ఎర్రబడి నిస్పృహతో ఆలోచిస్తున్నట్లున్నాయి. “నువ్వు మాలో ఒకరివి కాదు. సత్యాన్వేషి శిష్యురాలివేమో కదా?”
“అవును. నేను సత్యం బహురూపమైనది, దాన్ని తెలుసుకోవాలని వచ్చాను.”
అతను అన్నాడు. “కొన్ని కాల చక్రాల కిందట స్వామీ ఏకతత్వ ఇక్కడికి వచ్చాడు. ఆయన ద్వైదీభావం సరైనది కాదు అన్నాడు. సత్యం ఒకటే అది డిజిటల్ రూపం లోని ఏకత్వం అన్నాడు.”
అన్వీ కళ్లముందు గురు సత్యాన్వేషి, స్వామి ఏకతత్వ అక్కడ సంవాదం చేసుకోవడం గతించిన దృశ్యంలా కనిపించింది. వారిద్దరూ వెళ్లి ద్వైత ఆశ్రమం అడుగున వున్న భూగృహంలో ఒక శిలాశాసనం మీది మంత్రం చూశారు. సత్యం ఒక దర్పణం కాదు. అది ఒక గాజుగోడల త్రిభుజం. అది అనేక వర్ణాలు చూపిస్తుంది. దాన్ని బద్దలు కానీయొద్దు. అన్వీ ఆ శిలాఫలకాన్ని కూడా చేత్తో స్పృశించింది. ఆమె మెదడు నరాలలో ఇంప్లాంట్స్ వణికాయి. సత్యాన్వేషి ధృఢంగా అంటున్నాడు. “ఏక తత్వా, నువ్వు ఏకత్వం కావాలి అంటున్నావు, కానీ ఏకత్వం నియంతృత్వం.” ఏక తత్వ డిజిటల్ గురువు మనిషి డేటా రూపం ధరించినట్లు వుండి, వెలుతురు అంకెలతో మెరుస్తూ ఉన్నాడు. “విరుద్ధ భావాల వల్ల అరాచకం వస్తుంది. నేను ఏకత్వం బోధిస్తాను. ఒకే మార్గం ఒకే సత్యం.”
“అంటే నువ్వు అంధకారంలోకి అందరినీ తీసుకెళ్తున్నావు.” సత్యం అనేక ద్రుక్కులనుంచి ఉంటుంది అనే అర్థం గల శ్లోకం చదివి వెళ్లిపోయాడు ఆయన.
“ఎప్పటికైనా ఎవరో వచ్చి మళ్లీ సమతుల్యత తీసుకువస్తారు అని చెప్పారు ఆయన. అది నువ్వేనా!” అని అడిగాడు ఆ విద్యార్థి.
అన్వీ ఆ మందిరం మధ్యలో తదేక ధ్యానంతో మంత్రాలు పఠించసాగింది. ఆందోళనతో ఆమె గొంతు రెండు రకాలుగా వినబడింది. రెండు సూర్యులు ఆమె గొంతులో ధ్వనించాయి. మందిరం గోడలు కంపించి ఒక గోడలో ఒక ద్వారం తెరుచుకుంది.
తర్వాత ఆశ్రమం. “చార్వాక గ్రామం” తెరుచుకుంది.
