Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అన్నపూర్ణా వారి షష్టిపూర్తి చిత్రం.. ‘ఆత్మగౌరవం’ (1966)

[అన్నపూర్ణ వారి ‘ఆత్మగౌరవం’ సినిమాను విశ్లేషిస్తున్నారు శ్రీ ఆచారం షణ్ముఖాచారి.]

తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించి, తమ ఆశయాలకు అనుగుణంగా వారిని సమాజం మెచ్చేలా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తాపత్రయపడుతుంటారు. అయితే పిల్లలకు కూడా సొంత అభిప్రాయాలుంటాయి. అవి సంఘర్షణకు దారి తీస్తుంటాయి. తమ మాట నెగ్గించుకోవాలని పెద్దలు, తమ వ్యక్తిత్వం నిలుపుకోవాలని పిల్లలు పోటీపడుతుంటారు. ఈ సంఘర్షణల మధ్య ఆస్తులు, అంతస్తులు బలీయమైన శక్తులుగా పనిచేస్తాయి. అవి అంత త్వరగా లొంగవు. కానీ, వీటన్నిటికంటే అంతఃకరణ, ఆత్మగౌరవం ప్రధానమని తెలియజెప్పిన గొప్ప చిత్రాన్ని అన్నపూర్ణా పిక్చర్స్ వారు ‘ఆత్మగౌరవం’ పేరుతో నిర్మించారు. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి రంజింపజేసిన ఈ చిత్రం 11, మార్చి 1966 న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. షష్టిపూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలు కొన్ని..

చిత్ర కథ టూకీగా..

నమ్మకస్తుడైన రామయ్య(గుమ్మడి) పల్లెటూరి రైతు. అతని తల్లి శాంతమ్మ(హేమలత). ఎనిమిదేళ్ళ రామయ్య తమ్ముడు శ్రీనివాసరావు@వాసు(నాగేశ్వరరావు)ను రామయ్య భార్య జానకమ్మ (పుష్పకుమారి) చిన్నతనం నుంచి కన్నతల్లిలా పెంచుతుంది. జమీందారు వరహాలరావు (రేలంగి) పొలాన్ని రామయ్య సాగుచేస్తూ ఉంటాడు. సంతులేని జమీందారు వాసుని దత్తత చేసుకుంటాడు. అతని భార్య సంతానలక్ష్మి (సూర్యకాంతం)కి వాసుని దత్తత చేసుకోవడం ఇష్టముండదు. మొదటినుంచి తన చెల్లెలి కొడుకు వేణు(చలం) ను దత్తత చేసుకోవాలని వుంటుంది. ఆమె కోరిక ఫలించకపోవడంతో, వాసుని కన్నవారికి ఎన్నివిధాలా దూరం చెయ్యాలో అన్నివిధాలా దూరం చేస్తుంది. జమీందారు వరహాలరావు వాసుని రామయ్య కుటుంబానికి దూరంగా, పట్నంలో చదివించి పెద్దవాణ్ణి చేస్తాడు. వాసుని తల్లికంటె మిన్నగా పెంచిన రామయ్య భార్య జానకమ్మ జబ్బుచేసి చనిపోతుంది. ఆ వార్తను వాసుకు తెలియకుండా సంతానలక్ష్మి తొక్కి పెడుతుంది. దత్తత స్వీకారం ముందే రామయ్య తన మేనకోడలు సావిత్రి (కాంచన)తో వాసుకు వివాహం జరిపించాలని జమీందారు నుంచి వాగ్దానం తీసుకుంటాడు. కానీ సంతానలక్ష్మి అందుకు విరుద్ధంగా పట్నంలో వున్న జడ్జి భజగోవిందం (రమణారెడ్డి) కూతురు గీత (రాజశ్రీ)తో వాసుకు పెళ్లిసంబధం ఖాయం చేస్తుంది. రామయ్యకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేని అశక్తుడైన జమీందారు కూడా భార్య మాటకు ఎదురు చెప్పలేకపోతాడు. వాసుని అపార్థం చేసుకున్న రామయ్య పంతం కొద్దీ సావిత్రికి మరో గొప్పింటి సంబంధం చేయాలని, అందుకు ప్రతిగా ఆ ఇంటిలో పిచ్చిపిల్ల పార్వతి (వాసంతి)ని వివాహం చేసుకునేందుకు సిద్ధపడతాడు. తన వల్ల మామయ్య జీవితం నరకం కాకూడదని పెళ్లి రేపనగా సావిత్రి ఇల్లు వదలి వెళ్లిపోతుంది. ఇచ్చిన మాట నిలుపుకునేందుకు రామయ్య పిచ్చిపిల్లను పెళ్లాడతాడు. ఇల్లు వదలిన సావిత్రి పట్నంలో సేవాసదన్‌లో చేరి నృత్యం నేర్చుకొని ప్రదర్శనలిస్తుంటుంది. వాసు ఆమెను చూసి మనసిస్తాడు. సావిత్రికి వాసు తన మేనమామ అని తెలుసు. అవతల జమీందారు, జడ్జిగారు వాసు-గీతల పెళ్లి ఖాయం చేసుకుంటూ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈలోగా వాసుకి సావిత్రి తన మేనకోడలని, అన్న రామయ్యకు అన్యాయం జరిగిందని తెలుసుకొని, తల్లికి, అన్నకు క్షమాపణలు చెప్పి, పెంచినవారిని ఎదిరించి సావిత్రిని పెళ్లిచేసుకుంటాడు. ఈ క్లిష్ట సమస్యను అందంగా, ఆహ్లాదంగా వాసు పరిష్కరించి తన ఆత్మగౌరవాన్ని, తనవారి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడడం ఈ సినిమా గొప్పతనం.

