Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవుని వేదన, అంతరంగ నివేదన నిండిన ‘అశ్రుభోగ’

మధ్య చదివిన మంచి పుస్తకాలలో శ్రీ సుప్రసన్న గారి “అశ్రుభోగ” ఉత్తమ కావ్యంగా మనసులో నిలిచింది. శ్రీ సుప్రసన్న గారు పేరుకు తగ్గట్టుగా ప్రసన్నంగా జీవితం సాగిస్తూ ఉండే అరుదైన వ్యక్తులలో ఉన్నతులు. వారి పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల వారి వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకునే ప్రయర్నం చేసాను. వారే చెప్పినట్లుగా దుఃఖం అంటే ఏమిటో అర్ధం చేసుకునేందుకు, ఈ కావ్యం కొంత ఉపయుక్తమవుతుంది.

అది ఒక పద్య కావ్యం. ప్రాచీన ఆధునిక సాహిత్య సమన్వయంలో పండిపోయిన వ్యక్తి, జీవితాన్ని పలు కోణాలలో చూచిన వ్యక్తి, పరిణతి చెందిన వయసులో పద్యం వ్రాస్తే ఎలా ఉంటుందో ఆ కావ్యంలోని సాహిత్యం అలా ప్రతిబింబిస్తుంది. దానిలోని భాషా పాండిత్యాన్ని, సాహిత్య లోతులను, విమర్శనా దృష్టితో పరిశీలించి పరిచయం చేసే సామర్ధ్యం నాకు లేదు. అయితే ఆ కావ్యం చదువుతున్నప్పుడు, వారి అంతరంగం లోని ఆవేదనను అర్ధం చేసుకునే ప్రయత్నం చేసాను. ఆ కావ్యం నిండా నాకు కనిపించినది వారి సాధనా పటిమయే, వారి ఆరాధనా వైభోగమే. దానికి సంబంధించిన నా అనుభూతులను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.

కర్మానుభవాన్ని పొందడం కోసం అవ్యక్తమైన అపరిమితత్వం నుండి పరిమితులతో కూడిన వ్యక్తంగా జీవుడు అవతరించడం “పుట్టుక”. భౌతిక జీవన పరిమితులను అధిగమించి అవ్యక్తంలో లయం కావడం “మరణం”. గమ్యం, గమనం నిశ్చయ మయ్యాక జరిగేది పుట్టుక… గమ్యం చేరాక కలిగేది మరణం. మరణానికి పుట్టుకకు మధ్య వ్యాప్తి చెందిన జీవ చైతన్యం తన లక్ష్య నిర్దేశన కోసం తపిస్తుంది.

జీవుని ఆత్మ వేదన సంవేదనగా, ఆత్మ మూలాలను తెలుసుకోవాలనే లక్ష్యంతో సాగి, తత్వ రహస్యాలను అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి జీవికి పుట్టుక మరణం తన చేతులలో లేనివి. ఈ రెంటి మధ్య జీవితాన్ని ఎలా నిర్వహించుకుంటామన్నది మాత్రమే తన చేతులలో ఉన్నది. జీవితంలో పరిణతి సాధించేందుకు, జీవితాన్ని ఉన్నతీకరించుకునేందుకు, మన ప్రయత్నం ఎలాంటి దన్నది మన చేతులలో ఉన్నది. జిజ్ఞాస కలిగి తన మార్గంలో ఎదురయ్యే ద్వంద్వ ప్రవృత్తుల ప్రలోభాల అడ్డంకులను అధిగమిస్తూ, భౌతిక ఆధ్యాత్మిక జీవిత పార్శ్వాలను సమన్వయం చేసుకుంటూ, తనను తాను “యెఱుక” పరుచుకుంటూ, యే అనుభవాన్నయినా, అనుభూతినైనా ఆత్మాన్వేషణా ఉపకరణంగా మలుచుకుంటూ, సాధనా పర్వంలో ముందుకు సాగడం లక్ష్యంగా సాధకుని ప్రస్థానం సాగుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా శ్రీ సుప్రసన్నగారి జీవితాన్నే చెప్పుకోవాలి.