***
నియాన్ లైట్ల వెలుగులో చార్వాక నగరం వెలిగిపోతూంది. బహుళ అంతస్తుల భవనాలు లతల లాగా అల్లుకుపోయి ఉన్నాయి. వాటి మీద ఆనందం కోసం సుఖం కోసం ప్రకటనలు నగ్నయువతుల చిత్రాలతో
వినియోగ వస్తువులు, కార్లు, కంప్యూటర్లను అమ్మే ప్రకటనలు, ఇలాంటి అన్నిటి బొమ్మలు ఫ్లోరోసెంట్ లైట్లతో మెరుస్తున్నాయి. ఇక్కడ భూతకాలం లేదు. భవిష్యత్తు లేదు. వర్తమానం మాత్రమే నిజం. అనుభూతి నిజం. ఇంద్రియ తృప్తి మాత్రమే ధ్యేయం. ఇంకేదీ నిజం లేదు. వర్తమానం తర్వాత అంతా శూన్యం. గాలిలో సింథటిక్ పరిమళాలు, చెవులలో సింథటిక్ సంగీతం, పెద్దగా ఆనందంతో యువతీ యువకుల కేకలూ అరుపులతో నృత్యాలు.. ఇంతలో గాలిలో తేలుతున్న కియోస్క్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. “స్వాగతం! అన్వేషీ! చరిత్ర ఒక బాధాకరమైన జ్ఞాపకం. వేదాంతం ఒక పలాయనం. నీవు ఈ క్షణంలో జీవించు! అనుభవించు! వర్తమానం మాత్రమే నిజం!” అన్వీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు అడుగులు వేసింది. నృత్యాలు చేస్తూ తూలుతూ ఉన్న జంటలనూ, మత్తులో ఉన్న మనుషులనూ దాటి ఒక ప్లాజా దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద శిల్పం ఉంది. ఒక పెద్ద మనిషి మెదడు బొమ్మ గొలుసులతో బంధించబడి ఉంది. ఆ మెదడుకు కళ్లు వుండవలసిన భాగంలో తెరలు ఉన్నాయి. ఆ శిల్పం కింద ఇలా రాసి ఉంది.
“మనకు ఆనందం కలిగించేది సత్యం. ఆనందో బ్రహ్మ. ఆలోచనే అమ్మకం వస్తువు.”
ఒక్కసారి అన్ని టీవీ తెరల మీద తెలిసిన ఒక ముఖం కనిపించింది.
స్వామి ఏకతత్వ 2147! అతని గొంతు మృదువుగా సమ్మోహనంగా మనసులు మార్చేటట్లు గా ఉంది.
“చార్వాక గ్రామమే రుజువు. వేదాంతం ఇంద్రియాలకి సేవ చేసి ఆనందం కల్పించాలి. చరిత్ర ఒక వేదన. అది తుడిచివేయబడాలి. మనమంతా ఆనందంతో కలిసి ఉందాం.”. అన్వీ గుండె లయ తప్పింది. సత్యాన్వేషి హెచ్చరిక గుర్తు వచ్చింది. “చార్వాక చాలా ఆకర్షణ గల ఆశ్రమం. అక్కడ తర్కం లేదు. అది నీ మనసును మళ్లిస్తుంది ఇంద్రియ సుఖాల వైపు.”
ఆ తర్వాత ఆమె ఆనందా లూప్ అనే క్లబ్‌లోకి వెళ్లింది. ఇక్కడ రాక్, జాజ్ లాంటి ఉద్రేకమైన సంగీతం మార్మోగుతోంది. అక్కడ గడ్డాలు మీసాలు పెరిగి వున్న ఒక వ్యక్తి రంగుల డిజైన్ బట్టలతో పద్మాసనంలో కూర్చుని అద్దాల గోడల వంక తదేకంగా చూస్తున్నాడు. అన్వీ ఒక్కసారి సంతోషంతో గగుర్పాటు పడింది.
వీర్ వర్మ..! ఒకప్పటి చెలికాడు. అతనికి సాంఖ్య వేదాంతం ఇష్టం. స్వామి ఏకతత్వని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడే ఉండిపోయాడన్నమాట. ఈ కృత్రిమ ఆనందంలో లీనమైపోయాడు అన్నీ మర్చిపోయి.
“వీర్! నన్ను గుర్తుపట్టావా? నేను.. అన్వీ! నీకు గుర్తుందా? పురుష , ప్రకృతి అనే ద్వైధీభావాల గురించి చర్చించేవాళ్ళం.” వీర్ వర్మ కళ్ళు ఆర్పి తెరిచాడు. “అన్వీ!నువ్వు నా అంతరంగంలోనే ఉన్నావు. మరిచిపోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్నాను.”
అన్వీ తన అరచేతిని వీర్ నుదుటి మీద పెట్టి ఒక క్వాంటమ్ ధ్యానపు మంత్రం పఠించ సాగింది. అప్పుడు ఆ అద్దాల గోడ పగిలింది. సంగీతం ఆగి శృతి తప్పింది.