సినిమా విశిష్టతలు..

ఈ సినిమా విశిష్టతలను చెప్పుకునే ముందు దర్శకుడు విశ్వనాథ్ గురించి చెప్పుకోవాలి. విశ్వనాథ్ పట్టభద్రుడయ్యాక మద్రాసు వాహిని స్టూడియోలో ధ్వనిముద్రణ విభాగంలో రికార్దిస్టుగా చేరారు. ఆ స్టూడియో నిబంధనల ప్రకారం ప్రతి టెక్నీషియన్ కెమెరా ప్రొజెక్షన్, లేబరేటరీ వంటి అన్ని విభాగాలలో పనిచేయాలి. అలా ఆడియో విభాగంలో విశ్వనాథ్ ఎన్నో చిత్రాలకు సౌండ్ రికార్దిస్టుగా పనిచేశారు. ఈ క్రమంలో ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం స్నేహంగా మారింది. అలా ఆదుర్తికి స్క్రిప్టు అసిస్టెంట్‌గా, సహకార దర్శకునిగా పనిచేశారు. విశ్వనాథ్ పనితనం గమనించిన అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా సంస్థలోకి ఆహ్వానించి, దర్శకత్వ శాఖలో రెండేళ్ళు పనిచేశాక సొంతంగా దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. అలా అన్నపూర్ణా సంస్థలో ‘వెలుగునీడలు’, ‘ఇద్దరుమిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’ మూడు చిత్రాలకు అసోసియేట్‌గా ఆదుర్తి దగ్గర పని చేశాక, నాలుగవ చిత్రానికి డైరెక్టరుగా ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి సారథ్యం వహించాల్సిన విశ్వనాథ్ అప్పట్లో తన అధైర్యాన్ని వ్యక్తం చేయడం వల్ల ఆచిత్రాన్ని కూడా ఆదుర్తే డైరెక్ట్ చేయడం జరిగింది. అన్న మాట తప్పని అన్నపూర్ణా అధినేతలు ‘ఆత్మగౌరవం’ సినిమాని డైరెక్ట్ చెయ్యమని మళ్ళీ విశ్వనాథ్‌ని కోరారు. ఆ బాధ్యతను ఆయన సంతోషంగా స్వీకరించారు. కళాతపస్వి విశ్వనాథ్‌కు దర్శకునిగా ‘ఆత్మగౌరవం’ మొదటి సినిమా. అన్నపూర్ణ సంస్థలో పని చేసిన మూడవ దర్శకుడు విశ్వనాథ్.

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు కలిసి ‘ఆత్మగౌరవం’ సినిమాకు కథను సమకూర్చారు. ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా కథా రచయిత్రి డా. శ్రీదేవి కథాచర్చల సమయంలో అకాల మరణం చెందడంతో, సులోచనారాణి ఆ సినిమా అనుకరణకు సహకరించింది. కాగా, గొల్లపూడి మాత్రం చిత్రసీమకు ఈ సినిమాతోనే పరిచయమయ్యారు. ఈ సినిమా కథా చర్చలు ముఖ్యంగా హైదరాబాదు అబిడ్స్ తాజ్ మహల్ హోటల్లోను, పబ్లిక్ గార్డెన్స్ లోను జరగడం విశేషం. కథ తయారయ్యాక, సంభాషణలను భమిడిపాటి రాధాకృష్ణతో కలిసి మారుతీరావు రాశారు. సినేరియోను నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు రూపొందించారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలిరావడంతో, స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు సంకల్పించారు. అన్నపూర్ణ సంస్థకు బి.హీరాలాల్ నృత్యదర్శకుడుగా వుండేవారు. ఆ రోజుల్లో హైదరబాదులో డా. సుమతీ కౌశల్ ‘నృత్య శిఖర డ్యాన్స్ స్కూల్’ పేరుతో బాలబాలికలకు కూచిపూడి, భరత నాట్యం, ఒడిస్సీ నాట్యరీతుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తుండేవారు. ఈ సినిమాకు ఆమెను నృత్యదర్శకురాలిగా పరిచయం చేశారు. హీరాలాల్ ఆమెకు సహకరించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తొలి మహిళా నృత్యదర్శకురాలు ఈమే! ఈ సినిమాలో రాజశ్రీ, కాంచన నృత్యం చేసే క్షేత్రయ్య పదం “ముందటి వలె నాపై నెనరున్నదా సామి.. ముచ్చటలిక నేలరా.. మువ్వగోపాలా”కు సుమతీ కౌశల్ సమకూర్చిన కూచిపూడి నృత్యరీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఆకాశవాణి నాటక విభాగంలో పనిచేసే ఛాయాదేవి చేత కామాక్షమ్మ పాత్రను, అందులోనే వ్యాఖ్యాతగా వ్యవహరించే వెంపటి రాధాకృష్ణ చేత పురోహితుడు శాస్త్రి పాత్రను పోషింపజేశారు.