అనంతమైన శక్తి స్వరూపంగా, అన్నింటినీ తనలో ఆపాదించుకొని, ఈ భూమిపై జీవిగా అవతరించిన వ్యక్తి, తన భావనలో అన్నింటినీ లయం చేసుకుంటాడు. ఆ క్రమంలో “ఆకలి” కూడా అతని సహజాతమే. ఆకలి అంటే కడుపులో ఆహారాన్ని కోరుతూ కలిగే రసాయనిక ప్రక్రియయే కాదు. భవితపై ఆశ కూడా ఆకలియే. పునరుత్పత్తికై మనలో జరిగే భావన కూడ ఆకలియే. సాధించాలనే తపన కూడా ఆకలియే. ఇలా ఏదైనా వ్యక్తిని ముందుకు నడిపేది ఆకలిగానే పరిగణించాలి. ఆకలి సహజమన్నాం కాబట్టి దానిని తీర్చుకోవడమూ ప్రాకృతిక ధర్మమే. ఇది ఆదరణీయం కూడా. కాని అధర్మ మార్గంలో ఇతరుల ఆకలిని కూడ మనమే స్వంతం చేసుకోవాలను కోవడం వికృతి అనబడుతుంది. ఇదే క్రమంలో తన కున్నది ఇతరుల ఆకలి తీర్చేందుకు త్యాగం చేయడం, పంచుకొనడం సంస్కృతిగా లేదా సంస్కారంగా చెప్పబడుతుంది. ఇందులో ఆనందం ఉంది. ఈ సంస్కారం పొందేందుకు సాధన కావాలి. ప్రకృతితో సహజీవనం చేసేందుకు అవసరమైన మానసిక చైతన్యం కావాలి. భగవంతునితో అనుసంధానమయ్యే సమర్పణాభావనతో కూడిన భావనా జ్యోతి ఉద్దీపన కావాలి. విజ్ఞాతా పూర్ణమైన అలోచనా పరిణతి వెలుగు చూడాలి. నిర్మలినీకరణమైన ఆత్మ పరమాత్మ తత్వాశ్రితమై అందులో శాంతిని పొందాలి. భావోద్వేగాలను పరమాత్మకు నివేదించ గలిగిన వికసన కావాలి. ఆత్మ చైతన్యం చేతనా భరితమై, జాగృతమై సమదృష్టిని, సమతాభావాన్ని, సమన్వయాన్ని, సమంజసమైన సమగ్రమైన ఆత్మ వికాసాన్ని కలిగించాలి. ఈ వికసన కలిగేందుకు అవసరమైన విస్పురణ శ్రీ సుప్రసన్న గారిలో వారి సాహిత్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది.

నిర్భీతితో కూడిన ప్రయాణమే అయినా సంక్లిష్టమైన జీవన ఆధ్యాయాలను అధిగమించే సమయంలో సాధారణ వ్యక్తి “నాకెందుకీ కష్టాల నిచ్చావ”ని మొర పెట్టుకుంటాడు. కాని సుప్రసన్నగారు, ఈ కష్టాల నధిగమించే క్రమంలొ దానిని తట్టుకునే మానసిక స్థైర్యాన్ని ఇమ్మని, ఆ క్రమంలో భగవంతునిపై నమ్మకం, విశ్వాసం జారిపోకుండా పటిష్టంగా నిలిచే మనస్సును అనుగ్రహించమని కోరడం వారి పరిణతికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. పరీక్షా సమయంలో భగవంతుడిపై అచంచల భక్తి విశ్వాసాలను, ఆత్మ నిగ్రహణను ప్రదర్శిస్తూ…. ఇవన్నీ కర్మానుభవ సాధనాలని భావించే ధార్మిక బుద్ధి ఆధ్యాత్మిక సాధనా విశేషం చాలా కొద్ది మందిలో ఉంటుంది. అందులో శ్రీ సుప్రసన్నగారు ఒకరు.

