[అనుకృతి గారు రచించిన ‘అతిథి దేవో భవ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సునందకు మొక్కలంటే మహా ఇష్టం. వున్న కొద్దిపాటి స్థలంలో ఎక్కువగా పూల మొక్కలు వేసుకుంది. రోజూ పూజకు రంగు రంగుల మందారాలు, తెల్లని నందివర్ధనం, గరుడ వర్ధనం, కృష్ణ పాదం, మూడు రంగుల గన్నేరు, మూడు రంగుల కనకాంబరాలు, గోడవారగా సన్నజాజి, విరాజాజీ, మల్లె పందిర్లు, గులాబీలు, సీజన్లో పూసే చామంతులు, చాలా ఇష్టంగా పెంచుకుంటుంది. నీడ ఉంటే పూలు పూయవని నిమ్మ, మామిడి చెట్లని ఓ ప్రక్కగా వేసుకుంది. ఆమె ఇల్లు చిన్నపాటి నందనవనంలా అందంగా ఉంటుంది.
ఆ రోజు అలాగే పిల్లల్ని స్కూలికి పంపి, స్నానం చేసి, పూజకు పూలు కోయటానికి తోట లోకి వెళ్ళింది. నందివర్ధనం, మిగతా గన్నేరు చెట్ల క్రింద, చిన్న, చిన్న గుండ్రని పచ్చని పురుగుల విసర్జకాలు కనపడ్డాయి. వాటిని చూస్తేనే సునందకు ఒళ్ళు జలదరిస్తుంది. వేలంత పొడవుండి, ఆకుల్ని విపరీతంగా తినే ఆకుపూరుగులవి. గొంగళిపురుగులు కూడా అంతే. మొక్కల ఆకులన్నీ తినేసి బోడిగా చేసేస్తాయి.
వాటిని చంపాలన్నా ఆమెకు అసహ్యమే, ఒక పట్టాన చావవు. ఒకటా, రెండా చాలా ఉంటాయి. అందుకే ఆ పురుగులను సమూలంగా నిర్మూలించగలిగిన అతిథి కోసం ఎదురు చూడసాగింది.
సునంద “రావోయీ, అనుకోని అతిథి” అంటూ స్వాగత గీతం రెండు రోజుల నుండి సన్నగా హమ్ చేస్తూనే వుంది. ఆ అతిథికి తానేమీ సమర్పించనవసరం లేదు. సంవత్సరానికి రెండు, మూడుసార్లు దర్శనమవుతుంది అంతే.
ఆమె నిరీక్షణ ఫలించి అతిథి దేవుడు వచ్చేసి మామిడి కొమ్మల మధ్య కూర్చుని తన రాకను తెలియజేస్తోంది. మామిడి కొమ్మల గుబురులో నుండి ‘ఘు, ఘు ఘు’ అన్న శబ్దం ఆమెకు కర్ణపేయంగా వినిపించింది. తర్వాత కొమ్మల మధ్య నుండి వేగంగా నేలమీద వాలి, మొక్కల మధ్యే తిరుగుతున్న అతిథిని చూసిన ఆమెకు ఎంతో సంతోషం కలిగింది. పిల్లలు స్కూల్‌కి కెళ్ళారు. చప్పుడు చేయకుండా లోపలికి పరిగెత్తి, విషయం భర్తతో చెప్పింది. వేణుగోపాల్ నవ్వి, “అయితే ఈ రోజు నేను కార్ తీయరాదన్నమాట, సరే, ఏమి చేస్తా, క్యాబ్ బుక్ చేసుకొని వెళతాలే” అన్నాడు. జవాబుగా అతని చెంప మీద ముద్దు పెట్టి, మళ్ళీ వరండాలోకి పరుగెత్తింది.
వెళ్ళి చూసేసరికి, ఎదురింటి రంగబాబు నిశ్శబ్దంగా మొక్కల మధ్య తిరుగుతున్నాడు. అది చూసిన సునంద కంగారుగా అతన్ని దగ్గరకు రమ్మని సైగ చేసింది.
