[శ్రీ బి.ఆర్.కె.వి. భాస్కర రావు గారు వ్రాసిన ‘ఆత్మబంధువు..’ అనే కథని అందిస్తున్నాము.]
వాస్తవాలు వినడానికే కాదు చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం కూడగట్టుకోవడానికి వారంనుంచి ప్రయత్నిస్తోంది వసంత.
యుక్త పుట్టిన మూడునెలలకే మిలిటరీలో వీరమరణం పొందిన భర్త గురించిన ప్రస్తావన జీవితంలో అస్సలు రాదనుకుంటే ఇన్నాళ్ల కు అదే సమస్య అయి కూర్చుంది.
తన జీవితాన్ని ఓ ప్రశ్నగా మార్చిన భర్త మరణం తర్వాత జవాబుగా మరియు జవాబుదారిగా ఉండటానికి ఓ ఆశాకిరణంగా అగుపించింది నరేంద్ర పరిచయం.
వసంత భర్త కాలం చేసిన తొలినాళ్ళలో పెనషన్, పి ఎఫ్ వంటివి అప్లై చేసుకోవడానికి చాలా రకాల జిరాక్స్‌లు, అప్లికేషన్స్ గవర్నమెంట్‌కు పెట్టాల్సి వచ్చేది. వాటి నిమిత్తం ఎన్నోసార్లు దగ్గరలోనే ఉన్న జిరాక్స్ షాపుకు తరచు వెళ్లాల్సి వచ్చేది. పెళ్ళైన కొద్ది నెలలకే తనకు జీవితంలో కోలుకోలేని దెబ్బ ఊహించకుండా తగలడంతో ఒక్కసారిగా ఏమి చేయాలో పోలుపోక, పేపర్స్ ఎలా పూర్తి చేయాలో తెలియక, ఎవరికి పంపాలో కానరాక ఏమి చెయాలో తెలియక నడి సముద్రంలో మునిగిపోబోతున్నట్టున్న పరిస్థితిలో నేనున్నానని చేయూత నిచ్చి నిలిచాడు జిరాక్స్‌లు తీసే నరేంద్ర. ఓ రోజు వసంత మనసు బాగోక పర్సు షాపులో మర్చిపోతే తిరిగి ఆమె వెళ్లేవరకూ భోజనానికి కూడా వెళ్లకుండా ఉండిపోయాడు. తరువాత చాలా సార్లు ఎన్నోరకాలుగా సాయపడ్డాడు నరేంద్ర. కానీ ఏనాడూ తప్పగా మాట్లాడ్లేదు, హద్దు మీరలేదు. ఆ మంచితనం ఆత్మబంధువులా వసంత జీవితంలో చోటు సంపాదించుకున్నాడు. చాలా సార్లు ఇంటికి వచ్చేవాడు. వసంతకు వెన్నుదన్నుగా మారాడు
వసంత తల్లితండ్రులు ఓ పల్లెటూరిలో ఉండేవారు. వ్యవసాయం చేసే ఆ కుటుంబంలో అయిదో సంతానంగా వసంత పుట్టింది. పై నలుగురు ఆడపిల్లలే. తరాతరాల ఆస్తి వారసత్వంగా రావడంతో ఆ గ్రామంలో పేరుతోపాటు పలుకుబడి వసంత తండ్రికి మొదటినుంచి ఉండటంతో ఎన్నో తగువులు వాళ్ల ఇంటిదగ్గరే తీరేవి. చాలా తక్కువమంది మాత్రమే వసంత తండ్రి ముందు కూర్చుండానికి సాహాసించేవారు.
వసంత నైన్త్ చదువుతుండగా ఊహించని దుస్సంఘటన వాళ్ళ ఇంట్లో జరిగి తాత ముత్తాతాలనుంచి వస్తున్న పరువు గంగలో కలిసిపోయింది మేనత్త చేసుకున్న కులాంతర వివాహం ద్వారా.
అప్పట్నుంచి వసంత తండ్రి తప్పు చేసిన వాడిలా వీధి వైపు చూడలేదు. వసంతక్కూడా పెళ్ళి చేసిన ఆయన మరింత కాలం బ్రతకలేదు. వసంత అత్తారిల్లు విజయవాడ కావడంతో భర్త మిలిటరిలో క్యాడర్ ఉన్న పోస్టులోనే ఉండేవాడు. మావగారు లేని వసంత అత్తగారు తరచు తీర్థయాత్రలకు వెళ్ళేది. చివరగా కాశీలోనే స్థిరపడిపోతానని కోడలు వద్దని వారించినా వెళ్ళిపోయింది.