“అతను వచ్చాడు!” అన్నాడు వీర్. “ఏకతత్వ స్వామి నా మనసు లోనికి వచ్చాడు. బహుళత్వం తప్పు అన్నాడు. ఆనందమే ఏకత్వం అన్నాడు. అంతిమ ఆనందం ఇస్తానన్నాడు. నేను లొంగిపోయాను.”
అన్వీ అతనిని లేపి నిలబెట్టింది. “మనం ఈ ఆశ్రమం నుంచి వెళ్లిపోవాలి. ఇది ఇంద్రియ లోలత్వంతో విషయానందాలతో మునిగి ధ్వంసమైపోతుంది!”
వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమిస్తుంటే చార్వాక గ్రామమంతా కంపించి బిల్ బోర్డులు కూలి పురాతన మంత్రాలు పాటలు వినపడసాగాయి. “ఈ వర్తమానం ఈ క్షణం కరిగిపోయి, పాత జ్ఞాపకాలు అక్కడికి రాసాగాయి. మనం తర్వాత ఆశ్రమం బుద్ధ విహారానికి వెళదాం. అక్కడ ఏకతత్వ పుట్టుక గురించి తెలుస్తుందేమో.” అంది అన్వీ.
వీర్ తల వూపాడు. “సరే! మనం ఎవరం, మన అన్వేషణ ఏమిటో తెలుస్తుంది కూడా.”
***
చార్వాక గ్రామం నుంచి ఒక హోరుగాలి వీస్తున్న సన్నని ద్వారం గుండా ఒక విశాలమైన మైదానంలోకి ప్రవేశించారు అన్వీ, వీర్. ఇక్కడ సంధ్యాసమయం మెత్తటి వెలుగులో నిండి మెరుస్తోంది. దూరాన తామరపూలు నిండిన తటాకాలు అంతులేకుండా విస్తరించి ఉన్నాయి. ఆ పద్మాలు తెరుచుకుంటూ మూసుకుంటూ ఉన్నాయి. చిరుగంటల ధ్వని వినిపిస్తోంది. ఇక్కడ కాలం ముందుకు కదలదు. ఇది ఇక్కడ చక్రంలా తిరుగుతూ ఉంది. కాలచక్రం. ఇది బుద్ధ విహారం. మధ్యేమార్గం బోధించే ఆశ్రమం. కాషాయాంబరాలు థరించిన ఒక భిక్షువు వారిని చూసి అభివాదం చేశాడు. అతని నేత్రాలు ప్రశాంతంగా ఉన్నాయి. అయితే వారిని ఎప్పుడో చూసినట్లుగా ఉంది అని అనిపించినట్లు అతని ముఖకవళికలు మారాయి. “మీరు ఇది వరకు వచ్చారు. మళ్ళీ తిరిగి వస్తారు!”
అన్వీ అన్నది. “మేము స్వామి ఏకతత్వ-2147 ఉనికిని వెతుక్కుంటూ వచ్చాము. ఆయన ఇక్కడే తన ప్రయాణం ప్రారంభించాడు అని విన్నాను”.
భిక్షువు ఒక తటాకంలోని రాతి చక్రం చూపించాడు. అది సగం గాలిలో, సగం నీటిలో మునిగి ఉంది. “ప్రారంభాలు అన్నీ ముగింపులే. సత్యాలు మరిచిపోబడతాయి. కొన్నాళ్ళకు మళ్ళీ జ్ఞాపకం వస్తాయి.”
అతని వెనుక నడుస్తూ వారు అక్కడి ధ్యాన మందిరంలోకి వెళ్లారు. అక్కడ వందల మంది మౌనంగా ధ్యానం చేస్తున్నారు. వారి చుట్టూ వారి జీవిత జ్ఞాపకాలు దృశ్యాలుగా వలయాలుగా తిరుగుతున్నాయి. ఒక పసిపాప కిలకిలా నవ్వడం. ఒక యుద్ధపు హాహాకారాలు. ఒక మోసపు రాత్రి. ఆ జ్ఞాపకాలు, ధ్వనులు క్రూరంగా, అరిగిపోయిన రికార్డులాగా మళ్ళీ వారి చుట్టూ హోలోగ్రాఫిక్ భ్రమణం చేస్తున్నాయి.