“ఏమి కావాలి, ఎందుకు అక్కడ తారట్లాడుతున్నావు?” అన్నది కోపంగా.
“నాకు ఫిట్స్ వున్నాయి కదండీ, మా అమ్మమ్మ ఎలాగైనా దీన్ని పట్టుకొచ్చి దాని రక్తం, మాంసం వాడితే ఫిట్స్ పోతాయటండీ, పట్టుకు పోదామని” అన్నాడు అతిథిని వేలితో చూపిస్తూ.
ఒళ్ళు తెలియని కోపంతో అరిచింది సునంద, “ఎందుకూ ఏళ్ళు వచ్చాయి, బుద్ది లేదా నీకు, డాక్టర్స్ రాసిన మందులు వాడకుండా దీని మీదపడిందా నీ కన్ను, ఫో అవతలికి” అంటూ గద్దించింది. అలికిడికి అతిథి ఎక్కడ ఎగిరిపోతుందోనని ఆమె భయం.
నలుపు, బూడిరంగు కలిసి, మెరుస్తున్నఈకలతో అందమైన ఆ భరద్వాజ పక్షి తన ఇంటిని సందర్శించటం గొప్ప అదృష్టంగా భావిస్తుంది సునంద, చాలా మంది ఆ పక్షిని వెదుకుతూ, పొలాల వెంట, తోటలలో ఆ శకున పక్షి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి శ్రావణ మాసంలో వెతుకుతారని ఆమెకు తెలుసు. ఆ శకున పక్షి రాక భోగ భాగ్యాలు, అదృష్టాన్ని తెస్తుందని ప్రతీతి. దానిరాక ఎంతో శుభసూచకంగా అంతా భావిస్తారు.
దాని గూటిలో ‘సంజీవని’ పుల్ల ఉంటుందని నమ్ముతారు. మనుషుల నమ్మకాల గురించి ఆ పక్షి తెలుసో లేదో కానీ, ఎవరికీ అందని చోట, జనావాసాలకు దూరంగా గూడు కట్టుకుంటుంది. దాని గూడు నీటిలో వేస్తే ప్రవాహానికి ఎదురు ఈదుతుందని చెబుతారు.
దక్షిణ భారత దేశంలో తిరుగాడే ఆ జమురు కాకి, కోయిల జాతికి చెందిన పక్షి అయినా, కోకిలలా రాగాలాపన చేయకపోయినా ‘ఘు, ఘు’ అంటూ మామిడి కొమ్మల్లో, గుబురు చెట్ల కొమ్మల్లో వాలి తన రాకను తెలియ చేస్తుంది. ఎక్కువగా నేలమీద తిరుగాడుతూ, వర్షాకాలం రాగానే పంటలనీ, చెట్ల ఆకులనీ నాశనం చేసే రకరకాల పురుగుల్నీ, కీటకాలనీ భక్షించే రైతు మిత్ర ఈ సాంబ పక్షి.
సాందీపుని దగ్గర కృష్ణుడితో పాటు విద్యనభ్యసించిన కుచేలుడికి దాని దర్శనమైన అనంతరమే కృష్ణ సందర్శన భాగ్యం లభించి, భోగభాగ్యాలు లభించాయని చదివింది సునంద. ఏది ఎలాగున్నా, తన పూలమొక్కలని ఆ ఆకుపూరుగుల నుండి, రక్షించటానికి వచ్చిన అతిథి దేవుడిలా కనిపిస్తుంది ఆమెకు ఆ రత్న పక్షి.
అనుకృతి అనే కలం పేరుతో రచనలు చేసే బి. భవాని కుమారి గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 34 ఏళ్ళు లెక్చరర్‌గా పని చేసి 2014లో రిటైరయ్యారు. 2019లో వీరి మొదటి కథ ‘తొలకరి’ సాక్షి ఆదివారం అనుబంధం ‘ఫండే’లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన అనేక కథలు పలు వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.