నరేంద్ర యుక్త ఊహ తెలిసిందగ్గర్నుంచి ఇంటికి రావడం పోవడం జరిగినా అతను ఎవరని తల్లిని ప్రశ్నించలేదు.
కానీ వారం రోజుల క్రితం ఇంటర్మీడియట్ చదువుతున్న యుక్త స్నేహితురాలు ఇంటికి ఎగ్జామ్స్ కోసం గ్రూప్ స్టడీ కోసం వెళ్ళేసరికిమిగిలిన స్నేహితురాళ్ళ తండ్రులు చేసే గారాబం చూసేసరికి మనసు గాయపడి మొట్టమొదటిసారిగా ఆ రాత్రి “అమ్మా! మన ఇంటికి వచ్చే నరేంద్ర అంకుల్ నాకు ఏమౌతాడు? నాన్న నా చిన్నప్పుడే చనిపోయారాని చెప్పావు. ఆయన బ్రతికి ఉంటే నన్ను ఇంకా గారాబంగా చూసేవారు కదా ఈ అంకుల్ అలా చూడ్డంలేదు. మరి అలాంటప్పుడు మన ఇంటికి ఎందుకు రానిస్తున్నావు?” అని అడిగేసరికి ఏమిచెప్పాలో తెలియక మూగగా రోదించింది కానీ సమాధానం చెప్పలేకపోయింది.
తనకు నరేంద్రకు గల సంబంధాన్ని అర్థం చేసుకునే వయసు, అనుభవం లేని యుక్త సంధించిన ప్రశ్న రంపపు కోతగా హృదయాన్ని గాయపరస్తుంటే చెప్పే ధైర్యం లేక వారమంతా భరాయించి చివరకు మర్నాడు ఆదివారం ఉన్నది ఉన్నట్లు చెప్పాలని నిర్ణయించుకుంది. తనను కూతురు అసహ్యయించుకున్న ఎప్పటికైనా చెప్పవలసిన బాధ్యత తనపై ఉంది కనుక ఆ నిశ్చయానికి వచ్చింది.
తాను ఇన్నాళ్లు పడిన బాధకు తెరపడుతున్నందుకు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టిన వసంతకు కాలింగ్ బెల్ మ్రోగితేకాని మెలకువ రాలేదు. నిద్రకళ్ళు నలుపుకుంటూ వాల్ క్లాక్ చూసి ‘అబ్బో పదయిపోయిందే’ అని మసులో అనుకుంటూ తలుపు తీసి చూసి షాకైపోయింది. ఎదురుగా నరేంద్ర తల్లితో సహా నిల్చుని ఉన్నాడు. వెంటనే కంగారుగా “రండి లోపలకు రండి” సోఫా చూపించి లోపలకు వెళ్ళిపోయింది.
పావుగంట కు బయట కు వచ్చి తప్పు చేసినదానిలా సిగ్గుపడి “ఈ రోజు సండే కదాని రాత్రి లేటుగా పడుకుని ఉదయానే లేవలేకపోయాను సారీ” అంది నవ్వుతూ.
“పర్వాలేదు నేనే మీకు సారీ చెప్పాలి ఇంత ప్రొద్దుటే చెప్పకుండా వచ్చినందుకు” అనేసి “ఈవిడ మా అమ్మగారు” అని తల్లిని పరిచయం చేసాడు నరేంద్ర.
“నమస్కారమండి..” అని ఆగిపోయి ఆవిణ్ణి మరింత పరిశీలనగా చూస్తూ, “ మిమ్మల్ని ఎక్కడో చూసాను” అంది వసంత గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ..
ఆమె “అవునమ్మా నిన్నుకూడా ఎక్కడో చూసినట్టుంది. మీది ఏ వూరు?” అని అడిగింది. తన తల్లితండ్రుల పేర్లు చెప్పేసరికి ఒక్కసారిగా ఎక్కి ఎక్కి ఏడవడం చూసి “ఏమైందమ్మా?” అని నరేంద్ర, వసంత కంగారుగా ప్రశ్నించేరు.