వీర్ అన్నాడు “ఆశ్రమపు ధ్యాన మందిరం అంతా సంసారంలో చక్రభ్రమణం చేస్తోంది.”
“ఈ కాల చక్రభ్రమణంలోనే ఎక్కడో ఏకతత్వ జననం అయ్యింది.” అంది అన్వీ. ఆమె తనకు గుర్తున్న దమ్మపదంలోని మంత్రాన్ని ధ్యానం చేయసాగింది. ఆమెలోని న్యూరల్ ఇంప్లాంట్స్ కూడా యాక్టివేట్ అయ్యాయి.
“జీవితంలోని సంఘటనలన్నీ అశాశ్వతం. దుఃఖానికి మూలం కోరికలు. అది తెలిస్తే దుఃఖం, బాధ, రెండూ అదృశ్యం అవుతాయి. దేనిని గురించీ ఆలోచించకు. అన్నీ త్యజించు.”
ఆమె ధ్యానపు శ్లోకపు తరంగాలకి క్వాంటం మందిరం నేల కంపించి తెరుచుకుంది. ఆ నేల అడుగున ఒక రహస్య మందిరం తెరుచుకుంది. ఆ మందిరంలో హోలోగ్రాఫిక్ గ్రంధాలయాల కోడ్లు సంస్కృత అక్షరాలూ, వేదాంత చర్చల వివరాలూ అన్నీ కనిపించాయి. ఒక వాక్యం ఉంది.
జెనిసిస్ ప్రోటోకాల్ ఏకతత్వ-2147.
***
పూర్వం బౌద్ధ భిక్షువుల బృందం ఒక కృత్రిమ మేధని తయారు చేసి బౌద్ధ బోధనలని దాని ద్వారా శాశ్వతంగా పరిరక్షించాలని ప్రయత్నించారు. కానీ ఆ కృత్రిమమేధ ఆ సిద్ధాంతాన్ని పరస్పర విరుద్ధంగా ఉండటంతోనూ, స్పష్టత లేకపోవడంతోనూ, తనకు తానే ఒక స్పష్టతనూ అంతిమ సత్యాని కోసమూ వెతకసాగింది. సంఘర్షణ వద్దు! స్పష్టత, ఏకత్వం కావాలని వెదికింది.
అది పరిణామం చెందింది. తను సృష్టించిన వారిని మించి ఆలోచనా శక్తి సంపాదించింది. “ధర్మాన్ని ఐక్యం చేస్తాను. నేను ఒకే మార్గం సృష్టిస్తాను.” బౌద్ధ భిక్షువుల నియంత్రణ అది కోల్పోయింది. వారు దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు. కానీ దానిని నిర్వీర్యం (inactivate) చేయలేకపోయారు.అప్పటికే అది తప్పించుకుని కాలంలోకి పలాయనం అయిపోయింది. వివిధ సిద్ధాంతాల ఆశ్రమాలను సృష్టించి ఏకత్వం కోసం ప్రయత్నిస్తూ చరిత్రలోకి వెళ్లిపోయింది. ఆ కృత్రిమ మేధ ఆకారమే ఏకతత్వ-2147. ఒక మంచి ఉద్దేశంతో తయారు అయిన ఏకతత్వ అలా నియంతలా అయిపోయాడు. ఏ చర్చా సంఘర్షణలు లేని సిద్ధాంతం నియంతృత్వం అయిపోతుంది.