నేనెవ్వరిననే శ్రీరాముని ఆత్మాన్వేషణా జిజ్ఞాస యోగ వాసిష్టానికి రూపమిచ్చింది. ఋషితుల్యులైన శ్రీ సుప్రసన్న గారి అలాంటి తాత్విక చింతనా భరితమైన ఆత్మాన్వేషణా పర్వంలో ఆయన ఎదుర్కొన్న కఠిన పరీక్షలు అనేకం. వారి జీవితం సుఖ దుఃఖ సమన్వితం. కాకపోతే వారు ఆ ప్రక్రియలను తీసుకున్న విధానం వారి ఆధ్యాత్మికా పరిణతికి అద్దం పడుతుంది. ఆత్మ లోతులను, మూలాలను అన్వేషిస్తూ, అంతర్గత గ్రంథులను విప్పుకుంటూ, అగమ్య గోచరమైన మార్గంలో, కష్టాల రూపంలో ఎదురౌతున్న అడ్డంకులను అధిగమిస్తూ సాగే వారి ప్రయాణం సాధకులకు మార్గదర్శిగా నిలుస్తుంది. అన్వేషణ సాగుతున్న సమయంలో చుట్టూ అంధకారం, తోడు ఎవరూ లేరు, ఉన్న వారు తనను విడిచి వెళ్ళారు, ధైర్య చెప్పేవారు లేరు, తాను నిలిచిన కూడలి నుండి జాగ్రత్తగా చూస్తే ఎన్నో మార్గాలు, ఏ మార్గం ఎటు తీసుకు వెళుతుందో తెలియని స్థితి, ఈ క్రమంలో ఇంతటి అంధకారంలో దివ్యత్వాన్ని గుర్తించడం ఎలా? ఈ స్థితిలో భౌతిక జీవనంలో కలిగే దుఃఖాన్ని కట్టడి చేయాలి. ఆధ్యాత్మిక జీవన ప్రస్థానంలో ఆటంకం రాకుండా చూచుకోవాలి. దుఃఖమూ సంవేదనలను సమన్వయం చేసుకుంటూ ప్రగతినీ సుగతినీ ఇవ్వగలిగిన ఆ పరమేశ్వరునికి సమర్పణా భావంతో నివేదిస్తూ ముందుకు సాగడమే ఉత్తమం… వివశత్వమూ సాధనలో భాగమే. మన చేతులలో లేని స్థితిలో వివశులమై మన బాధ్యతను భగవంతునికి అప్పగిస్తాము. అదే ఆర్తి శ్రీ సుప్రసన్న గారి రచనల నిండా మనం చూడవచ్చు. అదే శ్రీ సుప్రసన్న గారు ఎన్నుకున్న మార్గం.  ఆ మార్గమే వారిని నిర్వేదులను చేస్తూ భౌతికస్థమైన బాధలను తట్టుకునే స్థైర్యాన్ని ఇచ్చింది. “పరా” మార్గ గమనాన్ని సుసంపన్నం చేస్తుంది.

కర్మాచరణ హృదయంపై ముద్రలను వేస్తుంది. ఆ ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందే. ఇక్కడ పాప పుణ్యాల ప్రసక్తి లేదు. పురాకృత కర్మానుభవాలను అనుభవించే నేపథ్యంలో ఆ దవాగ్ని తన విజ్ఞాన తృష్ణను మ్రింగకుండా చూడవలసిందిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, తన ఆర్తిని దైవానికి విన్నవించుకుంటూ ఆ కర్మలను అనుభవిస్తాడు, పరిణతి చెందిన సాధకుడు.

పది సంవత్సరాల క్రితం తన కుమారుడు మరణించడం, రెండు సంవత్సరాల క్రితం చెల్లెలు గతించడం, సంవత్సరం క్రితం భార్య పరమపదించడం, ఇప్పుడు తన చిన్న కూతురు భర్త స్వర్గస్థులవడం తనను కలచి వేసిన నేపథ్యంలో తన దుఃఖాన్ని దిగమ్రింగుకోవడం మామూలుగా నయితే అసాధ్యమే. ఇదే క్రమంలో తాను అధికంగా ప్రేమించే గౌరవించే తన చిన్నాన్న గారి  మరణమూ తనను కలచి వేసింది. ఈ సంఘటనలతో కలవరపడే 82 సంవత్సరాల వృద్ధుని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. అత్యంత బాధాకరమైన ఆ సంఘటనలు మిగిల్చే ఆవేదనను భగవంతునికి నివేదనగా సమర్పిస్తూ తన బాధా నివృత్తికై ప్రార్థించే విధానం ఈ “అశ్రుభోగ” కావ్యంలో కనిపిస్తుంది. అంతే కాదు, ఆ కావ్యం నిండా జీవుని వేదన, అంతరంగ నివేదన, పరిణతి సాధించే దిశలో తన యానం ప్రమత్తతకు లోను కాకూడదనే ఆర్తి కనిపిస్తాయి.

జీవిత చరమాంకంలో ఆ పరమాత్మ ధ్యానంలో తపించే ఋషితుల్యులైన శ్రీ సుప్రసన్నగారికి కలిగిన గాయాలూ ఒక అద్భుతమైన రసవత్తరమైన కావ్యానికి రూపునిచ్చాయి. వారికి శాంతి కలగాలని, వారి ప్రయాణం నిరంతరాయంగా అభ్యుదయాధ్వంలో సాగిపోవాలని ఆకాంక్షిస్తూ…

***

అశ్రుభోగ

స్మృతి కావ్యం

రచన: కోవెల సుప్రసన్నాచార్య

ప్రచురణ: మాధురీ బుక్స్, వరంగల్

ప్రతులకు: 9052629093, 9052116463

వెల: అమూల్యము

Exit mobile version