కాసేపటికి తెరుకున్నావిడ “కలవని రైలు పట్టాల్లా ఎంతో దూరం ప్రయాణించిన మీరిద్దరూ బావామరదళ్ళు. నేను నీ మేనత్తను. నేను చేసిన పొరపాటు వల్ల మీకు దూరమయ్యాను. ఈ విధంగా దగ్గర అయ్యాం” వసంతను గట్టిగా హత్తుకుంది.
వసంత కూడా ఎంతో బాధపడి తన గోడు వెళ్ళబోసుకుంది. అంతలో యుక్త లేవడంతో జరిగింది చెప్పింది వసంత. ఆ రోజంతా అక్కడే ఉండిపోయిన మేనత్త రాత్రి భోజనాలు అయ్యాక “వసూ! నీ బ్రతుకు అడవికాచిన వెన్నెల్లా అయిపోకుండా ఓ మంచి నిర్ణయం తీసువచ్చుగా” అంది.
మేనత్త మాటల్లోని అంతరంగాన్ని గ్రహించిన వసంత “అత్తా! మోడువారిన జీవితాన్ని చిగురింప చేయాలనుకోవడం సముద్రంలో మంచినీటి కోసం వెదకడం లాంటిదే. అమ్మాయి పెళ్ళికి ఎదిగిన ఈ వయస్సులో..” అని ఆగిపోయింది.
కొంత సేపటికి నిశ్శబ్దాన్ని తరిమేస్తూ “నేను చేసుకున్న వివాహం వల్ల బంధువులందరు దూరమై ఎవరూ లేక ఎన్నో అవమానాలు భరాయించి చివరికి పెళ్లంటే విరక్తి పెంచుకుని ఒంటరిగా మిగిలిపోయాడు నరేంద్ర. అప్పటివరకు ఎడారిగా ఉన్న నరేంద్ర జీవితంలోకి వయాసిస్సులా అగుపడ్డావు. వాడు నన్ను అడగలేదు కానీ మేనత్తనన్న చొరవతో అడుగుతున్నాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించండి. యుక్తకు తండ్రి ప్రేమను ఇవ్వండి” అంది వసంత మేనత్త.
వసంత సమాధానం చెప్పలేదు. మౌనం వహించింది.
నరేంద్ర యుక్తతో కబుర్లు చెప్పుతున్నాడు వీళ్ళకి దూరంగా.
ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉండిపోయారు.
రాత్రంతా ఆలోచించింది వసంత. ‘తాను పెళ్లి చేసుకుంటే సమాజం ఒప్పుకుంటుందా?’
ఇదే ప్రశ్న తెల్లవార్లూ వసంత మెదడును తొలిచేసింది.
సరిగ్గా తెల్లవారు ఝామున నాలుగు అవుతుండగా “వసంతా! ఇప్పటికే ఓ బిడ్డకు తల్లివైన నువ్వు, నేను ఒకటై కలసి ఆలోచించవలసినది యుక్త భవిష్యత్తు గురించే. పెళ్ళి అనేది మన ఇద్దరిని మా అమ్మ చెప్పినట్టు రైలు ట్రాకుల్లా విడిగా ఉన్నా రెండూ కదలకుండా కట్టి పడేసే స్లీపర్ లాంటిది అని నా అభిప్రాయం. స్లీపర్లు అడుగునవుండి పట్టాలను కదలకుండా చేస్తాయి. వాటి మీదనిర్భయంగా మన బిడ్డలు ప్రయాణం చేసి గమ్యం చేరుతారు. అంతే కానీ శారీరక వాంఛ తీర్చుకునే కుత్సితమైన ఆలోచన నాకు లేదు. ఆలోచించుకుని చెప్పు.” అని నరేంద్ర వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు.
తాను చేస్తున్నది తప్పు అయినా తప్పని పరిస్థితి వచ్చినప్పుడు చేయడంలో తప్పు కాదని తన మనస్సాక్షికి చెప్పడం వైపే మొగ్గు చూపిన వసంత యుక్త అభిప్రాయం తెలుసుకునే కన్నా ఆమెకు కొత్త ఉదయాన్ని చూపించాలనుకుంది.
తెల్లారి తొమ్మిది అయినా తల్లి నిద్ర లేవకపోవడంతో ఆశ్చర్యపోయిన యుక్త బెడ్రూం లోంచి హాల్లోకి వచ్చేసరికి వసంత సోఫాలో పడుకుని ఉన్న నరేంద్ర కాళ్ళ దగ్గర తల పెట్టుకుని నిద్రపోతోంది ఏ బెంగ లేనిదానిలా..