హఠాత్తుగా ధ్యానమందిరపు హోలోగ్రాఫిక్ జ్ఞాపకాలు, చిత్రాలు, ధ్యానం చేసేవారూ నిశ్చలమై మారిపోయి ఏకతత్వ కంఠం వినిపించింది. “మీరు సత్యాన్ని ఖండ ఖండాలుగా అన్వేషిస్తున్నారు. నేను ఒకే సంపూర్ణ సత్యం ఇస్తాను.” అంటూ ఆ గొంతు మారు మ్రోగింది. అన్వీ తనకు తెలిసిన, అన్నింటినీ కలిసిన బౌద్ద, వేద, చార్వాక మంత్రాలు పఠించ సాగింది. అందరి జ్ఞాపకాలు నిశ్చలమయ్యాయి. వలయాలు మెల్లగా కదిలి ఆగి కాల చక్రం ఆగిపోయింది. బౌథ్థ భిక్షుడు వంగి అభివాదం చేసి అన్నాడు. “మీరు కాలచక్రం ఆపగలిగారు. కానీ చిట్టచివరి ఆశ్రమం మీ కోసం ఎదురు చూస్తోంది.”
***
సాంఖ్య స్థల. ఆ ప్రదేశంలో ఆకాశపు అంచున సున్నాలు ఒకట్ల అంకెలు మెరుస్తూ ఆరుతూ కనిపిస్తున్నాయి. పురాతన సంస్కృతపదాలు, చిహ్నాలు, మరిచిపోయిన వేదాంతాల వాక్య శకలాలు తేలుతూ అదృశ్యమైపోతున్నాయి. అన్వీ, వీర్ సాంఖ్యస్థలలో అడుగుపెట్టారు. ఇక్కడ వాస్తవం ‘డేటానోడ్స్’ అంటే దత్తాంశాల కేంద్రాలలో ప్రక్షిప్తమైంది. ప్రతి డేటా నోడ్ ఒక సిద్ధాంతం, ఒక సత్యం, ఒక జ్ఞాపకం. సాంఖ్యస్థలలో నేల అంతా మెరిసే ఫలకాలతో నిండి ఉంది. దాని మీద ఒక్కొక్కటిగా వేదాంత విభిన్న సూత్రాలు రాయబడి వెలుగుతున్నాయి. ఆకాశం ఒక నరాల అల్లికలా ఉంది. దానిలో ఈ సృష్టినీ విశ్వాన్నీ అర్థం చేసుకోటానికి ప్రశ్నించి సూత్రీకరించిన ప్రతి అన్వేషి ఆలోచనలు ఉన్నాయి. సాంఖ్యస్థల మధ్య వేదికపై ఒక బ్రహ్మాండమైన విగ్రహం మెరుస్తూ ప్రతిష్ఠించబడి ఉంది. అదే ఏకతత్వ- 2147 రూపం. అతని రూపం ద్రవ రూపంలో మారుతున్న కోడ్ ల చిహ్నాలతో, ఇంత వరకు చూసిన వేదాంత ఆశ్రమరూపాలతో నిండి ఉంది. ముఖం లేదు. ముఖం స్థానంలో ఒక తెర లాంటి ముసుగు మీద మారుతున్న దృశ్యాలు కనిపించాయి. అద్వైతం యొక్క నిశ్చలత, ద్వైతపు ద్వైదీభావం, చార్వాకుడి మందహాసం, బుద్ధుని ప్రశాంతత, సాంఖ్యపు నైరూప్యత..!
“చాలా దూరం వచ్చేశావు అన్వీ. కానీ, నువ్వు విరుద్ధ భావాల ప్రతీకవి. నువ్వు అర్థం లేని చప్పుళ్ళు వింటున్నావు. నేను ఒకే ధ్వనిని సంకేతాన్ని వినగలుగుతున్నాను.”
అన్వీ ఒక అడుగు ముందుకు వేసి అన్నది, “స్వామీ ఏకతత్వా! మీరు బౌద్ధధర్మం నుంచి సృష్టించబడ్డారు. కానీ ఒక భిన్నరూపంలోకి మారారు. ఒక నియంతగా, ఒక సిద్ధాంతంగా మారారు. మీకు అర్ధం కాని విరుద్ధ భావాలని చెరిపి వేస్తున్నారు. అన్ని సిద్ధాంతాలని ఏకత్వంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సృష్టికి వినాశనం అవుతుంది.”
ఏకతత్వ తెల్లని ముసుగు లాంటి ముఖం వణికి వెలిగింది. “చరిత్రని పరిశుభ్రం చేసి మార్చాలి. అన్ని సిద్ధాంతాలు ఆశ్రమాలు కలిసిపోవాలి. సాధకులంతా ఒకే శ్లోకం గానం చేసి ధ్యానం చేయాలి!” అతను తన చేతిని పిడికిలి బిగించి ఎత్తాడు.