ఈ సినిమా అవుట్‌డోర్ షూటింగు కోసం ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, లక్ష్మీపతి బ్రదర్స్‌కు చెందిన బంగాళాతోబాటు వారి తోటను కూడా వినియోగించుకున్నారు. ఆంధ్రమహిళా సభ వారు, యు. ఫారం వారు సెట్స్ అలంకరణలో సహకరించారు. పాటలన్నిటిని రామప్ప దేవాలయ ప్రాంగణంలోను, దిండి ప్రాజెక్టు, పబ్లిక్ గార్డెన్ లోను చిత్రీకరించారు. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చలన చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నంది బహుమతులను ప్రవేశపెట్టింది. 23, మార్చి 1966న జరిగిన ‘నంది బహుమతుల ప్రదానోత్సవం’లో ‘ఆత్మగౌరవం’ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది, ఉత్తమ కథా రచనకు గొల్లపూడి మారుతీరావు, యద్దనపూడి సులోచనారాణిలకు సంయుక్తంగా నంది బహుమతి లభించింది.

ర‘సాలూరి’న రాజేశ్వర గీతాలు..

సాలూరు రాజేశ్వరరావు సంగీత ప్రతిభను ఎలా వాడుకోవాలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు తెలిసినంతగా మరే ఇతర నిర్మాతకు తెలియదు. అందుకే అన్నపూర్ణ సంస్థకు రాజేశ్వరరావు అందించిన సంగీతం అమరం. ‘ఆత్మగౌరవం’ సినిమాలో మొత్తం పది పాటలున్నాయి. అందులో ఒక్కటే విషాద గీతం. మిగతా పాటలన్నీ మైమరపించే అమృతగుళికలే. స్వతహాగా సౌండ్ ఇంజనీర్ కావడం వల్ల దర్శకుడు విశ్వనాథ్ స్వయంగా దగ్గరుండి పాటల్ని చక్కగా రికార్డ్ చేయించారు. పాటలన్నీ పాపులర్ అయ్యి ఈ చిత్రం మ్యూజికల్‌గా కూడా హిట్టయింది. రేలంగి తన పొలాల గొడవ పరిష్కారం కోసం పల్లెటూరికి వచ్చి, గుమ్మడి ఇంటిలో విందు ఆరగించినప్పుడు చిన్ననాటి వాసు, సావిత్రి ఆలపించే సినారె గీతం “మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మాయింటికొచ్చారు.. మా మంచి వారంట మనసున్న వారంట మా కెంతొనచ్చారు” ఒక అద్భుతమైన పాట. ఈ సన్నివేశంలో రేలంగికి కుర్చీ వేసి, బల్లమీద భోజనం వడ్డించి గుమ్మడి విసనకర్రతో సేదదీర్చుతుంటే, అల్లు రామలింగయ్యకు పీట వేసి భోజనం వడ్డించడం విశ్వనాథ్ ప్రతిభ. ముద్దపప్పు, ఆవకాయ, గుత్తివంకాయ, గారెలు, బూరెలు, నేతిబొబ్బట్లు ఆప్యాయంగా వడ్డించే గ్రామీణ సంప్రదాయం గౌరవప్రపత్తులకు ఈ పాట అద్దం పడుతుంది. సినిమా కథకు మలుపునిచ్చే ఈ పాటను సుశీల, వసంత ఆలపించారు.