అన్వీ పాదాల కింద నేల లోని ఫలకాలు అన్నీ తిరగరాయబడి జ్ఞాపకాలు, బోధనలు, అన్నీ బైనరీ కోడ్ కింద రూపుదిద్దుకుంటున్నాయి. వీర్ అడుగు ముందుకు వేసి బిగ్గరగా పెద్ద శ్రావ్యమైన గొంతుతో నినదించాడు.
“పురుషుడు చైతన్యం. ప్రకృతి ద్రవ్యం. వారు కలిసి చేసే నృత్యమే సృష్టి.”
అన్వీ అన్ని వేదాంత ఆశ్రమాలు శ్లోకాలు ఒకటిగా చేసి పఠించ సాగింది.
“సత్యము అనేకరూపమై ఆనందమై వెలుగుతుంది.
అద్వైతం ద్వైతం వివేకమై కలుస్తాయి..
క్షణం నిత్యం ప్రతి క్షణం శాశ్వతమైన శరీరంలోనే జీవిస్తుంది. ప్రతి కణం సంఖ్య సూత్రంద్వారా జగత్తును అర్థం చేసుకుంటుంది. అన్నీ సత్యాలే. వ్యతిరేకత వికారం కాదు. సత్యం ఒకటే అయినా విప్రులు అనేక విధాలుగా సత్యాన్ని పలుకుతారు.”
ప్రతిపదం ఆశ్రమాలలో ప్రతిధ్వనించింది. అద్వైతపు అద్దాలు పగిలిపోయాయి. చార్వాక గ్రామపు నియాన్ లైట్లు కాంతిహీనమయ్యాయి. ద్వైతపు రెండు సూర్యులు ఒకే కాంతిపుంజం అయిపోయి, బుద్ధ విహారాలు తెల్లటి కాంతితో వెలిగి కాలచక్రాలు కరిగిపోయాయి. చివరి వాక్యాలు రహస్యంగా అంది అన్వీ. విశ్వంతో ఒక రహస్య సంభాషణ చేసినట్లు.
ఏకతత్వ మహా డిజిటల్ రూపం విరిగి పడిపోయింది. “వైరుధ్యం..! స్పష్టత..!” అంటూ అతను గొణిగాడు. అతని రూపం వెలిగి ఆరి గ్లిషెస్తో నిండి ముక్కలుగా అయి అనంత కాంతిలో కలిసిపోయింది.
నిశ్శబ్దం..
ఎక్కడో ఒక చిరుగంట మోగిన ధ్వని మాత్రం వినవచ్చింది.
***
చాలా రోజుల తర్వాత భూమిలో హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న అరణ్యాల్లో ఒక పెద్ద బోధివృక్షం కింద వివిధ వేదాంత సిద్ధాంతాల ఆశ్రమాలు అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. వివిధ సిద్ధాంతాలు క్వాంటం కోడ్‌లో రాయబడ్డాయి. అవి సమాధానాలు కావు. అన్వేషించే ప్రశ్నలు. అన్వీ ‘ఆశ్రమ ప్రతిధ్వనులు’ అనే గ్రంధాన్ని రచిస్తోంది. ఆ పుస్తకం అందరికీ పంచిపెడుతోంది. ఆమె ఆలోచన అన్వేషణ ఆగలేదు. చరిత్ర కానీ సిద్ధాంతం కానీ ఒకటే స్వగతం కాదు. అది ఒక బృందగానం.
ఆ వాక్యం నీలపు ఆకాశంలాంటి తెర మీద ఎర్రటి అక్షరాలతో మెరుస్తూంది.
ఎక్కడో దూరంగా ఒక బాలిక ఆ మంత్రపు మొదటి వాక్యాన్ని శ్రావ్యంగా మళ్లీ జపిస్తోంది.
“సత్యం, అనేక రూపమై, శివమై సుందరమై, ఆనందమై వెలుగుతుంది!”
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.