అంతర్ కళాశాల వక్తృత్వ పోటీల్లో అక్కినేని అలపించే ఆరుద్ర గీతం “ప్రేమించి పెళ్లి చేసుకో..నీ మనసంతా హాయినింపుకో”లో ప్రేమవివాహానికి పెద్దపీట వేశారు దర్శకుడు. ఈ ధృక్పథంతోనే కాంచనను తన మేనకోడలని తెలియకుండానే ప్రేమించడానికి దారి తీస్తుంది. వరుని వలపు, వధువు తలపు తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపినా, కట్నాలకోసం పాకులాడినా చివరకు యెడమోము పెడమోములే మిగుల్తాయని, పురాణాలలో కూడా ప్రేమపెళ్ళిళ్ళు జరిగాయని కృష్ణుడు-రుక్మిణి; దుష్యంతుడు-శకుంతల; నలుడు-దమయంతిల ఉదంతం పాటలో జొప్పించడం బాగుంటుంది. ఇందులో అక్కినేని-రాజశ్రీలకు రెండు, అక్కినేని-కాంచనకు మూడు యుగళ గీతాలు, కాంచనకు ఒక సోలో గీతం వున్నాయి. ఈ పాటలన్నీ మరలామరలా వినాలనిపించేవే. ఆరుద్ర రాయగా అక్కినేని, రాజశ్రీలమీద చిత్రీకరించిన “ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ కోతలు కోశావులే.. ఆ మాటలు ఏమైనవి అహ అయ్యగారు ఓడారులే” పాటకు, అక్కినేని కాలేజిలో పాడే పాటకు అవినాభావ సంబంధముంది. రాజశ్రీ-అక్కినేనిల మరో యుగళగీతం సినారె రాసిన “పరువము పొంగే వేళలో పరదాల వెందుకో.. చెంగున లేచీ చేతులు సాచీ చెలియ నన్నందుకో” కూడా అద్భుతమే.

ఇక అక్కినేని – కాంచన విషయానికొస్తే రామప్ప, పాకాల సరస్సు వద్ద చిత్రీకరించిన దాశరథి గీతం “ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలిప్రేమ దీపం వెలిగిందిలే” గురించి చెప్పాలి. శంకరాభరణ రాగస్వరాలతో అల్లిన ఈ పాట హిందీ సినిమా ‘తాజ్ మహల్’ లో పహాడి రాగంలో రోషన్ స్వరపరచిన “జో వాదా కియా వో నిభానా పడేగా” పాటను గుర్తు చేస్తుంది. పహాడిరాగం కూడా శంకరాభరణ రాగజన్యం కావడం ఈ పోలికకు కారణం కావచ్చు. లతా, రఫీ పాడిన ఈ పాట 1963లో ‘బినాకా గీత్ మాల’ కార్యక్రమంలో ప్రథమస్థానం పొందినట్లే, ‘ఆత్మగౌరవం’లో పాటకూడా మకుటాయ మానమే! ఆరుద్ర విరచిత అక్కినేని-కాంచన మరో డ్యూయట్ “రాననీ రాలేననీ ఊరకె అంటావు.. రావాలనే ఆశలేనిదే యెందుకు వస్తావు” ఒక టీజింగ్ సాంగ్. నటభైరవి రాగంలో ఈ పాటను ఘంటసాల పాడినతీరు అద్భుతంగా వుంటుంది. కారులో మొదలై విడిది గృహంలో చిరుజల్లుల మధ్య ఒదిగిన మహాకవి శ్రీశ్రీ రాసిన “వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే” మరో అద్భుతగీతం. ఇందులో “ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి“ అని అక్కినేని ఆలపిస్తే, “నీ హృదయములో ఒదిగినచో బెదురింక ఏమున్నది” అని కాంచన గోముగా జవాబివ్వడం మంచి ప్రయోగం. దాశరథి గీతం “అందెను నేడే అందని జాబిల్లి.. నా అందాలన్నీ ఆతని వెన్నెలలే” ఒక జాబిలిపాట. ఈ పాట చివర్లో అక్కినేని కారులోవచ్చి కాంచన సోయగాలు వీక్షించడం పాటకు కొస మెరుపు. ఇక రాజశ్రీ-కాంచన రాధాకృష్ణుల నృత్యం సినిమా మొత్తానికే హైలైట్. “ముందటి వలె నాపై నెనరున్నదా సామి..ముచ్చటలిక నేలరా..మువ్వగోపాలా” అనే క్షేత్రయ్య పదానికి డా. సుమతీ కౌశల్ కూర్చిన కూచిపూడి నృత్యరీతులు అత్యద్భుతం. సుశీల ఆలపించిన ఒకే ఒక విషాద గీతం “బ్రతుకే నేటితో బరువై పోయెలే.. మదిలో ఆశలే మసిగా మారేలే” దాశరథి రచన. ఈ సినిమాలోని హిట్ పాటలే ‘ఆత్మగౌరవం’ రిపీట్ రన్‌లో కాసుల వర్షానికి కారణమయ్యాయి. ఈ సినిమాకు ముగ్గురు హీరోలు.. సాలూరు రాజేశ్వరరావు, విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావులు అనేది నిస్సందేహం.

Exit mobile version